నరేంద్ర మోడి అభివృద్ధి బండారం ఇంకోసారి


నర్మదా కాలువ పరిస్ధితి ఇది

నర్మదా కాలువ పరిస్ధితి ఇది

దేశంలో మిగతా రాష్ట్రాలకంటే గుజరాత్ అభివృద్ధిపధంలో దూసుకెళుతోందనీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సమర్ధతే దానికి కారణమనీ పత్రికలు భజన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో వాస్తవం ఏమిటో ‘గుజరాత్ అభివృద్ధి కధ‘ పేరుతో ఈ బ్లాగ్ లో ఓ ఆర్టికల్ రాయడం జరిగింది. గుజరాత్ లో జరిగిందంటున్న అభివృద్ధి స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులదే తప్ప అక్కడి ప్రజలది కాదని అందులో తెలియజేశాను. మరికొన్ని వివరాలు ఇపుడు చూద్దాం.

వారపత్రిక అయిన తెహెల్కా నవంబరు 10 సంచిక ఇచ్చిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ పాలించిన దశాబ్ద కాలంలో గుజరాత్ కంటే ఇతర రాష్ట్రాలే వేగంగా అభివృద్ధి సాధించాయి. మోడి పాలనా కాలంలో జి.డి.పి వృద్ధి రేటు 10 శాతం దాటటం వలన బాగా అభివృద్ధి చెందుతోందని ఊదరగొట్టారు గానీ నిజానికి అంతకుముందే 9 శాతం పైగా రేటుతో గుజారాత్ జి.డి.పి వృద్ధి చెందింది. సంబంధిత వివరాలు తెహెల్కా ఇచ్చింది. ఈ అంకెలు తెహెల్కా సొంతగా తయారు చేసినవి కావు. ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన గణాంకాలే అవి. కింద టేబుల్ ఒకసారి చూడండి:

తెహెల్కా నుండి

తెహెల్కా నుండి

1981 నుండి 1998 వరకూ జి.డి.పి వృద్ధి రేటు సాపేక్షికంగా ఎకువగా నమోదు చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. నరేంద్ర మోడి అక్టోబర్ 2001లో ముఖ్యమంత్రి కాకముందే గుజరాత్ రాష్ట్రం 90/91, 97/98 మధ్యనున్న ఏడు సంవత్సరాల కాలంలో 9.57 శాతం జి.డి.పి వృద్ధి రేటు నమోదు చేసింది. దానికి అతి సమీపంలో ఉన్న మహారాష్ట్ర కంటే 156 బేసిస్ పాయింట్లు (1.56 శాతం) ఎక్కువగా గుజరాత్ వృద్ధి నమోదు చేసింది. ఈ తేడాని మోడి కాలంలో 38 బేసిస్ పాయింట్లకి తగ్గించింది. అంటే మోడి పాలనాకాలంలో గుజరాత్ కంటే మహారాష్ట్ర వేగంగా అభివృద్ధి చెందిందన్నమాట. ఇతర రాష్ట్రాలు కూడా మాహారాష్ట్ర, గజరాత్ ల కంటే వేగంగా వృద్ధి చెందడాన్ని గమనించవచ్చు.

ఇంకో విధంగా కూడా చూడొచ్చు. 90/91 – 97/98 కాలానికీ, 02/02 – 11/12 కాలానికి మధ్య తేడా చూసినా మోడి కాలంలో ఇతర రాష్ట్రాలే మెరుగయిన వేగాన్ని నమోదు చేశాయి. ఈ రెండు కాలాల్లో మహారాష్ట్ర 1.89 శాతం మేరకు జి.డి.పి వృద్ధి రేటుని మెరుగుపరచుకుంటే గుజరాత్ మాత్రం కేవలం 0.71 శాతం మాత్రమే జి.డి.పి మెరుగయింది. తమిళనాడు 2.70 శాతం, కర్ణాటక 3.1 శాతం, ఆంధ్ర ప్రదేశ్ 3.2 శాతం మేరకు జి.డి.పి వృద్ధి రేటు మెరుగుపరచుకున్నాయి. ఈ టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమే ఎక్కువ జి.డి.పిని పెంచుకుంది. ఆ లెక్కన అవినీతి రహిత మోడి కంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న రాజశేఖర్ రెడ్డే (చంద్రబాబు నాయుడు, రోశయ్య, కిరణ్ లు కలిపి) ఎక్కువ అభివృద్ధి చేశాడనే కదా.

ఈ టేబుల్ ని బట్టి కొన్ని విషయాలని ఇలా చెప్పుకోవచ్చు.

  • మోడి ముఖ్యమంత్రి కాకముందే (1980ల నాటికే) మెరుగయిన వృద్ధి నమోదు చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి.
  • దేశవనరులని విదేశీ కంపెనీలకి అప్పజెబుతూ పి.వి, మన్మోహన్ లు ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధానాలే గుజరాత్ జి.డి.పి వృద్ధికి ముఖ్య కారణం. (ఈ వృద్ధి ప్రజలది కాదని వేరే చెప్పనవసరం లేదు) మోడి రాకముందే గుజరాత్ వృద్ధి అంతకుముందుతో పోలిస్తే దాదాపు రెట్టింపయింది.
  • మోడి ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళ కాలంలో గుజరాత్ జి.డి.పి పెద్దగా ఏమీ మెరుగుపడలేదు. ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలకంటే తక్కువగా జి.డి.పి వృద్ధి రేటుని పెంచుకుంది. గుజరాత్ రాష్ట్రంలోనే గత శతాబ్దంతో పోల్చినా లేక ఇతర రాష్ట్రాలతో పోల్చినా మోడి ప్రాభవం దిగనాసిల్లిందే తప్ప ఊడబోడిచింది ఏమీ లేదు.

గుజరాత్ లోని సందేశ్ పత్రికలో రాస్తూ దేవేంద్ర పటేల్ అనే రాజకీయ రాతగాడు ఇలా రాశాడు. “200 సంవత్సరాల క్రితం అహ్మదాబాద్ వ్యాపారులు చైనాతో సిల్క్ వ్యాపారం చేశారు; నరేంద్రమోడి అప్పటికి పుట్టనే లేదు. వంద సంవత్సరాల క్రితం అత్యంత భారీ టెక్స్ టైల్ మిల్లులని గుజరాత్ లో నెలకొల్పారు; మోడి అప్పటికి కూడా పుట్టలేదు. 50 సంవత్సరాల క్రితం అమూల్ గుజరాత్ కి వచ్చింది; మోడి అప్పటికి పిల్లోడు. 30 సంవత్సరాల క్రితం భావనగర్, అంక్లేశ్వర్ లలో అతిపెద్ద ఎరువుల కంపెనీలను నెలకొల్పారు; మోడి అప్పటికి రాజకీయాల్లో చురుగ్గా లేడు. కాబట్టి గుజరాత్ ప్రగతికి ఎవరు కారకులో ఎవరికి వారే ఊహించుకోవచ్చు.” (తెహెల్కా  నవంబర్ 10, 2012)

మరో దినపత్రిక ఎడిటర్ ఇలా అంటున్నాడు: “ఒకప్పుడు జీనత్ అమన్, పర్వీన్ బాబీ లు కూడా టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపైన ఉన్నారని మోడి తెలుసుకోవాలి. వారిద్దరిలో ఎవరూ ఆ సమయంలో అత్యున్నత నటిగా గుర్తింపు పొంది లేరు. అప్పట్లో వారు సృష్టించిన సెన్సేషన్ వల్ల ఆ స్ధానాన్ని (టైమ్ కవర్ పేజీ) పొందారు. మోడి కూడా కేవలం ఒక సెన్సేషన్ మాత్రమే. అసలు వాస్తవం గుజరాత్ ఓటర్లకు త్వరలోనే తెలిసొస్తుంది.” (తెహెల్కా)

మోడి నిజాయితీపరుడనీ, అవినీతిని సహించడనీ ఇంకో డాబు ప్రచారంలో ఉంది. అదీ ఒట్టి డాబే తప్ప నిజం కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడుగా దేశం భావిస్తున్న అన్నా హజారే, మోడికి నీతిమంతుడని ఇచ్చిన సర్టిఫికేట్ ఫోర్జరీ అని అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల క్రితమే తేల్చేశాడు. నర్మదా కాలవ రైతులకి ఒరగబెట్టింది ఏమీ లేదని వివిధ విశ్లేషణలు చెబుతున్నాయి. ముంద్రా పోర్టు సెజ్ లో అవినీతిని ఆనంద్ యాజ్ఞిక్ లాంటి లాయర్లు వెలికి తెచ్చారు. ఆయన పిటిషన్ తో ముంద్రా సెజ్ ని సుప్రీం కోర్టు నిలిపివేసింది. ముంద్రా అవినీతి మోడిని త్వరలోనే చుట్టుముడుతుందని యాజ్ఞిక్ చెబుతున్నాడు. కాగ్ రిపోర్టులు కూడా మోడి అవినీతిని తూర్పారబట్టాయి. కేజ్రీవాల్ మోడి అవినీతిని వెల్లడించిన కాగ్ నివేదికలను పట్టించుకోకుండా ఇంకేవో చెప్పి ఊరుకోవడం ఒక కుట్రగా కొందరు భావిస్తున్నారు. కేజ్రీవాల్ సంగతి ఎలా ఉన్నా మోడి నీతి పెట్టుబడిదారులకి ఆరాధన అయితే, రైతులకీ, శ్రామిక ప్రజలకి మాత్రం భూముల్నీ, ఉపాధిని కాజేసే నిలువు దోపిడి.

3 thoughts on “నరేంద్ర మోడి అభివృద్ధి బండారం ఇంకోసారి

  1. 9వ తరగతి బాగాచదివిన విద్యార్థి, 10వ తరగతి కూడా బాగాచదవడంలో ఆశ్చర్యం పడవలసిన అవసరం ఉండదు. మోడీ అధికారంలోకి రాక మునుపే మిగతా రాష్ట్రల కంటే అభివృద్ధిలో ముందున్న రాష్ట్రం గుజరాత్. అలానే,దేశంలోకెల్ల విశాల సముద్రబూభాగం వున్న రాష్ట్రం వంటి భౌగోళిక పరిస్థితులు కలసి వచ్చిన రాష్ట్ర అభివృద్ది కేవలం మోడీవల్లే అనే ప్రచారం కుట్రె తప్ప మరోకటి కాదు.

  2. tehalka anedi oka enduku paniki rani samstha , adi entasepu BJP ki vyatirekam ga panichestundi tappa,nijalani telupadu. congress inni kumbhakonalu chestunna eroju kuda vaariki vyatirekamga adi string operations nirvahinchaledu. kanukavaari maatalani pattinchukonavasaram ledu

వ్యాఖ్యానించండి