చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా బి.జె.పి ప్రవేశపెట్టిన తీర్మానం లోక్ సభలో ఓడిపోయింది. బిల్లుకి వ్యతిరేకం అని చెబుతూనే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు సభనుండి వాకౌట్ చేయడంతో బిల్లు 253-218 ఓట్లతో నెగ్గింది. వాకౌట్ చెయ్యడం ద్వారా తాము కూడా ఆ తానులోని ముక్కలమేనని ఎస్.పి, బి.ఎస్.పిలు నిర్ద్వంద్వంగా చాటుకున్నాయి. బి.సిలను ఉద్దరించడానికి ఉద్భవించామని ఎస్.పి, దళితుల ఉద్ధరణే ఏకైక లక్ష్యమని బి.ఎస్.పి చెప్పేవన్ని ఒట్టి కబుర్లేననీ, తమ అసలు లక్ష్యం బి.సిలు, దళితులను అడ్డం పెట్టుకుని బలిసిన వర్గాలకు తోకలుగా వ్యవహరించడమేననీ ఆ పార్టీలు మరోసారి రుజువు చేశాయి.
ములాయం సింగ్ తన ట్రేడ్ మార్క్ తలతిక్కవాదాన్ని సిగ్గులేకుండా మరోసారి వినిపించాడు. చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ ల వల్ల రైతులకి, చిన్న వ్యాపారులకీ నష్టం కలుగుతుందని లోక్ సభలో గొంతులు చించుకుని మరీ వాదించిన ములాయం, మాయావతిలు తమ వాదనకి సరిగ్గా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేలా వాకౌట్ చేసి తమ భావ దారిద్ర్యాన్నీ, దళారీ స్వభావాన్నీ అత్యంత పచ్చిగా విప్పిచూపారు.
“రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అందుకే వాకౌట్ చేశాము” అని ములాయం పార్లమెంటు బయట విలేఖరులకి చెప్పాడు. మరయితే బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయ్యకుండా వాకౌట్ ఎందుకు చేశారని ప్రశ్నిస్తే తన తలతిక్కను అత్యున్నత స్ధాయిలో ములాయం ప్రదర్శించాడు. “ఇది పార్టీ నిర్ణయం. బిల్లుని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయాలని పార్టీ నిర్ణయించింది” అని చెప్పాడు ములాయం సింగ్ యాదవ్. తమరి నిర్ణయం ప్రభుత్వానికి సహాయపడింది గదా అనడిగితే “పార్టీ ఏది చెబితే మేము ఖచ్చితంగా అదే చేస్తాం” అని వాకృచ్చాడు. ఈ “______________” మనిషి దృష్టిలో పార్టీ నిర్ణయానికీ సభలో చేసే వాదనకీ సంబంధం ఉండనవసరం లేదన్నమాట! ఇక రైతులూ, చిన్న వర్తకులూ అంటూ అదే పనిగా సొల్లు వాగుడు ఎందుకట? (ఈయనగారి తలతిక్క వాదనను బట్టి ఏ విశేషణం ఉపయోగించాలో అంతుబట్టక ఖాళీ వదిలేస్తున్నా.)
వాకౌట్ చేశాక కూడా తన వాక్ప్రతిభను వెళ్ళబుచ్చుకోవడం ములాయం మానుకోలేదు. “5 కోట్ల చిన్న వ్యాపారులు, 20 కోట్ల రైతులు వారి కుటుంబాల ప్రయోజనాలను తమ నిర్ణయం ద్వారా ప్రభుత్వం త్యాగం చేసింది. అందుకే మేము వాకౌట్ చేశాము” అని ఆయన తెచ్చిపెట్టుకున్న ఆగ్రహావేశాలను పార్లమెంటు బయట ప్రదర్శించాడు. ప్రభుత్వ నిర్ణయం వల్ల అంతబాధ కలిగితే దానిని ఓడించడానికి బుద్ధున్నవాడెవ్వడైనా ప్రయత్నిస్తాడు. ఇంత బహిరంగంగా సిగ్గులేనితనాన్ని ప్రదర్శించే బదులు కాంగ్రెస్ లాగా రైతు వ్యతిరేక నిర్ణయాలు రైతులకి, వ్యాపారుల వ్యతిరేక నిర్ణయాలు వ్యాపారులకీ లాభం అంటూ పచ్చి అబద్ధాలయినా చెప్పుకుని బతకొచ్చు కదా. అబద్ధాలకోరులు, వాల్ మార్ట్ దాసులు, తాకట్టు తలల మేధావుల చేతుల్లో దేశాన్ని పెట్టె దుర్గతి జనానికి దాపురించింది.
ఎస్.పి, బి.ఎస్.పి లు వాకౌట్ చెయ్యబోతున్నాయని అందరూ ఊహించినదే. కాకపోతే వాకౌట్ కి ఏమి కారణం చెబుతాయా అని పత్రికలు, జనం ఎదురు చూశారు. మరీ ఈ విధంగా తలా, తోకా లేని కారణం చెబుతారని బహుశా పత్రికల వాళ్ళు కూడా ఊహించి ఉండకపోవచ్చు. అసలు ములాయం చెప్పింది కారణం కూడా కాదు. కనీసం చిన్నపిల్లాడి తర్కానికి కూడా అందని తలతిక్క వాగుడు. దానికిబదులు ఎఫ్.డి.ఐ లంటే మాకు ఇష్టమే అని చెప్పినా “ప్రజావ్యతిరేకులు” అన్న బిరుదయినా ఇచ్చి ఊరుకుందుము. వీళ్లసలు నెగిటివ్ వ్యాఖ్యానాలకు కూడా అర్హతలేని ______________. (ఎంత గింజుకున్నా తగిన విశేషణం తట్టడం లేదు మరి!)
ఓటింగ్ కి ముందు కమల్ నాధ్ చెప్పిన అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గవి. “నిర్ణయాన్ని అమలుచేసే అధికారం రాష్ట్రాల చేతుల్లో ఉన్నందున అసలు సమస్య ఎఫ్.డి.ఐ కాదు. రాష్ట్రాలే నిర్ణయించబోతుంటే మనం ఇక్కడ చేసేదేముంది? ఇక్కడ మనం నిర్ణయించబోయేది ఏమిటంటే బి.జె.పి రాజకీయాలని వ్యతిరేకించి ఖండించడమే….” ఇది విషయాన్ని మంగళవారం కూడా కమల్ నాధ్ పత్రికలతో అన్నాడు. “ఎఫ్.డి.ఐ కి వ్యతిరేకంగా మాట్లాడడం వేరే అంశం. ఎందుకంటే వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ అన్నీ రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేసేదేమిటంటే బి.జె.పి రాజకీయాలకి వ్యతిరేకంగా ఓటేయ్యండి… అది బుధవారం ఓటింగ్ లో తేలుతుంది.”
దేశ ప్రజలకు తీవ్రంగా నష్టం కలుగజేసి ప్రజల రోజువారీ అవసరాలను డబ్బు మూటల్లో తరలించుకువెళ్లడానికి విదేశీ కంపెనీలకు అవకాశం ఇచ్చే ముఖ్యమైన ఆర్ధిక బిల్లునుండి రాజకీయాలను వేరు చేసే చతురతను కమల్ నాధ్ ప్రదర్శించాడు. ఇది నిజానికి ఎస్.పి, బి.ఎస్.పి వేయబోతున్న దివాళాకోరు ఎత్తుగడలకి కాంగ్రెస్ పార్టీ వైపునుండి ముందే ఒక న్యాయబద్ధతను (legitimacy) ని సమకూర్చడం. అంతేకాకుండా, ఆర్ధిక అవసరాలకోసం ఉపరితలంలో నిర్మాణమయ్యే రాజకీయాలను పరస్పరం విడదీయడం ఇది. వేరునుండి చెట్టునీ, పునాదినుండి ఉపరితలాన్నీ విడదీయడం. ఏ బహుళజాతి విదేశీ కంపెనీల కోసమైతే దేశ ప్రజల ఆర్ధిక వనరులని తాకట్టుపెడుతున్నారో ఆ కంపెనీలతో తమ బిల్లుకి సంబంధం లేదని చెప్పడం. ఇంకో రకంగా చూస్తే బి.జె.పి బూచిని చూపి బలగాలు సమీకరించుకునే ఎత్తుగడ. నిజానికయితే బి.జె.పి బూచి అవసరం లేకుండానే ఎస్.పి, బి.ఎస్.పి లు కాంగ్రెస్ చంకలో దూరాయి.
తెలంగాణవాదుల మొగ్గు
మంగళవారం కమల్ నాధ్ ఏర్పరిచిన ఎం.పిల సమావేశాన్ని బహిష్కరించి కలకలం సృష్టించిన తెలంగాణ కాంగ్రెస్ ఎం.పి లు బుధవారం దారిలోకి వచ్చారు. డిసెంబర్ 28 తేదీన తెలంగాణ విషయమై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో తాము సభకు హాజరై బిల్లుకి అనుకూలంగా ఓటు వేశామని కాంగ్రెస్ ఎం.పిలు చెప్పారు. వీరి దృష్టిలో తెలంగాణ సమస్య, ఎఫ్.డి.ఐ ల సమస్య వేరు వేరు. తెలంగాణ సమస్య, ఎఫ్.డి.ఐ సమస్య రెండూ ప్రజలదే అన్న దృష్టి వీరికి ఉంటే ఇంకా శక్తివంతమైన ఎత్తుగడని వీరు అనుసరించి ఉండేవారు. అఖిలపక్ష సమావేశం లాంటి అక్కరకురాని ఫలితం బదులు ఇంకా గట్టి ఫలితమే సాధించి ఉండేవారు. తెలంగాణ ప్రజల కోసం పదవులనే వదులుకోలేనివారు గట్టి నిర్ణయంతో అధిష్టానానికి దడ పుట్టిస్తారనుకోవడం అత్యాశే అనుకోండి.

చెప్పేదొకటి చేసేది ఇంకోటి అన్నట్లుగా బీఎస్పీ, ఎస్పీలు తమ రాజకీయ దివాళాకోరుతనాన్ని అనేక సార్లు ప్రదర్శించారు.
ఇవాళ ఎఫ్ డీఐల విషయంలో వారి వైఖరి మరీ పరాకాష్ఠకు చేరింది. అణగారిన వర్గాల ప్రయోజనాలకోసం పోరాడుతామని చెప్పుకునే ఆ పార్టీలు ఆ దిశగా చేసింది కూడా ఏమీ లేదు. అక్కడి ప్రజల అజ్ఞానం వల్ల, మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే వీరి ఆటలు సాగుతున్నాయి. ప్రజలు చైతన్యవంతులైన రోజు ఈ దగాకోరులుకు తగిన శాస్తి తప్పదు.
ఆర్యా,
ఈ సంఘటన ద్వారా ములాయం,మాయవతి,కారుణానిధి ల వ్యవహారం చూస్తే వీరికి దేశం, ప్రజలు ఎమైనా చీమకుట్టినట్లు ఉండదని అర్థమైంది.