దక్షిణచైనా సముద్ర గొడవల్లో తానూ ఉన్నానని భారత ప్రభుత్వం మరోసారి చాటింది. భారత ప్రభుత్వ కంపెనీ ‘ఒ.ఎన్.జి.సి విదేశ్’ దక్షిణచైనా సముద్రంలో ఆయిల్ పరిశోధనలో పాల్గొంటున్నందున భారత వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైతే ఇండియా కూడా తన బలగాలను పంపిస్తుందని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి స్పష్టం చేశాడు. సరిహద్దు తగాదాపై చర్చించడానికి భారత జాతీయ భద్రతాధికారి శివశంకర్ మీనన్ చైనా పర్యటనలో ఉండగానే నేవీ చీఫ్ ప్రకటన ఒకింత ఆసక్తిని రేపింది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో మూడోవంతుకి పైగా దక్షిణచైనా సముద్రం గుండానే జరుగుతున్న నేపధ్యంలోనూ, మత్స్య మరియు ఆయిల్ నిల్వలు పుష్కలంగా లభించే అవకాశం ఉన్న నేపధ్యంలోనూ దక్షిణచైనా సముద్రం సంక్లిష్టమైన అంతర్జాతీయ సమస్యగా ఇప్పటికే రూపుదిద్దుకుంది. ఇండియా చేసిన తాజా ప్రకటన ఘర్షణకు మరో కోణం వచ్చిచేరిందని భావించవచ్చు.
దక్షిణచైనా సముద్రం వద్ద పరిస్ధితి “సంక్లిష్టం’గా ఉండని నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి అభివర్ణించినట్లు పత్రికలు తెలిపాయి. చైనా తన నేవీని వేగంగా అభివృద్ధి చేసుకుంటున్న నేపధ్యంలో భారత దేశానికి అక్కడ ఉన్న ఆర్ధిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైతే భారత బలగాలను అక్కడికి పంపడానికి తాము సిద్ధం అని కూడా జోషి ప్రకటించాడు. “చైనా నేవీ భారత దేశానికి ఆందోళన కారకం కూడా” ఆయన తెలిపాడు. “దక్షిణచైనా సముద్రంలో భారత్ ప్రత్యక్ష ప్రయోజనాకారి కాదు, అయినప్పటికీ అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం అందరికీ ఉండాలన్నదే భారత్ కోరిక” అని జోషి వ్యాఖ్యానించాడు.
“అక్కడి సముద్ర జలాల్లో మనం తరచుగా వెళ్తామని కాదు. కానీ దేశానికి సంబంధించిన ఆర్ధిక ప్రయోజనాలకు భంగం కలిగితే స్పందించక తప్పదు. ఉదాహరణకి, ఒ.ఎన్.జి.సి విదేశ్ కి మూడు తవ్వకం బ్లాకులు అక్కడ ఉన్నాయి” అని జోషి తెలిపాడు. భారత దేశానికి చెందిన ఆయిల్ కంపెనీ ఒ.ఎన్.జి.సి విదేశాల్లో కూడా ఆయిల్ తవ్వకాలకు ప్రయత్నిస్తోంది. వియత్నాం దేశం కోసం ఒ.ఎన్.జి.సి విదేశ్ దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ వనరుల కోసం అన్వేషిస్తోంది. చైనా, వియత్నాం, జపాన్, ధాయిలాండ్ లు దక్షిణచైనా ఆయిల్, మత్స్య వనరులకోసం ఘర్షణ పడుతున్నాయి. చైనాపై కత్తికట్టిన అమెరికా ధాయిలాండ్, వియత్నాం, జపాన్ లకు మద్దతు ఇచ్చే పేరుతో అక్కడ ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. జోషి ప్రకటనను బట్టి ఈ వైరంలోకి ఇండియాని లాగడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయినట్లే కనిపిస్తోంది.
ది హిందూ ప్రకారం దక్షిణచైనా సముద్రంలో ఒ.ఎన్.జి.సి విదేశ్ కు మూడు ఆయిల్ బ్లాకుల్లో తవ్వకాలు జరుపుతోంది. ఆయిల్, గ్యాస్ తవ్వకాల కోసం కంపెనీ ఇప్పటికీ 600 మిలియన్ డాలర్ల వరకూ ఖర్చుపెట్టింది. వియత్నాం వరకే కాకుండా ఇంకా 15 దేశాల వరకూ ఆయిల్, గ్యాస్ వనరుల కోసం ఒ.ఎన్.జి.సి విదేశ్ అన్వేషణ జరుపుతోంది. దాదాపు 31 ప్రాజెక్టులను కంపెనీ నిర్వహిస్తోందని తెలుస్తోంది. దూరప్రాంతాల్లోని సముద్రజలాల్లో భారత నేవీ రక్షణ చర్యల కోసం ఎక్సర్ సైజ్ లు నిర్వహించిన ఉదాహరణలున్నాయని జోషి చెప్పినప్పటికీ వివరాలు ఇవ్వలేదు. అయితే దక్షిణచైనా సముద్రంలోకి నేవీ బలగాలను పంపాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం అని జోషి చెప్పాడు. దక్షిణచైనా సముద్ర వివాదాలను సంబంధిత దేశాలే చర్చలద్వారా పరిష్కరించుకోవాలన్నది భారత ప్రభుత్వం విధానంగా ఉంది. ఈ నేపధ్యంలో అక్కడికి బలగాలు పంపుతామని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
తన తీర సముద్రాల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోవడం ఏ దేశమైనా సహజంగానే చేసేపని. హిందూ మహాసముద్రంలో విదేశీ యుద్ధ నౌకలు, బలగాల కదలికలు మనకి ఎంత ఆందోళనకరమో దక్షిణచైనా సముద్రంలో అమెరికా, జపాన్ యుద్ధ నౌకల ఉనికి చైనాకి కూడా అంతే ఆందోళనకరం. అయితే పశ్చిమ మీడియా చైనాకి వ్యతిరేకంగా సాగించే విషప్రచారంలో చైనా వాస్తవ ప్రకటనలు, ఉద్దేశ్యాలు ఏవీ ప్రపంచదేశాలకు సరిగ్గా తెలిసే అవకాశాలు చాలా తక్కువ. ప్రాంతీయంగా తలెత్తే తగాదాలను అక్కడ ఉన్న దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడం సరైన పద్ధతి. దానికి తగిన అంతర్జాతీయ చట్టాలు కూడా ఉనికిలో ఉన్నాయి. అయితే సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తోక్కే అమెరికా, యూరప్ లకు ఒక్క దక్షినచైనా సముద్రమే కాకుండా హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలు కూడా ఆటస్ధలాలుగానే కనిపిస్తాయి. భారతదేశ ప్రజలు ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
హర్షణీయం. చాన్నాళ్ళకి ఇండియా నుంచి ఒక పురుషత్వం గల ప్రకటన.
ఎక్కడ ఏదున్నా అది నాదే అంటుంది చైనా ! సముద్రాల మీద కూడా బోడి కఱ్ఱపెత్తనం. అంత పరమ నీచ కక్కుర్తి జాతి ప్రపంచంలో ఎక్కడా లేదు.
సి.ఐ.ఎ ఏజెంట్లు దేశంలో పని చేస్తున్నారని అమెరికా సెనేట్ కమిటీ ముందు అమెరికన్ మిలట్రీ నివేదిక ఇచ్చింది. వాళ్లెవరో కనిపెట్టి తన్ని తరిమేస్తే అంతకంటే వీరత్వం ఇండియా పాలకులకి మరొకటి ఉండదు. పదేళ్లకి పైగా పొరుగు దేశంలో తిష్టవేసి ఆఫ్ఘన్ జనాన్ని చంపేస్తోంది అమెరికా. అమెరికా పేరు పెట్టి ‘ఇది అన్యాయం’ అని ఒక్క మాట చెబితే భారత పాలకులకి దండేసి దండం పెట్టొచ్చు.
అంతర్జాతీయ అన్యాయాల్ని ఎదిరించి ప్రశ్నించడం భారతదేశానికి గౌరవం. కాని అమెరికాకి సంతోషం కలిగించే ప్రకటనలు చేస్తే అది దాసత్వం తప్ప పురుషత్వం కాదని నా అభిప్రాయం.
అమెరికా, యూరప్ ల కర్రపెత్తనం గురించే నేను చదివాను. చైనాని బెదిరించే ప్రయత్నంలో ఆ దేశం పైన అమెరికా ప్రచారంలో పెట్టిన అబద్ధాలు తప్ప చైనా ఏ దేశం పైనైనా కర్రపెత్తనం చేస్తున్నట్లు నేనెక్కడా చదవలేదు.
ఓబుల్ రెడ్డి గారూ, చైనా కర్రపెత్తనం గురించి ఇతర సమాచారం ఏదన్నా మీ దగ్గర ఉందా?
ఇక్కడ ‘పురుషత్వం’ లాంతి పదాలు వాడుతూ ‘స్త్రీత్వం’ అంటే చేతకానితనం అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. గాజులు తొడుక్కోవడం, మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కడం, మగతనం చూపించడం తదితర వాక్యాలని వాడకూడదు. మీకు చేతనైతే ఒక పని చెయ్యడం ఎందుకు తప్పో, ఎందుకు తప్పు కాదో చెప్పండి. అంతే కానీ స్త్రీలని కించపరిచే పదాలు వాడొద్దు.