ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కొన్ని కాలేజీల తీరిది. అంగవైకల్యాన్ని జయించడానికి శ్రమిస్తున్న సాటి మనుషులకు తోడు నిలిచి భుజం తట్టడానికి బదులు యధాశక్తి అడ్డంకులు సృష్టిస్తున్న కాలేజీలు దేశ రాజధానిలోనే కొలువుదీరి ఉన్నాయి. తమ తరపున పరీక్ష రాయడానికి తోడు తెచ్చుకున్నవారిని నిర్దాక్షిణ్యంగా బైటికి తరిమికొట్టి, ఓ అంధ విద్యార్ధి పరీక్షలో తప్పడానికి సిద్ధపడిన కాలేజీ ఒకటైతే రైటర్ ని ఆలస్యంగా అందించడమే కాక కొశ్చేన్ పేపర్ కి పూర్తి సమాధానం ఇవ్వడానికి ఒక్క నిమిషం కూడా అదనపు సమయం ఇవ్వని కాలేజీ మరొకటి. సామాజిక సంబంధాల అభివృద్ధిలో దేశానికి మార్గదర్శిగా నిలబడవలసిన దేశ రాజధాని నగరంలోనే ఈ దారుణాలు చోటు చేసుకోగా సంబంధిత ప్రభుత్వాధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్ధితుల్లో ఉన్నట్లు చెప్పడం పరిస్ధితి తీవ్రతను చాటి చెబుతోంది.
“నవంబర్ 21 తేదీన నేను ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పరీక్ష రాయాల్సి ఉంది. కానీ నేను వెంట తెచ్చుకున్న రైటర్ ని పరీక్ష హాలులోకి నాతో అనుమతించడానికి ఒప్పుకోలేదు. ఆయనకి బదులు ఇంగ్లీష్ తెలియని కాలేజీ ప్యూన్ ని అందుకు నియమించింది. నేను ఖాళీ పేపర్ ఇవ్వాల్సి వచ్చింది” అని చూపులేని సుధాంశు కుమార్ ‘సమాన అవకాశాల సెల్’ (Equal Opportunities Cell – EOC) కి ఫిర్యాదు చేశాడు. సుధాంశు, దయాళ్ కాలేజీలో చదువుతున్న విద్యార్ధి అని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
మరో ఫిర్యాదుదారు పేరు హిమాన్షి. ఆమెకు కాళ్ళు, చేతులు రెండూ ఉపయోగపడే పరిస్ధితిలో లేవు. ఆమె తనవెంట తెచ్చుకున్న రైటర్ ని కాలేజీ అధికారులు పరీక్ష ప్రారంభంలోనే బైటికి వెళ్లగొట్టారు. అరగంట ఆలస్యంగా తమ సొంత రైటర్ ని వారు ఆమెకు సాయం చెయ్యడానికి సమకూర్చారు. అయితే ఆ రైటర్ కనీస వేగంతో కూడా రాయలేకపోయాడు. అత్యంత నెమ్మదిగా రాయడం వలన హిమాన్షి తనకు తెలిసిన ప్రశ్నలన్నింటికీ సమాధానం రాయలేకపోయింది. అరగంట ఆలస్యంగా రైటర్ ని సమకూర్చినప్పటికీ అదనంగా ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వడానికి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా ఆన్సర్ షీట్ ని అసంపూర్తిగానే ఆమె ఇవ్వాల్సి వచ్చింది.
చూపులేని మరో విద్యార్ధి నజ్ముల్ హసన్ కూడా అదే పరిస్ధితి ఎదుర్కొన్నాడు. ఎస్.జి.బి.టి ఖల్సా కాలేజీలో చదువుకుంటున్న నజ్ముల్ తన రైటర్ ని తెచ్చుకోగా పరీక్ష అధికారులు అతన్ని అనుమతించలేదు. వారు సమకూర్చిన రైటర్ కనీసం ప్రశ్నాపత్రం కూడా చదవలేకపోయాడు. దానితో నజ్ముల్ కూడా తన ప్రతిభని సమాధాన పత్రంలో తగిన స్ధాయిలో ప్రదర్శించలేకపోయాడు.
నియమ నిబంధనల ప్రకారం స్వయంగా పరీక్ష రాయలేని విద్యార్ధులకు అనేక చట్టబద్ధమైన అవకాశాలున్నాయి. ఆయా కాలేజీలు ముందుగానే అలాంటి విద్యార్ధులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తమ సొంత రైటర్లను తెచ్చుకునే హక్కు వికలాంగ విద్యార్ధులకు ఉంది కూడా. అభ్యర్ధుల సొంత రైటర్లను అనుమతించేందుకు ఇష్టపడని కాలేజీలు తగిన నిపుణత్వం కలిగినవారిని రైటర్లుగా అందించాల్సి ఉంటుంది. కానీ కనీస మానవత్వం, సానుభూతి లేని కాలేజీ అధికారుల వల్ల చట్టబద్ధ సౌకర్యాలేవీ వారికి అందుబాటులో లేకుండాపోతున్నాయి.
ప్రత్యేక బాధ్యతలపై నియమితుడయిన ఇ.ఒ.సి అధికారి బిపిన్ తివారీ ప్రకారం బాధితుల ఫిర్యాదులను యూనివర్సిటీకి అందినప్పటికీ వారు తిరిగి పరీక్ష రాసే సౌకర్యం ఇక లేనట్లే. “వారు మళ్ళీ పరీక్షలకు కూర్చునే అవకాశం లేదు. (పరీక్ష తప్పితే) అదే సంవత్సరం పరీక్షలు మళ్ళీ రాయాల్సిందే. ఇదంతా కేవలం వారి అంగవైకల్యం వల్లనే” అని బిపిన్ బాధగా నిట్టూర్చాడు. బాధితుల ఫిర్యాదుల మేరకు సంబంధిత కాలేజీలను కఠినంగా హెచ్చరిస్తూ బిపిన్ లేఖలు రాశాడు. భవిష్యత్తులో అలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని లేఖల్లో ఆయన కోరాడు. అయితే మళ్ళీ అలాంటివి జరిగితే గనక బాధిత విద్యార్ధులకు ఆయన చేయగలిగే సహాయం ఏమీ లేదు.
అధికారి ప్రకారం ఇది కొత్తేమీ కాదు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఫిర్యాదులు మామూలుగా మారాయి. “ఇలాంటి విద్యార్ధులకు ప్రతి సంవత్సరం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో యూనివర్సిటీ అనేక మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. అంగవికలురకు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంచింది. కానీ కాలేజీలు ఇంత మందబుద్ధితో ఉంటే వాటివల్ల ఉపయోగం ఉండదు” అని బిపిన్ ఒకింత కోపంగా వ్యాఖ్యానించాడు. కాలేజీల అనుచిత ప్రవర్తనను ముందే ఊహించిన బిపిన్ వికలాంగ విద్యార్ధుల హక్కులను, చట్టం వారికి కల్పించిన సౌకర్యాలనూ తెలియజేస్తూ తగిన మార్గదర్శకాలతో వివరంగా 20 రోజుల ముందే లేఖలు రాశాడు.
“స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఒక విద్యార్ధి ఆమె లేదా అతని సొంత రైటర్ ని తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ కాలేజీ అందుకు ఇష్టపడకపోతే తగిన అర్హతలున్న రైటర్ ని వారు అందజేయాల్సి ఉంటుంది. నిజానికి కాలేజీలు కొంతమంది రైటర్లను (bank of writers) ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి” అని బిపిన్ తెలిపాడు. “విద్యార్ధులు ఇక్కడికి వచ్చి నాకు ఫిర్యాదు చేయడం వల్ల ఈ కేసులైనా వెలుగులోకి వచ్చాయి. వారు సౌకర్యవంతంగా రాయడానికి ఉన్న ఇతర నిబంధనలని కాలేజీలు అమలు చేస్తున్నాయో లేదు నాకు తెలియదు. ఉదాహరణకి వారిని గ్రౌండ్ ఫ్లోర్ లోనే కూర్చోబెట్టాలని ఖచ్చితమైన నిబంధన ఉంది. ఇదంతా అమలు చేస్తున్నదీ లేనిదీ నాకు తెలియదు. ఎందుకంటే నేనొక్కడ్నే 80కి పైగా కాలేజీలు తిరిగి తనిఖీ చేయడం అసాధ్యం” అని బిపిన్ తెలిపాడు.
ఇదంతా జరుగుతున్నది ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో. బహుశా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కాలేజీల్లో ఇలాంటి అమానవీయ ఘటనలు జరిగే అవకాశం తక్కువే కావచ్చు. వికలాంగ విద్యార్ధుల మూడు చక్రాల బళ్ళను బడిదాకా చేర్చడానికి తలా ఒక చేయివేసే దృశ్యాలు పల్లెల్లోనే కాక జిల్లా కేంద్రాల్లో కూడా సాధారణంగా కనిపిస్తాయి. ఇంటిలోనే కాకుండా రోడ్డుపై జరిగే ఘటనలని కూడా గమనిస్తూ స్పందనా గుణాన్ని నిత్యం సజీవంగా ప్రదర్శించే గ్రామీణ ప్రాంతాల దేశీయ సంస్కృతి ఆధునిక పట్టణాల కృత్రిమ సంస్కృతితో ఇంకా కలుషితం కాకపోవడమే దానికి కారణంగా ఉంటుంది.
మనదికాని పరాయి సంస్కృతిని దిగుమతి చేసుకోవడమే ఆధునికత్వంగా భావించడమే కాక మానవ సంబంధాలను సైతం డబ్బుతో తూచే మార్కెట్ సంస్కృతిని నిండా పులుముకున్న ఆధునిక నగరాలు మానవీయ స్పందనలను తీవ్రంగా మొద్దుబార్చుతున్నాయని సుధాంశు, హిమాన్షి, నజ్ముల్ ల అనుభవాలు చెబుతున్నాయి. ఆయా సంస్కృతులు నూతన దశకు అభివృద్ధి కావడంలో తగిన పాత్ర పోషించవలసిన విద్యా సంస్ధలు కూడా మానవతా విలువల విషయంలో ప్రగతి నిరోధకంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది.
వికలాంగుల పేరు చెప్పుకుని కోట్లు దండుకునే కేంద్రమంత్రులు దేశాన్ని ఏలుతున్నపుడు ప్రభుత్వ పధకాలు, చట్టాలు వికలాంగ విద్యార్ధులకు అక్కరకు వస్తాయనుకోవడం అత్యాశే కావచ్చు.

దోచుకోవడమే దొంగ లక్ష్యమైనపుడు వాడు సాధారణర వ్యక్తి ఐనా… వికలాంగుడైనా….ఒకటే. అదీ కాక….మీరన్నట్లు…వికలాంగుల డబ్బు దోచుకున్నాడని సల్మాన్ ఖర్షీద్ పై సాక్ష్యాధారలతో సహా కేజ్రివాల్ ఆరోపించినా, తర్వాత పత్రికలు ఆధారాలు చూపినా చర్యలు లేవు. సరికదా అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారు. అంటే అర్తం ఏమిటి…ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోని దళసరిచర్మం పాలకులది అని..
అంతెందుకు ఆ మధ్య ఓ విమానాశ్రయంలో కూడా ఓ వికలాంగురాలిని నానా ఇబ్బందులు పెట్టిన వార్త జాతీయమీడియాలో హల్ చల్ చేసింది.
మనుషులపైనా…మానవత్వం పైనా గౌరవం ఉన్న వారికి సహజంగానే దేశంపైన కూడా ప్రేమ ఉంటుంది. అలాకాక కేవలం….విదేశీ పెట్టుబడులను ప్రేమించే వారికి మనుషులంటే విలువ ఉండదు. ఇక వికలాంగులని ఎక్కడ పట్టించుకుంటారు.
పౌర సమాజమైనా వికలాంగులను ఆదరించడమే దీనికి అంతో ఇంతో పరిష్కారం.
Can you write an article on child rights protection? Read this article: http://www.facebook.com/Taadepalli/posts/10151281575499131 There are some people who totally ignore about child rights.