(జస్టిస్ మార్కండేయ కట్జు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేశాడు. ఇప్పుడాయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఛైర్మన్. తన అభిప్రాయాలను జస్టిస్ కట్జు నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తాడని పేరు. దానివలన ఆయనకి మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులూ దాదాపు అంతమంది ఉన్నారు. ముద్రణా మీడియాపై నియంత్రణ ఉన్నట్లే దృశ్య, శ్రవణ మీడియా పై కూడా పరిమిత నియంత్రణ ఉండాలని వాదించడం వలన ఆయనకి మీడియాలో కూడా వ్యతిరేకులు ఉన్నారు.
రెండు రోజుల క్రితం మరణించిన శివసేన అధిపతి బాల్ ధాకరేకు నివాళులు అర్పించడానికి పలువురు ప్రముఖులు పోటీలు పడుతున్న నేపధ్యంలో జస్టిస్ కట్జు ఈ వ్యాసం రాశాడు. ఓట్ల కోసం ఇతర రాష్ట్రాల ప్రజలపై బాల్ ధాకరే వ్యక్తం చేసిన విద్వేషం భారత దేశానికి ఎంతమాత్రం ఉపయోగం కాదనీ, ఆయన ప్రవచించిన భూమిపుత్ర సిద్ధాంతం ఆయన కుటుంబానికి కూడా మహారాష్ట్రలో అస్తిత్వాన్ని నిరాకరిస్తుందని కట్జు తన వ్యాసంలో వివరించాడు. ది హిందూ ప్రచురించిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. తమిళకవి సుబ్రమణ్య భారతి కవిత, మహాభారతం శ్లోకాలను వదిలి పాఠ్యాన్ని మాత్రమే అనువదించి ప్రచురిస్తున్నాను. జాతుల స్వయం నిర్ణయాధికారానికి సంబంధించి ఇందులో పరోక్షంగా వ్యక్తమయిన అభిప్రాయాలతో నాకు ఆమోదం లేదు. -విశేఖర్)
*** *** ***
బాల్ ధాకరేకు నివాళులు అర్పించడానికి రాజకీయ నాయకులు, సినిమా తారలు, క్రికెటర్లు పోటీలు పడుతున్నారు. అనేకమంది పెద్దలు, ఉన్నతుల నుండి వెల్లువెత్తుతున్న ప్రశంసలు, స్తోత్రాల మధ్య సవినయంగా నా అసమ్మతిని నమోదు చేయాలని భావిస్తున్నాను.
చనిపోయినవారు మంచిని మాత్రమే చెబుతారన్న సూక్తి నాకు తెలుసు. కానీ నేను దానిని అంగీకరించలేనని చెప్పేందుకు విచారిస్తున్నాను. ఎందుకంటే, పౌర మర్యాదలను పాటించడం కంటే నా దేశ ప్రయోజనాలే ఉన్నతమని నేను భావిస్తాను.
బాల్ ధాకరే వారసత్వం ఏమిటి?
అది జాతీయ వ్యతిరేకమైన భూమి పుత్రుల సిద్ధాంతం.
“ఇండియా, అనగా భారత్, రాష్ట్రాల సమైక్య దేశం (Union of States) గా ఉంటుంది” అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1) చెబుతుంది.
అంటే, ఇండియా ఒక సమాఖ్య కాదు, కలయిక (యూనియన్).
“భారతదేశ భూభాగంలోని ఏ భాగంలోనైనా నివసించడానికీ, స్ధిరపడడానికీ దేశ పౌరులందరికీ హక్కు ఉంది” అని ఆర్టికల్ 19(1)(ఇ) చెబుతుంది.
అంటే, మహారాష్ట్రీయులకు దేశంలో ఏ చోటయినా స్ధిరపడే హక్కు ఉన్నట్లే, ఒక గుజరాతీ, ఒక దక్షిణ భారతీయుడు, ఒక బీహారీ ఒక ఉత్తర ప్రదేశీయుడు లేదా భారత దేశంలోని ఇతర ఏ ప్రాంతానికి చెందినవాడయినా మహారాష్ట్రకు వలసవెళ్లి స్ధిరనివాసం ఏర్పరుచుకునే హక్కు ఉంది. (కొన్ని చారిత్రక కారణాల రీత్యా, జమ్ము & కాశ్మీర్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.)
భూమిపుత్ర సిద్ధాంతం ఏమి చెబుతుందంటే మహారాష్ట్ర కేవలం మరాఠీ ప్రజలకే చెందుతుందని. గుజరాతీలు, దక్షిణ భాతీయులు, ఉత్తర భారతీయులు మొదలయినవారు బయటివారని చెబుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1), 19(1)(ఇ) లకు ఇది విరుద్ధం. భారతదేశం ఒకే దేశం. కనుక, మహారాష్ట్రలో మహారాష్ట్రేతరులను బయటివారుగా చెప్పడానికి వీలు లేదు.
ధాకరే సృష్టించిన శివ సేన 1960లు, 70ల్లో దక్షిణ భారతీయులపై దాడులు చేసింది. వారి ఇళ్లను, రెస్టారెంట్లను ధ్వంసం చేసింది. ముంబైలో నివసించే బీహారీలను, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారినీ (పాలు, దినపత్రికలు అమ్ముకుంటూ, టాక్సీలు నడుపుకుంటూ జీవనం గడిపే భయ్యాలు వీళ్ళు) 2008లో చొరబాటుదారులుగా ముద్రవేసి దాడులు చేశారు. వారి టాక్సీలను నాశనం చేశారు, అనేకమందిని చావబాదారు. ముస్లింలను కూడా నిందించారు.
ఇది, విద్వేషం ఆధారంగా ధాకరేకు ఓటు బ్యాంకును సృష్టించింది (ధాకరే అమితంగా ఆరాధించే హిట్లర్ కి మల్లేనే). దేశం ముక్కలై బాల్కనీకరణ (ఐక్య బాల్కన్ ద్వీపకల్పం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలు చెక్కలు కావడాన్ని బాల్కనైజేషన్ గా చెబుతారు -అను) చెందితే మాత్రం ఏమిటట?
భూమిపుత్ర సిద్ధాంతానికి అభ్యంతరం చెప్పడానికి అది జాతీయ వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అవడం ఒక్కటే కారణం కాదు. దానికి మరొక మౌలిక అభ్యంతరం కూడా ఉంది. ధాకరే సొంత ప్రజలపై కూడా అది తిరగబడుతుంది.
విశాలదృష్టితో చూస్తే, భారత దేశం వలస ప్రజల దేశం (ఉత్తర అమెరికా వలే). ఈనాడు భారత దేశంలో నివసిస్తున్నవారిలో 92-93 శాతం మంది అసలైన ఆదిమ నివాసులు కారు. వారు ప్రధానంగా వాయవ్య ప్రాంతం నుండి సౌకర్యవంతమైన జీవితం గడపడం కోసం ఉపఖండానికి వలస వచ్చినవారి వారసులు. (నా బ్లాగ్ justicekatju.blogspot.in లో ‘What is India’ అనే ఆర్టికల్ చూడండి. kgfindia.com లో వీడియో కూడా చూడండి.)
ద్రవిడులకు ముందు నివసించిన, ఆదివాసీలు (భిల్లులు, గోండులు, సంతాల్ లు, తోడులు మొ.వారు) గా పిలవబడుతున్న గిరిజనులు మాత్రమే భారతదేశ అసలు నివాసులు (అసలు భూమిపుత్రులు). వీరు ఇప్పటి జనాభాలో 7-8 శాతం మాత్రమే ఉన్నారు.
కనుక భూమిపుత్ర సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే, 92-93 శాతం మంది మహారాష్ట్రీయులను (బహుశా ధాకరే కుటుంబంతో సహా) బయటివారుగా పరిగణించవలసి ఉంటుంది. బైటివారిని ఎలా చూడాలో వారిని అలాగే చూడవలసి ఉంటుంది. మహారాష్ట్రలో అసలు భూమి పుత్రులు రాష్ట్ర జనాభాలో 7-8 శాతంగా ఉన్న భిల్లులు మరియు ఇతర గిరిజనులు మాత్రమే.
భారతదేశంలో ఈనాడు (భూమిపుత్ర సిద్ధాంతంతో సహా) అనేక వేర్పాటువాద, విచ్ఛిన్నకర శక్తులు పని చేస్తున్నాయి. దేశభక్త ప్రజలంతా ఈ శక్తులపై పోరాడాలి.
మనం ఎందుకు ఐక్యంగా నిలవాలి? ఎందుకంటే, భారీ ఆధునిక పరిశ్రమలు మాత్రమే ప్రజల సంక్షేమం కోసం అవసరమైన భారీ సంపదలను ఉత్పత్తి చేయగలవు. వ్యవసాయం మాత్రమే దానిని ఉత్పత్తి చేయలేదు. ఆధునిక పరిశ్రమ కావాలంటే భారీ మార్కెట్ అవసరం. దరిద్రం, నిరుద్యోగం మరియు సామాజిక చెడుగులను నిర్మూలించాలంటే పెద్ద మొత్తంలో ఆరోగ్య సంరక్షణ మరియు ఆధునిక విద్యా వ్యవస్ధలను కల్పించాలంటే, వాటిని నెరవేర్చగల ఆధునిక పరిశ్రమకు తగిన భారీ మార్కెట్ ను ఐక్యభారతం మాత్రమే అందించగలదు.
అందువలన బాల్ ధాకరే కు ఎలాంటి నివాళినీ అర్పించలేకపోతున్నందుకు నేను విచారిస్తున్నాను.

well said Katju
ఎవరి అభిప్రాయం వారిది.
మొత్తానికి కట్డూ తన దారి విభిన్నం అని మరోసారి నిరూపించుకున్నారు. కాకుంటే చనిపోయిన వాళ్లు ఎటువంటి వాళ్లైనా, చివరకి శత్రువైనా… సంతాపం తెలపడం మన ధర్మంగా భావిస్తాం కదా అంతే.
చందుతులసి గారూ, నివాళులు, సంతాపం వేరు వేరు అనుకుంటా.
తన అభిప్రాయాన్ని నిష్కర్షగా వెల్లడించిన కట్జు అభినందనీయుడు!
@ చందు తులసి: సంతాపం లాంఛనప్రాయమైనది; నివాళి అంతకంటే మించి అభిమానాన్నీ, గౌరవాన్నీ వ్యక్తం చేస్తుంది!
జస్టిస్ కట్టు చేసిన ప్రకటన అపురూపమైనది. ఆమోదించలేని అనేక అభిప్రాయాలున్నప్పటికీ, బాల్ థాకరేని హిట్లర్ తో పోల్చడం ద్వారా ఆయన సరైన వైఖరినే తీసుకున్నాడు. మీడియా అంతా ఒక గొప్ప నాయకుడిలా బాల్ థాకరేని కీర్తిస్తున్నప్పుడు తన వ్యతిరేకతను ఇలాంటి సందర్భంలో కూడా తెలియజేయడం ద్వారా ఆయన ప్రకటించిన ధైర్యం ఒక ఊరటను కలిగిస్తున్నది. గత రెండు రోజులుగా దిన పత్రికలను, దృశ్య మాధ్యమాలను చూస్తున్నప్పుడు లోపల రగులుతున్న మంట ఈ ప్రకటనతో చల్లారినట్టుగా అన్పిస్తుంది.
బాల్ థాకరే రాజకీయాలను పర్యావలోకనం చేసినప్పుడు ఆయనకూ హిట్లర్ కూ అతి దగ్గరి పోలికలు కనిపిస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతర నష్టాలతో, అవమానకర ఒప్పందాలతో నలిగిపోతున్న జర్మన్ ప్రజలలో ఆర్య జాతి ప్రత్యేకతనూ, విశిశ్టతనూ హిట్లర్ రెచ్చగొట్టినట్లుగానే, దేశానికి ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న బొంబాయిలో మరాఠా ప్రజల వెనుకబాటును సాకుగా చూపుతూ ఆయన వెలుగులోకొచ్చాడు. మహారాష్ట్ర- మరాఠా నినాదాన్ని ముందుకు తెచ్చాడు. ఇంతా చేసి మరాఠాప్రజలకు గానీ, మహారాష్ట్రకు గానీ ఆయన చేసిన మేలు ఏదీలేదు. హిట్లర్ ప్రదర్శించిన కమ్యునిష్టు వ్యతిరేకతనూ థాకరే పుణికి పుచ్చుకున్నాడు. ఒక పారిశ్రామిక నగరంలో కార్మిక సంఘాల నిర్మాణాలనూ, వాటి కార్యక్రమాలనూ విచ్చిన్నం చేయడంతో పాటుగా వాటి స్థానంలో లుంపెన్ మూకల ప్రాభల్యాన్ని పెంచడంలో ఆయన తనకు తానే ఒక ఉదాహరణగా నిలుచున్నాడు.
ముస్లీం వ్యతిరేకత కనపరచడం, హిందూ మతోన్మాద శక్తులతో కలగలిసి నడవడం మాత్రమే కాక, బాబ్రీమసీదు విధ్వంసంలోనూ, తదననంతర బొంబాయి అల్లర్లలోనూ తన వాటాను సగర్వంగా ప్రకటించుకొని ప్రజాస్వామిక సూత్రాలతో తన శత్రుత్వాన్ని బహిరంగంగానే వెల్లడి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన మరణాన్ని ఒక సందర్భంగా చేసుకొని మన దేశంలో ఉన్న బడాబాబులూ, వారి పరివార గణం, వారి వారి బాజా భజంత్రీలూ తమలోని ఒక పార్శ్వాన్ని పోగొట్టుకున్నందుకు దుఃఖిస్తున్నాయి. నివాళులిస్తున్నాయి.
హిట్లర్ లాగే, థాకరె ప్రజలకు కాక మూకకు నాయకత్వం వహించిన వ్యక్తి. మూకకు నిర్మాణాత్మక స్వభావం ఉండదు. అట్టాంటి మూక స్వభావాన్ని సందర్భానికి తగ్గట్టుగా రెచ్చగొట్టి, ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాలను, విబేధాలనూ అనాగరికమైన సంఘర్షణలుగా మలచడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ పనిలో ఆయన కళాకారుని స్థాయిలో ప్రావీణ్యం సంపాదించాడు.
ప్రజా రాజకీయాలకూ, ప్రజలకూ జాగరూకత వహించవలసిన అసహ్యకర సంకేతం ఆయన. తలుచుకుంటుంటే తనకు హిట్లర్ తో ఒక పోలిక మిస్సయినట్టుగా ఉంది. అది తన చావు. స్టాలిన్ నాయకత్వంలోని సోవియట్ సైన్యం చావచితకగొడుతుంటే హిట్లర్ ఎంచుకోవాల్సి వచ్చిన అవమానకరమైన చావు ఇక్కడ లేక పోవడం.
మహారాష్ట్రలో అనేక మంది తెలంగాణా ప్రజలు ఉన్నారనీ, థాకరే వీళ్ళపై కూడా దాడులు చెయ్యిస్తాడనీ తెలియక ఫేస్‌బుక్‌లో కొంత మంది తెలంగాణావాదులు & సమైక్యవాదులు (హైదరాబాద్‌వాదులు) కూడా థాకరేని పొగడడం చూడాను. గొఱ్ఱెల మందలో ఒక గొఱ్ఱె ఎటువైపు వెళ్తే మిగిలిన గొఱ్ఱెలు అటువైపే వెళ్తాయి.
మార్కండేయ కట్జూ గారి విషయానికి వస్తే, ఆయన తన అభిప్రాయాలని స్పష్టంగా చెపుతారు. హిందువులకి వ్యతిరేకంగా ముస్లింలలోని సున్నీ, షియా వర్గాలు ఏకమైన సందర్భాలు ఉన్నాయి. కానీ ముస్లింలకి వ్యతిరేకంగా హిందువులలోని రెండు కులాలు ఏకమైన సందర్భాలు ఎన్నడూ లేవు. ఈ విషయం మార్కండేయ కట్జూ గారు స్పష్టంగానే చెప్పారు. ఆయన చెప్పినది నిజమే కానీ ఆయన గమనించని విషయం ఇంకొకటి ఉంది. ఒకే కులంలో కూడా డబ్బున్నవాళ్ళూ, పేదవాళ్ళూ ఎన్నడూ కలిసి ఉండరు. వర్గ వైరుధ్యాల గురించి కొద్దిగా తెలిసినవాడు మార్కండేయ కట్జూ రచనలు చదివితే అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైపోతుంది “హిందువులలో వ్యక్తివాదం తప్ప ethnic unity గత చరిత్రలో ఎన్నడూ లేదు” అని. ఇప్పుడు హిందూ జాతీయవాదం పేరుతో విర్రవీగుతున్నవాళ్ళ చరిత్ర 200 సంవత్సరాల క్రితం మొదలైంది. క్రైస్తవ, ఇస్లాం మతాలు పుట్టుకతోనే వ్యవస్థీకృత మతాలు. ఆ మతాలకి పోటీగా హిందూ మతాన్ని వ్యవస్థీకృతం చెయ్యాలనే ఇప్పటి హిందూ జాతీయవాదులు అనుకుంటున్నారు. ఈ విషయాలు వ్రాసే సమయం నాకు లేదు కానీ ఆన్‌లైన్‌లో మార్కండేయ కట్జూ గారి రచనలు ఉన్నాయి, అవి చదవండి.
Read this link: https://plus.google.com/107663886412490523651/posts/iPKy6n3cHdv
A girl was arrested for expressing her opinion against Thackeray’s grand funeral.
మహారాష్ట్రలో అనేక మంది తెలంగాణా ప్రజలు ఉన్నారనీ, థాకరే వీళ్ళపై కూడా దాడులు చెయ్యిస్తాడనీ తెలియక ఫేస్‌బుక్‌లో కొంత మంది తెలంగాణావాదులు &
………………………….
. థాకరే చనిపోయారు కదా దాడులు చేయించడం ఏమిటి ?
తెలంగాణా వారిపై థాకరే దాడులు చేయించిన సంఘటనలు లేవు కాబట్టి భవిష్యత్తు లో చేయిస్తారని చెప్పలనుకున్నరేమో .. కానీ చనిపోయిన వారికీ ఆ అవకాశం ఉండదండి
As English medium student, I do commit grammar mistakes in Telugu.
I remember reading this article yesterday and thought it would be nice if someone translated it into regional language newspapers. Thanks again for doing the translation.
కట్జు వ్యాసం ప్రజాశక్తిలో ఇక్కడ http://www.prajasakti.com/todaysessay/article-404931 చదవండి
I think news papers like eenadu won’t wish to publish such news. Read this: http://andamainacheekati.blogspot.in/2012/01/blog-post.html
గత కొన్నేళ్ళుగా ఈనాడు అధినేత అద్వానీతో దగ్గరగా ఉంటున్నాడు. బహుశా ది పనిచేసి ఉండొచ్చు
వ్యాపారి తన వ్యాపారానికి పోటి దారుని తో తప్ప ఎవరితోనూ ఘర్షణ కొరుకోడు
చిన్నప్పుడు మాకు పాఠాలు చెప్పిన పంతుళ్ళు అనేవాళ్ళు “రాజకీయ నాయకులని ఆరాధించకండి, IAS, IPS అధికారులని గౌరవించండి” అని. “వ్యక్తి పూజ చెయ్యడానికి రాజకీయ నాయకుడైతే ఏమిటి, బ్యూరోక్రాట్ అయితే ఏమిటి?” అనే సందేహం మాకు రాని వయసులోనే మా పంతుళ్ళు మాకు సమాజం గురించి తప్పుడు సందేశాలు ఇచ్చారు. ఇప్పుడు జరిగిందేమిటి? చిన్నప్పుడు మనం ఏ బ్యూరోక్రాట్‌లని గొప్పవాళ్ళని అనుకున్నామో, ఆ బ్యూరోక్రాట్‌లే థాకరేకి వ్యక్తిపూజ చేసి అతని అభిమానుల కోసం ఇద్దరు అమ్మాయిలని అరెస్ట్ చేశారని తెలిసింది. థాకరే అభిమానులకి అనుకూలంగా వ్యవహరించినవాళ్ళలో ఒకడు జిల్లా ఎస్.పి., ఇంకొకడు జడ్జ్. ఇద్దరూ చదువుకున్నవాళ్ళే. వాళ్ళు నిజ జీవితంతో సంబంధం లేని స్కూల్ పాఠాలని బట్టీ పట్టి చదివి, ఫస్ట్ ర్యాంక్‌లు తెచ్చుకుని పాసై, బ్యూరోక్రాట్‌లుగా అవతారం ఎత్తినవాళ్ళు.