రాముడు చెడ్డ బాలుడు -రాం జేఠ్మలాని


Photo: The Hindu

‘రాముడు మంచి బాలుడు’ అని చదవడమే ఇప్పటిదాకా మనకున్న అలవాటు. ఇకనుండి ‘రాముడు చెడ్డవాడు’ అనికూడా చదువుకోవచ్చు. బి.జె.పి రాజ్యసభ సభ్యుడు, జగన్ బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలం అయిన ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ రాం జేఠ్మలాని భారత ప్రజలకు ఆ అవకాశాన్ని కల్పించాడు. ఏ కారణంతో అయితే ఇన్నాళ్లూ ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారో సరిగ్గా అదే కారణంతో రాముడు తాజాగా చెడ్డవాడు కావడమే ఓ ఆసక్తికర పరిణామం.

స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలపై రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన సభలో రాం జేఠ్మలాని మహా పాపపు మాటలు పలికి సంచలనం సృష్టించాడు. “రాముడు చెడ్డ భర్త. అతనంటే నాకసలు ఇష్టం లేదు. ఎవరో ఒక జాలరి ఏదో అన్నాడని, పాపం ఆ మహిళని వనవాసానికి పంపేశాడు” అని రాం జేఠ్మలాని వ్యాఖ్యానించి పెను దుమారానికి తెరతీశాడు. జేఠ్మలాని వ్యాఖ్యతో ‘రామాయణ విషవృక్షం’ లాంటి ఉద్గ్రంధాల ద్వారా సీత అనుభవించిన హింసను వెలుగులోకి తెచ్చిన రంగనాయకమ్మగారి లాంటి వాస్తవ సామాజిక చరిత్ర  విశ్లేషకులకు ఊహించనివైపు నుండి మద్దతు దొరికినట్లయింది.

రాముడి వెంట అడవులకు నడిచి మంచితమ్ముడిగా సర్టిఫికేట్ కొట్టేసిన లక్ష్మణుడిని కూడా జేఠ్మలాని వదల్లేదు. “ఆయనయితే ఇంకా వరస్ట్. సీతని పట్టుకెళ్ళినపుడు తన కాపలాలోనే ఆమెని పట్టుకెళ్లారు గనక లక్ష్మణుడే వెతకాలని రాముడు కోరాడు. సీత తన వదిన అనీ, అందువల్ల ఆమె ముఖమే తానెన్నడూ చూడలేదని, కనుక తానామెను గుర్తుపట్టలేననీ చెప్పి లక్ష్మణుడు తప్పించుకున్నాడు” అని సీత వనవాసంలో లక్ష్మణుడి పాత్రను జేఠ్మలాని నిరసించాడు.

మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం పైన కూడా జేఠ్మలాని ఆగ్రహం వెళ్ళగక్కాడు. “ఈ రోజు ఈ గ్రహం యొక్క భవిష్యత్తుకి సంబంధించి కూడలిలో నిలబడి ఉన్నాం. మతం పూర్తిగా మారిపోయింది. మతం భయోత్పాతాన్నిమాత్రమే సృష్టించింది. చంపేయ్యాలంటూ ఫత్వాలు జారీ చేసే వారిని మాత్రమే మతం సృష్టించింది” అని జేఠ్మలాని కుండ బద్దలు కొట్టాడు.

జేఠ్మలాని చెప్పిన వాస్తవాలు కొత్తగా కనిపెట్టినవేమీ కాదు. దశాబ్దాలుగా అనేకమంది సామాజికవేత్తలు, చరిత్రకారులు, వ్యక్తులు, సంస్ధలు, సంఘాలు చెబుతూ వచ్చిన అంశాలనే ఆయన తన గొంతుతో చెప్పాడు. ఎవరో ఒక బైటివ్యక్తి నోటి దురదతో చేసిన ఆరోపణని పట్టించుకుని తనను నమ్మివచ్చిన భార్యని వదిలేయడం అత్యంత అమానుషం అని చెప్పడానికి చరిత్రతోనో, సిద్ధాంతాలతోనో, తత్వాలతోనో పనిలేదు. జీవితాంతం సహజీవనం చేయడానికి సిద్ధపడిన భార్యను నిరూపణకు నిలబడని తప్పుడు ఆరోపణలతో నిర్దాక్షిణ్యంగా అడవులుపాలు చెయ్యడం అంటే ఆమె వ్యక్తిత్వానికి అసలు విలువ ఇవ్వనట్లే.

రామూడు రాజు కనుక రాజధర్మం పాటించాడనీ, ప్రజల మనోభావాల కోసం సీతను పరిత్యజించాడనీ సమర్ధకులు చెబుతారు. అంటే రాముడు ప్రజల వ్యక్తి అని చెప్పే ఒకానొక సుగుణంగా మాత్రమే ఆయన భార్య ఉండాలన్నమాట! సీతను మనసు, హృదయం, మెదడు ఉన్న ఒక ఆత్మగౌరవ వ్యక్తిగా కాక రాజు గుణగణాలకు అలంకారంగా చూడడమే ఇది. రాముడు దేవుడు కనుక ఆయన చేసిన ప్రతిపనీ గొప్పదే కావాలి కనుక ఆయన భార్యని అడవులపాలు చేసినా ఆదర్శమే. తపస్సు చేస్తున్న శూద్ర శంభూకుడిని హత్య చేసినా ఆదర్శమే. తుమ్మినా, దగ్గినా ఆదర్శమే. ఆ ఆదర్శం మా విశ్వాసం అంటూ అప్రజాస్వామిక శాసనాలు జారీచేస్తే పాలితులంతా దాన్ని పాటించాలి. మరొకరి సెంటిమెంట్ సంకెళ్లని మనవిగా భావించి చేతులూ, కాళ్ళూ, నోరూ, ఆలోచనలు అన్నీ కట్టేసుకుని ఆమోదించాలి.

రాం జేఠ్మాలని ఈ శృంఖలాలని తెంచేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అవినీతి ఆరోపణల రీత్యా బి.జె.పి సారధి నితిన్ గడ్కారీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న జేఠ్మలానికి ఇంత అకస్మాత్తుగా రాముడిపై ద్వేషం పుట్టుకొచ్చిందంటే ఏమిటి కారణం? కాంగ్రెస్ వైపుకి ఆయన దూకనున్నాడా? దూకినా ఆశ్చర్యం లేదు. దూకడానికి ఆయనకి అడ్డుగోడలేవీ లేవు కూడా. కానీ ఆయన రామద్వేషానికి ఇంకా లోతైన కారణాలే ఉండవచ్చు.

భారతదేశ రాజకీయ రంగంలో రెండు ప్రధాన ధోరణులు ఉన్నాయి. దేశంలో ఆధిపత్య వర్గాలైన భూస్వాములు, పెట్టుబడుదారులు ప్రధానంగా రెండు రాజకీయ స్రవంతులను ఎంచుకున్నారు. లిబరల్ రాజకీయ స్రవంతిని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ సెక్యులరిస్టు అవతారం ఎత్తగా, మితవాద గ్రూపులు ప్రజల్లో ఉన్న మతఛాందస భావాలను సొమ్ము చేసుకోవడానికి బి.జె.పి నీడలో హిందూమతాన్ని ఎంచుకున్నాయి. కాంగ్రెస్ కి సెక్యులరిజంపై ప్రేమ లేనట్టే బి.జె.పి వర్గాలకు హిందూమతంపై ప్రేమ ఉండదు. భావజాలంపై గౌరవం లేనందునే వారి నాయకులు యధేచ్ఛగా అటు ఇటూ మారగలరు.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎంచుకున్న భావజాలం కొనసాగుతుండగా, బి.జె.పి ఎంచుకున్న రామదీపం కొడిగడుతోంది. రాముడు, అయోధ్య, గుడి మొదలయిన అంశాలకు ఆదరణ తగ్గిపోయింది. ప్రజల భౌతిక అవసరాలలో పునాదిలేని మతవిశ్వాసాలు మూకుమ్మడిగా ఓట్లను రాల్చే పరిస్ధితి ఇపుడు లేదు. దానితో రాముడి గుడి చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలను మునుపటిస్ధాయిలో కొనసాగించలేక నీళ్ళు ఒదులుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది. ఈ పరిస్ధితిని మితవాద శిబిరంలోని ప్రతి గ్రూపూ ఇపుడు గుర్తించకపోవచ్చు. కానీ ఒక గ్రూపు గుర్తించినా ఆ గుర్తింపు ముసుగు కప్పుకుని ఊరుకోదు. తన ఉనికిని చాటుకుంటుంది. అలా ఉనికిని చాటుకున్న ఫలితమే రాం జేఠ్మలాని ప్లేటు ఫిరాయింపు.

లేదంటే ఆయనకి ఇన్నాళ్లూ రాముడు చెడ్డ భర్త అని తెలియకనా? రాముడి గుడి వెనుక గుమికూడిన ప్రజల ఓట్లు, ఆ ఓట్లు అందించే అధికారం ఆయనకీ, ఆయన మిత్రులకీ కావాలి కనుక చెడ్డ భర్త కోసం గుడి కట్టినా వారికి ఓ.కె. ఇపుడు జనం పలచబడ్డారు కనక మరోదారి వెతుక్కోవాలి. రాం జేఠ్మలాని వ్యాఖ్యల్లో ఇంతకంటే గొప్పతనం ఏమీలేదు.

22 thoughts on “రాముడు చెడ్డ బాలుడు -రాం జేఠ్మలాని

 1. జెఠ్మలానీ వ్యాఖ్యల నేపథ్యం, ఆయన ఆంతర్యంపై మీ పరిశీలన, విశ్లేషణ ఆసక్తికరం! టపాకు పెట్టిన టైటిల్ బాగా కుదిరింది…

 2. తమ అవసరాలకోసం మతాన్ని ఉపయోగించుకోవడంలో భారతీయ జనతా పార్టీకి మించిన పార్టీ మరోటి లేదు. ఆర్ధిక, సామాజిక సమస్యలు కాకుండా…కేవలం ఓ మందిరం నిర్మించడం ద్వారా….ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.
  ఇక రాం జెఠ్మలానీ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవే కావచ్చు. మీరు చెప్పినట్లుగానే రామున్ని నమ్ముకుని ఎంతోకాలం మనుగడ సాగించలేము అని ఆ పార్టీ శ్రేణులు గుర్తించాయి. అందులో భాగమే ఈ వ్యాఖ్యలు.
  ఇది ఒక్క భాజపాకు మాత్రమే కాదు. ప్రజల నిజమైన సమస్యల పరిష్కారం కోసం కాక తాత్కాలికంగా ఓట్లు లభించేందుకు…ఏదో ఒక అడ్డదారిని..భావోద్వేగ సమస్యను ఎంచుకుంటే ఏ పార్టీకైనా ఇబ్బంది తప్పదు.
  భాజపా నాయకులు ఇకనైనా ఓ సారి ఆత్మవిమర్స చేసుకోవాలి.
  మతం గొప్పదే కావచ్చు. కానీ మనిషి ఇంకా గొప్పవాడు.
  ఎందుకంటే మతం లేని మనిషి ఉండొచ్చు. కానీ మనిషి లేని రోజున మతానికి విలువ ఉండదు.

 3. పాకిస్తాన్‌లో ఉన్నంత మతతత్వం ఇండియాలో లేదు. అందుకే బిజెపి ఎంత మతం పేరు చెప్పుకున్నా వోట్లు పడవు. ఇండియా ఏమీ కాంగ్రెస్ చెపుతున్నంత సెక్యులర్ సమాజం కాదు. నిత్యం ఏవో సమస్యలలో ఉండే పేదవాళ్ళకి మతం గురించి ఆలోచించడానికి సమయం ఉండదు కాబట్టి చాలా విషయాలలో మత పట్టింపులు లేకుండా ఉంటారు. ఆ మాత్రానికే ఇండియా సెక్యులర్ సమాజం అనీ, ఇక్కడి ప్రజలలో పరమత సహనం ఉందనీ భ్రమపడేవాళ్ళు ఉన్నారు.

 4. Yesterday Karunanidhi, now Ramjetmalani, every one trys to hit Hindu Gods and get sensational name. It is indeed repulsive to note that no one dares to comment on other religion gods, especially, Islam god because the revenge would be very serious and may be assasination. Hence, better not revolt these type of persons who comments abuse contents on Hindu gods and instead leave them to air as if talk of a mad guy. Ofcourse, age factor is also there. Let us pity on this old guy who is famous for pleading villians mostly and won money and fame. Instead of criticizing Rama he would have praised Ravana. Any way, let us not expect any support in condemning these type of criticizm from Italian runb Indfian Government.

 5. ఇలాటి వ్యాఖ్యలను చదువుతున్నపుడు కార్య క్షేత్రంలో పని చేసే కార్యకర్తల మీద ఉన్న గౌరవం ఇనుమడిస్తూ ఉంది. మనలాంటి వాళ్ళం రామున్ని భూస్వామ్య సమాజపు ప్రతిరూపమని, మనుధర్మ సంరక్షకుడని తేలికగా చెప్పగలం. కానీ కార్యకర్తలు ఈ అవగాహన కలిగి ఉంటూనే, ప్రజల తక్షణ అవసరాలు, వారి అవగాహనాస్థాయిని దృష్టిలో ఉంచుకొని తమ కార్యాచరణను రూపొందించుకోవలసి వస్తుంది. తగినట్టుగా మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు మనలాగా రాముడు పనికిమాలిన వాడని అనలేరు. అవగాహనకు, కార్యాచరణకు మధ్య ఉన్న ఈ గ్యాప్ ను వాళ్ళు గతి తర్కంతో పోల్చుకోగలరు.

  ఇలాంటి ఒక సందర్భం గురించి చెబుతాను. ఎమ్.ఎఫ్ హుస్సేన్ సరస్వతీ బొమ్మని ఆయన ధోరణిలో వేసినపుడు ఆరెస్సెస్ వాళ్ళు ఆయన పెయింటిగ్సును ధ్వంసం చేసారు. ఇంటెలెక్ట్యువల్స్ ఈ చర్యలను హక్కులకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఖండించారు. కవులు కూడా దీన్ని ఖండిస్తూ తీర్మానాలు చేసారు. నా పక్కనే ఉన్న్న ఒక పెద్దాయన స్వేచ్చ పేరుతో పని గట్టుకొని ఇలాంటి బొమ్మలను వేయడమెందుకు. ఇదొక రకమైన అబ్సెస్సన్ కాదా అన్నాడు. ఈ విఙ్ఞత జనం కోసం రాస్తున్నామని గుర్తుంచుకున్న వాళ్ళకే ఉంటుంది. ఈ వ్యాఖ్యలు చదివినపుడు ఇవన్నీ మెదులుతున్నాయి.

  అయినా ఇన్నాళ్ళు బిజెపీతో అంటకాగి, గుజరాత్ మారణ కాండ జరిగినప్పుడు నోరిప్పకుండా ఇప్పడు రాముడు గురించి మాట్లాడడం దుర్మార్గమైన ఐరనీ కదా

 6. నాగరాజు గారూ, నా ఉద్దేశ్యంలో మీరు ప్రస్తావించినవి రెండూ అత్యంత అవసరమైన, దేనికదే ప్రత్యేకమైన కార్యరంగాలు. అవి రెండూ ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కావు. ఇంకా చెప్పాలంటే ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకునే కార్యాచరణలు. ఇవి రెండూ అవసరమైనవే.

  ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటూ ఉద్యమంలో నిమగ్నం అయినవారు పరిమితులు పాటించడం ఎంత అవసరమో, సైద్ధాంతిక విశ్లేషణలో ఖచ్చితంగా సరిహద్దులు గీయడం కూడా అంతే అవసరం. సిద్ధాంతాన్ని గీత గీసినట్లు ఆచరించడం సాధ్యం కాదు గనకా, ఆచరణలోని సమస్త అంశాలనూ, పరిమితులతో సహా సైద్ధాంతీకరించడం కుదరదు గనకా, సిద్ధాంతానికీ ఆచరణకూ ఎప్పుడూ ఒక అంతరం ఉంటుంది. అది అనివార్యం. అంతమాత్రాన అవి రెండూ ఎదురు బొదురుగా ఉండజాలవు. ఒకదానినొకటి ప్రోత్సహించుకుంటూ, మరింత సుసంపన్నం కావించుకుంటూ ఎప్పుడూ ఉనికిలో కొనసాగుతాయి.

  సిద్ధాంతం ఆచరణను రంధ్రాన్వేషణ చేయవలసిన అవసరం లేదు. అలాగే ఆచరణ, సిద్ధాంతాన్ని తప్పుపట్టాల్సిన అవసరమూ లేదు. రెండింటి పాత్రలను అంచనా వేసేటపుడు సమతూకం చేయవలసిన జాగ్రత్త తప్పనిసరి. ఆచరణ సిద్ధాంతానికి మూలం. ఆచరణకి మార్గదర్శి సిద్ధాంతం. ఇవి పరస్పరం అవిభాజ్యాలు.

  ప్రజల ఆలోచనా స్ధాయి, చైతన్యం సిద్ధాంత స్ధాయికి అభివృద్ధి చెందవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే సిద్ధాంతం వారి ఆచరణల మెరుగైన రూపం కనుక. దానివల్లనే రెండింటి మధ్య వైరుధ్యం కనపడుతుంది. ప్రజల చైతన్యం అభివృద్ధి చెందుతూ పోవడమే ఈ వైరుధ్యం ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేందుకు తగిన మార్గం. వివిధ రంగాల్లో, వివిధ స్ధాయిల్లో సాగే వర్గ పోరాటం అలాంటి అభివృద్ధికి బాటలు వేస్తుంది. మరో విధంగా చెప్పాలంటే సిద్ధాంతం, ఆచరణల మధ్య ఉన్న వైరుధ్యం కూడా ప్రజాచైతన్యం తదుపరి స్ధాయికి అభివృద్ధి చెందేందుకు దారితీస్తుంది. ఇంకో విధంగా చూస్తే పరిమిత పరిశీలనలో శ్రమ, మేధ ల వైరుధ్యం కూడా కావచ్చు. (శ్రామికులు, మేధావుల వైరుధ్యం కాదు).

  పోతే కళలు స్వతంత్రత తీసుకోకపోతే సరికొత్త భావజాలం యొక్క ఆవిష్కరణకు ఒక కోణంలో మార్గం మూసుకుపోతుంది. ప్రజా చైతన్యానికి అప్పటి సామాజిక పరిస్ధితుల రీత్యా పరిమితులు ఉన్నంతమాత్రాన కళారంగం తన స్వేఛ్ఛని కోల్పోవలసిన అవసరం లేదని నా భావన. ఈ స్వేచ్ఛ విచ్చలవిడితనంలోకి జారిపోకుండా చూసుకోవడమే పాటించవలసిన జాగ్రత్త.

  ఎం.ఎఫ్.హుస్సేన్ విషయానికి వస్తే అశ్లీలత అటుంచి నగ్నం అన్న భావన కూడా నాకు కలగదు. మత రాజకీయాలు ఆయన చిత్రాలకు పనిగట్టుకుని నగ్నత్వాన్ని అంటగట్టకపోతే జరిగిన గొడవకి పునాది లేదు. హుస్సేన్ భావాలు అబ్సెషన్ అయితే కావచ్చు గానీ (నేనలా అనుకోను), అణచుకోవలసినవీ, చాటుకోకూడనివీ అయితే కాదు.

 7. MF హుస్సేన్ బొమ్మలు నేను ఇంటర్నెట్‌లో చూశాను. అవి బూతు బొమ్మలా, కాదా అనే సంగతి తరువాత. అవేమీ అందమైన కళాఖండాలు కావని మాత్రం చెప్పగలను. కనుక ఆ బొమ్మల మీద గొడవ అనవసరమే. ఆ బొమ్మలని సమర్థించిన కాంగ్రెస్‌వాళ్ళు కావాలనే కొన్ని నిజాలు చెప్పకుండా రెండు మతాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించి ఒక మతంవాళ్ళ వోట్లు పొందాలని అనుకున్నారు. MF హుస్సేన్ ఆ బొమ్మలు వేసినది 1970. చాలా సంవత్సరాల తరువాత ‘విచార్ మీమాంస‌’ అనే హిందూత్వ పత్రిక మత ఘర్షణలని రెచ్చగొట్టడానికి ఆ బొమ్మలని ప్రచురించింది. దాంతో హిందూత్వవాదులు MF హుస్సేన్‌పై పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. MF హుస్సేన్ మత ఘర్షణలని సృష్టించడానికి ప్రయత్నించాడని పోలీసులు కేస్ నమోదు చేశారు. అసలు విషయం తెలిసిన కోర్ట్ MF హుస్సేన్‌పై నమోదైన కేస్‌ని కొట్టివేసింది. కోర్ట్ ఆ కేస్‌ని ఎందుకు కొట్టివేసిందో తెలియని హిందూత్వవాదులు ఆ జడ్జ్‌మెంట్‌ని హిందూ వ్యతిరేక జడ్జ్‌మెంట్ అనీ, సెక్యులర్ దేశంలో కోర్ట్‌లు మైనారిటీలకి అనుకూలంగా తీర్పులు చెపుతున్నాయనీ ప్రచారం చేశారు.

  “అది హిందూ వ్యతిరేక జడ్జ్‌మెంట్ కాదు. ఆ బొమ్మలు 1970లో వేసినవి. అలాంటి బొమ్మలు వేసినవాళ్ళలో హిందూ చిత్రకారులు కూడా ఉన్నారు కనుక అవి హిందూ మతాన్ని కించపరిచే బొమ్మలని కోర్ట్‌కి అనిపించలేదు‌” అనే నిజం కాంగ్రెస్‌వాళ్ళకి తెలిసినా కూడా ఆ విషయం చెప్పకుండా “కళలని కళా దృష్టితోనే చూడాలి” అని అంటూ ఏవేవో కబుర్లు చెప్పి కాలం గడుపుకున్నారు. ముస్లింలలో ఉన్నంత స్థాయిలో భక్తి విశ్వాసాలు హిందువులలో లేవు కాబట్టి అలా మాట్లాడడం వల్ల హిందువుల వోట్లు పోవు. MF హుస్సేన్ హిందూ మతంపై చేసిన దాడిని తాము సమర్థిస్తున్నట్టు ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇస్తే ముస్లింల వోట్లు పడతాయని అనుకున్నారు. ఇలా కాంగ్రెస్‌వాళ్ళు కావాలని నిజాలు మాట్లాడకుండా రెండు మతాలవాళ్ళతోనూ దోబూచలాడారు.

 8. ఇందులో MF హుస్సేన్ తప్పు కూడా ఉంది. ఆ నగ్న చిత్రాలు (ఆ నగ్నత్వం స్పష్టంగా కనిపించకపోయినా కూడా) ఉన్న ఆర్ట్ గేలరీలోనే ముస్లిం స్త్రీలు ఒంటి నిండా దుస్తులు వేసుకున్న చిత్రాలు పెట్టాడు. అలా పెడితే హిందువులకి అనుమానం రాదా?

 9. “ఇందులో MF హుస్సేన్ తప్పు కూడా ఉంది. ఆ నగ్న చిత్రాలు (ఆ నగ్నత్వం స్పష్టంగా కనిపించకపోయినా కూడా) ఉన్న ఆర్ట్ గేలరీలోనే ముస్లిం స్త్రీలు ఒంటి నిండా దుస్తులు వేసుకున్న చిత్రాలు పెట్టాడు. అలా పెడితే హిందువులకి అనుమానం రాదా?”

  అది తప్పు ఎందుకు అవుతుంది? ఆయన తన భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది మీకు నచ్కాకపోవ్చు, కానీ అది తప్పని తేల్చి చెప్పే హక్కు మీకు లేదు.
  మన దేశం లో తరచుగా వినిపించేది “మనోభావాలను దెబ్బతీశారు అందుకని రెచ్చిపోయి, మేము ఏదైనా చేయోచ్చు.”
  ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ అంటే మనకు నచ్చనవి కుడా భరించాలి.

 10. నేనేమీ మత చాంధసవాదాన్ని సమర్థించడం లేదు. మతం లాంటి సెన్సిటివ్ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనే చెపుతున్నాను. హిందూ కుటుంబానికి చెందిన ఫాషన్ డిజైనర్ బికినీ మీద బిస్మిల్లాహ్ (In name of God) అని వ్రాసి, చీర మీద లక్ష్మీ దేవి బొమ్మలు ముద్రించి ‘ఇలా చేసే స్వేచ్ఛ మాకుంది’ అని అంటే ముస్లింలు ఒప్పుకోరు. అటువంటప్పుడు హిందూ దేవతల నగ్న చిత్రాల పక్కన ముహమ్మద్ ప్రవక్త కూతురు ఒంటి నిండా బట్టలు వేసుకున్న బొమ్మ పెడితే హిందువులు ఎలా ఒప్పుకుంటారు?

 11. “మతం లాంటి సెన్సిటివ్ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనే చెపుతున్నాను.”
  కళాకారులకు జాగ్రత్తలు చెబుతున్నామంటే మనం సరైన ఆలోచనా విధానం లో లేవని అనిపిస్తుంది.

  “‘ఇలా చేసే స్వేచ్ఛ మాకుంది’ అని అంటే ముస్లింలు ఒప్పుకోరు.”
  అదే నేను చెప్పేది. వారు ఒప్పుకోరు కనుక మేము కుడా ఒప్పుకోము అనడం పొరపాటు.

 12. గౌతమ్ గారు, నీతి అనేది రెండు పక్షాలకీ సమానంగా వర్తిస్తేనే ప్రజలు నీతిని అంగీకరిస్తారు. అలా కాకపోతే నీతిని అంగీకరించరు. ఆ విషయమే నేను చెప్పేది. గాంధీలాగ “నువ్వు వాణ్ణి చెంప మీద కొడితే వాడు ఊరుకునే పరిస్థితి లేకపోయినా వాడు నిన్ను చెంప మీద కొడితే నువ్వు ఊరుకోవాలి” అని అంటే ఎవరూ అంగీకరించరు.

 13. ప్రవీణ్ గారు, ఇక్కడ నీతి గురించి పట్టింపులేవీ లేవు. ఉన్నదంతా రాజకీయ ప్రయోజనాల కోసం తద్వారా ఆర్ధిక వర్గ ప్రయోజనాల కోసం ఏదో ఒక వంకతో భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు విధించడమే. వివిధ రంగాల్లో వ్యక్తీకృతం అయ్యే ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛ ఎప్పుడూ సమాజాన్ని ఉమ్మడి నీతివైపుకే నడిపిస్తుంది. నీతి కూడా వర్గ ప్రయోజనాన్ని కాంక్షిస్తూ ఒకవైపుకి చేరిపోతుందని గ్రహిస్తె, అది abstract కాదనీ relative అనీ తేలుతుంది.

 14. MF హుస్సేన్ వేసిన అస్పష్ట నగ్న చిత్రాలు చూసి mental perverts ఎవరూ ఆకర్షితులు అవ్వరు. నిజమే. కానీ కాంగ్రెస్ కావాలని MF హుస్సేన్‌ని సమర్థిస్తున్నట్టు మాట్లాడి ముస్లింల వోట్లు పొందాలనుకోవడం తప్పు కాదా? బిజెపి హిందువుల వోట్ల కోసం ఇలాంటి పనులే చేస్తుంది. కాంగ్రెస్ కూడా ముస్లింల వోట్ల కోసం ఇలాంటి పనులు చేసి హిందువులూ-ముస్లింల మధ్య ఉన్న గొడవని etarnal flameగా మార్చి బిజెపి కంటే తాము తక్కువేమీ తినము అని నిరూపించుకోవడం అవసరమా? 1990కి ముందు ఇండియాలో మతతత్వం అంతగా లేదు. BJP అంటే బొత్తిగా జనం లేని పార్టీ అనే పాప్యులర్ మాట ఒకటి ఉండేది. కానీ కాంగ్రెస్ కావాలని మైనారిటీ వోట్ బ్యాంక్ రాజకీయాలు నడిపి హిందువులు “మనకి మతతత్వ పార్టీ అవసరం” అని అనుకునేలా చేస్తున్నారు. “MF హుస్సేన్ వేసిన అస్పష్ట నగ్న చిత్రాలు చూసి mental perverts ఎవరూ ఆక్షర్షితులు అవ్వరు” అనే నిజం అప్పట్లోనే చెప్పి ఉద్రిక్తతలు ఆపడానికి ప్రయత్నించొచ్చు కదా. కానీ కాంగ్రెస్ కావాలని ఆ పని చెయ్యలేదు. “గోటితో పోయే దాన్ని గొడ్డలిదాక తీసుకురావడం” అనే సామెత గుర్తొస్తోంది.

 15. పింగ్‌బ్యాక్: రేపిస్టు అ(వ)సరం కోసం బాలికకు జబ్బు అంటగట్టిన జేఠ్మలాని | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s