ధర్మపురి కుల హింస: బంగారం, డబ్బు దోచుకుని తగలబెట్టారు -ఫోటోలు


ధర్మపురి జిల్లాలో కులాంతర వివాహం వల్ల జరిగిన కుల హింసలో దాడి చేసినవారు ఒక పధకం ప్రకారం వ్యవహరించారు. ప్రతి ఇంటిని వెతికి విలువైన వస్తువులను దోచుకున్నాకనే ఇళ్లను తగలబెట్టారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (టి.ఒ.ఐ) పత్రిక తెలిపింది. ఇళ్లతో పాటు ఇళ్లముందు ఉన్న వాహనాలను కూడా తగలబెట్టారని తెలిపింది. మొత్తం 268 ఇళ్ళను, 50 ద్విచక్ర వాహనాలను, నాలుగు వేన్లను తగలబెట్టారని డేషింగ్ టైమ్స్ పత్రిక తెలిపింది. దాదాపు 2500 మంది దాడిలో పాల్గొన్నారనీ, అప్పటికే 300 మంది పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ తమకంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఉన్న దుండగులను వారు అడ్డుకోలేకపోయారని టి.ఒ.ఐ తెలిపింది. టపాకాయలు పేల్చి అడ్డం వేయడం ద్వారా పారిపోతున్న దళితులను అడ్డుకోవాలని దుండగులు ప్రయత్నించారనీ వారెలాగో తప్పించుకోగలిగారనీ తెలుస్తోంది.

ది హిందూ పత్రిక ప్రకారం సి.రవి అనే వ్యక్తి కార్పెంటర్. వినియోగదారులు ఇచ్చిన టేకు కలపతో పాటు స్వంత టేకు కలపను కూడా ఆయన ఇంటిలో నిలవ ఉంచుకున్నాడు. అదంతా కులోన్మాద దహనంలో తగలబడిపోయింది. కాలనీల్లో చాలామంది మగవారు పని కోసం బెంగుళూరు, తిరుప్పూరు తదితర చోట్లకి వెళ్ళగా ఎక్కువగా ఆడవాళ్ళు, వృద్ధులు, పిల్లలు మాత్రమే ఇళ్ళలో ఉన్నారు. గుంపు ఒక్కసారిగా విరుచుకుపడి ఇళ్ళలో జొరబడి దోపిడీ మొదలు పెట్టడంతో అక్కడ ఉన్న ఆడవారు, పిల్లలు వృద్ధులు సమీపంలోని పొలాల్లోకి పారిపోయారు. కొంతమంది దూరంలో ఉన్న బంధువుల ఇళ్ళకి పారిపోయారు.

ది హిందూ ఉటంకించిన పళని స్వామి ప్రకారం ప్రమాదం గ్రహించి కాలనీవాసులు ముందే సహాయం కోరినా పోలీసులు తగినంతమంది రాలేదు. టి.ఒ.ఐ ప్రకారం పోలీసుల సంఖ్య 300. నిజానికి ఈ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అయినప్పటికీ గుంపును పోలీసులు అడ్డుకోలేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. కలియప్పన్ ప్రకారం ఆయన బెంగుళూరులో చిన్న షాపు నడుపుకుంటున్నాడు. రెండు నెలల్లో కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. పెళ్లి కోసం 21 సవర్ల బంగారం, రు.2 లక్షల నగదు ఇంట్లో పెట్టుకున్నాడు. అదంతా దోచుకున్నారు. కె.సెల్వం, నాధం కాలనీలో అమ్మన్ గుడికి పూజారి. భక్తులు కానుకలుగా ఇచ్చిన 4.5 కిలోల బంగారం, 15 కిలోల వెండి నగలు ఆయన ఇంట్లో ఉండగా వాటినీ దోచుకుపోయారు. నగలు, డబ్బు మాత్రమే కాదు. విద్యా సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు, భూమి ఆస్తి పత్రాలు తదితర కాగితాలన్నీ గృహ దహనాల్లో తగలబడిపోయాయి.

నాధం కాలనీ ప్రధానంగా దాడిని ఎదుర్కోగా దాని పక్కనే ఉన్న అన్నా నగర్ కాలనీ, కొండంపట్టి కాలనీలలోని ఇళ్ళు కూడా తగలబెట్టారు. గుడిసెలు, పెంకుటిళ్ళు, రెండు గదుల కాంక్రీట్ ఇళ్ళు మొత్తం వేటినీ వదలకుండా మొదట దోపిడి చేసి ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా తగలబెట్టారు. దాడికి గురయినవారు ఆది ద్రవిడ (ఎస్.సి) కులస్ధూలని కొన్ని పత్రికలు తెలిపాయి. దాడి చేసినవారు వన్నియార్ కులస్ధులని కొన్ని పత్రికలు చెప్పగా ఇతర పత్రికలు పేరు చెప్పకుండా ఇతర కులమని చెప్పాయి. వన్నియార్ కులం అయితే అగ్రకులం కాదనీ, బి.సి కులం కిందికి వస్తుందనీ తెలుస్తోంది.

దాడికి తగిన భావోద్వేగ పునాది పంచాయితీ కోర్టులో పడినట్లు స్పష్టం అవుతోంది. నాలుగు రోజుల క్రితం అగ్రకులస్ధులు (లేదా బి.సి కులస్ధులు) పంచాయితీ నిర్వహించారు. దీనికి అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. పెళ్లి రద్దు చేసుకుని దళిత కులస్ధులు తమ అమ్మాయిని అప్పజెప్పాలని పంచాయితీ తీర్పుగా నిర్ణయించారు. ఈ తీర్పుని అమ్మాయి అక్కడే తిరస్కరించింది. తాను పెళ్లి రద్దు చేసుకోనని తెగేసి చెప్పింది. తాను దళిత యువకుడిని ఇష్టపడుతున్నాననీ, అతనితోనే జీవితం గడుపుతాననీ అందరిముందూ చెప్పింది. దీనిని ఆమె తండ్రి అవమానంగా భావించాడు. తన కూతురే కుల పెద్దల ముందు  పరువు తీయడం సహించలేకపోయాడు. ఇక తన జన్మ వృధా అని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్య వలన పెల్లుబుకిన సానుభూతి కులోన్మాదానికి జతకలిసింది. ప్రతీకారం కోరింది. దాని ఫలితమే కుల దాడి. నెలరోజులుగా కుల వివక్ష కేంద్రంగా జరుగుతున్న పరిణామాల ఫలితంగా జరిగిన దాడి.

3 thoughts on “ధర్మపురి కుల హింస: బంగారం, డబ్బు దోచుకుని తగలబెట్టారు -ఫోటోలు

  1. ఎంత చక్కగా మసిపూసి మారేడుకాయ చెస్తున్నవయ్యా ? వార్తాపత్రికలకథనం ప్రకారం ఇరువర్గాలదాడులు ప్రతిదాడులు జరిగాయంటూన్నాయి. నువ్వేమో బీసీలనూ ఒసీలంటూన్నావు.

  2. అవునా దుర్గేశ్వర గారూ? దళితులు ప్రతిదాడి చేసారని ఏ పత్రిక రాసింది? దళితుల దాడిలో దెబ్బతిన్న ఇళ్ల ఫొటోలను ఏ పత్రికయినా ప్రచురించిందా? ప్రతిదాడి జరిగింది కనుక ఇందులో కుల వివక్ష లేదని చెప్పదలిచారా?

    ఈ వార్త మొదట ‘ది హిందూ’ పత్రిక మాత్రమే ప్రచురించింది. ఇతర ఏ పత్రికా నిన్న వార్త రాయలేదు. ఈ రోజు మాత్రం టి.ఒ.ఐ రాసింది. అది కూడా పరిమిత వివరాలతో. డాషింగ్ టైమ్స్ లాంటి పెద్దగా పేరు తెలియని ఇతర పత్రికలు తప్ప పెద్ద వార్తా సంస్ధలేవీ ఈ వార్తను కవర్ చెయ్యలేదు. జరిగిన దారుణాన్ని వర్ణిస్తూ యూట్యూబ్ లాంటి చోట్ల కూడా వివరాలు ఉన్నాయి తప్ప ప్రతిదాడి గురించి నేను చూడలేదు. మీరు ఏ పత్రిక చదివారో చెబితే నేనూ చూస్తాను.

    పోతే, దళితులు ప్రతిదాడి చేసినా ఇందులో కుల వివక్ష లేకుండా ఎమీలేదు. మూడొందలు ఇళ్లు తగలబెట్టి, డబ్బు, బంగారం దోపిడీ చేసి, నిలవ నీడ లేకుండా చేశాక ఎవరైనా ప్రతీకారాన్ని కోరుకుంటారు. అది సహజం. ఫొటోలు కూడా ప్రచురించాక మసిపూసి… అనడం కరెక్ట్ కాదు.

    కులాంతర వివాహాలకు ఈ దేశంలో రెడీమేడ్ ఆమోదం ఉంటేనో లేక కుల వివక్ష లేకపోతేనో మీరు చెప్పినట్లు ‘మసిపూసి మారేడుకాయ’ చేసే అవసరం తలెత్తవచ్చేమో. భారతదేశ సామాజిక వ్యవస్ధలో సమూల మార్పులు వచ్చేంతవరకూ దానికి మసిపూయవలసిన అవసరమే రాదు. అదే బోలెడు మసి పూసుకుని వికృత ముఖంతో అందరికీ తన రూప సౌందర్యం చాటుకుంటుంటే అదనపు మసి అవసరం ఉందా చెప్పండి? ఉన్న మసిని చూడలేకపోతే, చూడడం ఇష్టం లేకపోతే అది వేరే సంగతి.

  3. ఇప్పుడే టైమ్స్ ఆఫ్ ఇండియా (టి.ఒ.ఐ) వార్త చూశాను. మధ్యాహ్నం ప్రచురించిన కొద్దిపాటి వార్తని ఎడిట్ చేసి మరిన్ని వివరాలు చేర్చారు. ఇందులో ప్రతిదాడి గురించి ఒకే వాక్యం ఉంది. అది ఇది.

    Later, police said, a group of dalits set fire to two houses belonging to non-dalits in Natham.

    ఇందులో ‘దాడులు ప్రతిదాడులు’ అన్న అభిప్రాయం కలిగే అవకాశమే లేదు. అలా ఉండాలని బలీయంగా కొరుకుంటూ చూస్తె తప్ప. మూడొందులు ఇళ్లు, యాభై వాహనాలు తగలబెట్టి, డబ్బు, బంగారం దోచుకుని, కష్టార్జితాన్ని నేలపాలు చేసినవారు ఒకవైపు. జరిగిన నష్టాన్ని తట్టుకోలేక స్పందనగా కేవలం రెండు ఇళ్లు తగలబెట్టినవారు మరొకవైపు. దీనిని దాడి-ప్రతిదాడి అనగలమా?

    పైగా వన్నియార్ నాయకులు కులాంతర వివాహానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనీ, బహిరంగంగానే హెచ్చరికలు జారీచేసారనీ టి.ఒ.ఐ రాసింది. అదేమీ దుర్గేశ్వర గారి దృష్టికి వచ్చినట్లులేదు.

    నిజానికి దుర్గేశ్వర గారే మసిపూసి మారేడుకాయ చేయాలని తలపెట్టారు. దాడి ప్రతిదాడి పేరుతో దళితుల ధర్మాగ్రహాన్ని భూతద్దంలో చూపడానికి ప్రయత్నించారు. కుల దురహంకార దాడిని దళితుల నామమాత్ర ప్రతిఘటనను ఒకే గాటన కట్టడానికి ప్రయాసపడ్డారు. ఆయనకి ఇంత శ్రమ ఎందుకన్నదే అర్ధం కాని విషయం.

వ్యాఖ్యానించండి