భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండోసారి కూడా బి.జె.పి అధ్యక్షుడుగా ఎన్నిక కావాలని కోరుకుంటున్న గడ్కారీ ఆశలకు సాక్ష్యాత్తూ ఎల్.కె.అద్వానీ నుండే ప్రతిఘటన ఎదురవుతోంది. కొద్ది నెలల క్రితం ముంబైలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడి సహాయంతో రెండో పదవీకాలానికి అనుమతిని గడ్కారీ సంపాదించినప్పటికీ ఆ నిర్ణయం జాతీయ మహాసభలో ఆమోదం పొందవలసి ఉంది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అద్వానీ ముంబైలోనే అలకపాన్పు ఎక్కాడు. జాతీయ కమిటీ సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనకుండా బహిష్కరించి గడ్కారీ అధ్యక్ష పదవీకాలం పొడిగింపుపై తన వ్యతిరేక ఉద్దేశ్యం స్పష్టం చేశాడు. ప్రధానమంత్రి పదవీ ఆశతో మోడి గడ్కారీకి మద్దతు ఇస్తుండగా, అదే ప్రధాని పదవి ఆశతో మోడీకి మద్దతు ఇస్తున్న గడ్కారీని అద్వానీ వ్యతిరేకిస్తున్నాడు. ప్రధానమంత్రి పదవి కేంద్రంగా అద్వానీ, మోడీల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు చివరికి గడ్కారీ పదవీ ఆశను హరించడానికి దారితీస్తున్నాయి.
పార్టీ జాతీయ కమిటీ నాయకుడిగా గడ్కారీ పదవికాలాన్ని రెండోసారికి పొడిగించాలంటే పార్టీ రాజ్యాంగంలో మార్పులు అవసరం. ఆ మార్పులు జరిగేవరకూ గడ్కారీ రెండు శిబిరాలతోనూ సత్సంబంధాలు నెరపవలసి ఉంటుంది. అయితే మోడివైపు దృఢంగా నిలబడి ఉన్న గడ్కారీకి అద్వానీనుండి తిరస్కరణ ఎదుర్కొంటున్నాడు. గడ్కారీ అవినీతిపై చర్కించడానికి బి.జె.పి కోర్ కమిటీ మంగళవారం సమావేశం కాగా దానికి అద్వానీ గైర్హాజరయ్యాడు. గడ్కారీ పదవినుండి తప్పుకోవలసిందేనని రామ్ జేఠ్మలాని పత్రికలకెక్కాడు. యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా తదితర మాజీ మంత్రులు కూడా గడ్కారీ తప్పుకోవాలనీ, ఆయనకి రెండోసారి పార్టీని అప్పగిస్తే పార్టీ బలహీనపడుతుందనీ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. బి.జె.పి కోర్ కమిటీ మాత్రం గడ్కారీకి అండగా ఉన్నట్లు ప్రకటించడమే ఒక ఊరట.
–

కాంగ్రెస్‌ని ఓడిద్దామని బిజెపి అన్నా హజారేకి మద్దతు ఇచ్చి, చివరికి ఇలా గోతిలో పడింది. గతంలో వాళ్ళ సపోర్ట్‌తో పని చేసిన అరవింద్ కెజ్రివాలే వాళ్ళ అవినీతిని బయటపెట్టాడు.