ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -2


మొదటిభాగం తరువాయి…

ఇపుడు మళ్ళీ ఆయన చెప్పేదేమిటో ఊహించదగినదే. అదేమంటే, ముస్లింలు భారతీయ ఆర్కిటెక్చర్ ను నాశనం చేశారు; ప్రతీదీ కూలిపోయింది. వారు దోపిడీదారులు మరియు వినాశనకారులు. ముస్లింల హయాంలో ఏమి జరిగిందో తెలియాలంటే ఏ భవనాన్నైనా చూడవచ్చు. జనం ఆయనతో వాదించినపుడు ఆయన తాజ్ గురించి ఏమాన్నాడో చూడండి: “తాజ్ అనేది పెద్ద వృధా, క్షీణదశలో ఉన్నది. చివరికది ఎంత క్రూరమైనదంటే అక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు చాలా కష్టంగా తోచింది. ప్రజల రక్తం గురించి తెలియజెప్పే ఒక విపరీత దుబారా అది.”

మనం తాజ్ వద్ద ఉన్నట్లయితే, ప్రజల రక్తం గురించి తెలియజేసే విపరీత దుబారా గురించి మనం ఎవరమూ ఆలోచించము! మీకు తెలుసో లేదో, నోబెల్ బహుమతి మీకు అందుకే వస్తుంది!

మొఘల్ హయాంలో హిందూ, ముస్లిం రీతుల సమ్మిశ్రమం వెల్లివిరిసిందని చెప్పిన చరిత్రకారిణి రొమిలా ధాపర్ అగాహనను ఆయన మార్క్సిస్టు పక్షపాతంతో ఇచ్చిన తీర్పుగా కొట్టిపారేస్తాడు. ఆయనింకా ఏమంటాడంటే, “దండయాత్రీకులు తమ చర్యలను ఎలా చూస్తారో అదే సరైన నిజం. వారు జయిస్తున్నారు. వారు లొంగదీసుకుంటున్నారు” అని.

నైపాల్ దృష్టిలో భారతీయ ముస్లింలు ఎప్పటికీ దండయాత్రీకులుగానే మిగిలిపోతారు. ఎప్పటికీ ఖండనార్హులుగా ఖండించబడతారు. ఎందుకంటే వారిలో కొంతమంది దండయాత్రీకులను పూర్వీకులుగా కలిగి ఉన్నారు. అమెరికాకి అన్వయించినట్లయితే చాలా విచిత్ర ఫలితాలు వచ్చే వాడుక ఇది.

ప్రధానంగా, భారతీయులతో వరుసగా ఇంటర్వ్యూలు చేయడం ద్వారా, ఆధునిక భారతంపై ఆయన సాగించిన పాత్రికేయ అన్వేషణ విషయానికి వస్తే, అవి చాలా గొప్పగా రాయబడ్డాయని ఎవరైనా ఒప్పుకోవలసిందే. తాను జనంతో సాగించిన సంభాషణలను, సందర్శించిన స్ధలాలనూ తీక్షణమైన, ఖచ్చితమైన దృశ్య రూపాల్లోకి తేవడంలో ఆయన మాస్టర్.

అయితే, ఆ తర్వాత ఎవరినైనా ఒక విషయం బాధించడం మొదలుపెడుతుంది. అదేమిటంటే, ఆయన ఎంతగొప్ప తెలివిమంతులను ఇంటర్వ్యూ చేస్తాడంటే తన ప్రశ్నలకు ఎంతో చమత్కారంతో, నేర్పు సొగసులతో  వారిచ్చే సమాధానాలు తన సొంత భాషా ప్రావీణ్యానికి సరిగ్గా సరిపోతాయి. అర్ధ-అక్షరాస్యులు సైతం తమ వ్యక్తీకరణలో ఎటువంటి సంకోచాలనూ ఎదుర్కోరు.

ఆయన రికార్డు చేసే సంభాషణలు ఎంతవరకు నమ్మదగినవి?

ఒక ప్రసిద్ధమైన వ్యాసంలో, నైపాల్, అహ్మదాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్  సందర్శనను వర్ణిస్తాడు. ఆ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, తన మిత్రుడూ అయిన అశోక్ చటర్జీ తో అప్పుడాయన కలిసే ఉన్నాడు.

ఇటీవల ఒక ఈమెయిల్ లో చటర్జీ ఇలా అన్నాడు. నైపాల్ వ్యాసం “అలా అయి ఉండొచ్చన్న ఒక దృశ్య వివరణ (scenario) మాత్రమే కానీ అది వాస్తవానికి ఆయన చూసింది కాదు. వాస్తవంలోని కొన్ని ముక్కలను ఎన్నుకుని మళ్ళీ ఒక చోట అతికించిన ఫక్తు స్వైరకల్పన (fantasy) మాత్రమే అది.”

తన పుస్తకం ‘ఎ వూండెడ్ సివిలైజేషన్’ ని ఫిక్షన్ గా వర్గీకరించాలని చటర్జీ నైపాల్ తో చెప్పాక నైపాల్ తో చటర్జీ స్నేహం ఆకస్మికంగా ముగిసిపోయింది.

నైపాల్ ఒక ఇటీవలి పుస్తకంలో మున్షి రహ్మాన్ ఖాన్ ఆటో బయోగ్రఫీ ని పరిశీలనకు తీసుకున్నాడు. 19వ శతాబ్దం చివరిలో రహ్మాన్ ఖాన్ సురినాం కి వలస వెళ్ళాడు. గాంధీ పుస్తకంతో పోలుస్తూ నైపాల్ దానితో విభేదించాడు.

‘లండన్ రివ్యూ ఆఫ్ బుక్స్’ లో సంజయ్ సుబ్రమణ్యం అనే చరిత్రకారుడు సదరు పుస్తకాన్ని సమీక్షించాడు. (రహ్మాన్ ఖాన్ పుస్తక) పాఠ్యం మూడు చేతులు మారి కత్తిరించబడిన అనువాదాన్ని మాత్రమే నైపాల్ చదివాడని నిర్ధారించడానికి ఆయన పెద్దగా శ్రమ తీసుకోలేదు: “జపనీస్ భాష నుండి తర్జుమా చేయబడిన నైపాల్ పుస్తక పాఠ్యాన్ని గోరఖ్ పూర్ లో ఉన్న పాఠకుడు చదువుతున్నట్లుగా ఆ పుస్తకం ఉంటుంది” అని సంజయ్ తెలిపాడు.

అయినప్పటికీ రహ్మాన్ ఖాన్ భాషా రీతి, వాడుకల పైన వ్యాఖ్యానించడాన్ని కూడా ఈ వాస్తవం నైపాల్ ని అడ్డుకోలేదు.

సమస్య ఏమిటంటే ఆయనకి ‘లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు’ ఇవ్వడం ద్వారా అవార్డు ప్రదాతలు ఏమి చెప్పదలిచారు?

పాత్రికేయుడుగా ఇండియా గురించి ఆయన ఏమిరాస్తాడన్నదీ ఆయన సొంత విషయం. ఆవివివేకిగా ఉండడానికీ, లాలూచీపరమయిన సందిగ్ధత చూపడానికీ ఆయనకి గల హక్కుని ఎవరూ ప్రశ్నించలేరు.

కానీ నోబెల్ బహుమతి ఆయనకి అకస్మాత్తుగా ఒక సాధికారతను సమకూర్చిపెట్టింది. దాని (సాధికారతా) వినియోగాన్ని ఖచ్చితంగా పరీక్షించాల్సిందే.

నోబెల్ బహుమతి స్వీకరించాక నైపాల్ చేసిన మొట్టమొదటి పనుల్లో ఒకటి ఢిల్లీలోని బి.జె.పి కార్యాలయాన్ని సందర్శించడం. ‘ఒక రాజకీయాభిప్రాయాన్ని కలిగి ఉండడం అంటే, ముందే ప్రోగ్రామ్ కాబడి ఉండడం’ అని గతంలో చెప్పిన నైపాల్ ఇపుడు (బి.జె.పి ఆఫీసు సందర్శన అనంతరం) రాజకీయంగా వినియోగించబడినందుకు సంతోషాన్ని ప్రకటించడానికి వెనుదీయలేదు.

ఆ తర్వాతే ఆయన అత్యంత అపఖ్యాతి పొందిన వ్యాఖ్యానం చేశాడు: “అయోధ్య (కూల్చివేత), ఒక విధమైన ఆవేశం (passion). ఏ ఆవేశమైనా సృజనాత్మకత కలిగి ఉంటుంది. ఆవేశం సృజనాత్మకతకు దారి తీస్తుంది” అన్నాడాయన.

“ఫాసిజానికి సహ ప్రయాణీకుడి తరహాలో ఆయన ప్రవర్తించాడు. నోబెల్ బహుమతికి అగౌరవం తెచ్చిపెట్టాడు” అని  నైపాల్ పట్ల సల్మాన్ రష్దీ స్పందించాడు.

అయోధ్య నేపధ్యంలో ఒక్క బోంబే వీధుల్లోనే 1500 మంది వరకూ ముస్లింలు వధించబడ్డారు. అల్లర్లు బద్దలయినపుడు న్యూఢిల్లీలో నేనొక ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నాను. అపుడు బోంబేలో పరితాపంలో మునిగిన నా ముస్లిం స్నేహితులనుండి ఫోన్ కాల్స్ అందుకున్నాను. ముస్లింలను ఇళ్లలోనుండి లాక్కొచ్చి లేదా వీధుల్లో అడ్డుకుని చంపేస్తున్నారని వారు నాకు చెప్పారు.

నా మిత్రుల్లోని ఒక ముస్లిం ఎడిటర్ కి ఫోన్ చేసి చెప్పాను, పరిస్ధితి కుదుటపడేవరకూ అతనూ, అతని కుటుంబమూ పార్శీలు ఎక్కువగా ఉండే భవంతిలోని నా ఫ్లాట్ లో ఉండవచ్చని.

గొప్ప మరాఠీ నటి ఫయ్యజ్ ను వెతికీ వెతికీ చివరికి పూణేలో ఒక మూల కనుగొన్నాను. భయ దుఃఖాలతో ఆమె ముంబై నుండి అక్కడికి పారిపోయింది. ముస్లిం మురికివాడలపైకి శివ సైనికులు ఎలా ఫైర్ బాంబులు విసిరిందీ ఆమె చెప్పారు. భయ విహ్వలులైన ముస్లింలు ఇళ్ళలోంచి వీధుల్లోకి పరుగెడితే వారిని సమస్య కారకులుగా ముద్రవేసి పోలీసులు వారినెలా కాల్చి చంపిందీ తెలియజేసింది.

ఏడు సంవత్సరాల తర్వాత, పచ్చి రక్త పిపాసతో, నైపాల్ ఈ ఘటనలను ‘ఆవేశం’ గా, ‘సృజనాత్మక చర్యలు’ గా  గ్లామరైజ్ చేస్తున్నాడు.

నైపాల్ సోషియాలజీలోని ఈ భాగాన్ని అవార్డు ప్రదానంలో ఏ మాత్రం ప్రస్తావించకపోవడం గమనించవలసిన విషయం. ఆయనను ఇంటర్వ్యూ చేస్తూ ‘ఎమాంగ్ ద బిలీవర్స్’ పుస్తకాన్ని ప్రస్తావించిన ఫరూక్ డూండీ, వెనువెంటనే సర్ విద్య ఒక పిల్లిని దత్తత తీసుకోవడానికి తానెలా సహాయపడిందీ, పదమూడేళ్ళ తర్వాత తన ఒడిలోనే (శాశ్వత) నిద్రలోకి అదెలా జారిపోయిందీ తెలియ చెప్పే సుదీర్ఘ ప్రస్తావనలోకి త్వర త్వరగా వెళ్లిపోవడాన్ని కూడా గమనించాలి. (పిల్లి ప్రస్తావన ద్వారా) నైపాల్ మరోసారి భావోద్వేగపూరకమైన కన్నీటిలో మునిగిపోవడానికి అవకాశం కల్పించబడింది.

ఊహించగల విషయమేమంటే నైపాల్ లో ఎంతటి మానవత దాగి ఉన్నదో రుజువు చేయడానికి డూండీ అపుడు ప్రయత్నిస్తున్నాడు.

కానీ ఈ అవార్డును ప్రకటించిన ‘లాండ్ మార్క్ అండ్ లిటరేచర్ అలైవ్’ మనకి వివరించాల్సిన బాధ్యత ఉంది. నైపాల్ చేసిన ఈ వ్యాఖ్యల విషయంలో వారు సరిగ్గా ఎక్కడ నిలబడి ఉన్నారు?

నైపాల్ ఒక విదేశీయుడు. తాను కోరుకున్నట్లుగా ఆయన ఏమైనా చెప్పవచ్చు. కానీ భారతీయ ముస్లింలను ముట్టడిదారులుగా, బందిపోట్లుగా చెప్పిన నైపాల్ వ్యాఖ్యలకు వారు విలువ సమకూర్చదలిచారా? భారతదేశంలో ముస్లిం భవనాలను మానభంగాలకూ, దోపిడీలకూ చిహ్నాలుగా ఇప్పటికీ నొక్కి చెబుతున్న ఆయనకు మద్దతు ఇస్తున్నారా? లేదా తమ మౌనం ద్వారా ఈ అంశాలేవీ పట్టించుకోదగినవి కావని సూచిస్తున్నారా?

అవార్డు ప్రదాతలు చెప్పవలసిన సమాధానం చాలా ఉంది.

… … … అయిపోయింది

2 thoughts on “ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -2

  1. indian architecture ni dvamsam chesina vallu vachi dvamsam cheso vellipoyaru be naku telisi nijam navabulu prastutam turkey lo untunnaru moghals khiljilu lodi lu andaru eto velli poyaru nayee pal ki indian muslims ki sambandam naku ardam kaledu ippati muslims purvikulu evaru dandayatrikulu kadu ayte vellu ikkada undaru

వ్యాఖ్యానించండి