మడత పేచీ: చిదంబరం వర్సెస్ ఆర్.బి.ఐ -కార్టూన్


రెండు రోజుల క్రితం భారత ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు పైన బహిరంగంగానే అక్కసు వెళ్ళగక్కాడు. భారత ఆర్ధిక వ్యవస్ధ తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కించడానికి తాము (ప్రభుత్వం) ఒక రోడ్ మ్యాప్ గీసి మరీ శ్రమిస్తుంటే ఆర్.బి.ఐ తమకు సహకరించడం లేదని ఆయన ఆర్.బి.ఐ పైన యాష్టపోయాడు. ఆర్.బి.ఐ సహకారం లేకపోతే మాత్రం ఏమిటట? నేనొక్కడినే ఒంటరిగా శ్రమించడానికి వెనుకంజ వేసేది లేదు, అని కూడా సాక్ష్యాత్తూ విలేఖరుల సమావేశంలోనే ఆర్ధిక మంత్రి చిదంబరం ఒక అసంతృప్త ప్రకటన చేశాడు. ద్రవ్య విధానం సమీక్ష సందర్భంగా స్వల్పకాలిక వడ్డీ రేటు (రేపో రేటు) ను పావు శాతం మేరకు ఆర్.బి.ఐ తగ్గిస్తుందని చిదంబరం ఆశించగా అది జరగకపోవడమే ఆర్ధిక మంత్రి అసంతృప్తికి కారణం.

ఆర్.బి.ఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు ను రేపో రేటు అంటారు. దీనిని తగ్గిస్తే బ్యాంకులు, కంపెనీలకు ఇంకా తక్కువ వడ్డీకి ఆర్.బి.ఐ నిధులు అందుబాటులోకి వస్తాయి. ఈ తగ్గింపు కోసం ప్రభుత్వ, ప్రవేటు బ్యాంకులతో పాటు అనేక ప్రవేటు కంపెనీలు ఆతృతగా, ఆశగా ఎదురుచూస్తున్నాయి. తన ప్రకటనల ద్వారా చిదంబరం కూడా ఆమేరకు ఆశలు కల్పించడంలో తగిన పాత్ర పోషించాడు. తీరా ఆ ఆశలు సఫలం కాకపోయేసరికి ఆర్.బి.ఐ మీద బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా ఆర్ధిక మంత్రి వెనకాడలేదు.

ఆర్.బి.ఐ వద్ద ఉన్నా, బ్యాంకుల వద్ద ఉన్నా సదరు నిధులన్నీ ప్రధానంగా ప్రజలనుండి సేకరించిన డిపాజిట్లే. ఈ డిపాజిట్లను విచ్చలవిడిగా అప్పులు ఇవ్వకుండా ఉండడానికీ, ఖర్చు చేయకుండా ఉండడానికీ ఆర్.బి.ఐ ద్రవ్య విధానాన్ని అమలు చేస్తుంది. సి.ఆర్.ఆర్ పేరుతో డిపాజిట్లలో నిర్దిష్టమొత్తాన్ని ఆర్.బి.ఐ వద్ద బ్యాంకులు అట్టి పెట్టాలి. ఈ సి.ఆర్.ఆర్ ను పావు శాతం తగ్గించినా కంపెనీలకు తృప్తీ కలగలేదు. దీనివలన కొద్దిపాటి నిధులు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. అది కూడా గత రేపో రేటు రేటుతోనే. అలా కాకుండా రేపో రేటు తగ్గిస్తే బ్యాంకులు మరిన్ని నిధులను ఆర్.బి.ఐ నుండి అప్పు తీసుకుని వాటిని ప్రవేటు కంపెనీలకు అప్పులరూపంలో పంపిణీ చేయవచ్చు. ఆ అవకాశం ఆర్.బి.ఐ ఇవ్వలేదు. మరిన్ని నిధులను మార్కెట్లోకి విడుదల చేస్తే ఇప్పటికే అధికంగా ఉన్న ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని ఆర్.బి.ఐ భయం వ్యక్తం చేస్తూ రేపో రేటు తగ్గించడానికి నిరాకరించింది.

ద్రవ్యోల్బణం పెరిగితే అధిక ధరల రూపంలో ప్రజలందరికీ నష్టం కలుగుతుంది. కానీ రేపో రేటు తగ్గిస్తే ప్రవేటు కంపెనీలకీ, బ్యాంకులకీ మరిన్ని నిధులు విందుభోజనంగా లభిస్తాయి. అంటే ఆర్.బి.ఐ ఒకింత ప్రజలగురించి ఆలోచిస్తే చిదంబరం కంపెనీలకి విందుభోజనం దక్కనివ్వలేదని ఆలోచించాడు. ఈ విందు భోజనం కూడా దేశ అభివృద్ధి కోసమేనని చిదంబరం అభిప్రాయం. ఆయన దృష్టిలో ఐదు కోట్ల కుటుంబాల ఉపాధిని కత్తిరించడానికి దారితీసే చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ లు కూడా అభివృద్ధే. ప్రజల ఉపాధి రద్దు చేసి అదికూడా ప్రజల అభివృద్ధి కోసమే అని చెప్పడానికి మన్మోహన్, చిదంబరం, మాంటెక్ సింగ్ బాపతు పాలకులకు ఎటువంటి సిగ్గూ, సంకోచమూ ఉండదు. అనేక కుంభకోణాల రూపంలో

ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దోపిడికి గురవుతుండగా, దాన్ని వదిలి చాలా కొద్దిగా మాత్రమే ప్రభావం చూపే ఆర్.బి.ఐ ద్రవ్య విధానంపైన అక్కసు వెళ్లగక్కడం అంటే ప్రజలను తప్పుదారి పట్టించడానికే. దేశ ఆర్ధిక వ్యవస్ధను నడిపేది ప్రభుత్వ ఆర్ధిక విధానాలే తప్ప ఆర్.బి.ఐ ద్రవ్య విధానం కాదు. ఆర్ధిక విధానాల ద్వారా జరిగే ద్రవ్య సంచయాన్ని నియంత్రించడానికి మాత్రమే ద్రవ్య విధానం ఉద్దేశించబడింది. ఆర్.బి.ఐ ద్రవ్య విధానంపై అర్ధంలేని అక్కసు వెళ్లగక్కడం ద్వారా సమీప భవిష్యత్ లోని ఆర్ధిక వైఫల్యాలకి తగిన సాకుని చిదంబరం ముందే ఏర్పాటు చేసుకుంటున్నాడు.

వ్యాఖ్యానించండి