గ్వాంగ్జూ హత్యాకాండ నిర్మాతకు రాయబార హోదా, కొరియా చీకటిగాధ మరోసారి


Source: Timshorrock.com

దక్షిణ కొరియా ప్రజలు భయోత్పాతంతో గుర్తుకు తెచ్చుకునే గ్వాంగ్జూ సామూహిక హత్యాకాండ బాధ్యుడు ప్రభుత్వం ఇచ్చిన డిప్లొమేటిక్ ట్రావెల్ పాస్ పోర్ట్ తో దర్జాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ప్రజాస్వామిక ఉద్యమకారులను చంపినందుకు కొరియా ప్రభుత్వం చేత మరణ శిక్ష కూడా విధించబడిన మాజీ కరకు నియంత ‘చున్ దూ-హ్వాన్’ ఇపుడు ప్రభుత్వ మర్యాదలు అనుభవిస్తున్నాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో నియంతృత్వ పాలన అంతం కావడానికి కారణమయిన ప్రజాస్వామిక ఉద్యమాన్ని చున్ రక్తపుటేరుల్లో ముంచెత్తాడు. అమెరికా రాయబారి ప్రత్యక్ష అనుమతితో గ్వాంగ్జూ పట్టణంలోని విద్యార్ధులు, యువకులపై సైనిక ట్యాంకులు నడిపి వేలాదిమంది యువ ఉద్యమకారులను ఊచకోత కోశాడు. 149 మిలియన్ డాలర్ల ప్రజాధనాన్ని సైతం తన స్వాధీనంలోనే ఉంచుకోవడానికి చున్ ని అనుమతించిన కొరియా ప్రభుత్వం, తన రూపం ప్రజాస్వామ్యమే గానీ, సారం నియంతృత్వమమేనని చాటుకుంది.

Chun Du-Hwang

ద.కొరియా ప్రభుత్వ ‘విదేశాంగ మరియు వాణిజ్య’ మంత్రిత్వ శాఖ, మాజీ నియంత చున్ దూ-హ్వాన్ కు రాయబార రక్షణ కలిగి ఉన్న ట్రావెల్ పాస్ పోర్ట్ ను మంజూరు చేసినట్లు వెల్లడయింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు హాంగ్ ఇక్-ప్యో తయారు చేసిన నివేదిక ద్వారా సెప్టెంబర్ 18 తేదీన ఈ సంగతి వెల్లడయింది. 1988 నుండి ఐదేళ్ల కాలపరిమితి గల నాలుగు పాస్ పోర్ట్ లు చున్ కు మంజూరు చేశారని ప్యో నివేదిక తెలిపింది. తన నియంతృత్వ పాలనలో పౌరుల హత్యాకాండకు పాల్పడడం లాంటి నేరాలకు పాల్పడినప్పన చున్ విదేశాల్లో అరెస్టులనుండి తప్పించుకోవడానికి వీలుగా డిప్లొమేటిక్ రక్షణతో పాస్ పోర్ట్ ను ద.కొరియా ప్రభుత్వం మంజూరు చేసింది.

1980 నాటి గ్వాంగ్జూ ప్రజల వీరోచిత ప్రతిఘటన ద.కొరియాలో  ప్రజాస్వామిక ఉద్యమాలకు ఊపిరి పోసింది. సదరు ఉద్యమాల ద్వారానే కొరియా ప్రజలు నియంతృత్వానికి చరమగీతం పాడారు. అనంతరం జరిగిన విచారణలో చున్ దూ-హ్వాన్ కు కోర్టులు మరణ శిక్ష విధించాయి. అయినప్పటికీ ప్రజాస్వామ్య ప్రభుత్వ నేతలు ఆయనకి క్షమాభిక్ష పెట్టి విడుదల చేశాయి. ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులను కూడా అట్టే పెట్టుకోవడానికి అనుమతించాయి. ఇపుడు ఏకంగా రాయబార హోదా కల్పించడం ద్వారా చున్ అకృత్యాల పట్ల తమకు ఎప్పుడూ అభ్యంతరం లేదని సో కాల్డ్ ప్రజాస్వామ్య ప్రభుత్వమే చెప్పినట్లయింది.

చున్ ఇప్పుడు బతికి ఉన్నాడంటే దానికి కారణం మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్. 1980 నుండి 1988 వరకూ సాగించిన నియంతృత్వ పాలనలో చున్ అంతులేని అవినీతికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. గ్వాంగ్జు నగర విద్యార్ధులను, యువకులను ఊచకోత కోసిన దుర్మార్గానికి బాధ్యుడనీ, 1980లో అప్పటి అధ్యక్షుడు మరణానంతరం మిలట్రీ కుట్రతో అధికారాన్ని చున్ చెప్పట్టడం రాజ్యాంగ విరుద్ధమనీ కూడా ప్రభుత్వ విచారణ తేల్చింది. ఈ నేరాలకు గానూ 1996లో చున్ కి మరణ శిక్ష విధించారు. అయితే అప్పటి అధ్యక్షుడు కిమ్ యోంగ్-సామ్ తన తర్వాత కొద్ది రోజుల్లో అధ్యక్షుడు కానున్న కిమ్ డే-జంగ్ సలహా మేరకు ‘చున్ దూ-హ్వాన్’ కి క్షమాభిక్ష ప్రసాదించాడు. చున్ పాలనలో కిమ్ డే-జంగ్ కూడా ఒక రాజకీయ ఖైదీ. మరణ శిక్షను కూడా తృటిలో తప్పించుకున్నాడు. అలాంటి కిమ్ స్వయంగా చున్ కి క్షమాభిక్ష ప్రసాదించడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందన్నది బహిరంగ రహస్యమే. చున్ సాయంతోనే ఎనిమిదేళ్లు దక్షిణ కొరియా ప్రజలను దోచుకుతినడమే కాక ఆసియాలో మిలట్రీ ఎస్సెట్ గా ఆ దేశాన్ని అమెరికా చేసుకోగలిగింది. ఆ కృతజ్ఞతను క్షమాభిక్ష ద్వారా అమెరికా తీర్చుకుందన్నమాట! తాను దోచుకున్నదంతా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలన్న షరతుమీద క్షమాభిక్ష ప్రసాదించిన కిమ్ సదరు షరతును పాటించకపోయినా పట్టించుకోలేదు.

చున్ ఇప్పటికీ అనేకమంది ప్రవేటు బాడీ గార్డుల మధ్య బతుకుతున్నాడు. ఆయన నియంతృత్వ పాలనలో సాగించిన పాశవిక అణచివేతలో బాధితులు ఎవరైనా ఆయనపై ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో నిరంతర కాపలాలో బతుకుతున్నాడు. తన వద్ద ఉన్నది కేవలం 250,000 వన్ (240 డాలర్లు) మాత్రమే అని 2003లో విచారణలో చెప్పిన చున్ అమెరికా, జపాన్ లకు విస్తృత ప్రయాణాలు ఎలా చేయగలుగుతున్నాడో ప్రభుత్వాలు ప్రశ్నించలేదు. ఉత్తర కొరియా పాలకుల ఆడంబరాలను భూతద్దంలో చూపడానికి ఆసక్తి చూపే పశ్చిమ పత్రికలు చున్ ఆస్తుల గురీంచి ఎన్నడూ ప్రశ్నించనైనా లేదు. ఉక్కుతెర వెనుక ఉతరకొరియా ప్రజలు బతుకుతున్నారని చెప్పే కధలతో ఊదరగొట్టే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు అమెరికా, యూరప్ దేశాల అండదండలతో మూడు దశాబ్దాల పాటు దక్షిణ కొరియాను ఏలిన నియంతల అకృత్యాల గురించి తమకసలు తెలియదన్నట్లు నటిస్తాయి.

ప్రపంచవ్యాపితంగా మానవ హక్కుల పరిరక్షణకే పుట్టినట్లు ఆపసోపాలు పడే దేశాలు చున్ పర్యటనలను ఎలా అనుమతిస్తున్నాయన్నది మరో ప్రశ్న. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ఒక అధ్యక్షుడు ఒక క్రూర నియంత చేసిన పాపాలకు క్షమాభిక్ష ప్రసాదించడంతోనే అంతర్జాతీయంగా గౌరవనీయ వ్యక్తి ఎలా కాగలడో అమెరికా, యూరప్, జపాన్ లు చెప్పవలసి ఉంది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా యే స్వయంగా తన పూర్వ అధ్యక్షుడు జార్జి బుష్ సాగించిన యుద్ధాల నాటి చట్టరాహిత్యాన్ని, చిత్రహింసలనూ, అబద్ధాలనూ క్షమించి మర్చిపొమ్మన్నపుడు అమెరికా జూనియర్ పార్టనర్ ద.కొరియా పాలకుల క్షమాభిక్ష ఏపాటి? “వెనక్కి తిరిగి చూడడానికి బదులు మనం ముందుకే చూడాలి” అని చెప్పి బుష్ యుద్ధ నేరాలను ఒబామా తేలికగా కొట్టిపారేశాడు. ఒబామా యుద్ధ నేరాలను క్షమించే అధ్యక్షుడు కూడా ఒబామాకి అవసరం మరి.

గ్వాంగ్జు హత్యాకాండకు బాధ్యులను బోనులో నిలబెట్టదలిస్తే చున్ కంటే ముందు అమెరికా పాలకులు బోనెక్కాలి. గ్వాంగ్జు హత్యాకాండకు అమెరికా ప్రత్యక్ష మద్దతు, ప్రోత్సాహం ఉండడమే దానికి కారణం. చున్ ని కోర్టు బోను ఎక్కిస్తే దక్షిణ కొరియా ప్రజలపై నియంతృత్వ సైన్యం సాగించిన అకృత్యాల వెనుక అమెరికా ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం అన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం మెండుగా ఉంది. గ్వాంగ్జు ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణచివేయడానికి అప్పటి అమెరికా రాయబారి గ్లే స్టీన్ ప్రత్యక్ష అనుమతి ఉందని తర్వాత వెలుగులోకి వచ్చింది. 1982 లో న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన లేఖలో రాయబారి గ్లే స్టీన్ స్వయంగా ఈ సంగతి తెలియజేశాడు. తన ఆమోదంతోనే సియోల్ లో మార్షల్ లా డ్యూటీలో ఉన్న సుశిక్షిత సైన్యాన్ని గ్వాంగ్జు నగరాన్ని ప్రజలనుండి పునఃస్వాధీనం చేసుకోవడానికి పంపానని గ్లేస్టీన్ టైమ్స్ కి రాసిన లేఖలో తెలిపాడు. దీనితో అమెరికా నిజ స్వరూపం ఏమిటో కొరియా ప్రజలకు తెలిసొచ్చింది. ముఖ్యంగా యువతరం ఆగ్రహోదగ్రులయ్యారు.

జపాన్, దక్షిణ కొరియాలలో పెరిగి వాషింగ్టన్ నుండి పని చేస్తున్న జర్నలిస్టు టిమ్ షోరోక్ సమాచార హక్కు చట్టం ద్వారా సంపాదించిన అమెరికా పత్రాల ద్వారా కూడా గ్వాంగ్జు హత్యాకాండలో అమెరికా పాత్ర స్పష్టంగా రుజువయింది. గ్వాంగ్జు పట్టణాన్ని మిలిషియా రక్షణలో ప్రజలు నిర్వహించుకోవడం ప్రారంభం అయ్యాక ఏం చేయాలో నిర్ణయించడానికి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఒక సమావేశం జరిపాడు. (మీరు సరిగ్గానే చదివారు. గ్వాంగ్జు లో ఏమన్నా చెయ్యాలంటే కొరియా పాలకులు సమావేశం కావాలి గానీ అమెరికా అధ్యక్షుడికి ఏం పని అన్న మీ అనుమానం మీకు న్యాయమైనదే. కానీ అమెరికాకి కాదు. ప్రజాస్వామ్య స్ధాపన పేరుతో నియంతృత్వాలను కాపాడడం అమెరికా పాలకుల జన్మహక్కు.) ముందు గ్వాంగ్జు తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేయాలని, ప్రజాస్వామిక సంస్కరణల సంగతి తర్వాత చూసుకోవచ్చనీ జిమ్ కార్టర్ నిర్ణయించినట్లుగా టిమ్ వెల్లడి చేసిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

“సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే, కొరియాలో అమెరికా కమాండర్ కి ఆదేశాలు వెళ్ళాయి. సదరు ఆదేశాల మేరకు అమెరికా-కొరియా జాయింట్ కమాండ్ లో ఉన్న కొరియా సైన్యంలోని ఓ విభాగాన్ని గ్వాంగ్జు తరలించడానికి అమెరికా కమాండర్ కొరియా ప్రభుత్వానికి ఆమోదం తెలిపాడు. గ్వాంగ్జు తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న పట్టణాలను అప్పటికే మిలట్రీ వలయంతో చుట్టుముట్టారు. ఎటువంటి కమ్యూనికేషన్లు లేకుండా ఆ ప్రాంతాన్ని దేశంలోని ఇతర ప్రాంతంతో కత్తిరించేశారు. మిలట్రీ హెలికాప్టర్లు నగరంపైన ఎగురుతూ గ్వాంగ్జు రాష్ట్ర పాలనా భవనాన్ని అదుపులో ఉంచుకున్న అర్బన్ ఆర్మీని లొంగిపొమ్మని హెచ్చరికలు చేశాయి. ఒక సమయంలో జోక్యం చేసుకోవలసిందిగా అమెరికా రాయబారి విలియం గ్లేస్టీన్ కు గ్వాంగ్జు సిటిజన్స్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా ఒప్పందానికి రావచ్చని సూచించింది. అయితే ఈ విజ్ఞప్తిని అమెరికా రాయబారి నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు” అని టిమ్ షోరోక్ తెలియజేశాడు. ఏ దేశంలోనైనా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను సహించేదే లేదని ఆ విధంగా అమెరికా స్పష్టం చేసింది.

అప్పటికే పోలీసులు, సైనికుల చేతుల్లో వేలమంది విద్యార్ధులను, యువకుల కోల్పోయిన గ్వాంగ్జు ప్రజలు మరిన్ని బలగాలు రావడంతో పెద్దగా ప్రతిఘటన ఇవ్వలేకపోయారు. ఈ అణచివేతలో దాదాపు 200 మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెప్పగా 2000 పైనే మరణించారని గ్వాంగ్జు పట్టణ ప్రజా సంఘాలు తెలిపాయి. ప్రభుత్వం చెప్పిన లెక్కను తప్పు పట్టేవారిని కఠినంగా శిక్షించేలా చట్టం చెయ్యడంతో ఆప్తులను కోల్పోయినవారి గోడు సమాధి చెయ్యబడింది. ఈ ఘోరాన్ని పశ్చిమ పత్రికలు ఎప్పుడూ తలచుకోవు. చైనా తీయాన్మాన్ స్క్వేర్ ను సందర్భం వచ్చినప్పుడల్లా తలుచుకునే స్వేచ్చా కాముక కార్పొరేట్ పత్రికలు గ్వాంగ్జు హత్యాకాండను మౌనంతో సమాధి చేశాయి. ఆ హత్యాకాండ వెనుక అమెరికా ప్రత్యక్షపాత్ర ఉండడమే దానికి కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనా వనరుల ప్రత్యక్ష దోపిడికి ఆ దేశ పాలకులు అనుమతించలేదు గనుక అక్కడ ఏంజరిగినా భూతద్దంలో ప్రపంచానికి కనపడుతుంది. ఉత్తర కొరియాలో ఎవరికీ తెలియని అణచివేతల కధలను పశ్చిమ పత్రికల విలేఖరులు సాహసాలు చేసి మరీ కనిపెట్టి వెల్లడి చేశారు. ఉక్కుతెరలను చీల్చుకుని మరీ ఉత్తరకొరియా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను కధాలుగా మోసుకొస్తారు. కానీ అమెరికా కంపెనీలకు పూర్తి అనుమతి ఇస్తూ, దాని జియో పోలిటికల్ ఆధిపత్య వ్యూహాల్లో భాగం కావడానికి అంగీకరించిన దక్షిణ కొరియా ప్రజల నెత్తురు ఏరులై పారినా కార్పొరేట్ పత్రికలకు అది రంగునీళ్లుగా తోస్తుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా నియంతృత్వాల రక్త చరిత్ర పశ్చిమ పత్రికల్లో రంగుల హరివిల్లుగా ప్రత్యక్షమై ఊరేగుతుంది.

దక్షిణ కొరియాలో నియంతృత్వ పాలకుల అణచివేతల చరిత్రను మరుగుపరుచడానికే ఉత్తర కొరియా చుట్టూ ఉక్కుతెరలు ప్రత్యక్షం అవుతాయి. దక్షిణ కొరియా వలే అమెరికా ఆధిపత్యానికి తలొంచలేదు కనుక ఉత్తర కొరియా అణ్వాయుధాలు ప్రపంచ భధ్రతకే ప్రమాదంగా తయారై కూర్చుంటాయి.   దక్షిణ కొరియాలో దశాబ్దాలుగా తిష్టవేసిన అమెరికా సైనిక స్ధావరాలనుండి నిరంతరం పొంచి ఉన్న ప్రమాదాన్ని ఉత్తర కొరియా ఎదుర్కొంటున్నది. ఈ పరిస్ధితిలో ఘర్షణల నివారణ కోసం ఉత్తర కొరియా పాలకులు చేసే సానుకూల ప్రకటనలు కూడా ఆశ్చర్యకరంగా అహంకార ప్రకటనలుగా పశ్చిమ పత్రికల్లో ప్రత్యక్షం అవుతాయి. స్వతంత్ర దేశాలపై దాడులు చేసి కబళించిన చరిత్ర కలిగిన అమెరికా సైన్యం నుండి రక్షణ పొందాలంటే దానికి తగిన శక్తి పొందడం ఉత్తరకొరియాకి అనివార్యం. ఈ నేపధ్యంలోనే ఆ దేశం సంపాదించుకున్న అణ్వాయుధాలని చూడాలి తప్ప కార్పొరేట్ మీడియా మన కళ్ళకి తగిలించిన గంతలనుండి కాదు.

సాధారణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రప్రధమ శత్రువు అమెరికాయేనని ఉత్తర కొరియా కాదు దక్షిణ కొరియా ప్రజల అనుభవమే చూపుతోంది. అమెరికా ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగిన గ్వాంగ్జు మారణకాండ, సదరు మారణకాండ బాధ్యుడు చున్ దూ-హ్వాన్ కి అమెరికా లో లభిస్తున్న గౌరవం దానికి ప్రబల సాక్ష్యం.

వ్యాఖ్యానించండి