శ్రమ విలువను గుర్తించిన మేధావి ఆమె


ఆమె పేరు క్రాంతి (ట). అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి విజయనగరం జిల్లా ఇట్లమామిడి పల్లిలో వ్యవసాయం చేయడానికి వచ్చిన ఈమె అద్భుత మహిళగా తోస్తోంది. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంస్మరణ వ్యాసం కోసం రాజశేఖర రాజు గారి బ్లాగ్ లోకి వెళ్ళి, అక్కడి నుండి ఓ లింక్ పట్టుకుని జర్నలిస్టు అరుణ పప్పు గారి బ్లాగ్ లోకి వెళ్తే ఓ అపూర్వ కధనం కనిపించింది. ఆ కధనం ఆసాంతం చదివాక నిజంగా ఆశ్చర్యంతో ఏ ఇతర ఆలోచనా లేకుండా పోయింది.

కాకపోతే:

“మన దేశంలో వ్యవసాయదారులు పెద్దగా చదువుకున్నవాళ్లు కాదు. బాగా చదువుకున్నవాళ్లెవరూ వ్యవసాయం చెయ్యరు. ఎందుకంటే అందులో లాభాల్లేవు గనుక. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా తయారవుతుంది. దానికోసమే విద్యావంతులు సైతం పొలంలోకి దిగాలి. నాగలి పట్టాలి…”

అని ఏ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా అనగలరా? అనకోవడమే తడవుగా తన ఆలోచనను అమలు చేయడానికి అమెరికా నుండి ఇండియాకి వచ్చేసి సేద్యం మొదలు పెట్టడం ఏ భారత మేధో అతివకయినా సాధ్యమా? అన్నం వృధా చేయకూడదని పిల్లలకి నచ్చచెప్పడానికి తానే మట్టిమనిషిగా మారిన క్రాంతి నిజంగా అభినందనీయురాలు.

ఫొటో: అరుణిమ బ్లాగ్

దాదాపు ముప్ఫై ఎకరాల బీడు భూమిని సాగులాయకీ భూమిగా మార్చదానికి ఆమె కృషి చేస్తున్నదని అరుణ గారి కధనం చెబుతోంది. ఆ క్రమంలో గ్రామీణ శ్రామికులకు ఉపాధి కల్పించడం కోసం సరుగుడు తోటలను నరికేసి కూరగాయలను పెంచి నిజమైన సామాజిక మనిషిగా క్రాంతి నిరూపించుకుంది.

క్రాంతి మాటల్లో కనిపిస్తున్న లాభార్జనా దృక్పధం కేవలం ఒక్క కోణం మాత్రమే. శారీరక శ్రమకు, మేధో శ్రమకూ ఉన్న వైరుధ్య సంకెళ్ళను ఒక్క ఉదుటున తెంచేసిన క్రాంతి శ్రమాచరణ తప్పనిసరిగా గుర్తించవలసిన విషయం. నిజమైన సుఖం, ఆయురారోగ్యాలు అనేవి శ్రమరాహిత్య జీవనంలో కాకుండా శ్రమ జీవనంలోనే ఉంటుందని క్రాంతి చాటి చెప్పినట్లయింది. ఆమెకి ఏదో అవార్డు వచ్చిందిట. కానీ, సమాజానికి ఆమె ఇచ్చిన శ్రమ సందేశంతో పోలిస్తే అదొక లెక్కేకాదు.

‘నువ్వోస్తానంటే నేనొద్దంటానా’ (అదేనా?) అనే సినిమాలో ప్రేమ కోసం వ్యవసాయాన్ని చేపట్టి విజయం సాధిస్తాడు హీరో. కానీ అది సినిమా. నిజ జీవితంలో దాదాపు అలాంటి ఫీట్ నే సాధించిన పాతూరి క్రాంతికి హృదయపూర్వక అభినందనలు.

అరుణ పప్పు గారి కధనాన్ని అరుణిమ బ్లాగ్ లో చూసి మీరూ అబ్బురపడండి!

4 thoughts on “శ్రమ విలువను గుర్తించిన మేధావి ఆమె

  1. ఈ ప్రసంగం పూర్తిగా వినండి. దేవేందర్ శర్మ వ్యవసాయంలో రైతులకి కొత్త టేక్నిక్ లు నేర్పిస్తూ, వ్యవసాయం నష్టమనే ప్రభుత్వ ప్రచారాన్ని ఎలా తిప్పికొడుతున్నారో తెలుస్తుంది.

  2. ‘నిజమైన సుఖం, ఆయురారోగ్యాలు అనేవి శ్రమరాహిత్య జీవనంలో కాకుండా శ్రమ జీవనంలోనే ఉంటుందని క్రాంతి చాటి చెప్పినట్లయింది.’

    మీరు ప్రచురించిన మట్టిమనిషి క్రాంతికి ఆమెను వెలికి తెచ్చిన అరుణగారికి ధన్యవాదాలూ, అభినందనలూనూ..

వ్యాఖ్యానించండి