‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి


ఖోక్రా, అహ్మదాబాద్ లో హిందూ మూకల స్వైర విహారం

(ఈ ఆర్టికల్ గత సంవత్సరం మార్చి నెలలో ఇదే బ్లాగ్ లో ప్రచురించబడింది. బ్లాగ్ ప్రారంభంలో రాసినందున పెద్దగా పాఠకుల దృష్టికి రాలేదు. ప్రధాన మంత్రి పదవి కోసం నరేంద్ర మోడి చేస్తున్న ప్రయత్నాలకు ఇంటా బయటా వస్తున్న మద్దతు, పోటీల దృష్ట్యా దీనికి ప్రాధాన్యత కొనసాగుతోంది. అందువలన పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్)

2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం చర్య తీసుకున్నారు అనడిగిన అమెరికా రాయబారి ప్రశ్నకు కోపంతో, “అది గుజరాత్ అంతర్గత వ్యవహారం. ఆ విషయం గురించి ప్రశ్నించే అధికారం అమెరికాకు లేదు” అని నరేంద్ర మోడి హుంకరించిన విషయం అమెరికా రాయబారి రాసిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారులు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిన కేబుల్ ఉత్తరాలను వికీలీక్స్ నుండి సంపాదించి ‘ది హిందూ’ పత్రిక వారం రోజులుగా ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ప్రచురించిన ఒక కేబుల్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి తాము సాగించిన హత్యాకాండను అమెరికా రాయబారి వద్ద ఎలా సమర్ధించుకున్నదీ తెలియజేసింది.

ముంబైలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఉన్న కాన్సల్ జనరల్ మైఖేల్ ఎస్.ఓవెన్, నవంబరు 16, 2006 తేదీన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడితో గాంధీనగర్ లో సమావేశమయ్యాడు. 2002 లో గుజరాత్ లో ముస్లింలపై జరిగిన దారుణ హత్యాకాండలో నరేంద్ర మోడీకి పాత్ర ఉన్నందుకుగాను మార్చి 2005 లో అతని వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. వీసా రద్దు తర్వాత నరేంద్ర మోడితో ఒక అమెరికా రాయబారి మాట్లాడటం అదే మొదటిసారి. ఫిబ్రవరి 27, 2002 తేదీన గోధ్రా రైలు స్టేషన్ లో సబర్మతి ఎక్స్ ప్రెస్ కి చెందిన ఒక రైలుబోగీకి నిప్పుపెట్టి యాభైమందికి పైగా కరసేవకులను చంపివేసిన నాటినుండి నాలుగు వారాల పాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఆ దారుణ మారణకాండలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోగా మరో 223 మంది జాడ తెలియలేదు. 2005 లో పార్లమెంటులో సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారికంగా చేసిన ప్రకటనలో ఈ సంఖ్యలను పొందుపరిచారు. వాస్తవ సంఖ్య దీనికి అనేక రెట్లు ఉన్న సంగతి చాలామంది అంగీకరించే విషయం.

నవంబరు 27, 2006 తేదీన అమెరికా స్టేట్ డిపార్డుమెంటుకి పంపిన కేబుల్ లేఖలొ అమెరికా రాయబారి ఓవెన్ నరేంద్ర మోడితో జరిపిన సంభాషణ వివరాలను రాశాడు. కాన్ఫిడెన్షియల్ గా వర్గీకరించిన ఈ కేబుల్ కాపీలను ప్రపంచంలోని అవసరం అనుకున్న ఇతర దేశాల అమెరికా రాయబార కార్యాలయాలకు కూడా పంపించారు. విశ్రాంతిగా కూర్చొని ఉన్న నరేంద్ర మోడి తన ఆధ్వర్యంలోని రాష్ట్రప్రభుత్వం, మౌలిక వసతులు నిర్మించడంలోనూ,  ఆర్ధికాభివృద్ధిని ప్రోత్సహించడంలోనూ సాధించిన విజయాలను ఉత్సాహంగా చెప్పినట్లు రాయబారి తెలిపాడు. గుజరాత్ అభివృద్ధిపై చర్చ జరుగినంతసేపు ఉత్సాహంగా ఉన్న నరేంద్రమూడి వివాస్పద అంశం మీదికి చర్చ మళ్లిన వెంటనే కోపంగా మారిపోయాడని రాయబారి రాశాడు.

“మన వ్యాపార సంబంధాల పట్లా, గుజరాత్ ప్రజలకూ అమెరికా ప్రజలకూ ఉన్న సంబంధ బాంధవ్యాల పట్లా మేము చాలా సంతృప్తికరంగా ఉన్నాం. అయితే రాష్ట్రంలోని మతపరమైన వాతావరణం పట్ల మేము ఆందోళనతో ఉన్నాము. ప్రత్యేకంగా 2002లో జరిగిన భయంకరమైన మత మారణకాండకు ఇంతవరకూ ఎవర్నీ బాధ్యులుగా గుర్తించకపోవడం పట్ల చాలా ఆందోళనగా ఉన్నాం. మత హింసకు బాధ్యులైనవారు చట్టం ద్వారా ఎటువంటి శిక్షకు గురికాబోరన్న వాతావరణం వలన మత సంబంధాలు మరింతగా దిగజారుతాయన్న ఆందోళనగా ఉంది. గుజరాత్ ప్రభుత్వం ఈ విషయంలో ఏమనుకుంటున్నది?” అని రాయబారి నరేంద్ర మోడిని ప్రశ్నించినట్లుగా రాశాడు.

“ఈ ప్రశ్నకు నరేంద్రమోడి కోపంతో సుదీర్ఘ సమాధానం ఇచ్చాడు. మోడి ప్రధానంగా మూడు విషయాలు చెప్పాడు. 2002 లో జరిగిన సంఘటనలు గుజరాత్ రాష్ట్ర అంతర్గత వ్యవహారం. ఇందులో జోక్యం చేసుకునే అధికారం అమెరికాకు ఏ మాత్రం లేదు; అమెరికా స్వయంగా భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలో దోషిగా ఉంది (అబుఘ్రయిబ్ జైలు, గ్వాంటనామో బే, సెప్టెంబరు 11 తర్వాత భారత సిక్కులపై అమెరికాలో జరిగిన దాడులు తదితర అంశాలను నరేంద్ర మోడి ప్రస్తావించాడు) కనుక అటువంటి విషయాల్లో ఇతరులను ప్రశ్నించే నైతిక స్ధానంలో అమెరికా లేదు; మూడవది భారత దేశంలో మరే ఇతర రాష్ట్రంలోని ముస్లింల కంటే గుజరాత్ ముస్లింలు చాలా ముందంజలో ఉన్నారు. కనుకు ఎవరికైనా ఈ విషయంలో సణుగుడు ఎందుకు? అని నరేంద్రమోడి ప్రశ్నించాడు.”

నరోదపాటియాలో ముస్లింలను నరికి పడేసిన బావి ఇదే

“అమెరికా ఒక్కటే ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేయడం లేదు. భారతదేశ జాతీయ మానవ హక్కుల సంస్ధే స్వయంగా ‘గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మత హింసను నివారించడంలో అన్ని విధాలుగా విఫలమైంద’ని పేర్కొన్నది. జరిగిన హత్యాకాండకు బాధ్యులుగా ఎవర్నీ గుర్తించకపోవడంపట్ల, తద్వారా చట్టంనుండి వారు తప్పించుకోగలరన్న వాతావరణం ఏర్పడుతున్నదన్న అంశంపట్లా అనేక వర్గాల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలనే మేము వ్యక్తీకరిస్తున్నాం. రెండోది, అబూఘ్రయిబ్ విషయానికి సంబంధించి: అమెరికన్లు కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడవచ్చు. అయితే అలాంటివి జరిగినప్పుడు పరిశోధించి, విచారించి, తప్పు చేసిన వారిని శిక్షించడానికి అమెరికాలో స్పష్టమైన పద్ధతులున్నాయి. అటువంటి పద్ధతులనే గుజరాత్ లో కూడా చూడాలని మేము గానీ ఇతరులు గానీ భావిస్తున్నాము” అని మోడీకి చెప్పినట్లుగా అమెరికా రాయబారి ఓవెన్ తన కేబుల్ లో రాశాడు.

“దీనికి మోడి గుర్రుమంటూ ‘భారత జాతీయ మానవహక్కుల సంఘం పక్షపాత పూరితమైనది. దాని నిర్ణయాల్లో తీవ్ర తప్పిదాలున్నాయి. అదీ కాక అమెరికా, కొద్ది సంఖ్యలో ఉన్న చిన్న చిన్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్ధలపైనే ఆధారపడుతోంది. వాటికి వాస్తవ పరిస్ధితులేవీ తెలియదు. పైగా వాటికి స్వార్ధ ప్రయోజనాలున్నాయి. ఏదైమైనా అధికారులు తప్పు చేసినట్లయితే వారిని విచారించి, శిక్షించేందుకు కోర్టులున్నాయి. ముఖ్యమంత్రులు న్యాయ ప్రక్రియల్లో జోక్యం చేసుకోలేరు’ అని సమాధానమిచ్చాడు” అని ఓవెన్ రాశాడు. కాన్సల్ జనరల్ దానికి సంఘటన జరిగి నాలుగు సంవత్సరాలవుతున్నా ఎవర్నీ పట్టుకోలేదనీ, దానితో నిజంగా బాధ్యుల నెవరినయినా గుర్తిస్తారో లేదోనన్న నమ్మకం కలగడం లేదనీ మోడితో అన్నట్లు రాశాడు.

“దానికి మోడీ 1993 లో జరిగిన ముంబై దాడులకు బాధ్యులకు ఇప్పుడు శిక్షలు పడుతున్నాయి. కనుక మనం అవాస్తవమైన అంచనాలు పెట్టుకోకూడదని సమాధానమిచ్చాడు. అసలు గుజరాత్ హింసపై ఏదన్నా పరిశోధన జరుగుతున్నదా అని అడగ్గా మోడీ దానికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇతర రాష్ట్రాల్లో కంటే గుజరాత్ ముస్లింలే బాగా బతుకుతున్నారన్న తన వాదన దగ్గరకూడా నిలబడలేక పోయాడు. తమ బిజేపి పార్టీ ఇటీవల జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ముస్లిం జిల్లాల్లో మంచి విజయాలు సాధించిందని గుర్తు చేశాడు. ఇతర రాష్ట్రాల్లో కంటే గుజరాత్ ముస్లింలు ఎక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న సంగతి ఓ అధ్యయనంలో తేలిందన్నాడు. 2002లో జరిగిన హింస కొద్దిమంది అల్లరిగుంపుల వలన జరిగిందనీ, దానిని గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేశారనీ ఆరోపించాడు. ఇప్పుడు గుజరాత్ లో మతాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయన్నాడు.”

“అమెరికా ప్రభుత్వం మోడి ప్రభుత్వం అనేక సానుకూల ఫలితాలు సాధించిన విషయం గుర్తించిందనీ, ఆర్ధిక వృద్ధి, విద్యారంగాల్లో కూడా అభివృద్ధి సాధించిన అంశాన్ని కూడా గుర్తించిందనీ నేను మోడీకి వివరించాను. ఇవి కొనియాడ దగ్గ విషయాలే. కానీ మత హింసను రెచ్చగొట్టినందుకు, హింసకు పాల్పడినందుకు బాధ్యులైనవారిని గుర్తించవలసిన ముఖ్యమైన అంశాన్ని అవి కప్పిపెట్టజాలవని చెబుతూ అలా చేయనట్లయితే ఎంత నేరానికి పాల్పడినా ఎటువంటి శిక్షా పడబోదన్న వాతావరణంలో తీవ్రవాద శక్తులు భవిష్యత్తులో పెచ్చరిల్లిపోతాయనీ మోడీకి తెలిపాను. అమెరికా ప్రభుత్వం మానవ హక్కులు, మత స్వేచ్ఛలకు అత్యధిక ప్రాముఖ్యం ఇస్తుందనీ, ఇక ముందు కూడా ఈ అంశాల్లో గుజరాత్ లో జరిగే మార్పులను పరిశీలిస్తూనే ఉంటుందనీ, ఈ అంశాలో గుజరాత్ ప్రభుత్వ విధానాలపై కన్నేసి ఉంటుందనీ మోడీకి తెలిపాను” అని ఓవెన్ తాను పంపిన కేబుల్లో రాశాడు.

హిందూ మతోన్మాదుల చేతుల్లో వికలాంగులయిన పసిమొగ్గలు

“దానితో మోడీ రాజీ ధోరణిలో మాట్లాడుతూ మానవ హక్కులు, మత స్వేచ్ఛ లకు అమెరికా అత్యంత ప్రాముఖ్యమిచ్చే సంగతి నాకు తెలుసనీ, ఎందుకంటే అమెరికన్లు ఎప్పుడూ ఈ విషయాలపైనె ఎక్కువగా మాట్లాడుతుంటారని అంగీకరిస్తూ నిందాస్తుతితో రాయబారిని మళ్ళీ గుజరాత్ ను సందర్శించాలనీ, అమెరికన్లు ఎప్పుడూ గుజరాత్ లో ఆహ్వానితులే అని ముగించడంతొ మా సమావేశం అంతటితో ముగిసింది” అని ఓవెన్ రాశాడు.

కాన్సల్ జనరల్ ఓవెన్ తన కేబుల్ ను కొన్ని అంతిమ వ్యాఖ్యానాలతో ముగించాడు. అవి: “2002 లో గుజరాత్ లో జరిగిన హింసకు క్షమాపణ చెప్పడంకానీ, అది తప్పని చెప్పడంకానీ చెప్పే ఉద్దేశంలో ఏమీ లేడు. అయితే ఆ సంఘటనను అమెరికా కాలంతో పాటు మరుగున పడనివ్వబోదన్న విషయాన్ని మోడీ స్పష్టంగా గుర్తించాలి. సమావేశం చిటపటలతో జరిగినా మానవహక్కులు, మత స్వేఛ్ఛలను ముఖ్యమైన అంశాలుగా గుర్తించడం అమెరికా కొనసాగిస్తూనే ఉంటుందన్న సందేశాన్ని మోడీ గ్రహించాడు. అయితే మోడీపై సింహ్ జీ చేసిన వ్యాఖ్యలు సరైనవే. దురదృష్టకరం ఏంటంటే 2002 గుజరాత్ హత్యాకాండాకు ప్రధాన బాధ్యుడైయిన వ్యక్తే ఇప్పుడు మత సహజీవనానికి గట్టి మద్దతుదారుగా ఉండటం, కనీసం పైకయినా అలా కనిపిస్తుండడమే. గుజరాత్ ఆర్ధిక వృద్ధి కాలక్రమేణా మంత సంబంధాలను ఏమేరకు మెరుగుపరుస్తుందో పరిశీలించవలసి ఉంది” అని రాయబారి తన కేబుల్ ను ముగించాడు.

సింహ్ జీ అని అమెరికా రాయబారి ప్రస్తావించిన వ్యక్తి ఎవరో, సందర్భం ఏమిటో తెలుసుకోవడం ఉపయుక్తం. ఈయన కాంగ్రెస్ పార్టీ ఎం.పి. పర్యావరణ మంత్రిత్వ శాఖకు మాజీ మంత్రిగా పనిచేసిన ఈయన పూర్తిపేరు ‘యురాజ్ దిగ్విజయ్ సింహ్ జీ’. ఈయన కాన్సల్ జనరల్ ఓవెన్ తో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఇది: “జాతీయ నాయకత్వానికి ఎగబాగటానికి మోడీకి గట్టి ఆకాంక్ష ఉన్ననిజమే ప్రస్తుతం అతనిని మత సహజీవనానికి గట్టి మద్దతుదారుగా నిలిపింది. 2002 లో జరిగినట్లుగా మరోసారి జరిగినట్లయితే జాతీయస్ధాయికి వెళ్ళే అవకాశాలు మూసుకుపోయినట్లే. కనుక తన హయాంలో మరో మతకల్లోలం జరగకుండా ఉండటానికి మోడీ గట్టిగా శ్రద్ధ తీసుకుంటాడు” అని.

యురాజ్ అది చెప్పటంతోనే ముగించుకోలేదు. కేబుల్ ప్రకారం ఓవెన్ ఆయన్ని మోడీ జాతీయ నాయకుడు కాగలడా అని అడిగితే వాంకనర్ రాజ వంశంలో పుట్టి కేంబ్రిడ్జిలో పట్టా పుచ్చుకున్న యురాజ్ “మోడీకి జాతీయ నాయకత్వ స్ధాయికి ఎదగడానికి అవసరమైన మెరుగుతనం గానీ, స్వఛ్ఛత కానీ లేవని సమాధానం ఇచ్చాడు. మరో కారణం కూడా యురాజ్ చెప్పాడు. “అవినీతిని మోడి ఏ మాత్రం సహించడని ఓ వార్త ప్రచారంలో ఉంది. అది నిజమే. అతను గనక జాతీయ నాయకుడైతే దేశవ్యాపితంగా బిజెపిలో అవినీతి లేకుండా చూడడానికి ప్రయత్నిస్తాడు. బిజెపి అధికారంలోకి వచ్చాక తమ జేబులు నింపుకోవడానికి బిజేపి నాయకులు అనేకమంది క్యూ కట్టి ఉన్నారు. అవినీతిని సహించలేని మోడీ లక్షణాన్ని ఈ గుంపు బొత్తిగా భరించలేదు. ఈ అడ్డంకిని దాటి జాతీయ స్ధాయికి చేరుకోవడం మోడికి కష్టమే” అని యురాజ్ ఓవెన్ కు తెలిపాడు.

2 thoughts on “‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s