కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి -2


Pol Pot leading guerrilla army -Photo: BBC

మొదటి భాగం తరువాయి… …

‘కమ్యూనిస్టు హోలోకాస్ట్’ కి సంబంధించిన పాపపు కధలన్నీ పశ్చిమ దేశాలు కనిపెట్టినవిగా నేను మాట్లాడిన కాంబోడియన్లు కొట్టిపారేశారు. నిజంగా ఏంజరిగిందో వారు నాకు గుర్తుచేశారు. 1970లో న్యాయబద్ధమైన తమ పాలకుడు యువరాజు సిహ్నౌక్ ని అమెరికన్లు వెంటపడి తరిమేసి అతని స్ధానంలో తమ కీలుబొమ్మ, మిలటరీ డిక్టేటర్ లోన్ నోల్ ను ప్రతిష్టించడంతో వారి కష్టాల చరిత్ర ప్రారంభం అయింది. లోన్ నోల్ మధ్య నామం అవినీతి. అతని అనుచరులు తమకు సాధ్యమైనదంతా దోచేశారు. దోచిన సొమ్మును విదేశాలకు తరలించి అనంతరం తాము కూడా అమెరికాకి తరలిపోయారు. ఇదంతా ఒక ఎత్తైతే అమెరికా జరిపిన బాంబుదాడులు మరొక ఎత్తు. దోపిడీకి తాళలేని పేద రైతులు కొద్ది మంది సర్బాన్ (ప్యారిస్ యూనివర్సిటీ) గ్రాడ్యుయేట్ల నాయకత్వంలో ని అటవీ గెరిల్లాల వద్దకి పరుగెత్తుకెళ్లారు.  లోన్ నోల్ నూ అతని అమెరికన్ మద్దతుదారులనూ అనతికాలంలోనే దేశం నుండి తరిమికొట్టారు.

డ్రెస్ డెన్ క్రౌర్యానికి (1945లో ఎటువంటి మిలిటరీ ప్రయోజనం లేకుండానే భారీ బాంబుదాడులతో జర్మనీ నగరం డ్రెస్ డెన్ లో బ్రిటిష్ రాయల్ ఆర్మీ సృష్టించిన పెను విధ్వంసాన్ని రచయిత సూచిస్తున్నాడు -అను) ఏమాత్రం తీసిపోని అమెరికన్ బాంబుదాడుల్లో సర్వనాశనమైన కాంబోడియాను 1975 లో పోల్ పాట్ చేపట్టి కాపాడాడని వారు నాతో చెప్పారు. (‘అపోకలిప్స్ ఈజ్ నౌ’ సినిమాలో ‘రైడ్ ఆఫ్ ద వకారిస్’ సీన్ మీకు గుర్తుందా?) నిజానికి అమెరికా విమానాలు నాజీ జర్మనీ పై జారవిడిచిన బాంబుల కంటే ఎక్కువగానే ఈ పెద దేశంపై జారవిడిచాయి. అమెరికన్లు తమ భూగర్భ మందుగనులను దేశమంతటా నాటారు. తమ దేశాన్ని ఎక్కువగా నాశనం చేసినవారెవరని అడిగితే కాంబోడియన్లు చెప్పే పేరు అప్పటి అమెరికా విదేశీ మంత్రి ప్రొఫెసర్ హెన్రీ కిసింజర్! కామ్రేడ్ పోల్ పాట్ కాదు.

సర్వనాశనమైన దేశం మాత్రమే పోల్ పాట్ అతని మిత్రుల చేతికి లభించింది. గ్రామాలన్నీ ఖాళీ అయిపోయాయి. అమెరికన్ బాంబు దాడులనూ, అమెరికా నాటిన మందుగనులనూ తప్పించుకోవడానికి మిలియన్ల మంది శరణార్ధులు రాజధానికి చేరారు. ఆకలి, దరిద్రంతో మునిగిపోయిన దేశానికి మొదట తిండి కావాలి. కానీ అమెరికన్ బాంబింగ్ వల్ల 1974లో ఎవరూ వరి నాట్లు వేయలేదు. దానితో ప్రజలందరూ నగరం విడిచి వరి పొలాలలకి వెళ్ళి, వరి నాటాలని పోల్ పాట్ ఆదేశాలిచ్చాడు. ఇది కఠినమైన చర్యే కానీ అవసరమైన చర్య. సంవత్సరం తిరిగేసరికల్లా కాంబోడియాలో వరి పంట పుష్కలంగా చేతికొచ్చింది. ప్రజలందరికీ సరిపడా తిండి అందుబాటులోకి వచ్చింది. అవసరమైన ఇతర సరుకులను కొనుగోలు చేయడానికి సరిపోయిన మిగులు ధాన్యం కూడా దేశానికి అందింది.

పోల్ పాట్, అతని మిత్రుల ఆధ్వర్యంలోని నూతన కాంబోడియా (అప్పట్లో కంపూచియాగా పిలిచేవారు), సంపన్నులకూ, హక్కులు భుక్తంగా భావిస్తున్నవారికీ, వారిని కాపాడేవారికీ పీడకలగా మారిపోయింది. కానీ పేద ప్రజలకి మాత్రం కడుపునిండా తిండి దొరికింది; చదవడం, రాయడం కూడా నేర్చుకోవడం మొదలుపెట్టారు. సామూహిక హత్యల విషయానికి వస్తే అవి కేవలం కాంబోడియన్ భాష్యకారులు చెప్పే హారర్ స్టోరీలు మాత్రమే. తమను కొల్లగొట్టినవారినీ, గూఢచారులనూ విజయోల్లాసులైన పేదరైతులు కాల్చి చంపారు; అందులో సందేహం లేదు. కానీ అమెరికా నాటిన భూగర్భ మందుగనులు పేలుళ్లలోనూ, ఆ తర్వాత వియత్నాం దురాక్రమణలోనూ అనేకమంది కాంబోడియన్లు విగతులయ్యారని వారు నాకు చెప్పారు.

అవతలివైపు ఏమంటున్నారో వినడానికి నేను చ్యోంగ్ ఏక్ వధ్య క్షేత్రాలకు ప్రయాణం చేశాను. బాధితులుగా చెప్పడబడుతున్న వారు చంపబడి, సమాధి అయిన చోటులో వెలసిన జ్ఞాపక చిహ్నం అక్కడ ఉంది. రాజధాని ఫోమ్ పెన్ కి 30 కి.మీ దూరంలో ఉన్న ఈచోటులో చక్కని గ్రీన్ పార్క్ లో చిన్న మ్యూజియం ఉంది. టూరిస్టులు మిక్కిలిగా సందర్శించే కాంబోడియన్ యాద్ వా-షెమ్ (జర్మనీ హోలో కాస్ట్ మెమోరియల్) ఇది. ఖ్మేర్ రోజ్ గార్డులు నెలకు ఒకటి లేదా రెండు సార్లు 20 నుండి 30 వరకూ ఖైదీలను ఇక్కడికి తెచ్చేవారినీ, వారిలో అనేకమందిని చంపేవారనీ మ్యూజియంలోని ఒక ఫలకం చెబుతోంది. అంటే మూడేళ్లకు లెక్కిస్తే అలా చనిపోయినవారి సంఖ్య 2,000 కంటే మించదు. కానీ 8,000 మంది శవాలను తవ్వితీశామని మరో ఫలకం చెబుతోంది. ఇంకో ఫలకం చూస్తే ఒక మిలియన్ మంది చనిపోయారని చెబుతోంది. కాంబోడియాలో చనిపోయినవారి సంఖ్యను వెయ్యి రెట్లు పెంచి ఉండవచ్చని ప్రఖ్యాత అమెరికన్ భాషావేత్త, సమకాలీన రాజకీయ విశ్లేషకుడు నోమ్ చోంస్కీ నిర్ధారించాడు.

(‘యాద్ వా-షెమ్’లో ఉన్నట్లుగా) ఇక్కడ చనిపోయినవారి ఫోటోలేమీ లేవు. దాని బదులు సాంప్రదాయక పద్ధతిలో గీసిన రెండు పెయింటింగ్ లు మాత్రం ఉన్నాయి. భారీ దృఢకాయుడొకరు ఒక బలహీనమైన చిన్న వ్యక్తిని చంపుతున్నట్లుగా పెయింటింగ్స్ లో చిత్రీకరించి ఉంది, అది కూడా సాంప్రదాయ పద్ధతిలో. ఇతర ఫలకాల్లో కూడా వివరాలేవీ లేవు. “ఇక్కడే హత్యా సాధనాలను ఉంచారు, కానీ అందులో ఏవీ మిగిలి లేవు” అనీ, ఇంకా ఇలా. నాకయితే ఇవి చూశాక సి.ఐ.ఏ రచించి ప్రచారం చేసిన  స్టాలిన్ టెర్రర్, ఉక్రేనియన్ హోలోడోమోర్ (1932-33 నాటి ఉక్రెయిన్ కరువు కధలు) లాంటి రెడ్ అట్రాసిటీస్ స్ఫురణకు వచ్చాయి. అమెరికా, యూరప్, రష్యాల్లో అధికారం నెరుపుతున్నవారికి తమ పాలనకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఏదైనాసరే పనికిరానిదిగా లేదా రక్తసిక్తమైనదిగా లేదా రెండూ నిండి ఉన్నదిగా చెప్పాలని భావిస్తారు. వాళ్ళకి ముఖ్యంగా అవినీతికి లొంగని నాయకులంటే తగని ద్వేషం. వారు రాబెస్పియర్రే, లెనిన్, స్టాలిన్, మావో లేదా పోల్ పాట్ ఇలా ఎవరైనా కావచ్చు. అవినీతిపరులకే వారి ప్రాధాన్యత, చివరికి వారినే పదవిలో ప్రతిష్టిస్తారు. అమెరికన్లకి మరో మంచి కారణం ఏదీ ఉండదు. వారు స్వయంగా సాగించిన హత్యాకాండలనీ, నాపామ్ దాడుల్లో, ఫిరంగుల హత్యాకాండల్లో మిలియన్ల మంది ఇండో చైనీయుల బలితీసుకున్న వాస్తవాలనూ కప్పిపుచ్చడానికే (సో కాల్డ్) పోల్ పాట్ హత్యలు రంగంమీదికి వచ్చాయి.

1978 వియత్నాం దురాక్రమణ దాడుల్లో ఇంకా అనేకమంది ప్రజలను చపేశారని కాంబోడియన్లు నాకు చెప్పారు. నేరాన్ని ఖ్మేర్ రోజ్ పైకి నెట్టడానికి వియత్నామీయులు సహజంగానే ప్రాధాన్యమిస్తారు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఇలా గతాన్ని తవ్వడానికి ప్రోత్సహించడం లేదు. దానికి తగిన కారణం ఉంది: ఒక నిర్దిష్ట వయసును మించిన ముఖ్యఅధికారులందరూ ఖ్మేర్ రోజ్ సభ్యులే; తరచుగా నాయకత్వ స్ధానాల్లో ఉన్నవారే. పైగా దాదాపు వారందరూ వియత్నాంతో కుమ్మక్కయినవారే. ప్రస్తుత ప్రధానమంత్రి హూన్ సేన్ ఖ్మేర్ రోజ్ లో ఒక కమాండర్. ఆయన తర్వాత వియత్నాం ఆక్రమణకు మద్దతు ఇచ్చాడు. వియత్నామీయులు వెళ్లిపోయాక ఆయన అధికారంలో కొనసాగాడు.

అమెరికా చేత ప్రవాసం పంపబడిన యువరాజు సిహ్నౌక్ కూడా ఖ్మేర్ రోజ్ మద్దతుదారుడే. వియత్నామీయులు వెళ్లిపోయాక ఆయన తన విలాస రాజభవనానికీ, దాని పక్కనే ఉన్న వెండి దేవాలయానికీ ఎమరాల్డ్ బుద్ధ తో తిరిగొచ్చాడు. నమ్మశక్యంకాని రీతిలో ఆయన ఇంకా బతికే ఉన్నాడు. తన కిరీటాన్ని కొడుకికి అప్పగించాడు. బౌద్ధ సాధువయిన సిహ్నౌక్ కుమారుడు కిరీటం కోసం మోనాస్టరీని వదిలిరావలసి వచ్చింది. కనుక రాచకుంటుంబానికి కూడా గతాన్ని తవ్వడంపై ఆసక్తి లేదు. దానిగురించి బహిరంగంగా చర్చించడానికి ఎవరికీ ఇష్టం లేదు. ఖ్మేర్ రోజ్ సాగించిందని చెప్పిన అత్యాచారాల నిర్వాహకులను విచారించడానికి చేసిన ప్రయత్నాలు ఏమీ సాధించలేకపోయినా, పశ్చిమ దేశీయుల చేతనలో మాత్రం అధికారిక ఖ్మేర్ రోజ్ హత్యల కధలు స్ధిరస్ధానం సంపాదించుకున్నాయి.

వెనక్కి తిరిగి చూస్తే, పోల్ పాట్ నేతృత్వంలోని ఖ్మేర్ రోజ్ అంతర్గతంగా కంటే విదేశాంగ విధానంలో విఫలం అయినట్లు కనిపిస్తోంది. డబ్బును రద్దు చేయడం, బ్యాంకుల్ని పేల్చివేయడం, బ్యాంకర్లను వరినాట్లకి తరలించడం నిస్సందేహంగా గొప్పసంగతులు. శ్రామికుల రక్తాన్ని తాగి బతికే జలగలైన పెద్ద నగరాల దళారీలను, వడ్డీ దోపిడీదారులను ఎండగట్టడం గొప్ప విషయం. వియత్నాంకు సంబంధించినంతవరకూ తమ స్ధానం ఏమిటో వారు సరిగా లెక్కించలేకపోయారు. తమ కంటే భారీకాయులని తోసేయడానికి ప్రయత్నించారు. వియత్నాం చాలా శక్తివంతమైనది. వారు అప్పుడే అమెరికాని తరిమికొట్టి ఉన్నారు. ఫోమ్ పెన్ లోని తమ జూనియర్ సోదరుల ధిక్కారాన్ని వారు సహించలేకపోయారు. వియత్నామీయులు తమ నాయకత్వంలో లావోస్, కాంబోడియాలతో కలిపి ఇండో చైనాను సృష్టించాలని పధకం వేశారు. కాంబోడియాపై దాడి చేసి తమ స్వతంత్రత కోసం పట్టుబట్టి నిలబడిన ఖ్మేర్ రోజ్ ను పదవీచ్యుతం కావించారు. తమ దురాక్రమణ రక్తచరిత్ర ధర్మబద్ధమైనదే అని చెప్పుకోవడానికి బ్లాక్ లెజెండ్ (స్పెయిన్ రాచరికంపై ద్వేషం రెచ్చగొట్టడానికి 16వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ ఇంగ్లండ్, నెదర్లాండ్ సాగించిన దుష్ప్రచారం) తరహా ప్రచారాన్ని కూడా వియత్నాం సమర్ధించుకున్నది.

ఫ్యూచరిస్టు పాలకుల కింద సాగిన తప్పుల గురించి మనం చాలా ఎక్కువగా మాట్లాడుతాం. దురాశపరులైన పాలకుల తప్పుల గురించి చాలా తక్కువగా మాట్లాడుతాం. బెంగాల్ కరువు, హీరోషిమా హత్యాకాండ, వియత్నాం వేదన, సబ్రా మరియు షటిలా హత్యాకాండ (1982లో లెబనీస్ షియాప్రజలపై లేబనీస్ క్రిష్టియన్ మిలీషియా సాగించిన హత్యాకాండ)… వీటిగురించి మనం పెద్దగా మాట్లాడుకోము. రష్యాలో సోషలిజం ప్రవేశించినప్పటికంటే పెట్టుబడిదారీ విధానం ప్రవించినప్పుడే ఎక్కువమంది చనిపోయారు; కానీ ఆ విషయం ఎందరికి తెలుసు?

ఇపుడు వివిధ దేశాల్లో సోషలిజం చేరుకోవడానికి జరిగిన సాహసోపేత ప్రయత్నాలను మనం జాగ్రత్తగా పునర్మూల్యాంకనం చేసుకోవచ్చు. కఠినమైన, దుర్భరమైన ప్రతికూల పరిస్ధితుల్లో జోక్యందారీ భయాలు వెన్నాడుతున్న పరిస్ధితుల్లో, శత్రుపూరిత ప్రచారం నేపధ్యంలో అవి జరిగాయి. కానీ ఒక సంగతి మాత్రం గుర్తుంచుకుందాం: సోషలిజం విఫలం అయితే పెట్టుబడిదారీ విధానం కూడా విఫలం అయింది. కమ్యూనిజం సాఫల్యతలో ప్రాణ నష్టం ఉన్నట్లయితే పెట్టుబడిదారీ విధానంలో అప్పుడూ, ఇప్పుడూ ప్రాణ నష్టం కొనసాగుతోంది. కానీ పెట్టుబడిదారీ విధానంలో మనకు జీవించదగిన భవిష్యత్తేమీ లేదు. అదే సోషలిజం అయితే అదింకా మనకీ, మన పిల్లలకీ నమ్మకాన్నీ ఉజ్వలమైన భవిష్యత్తునూ హామీ ఇస్తోంది.

… … …అయిపోయింది.

One thought on “కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి -2

వ్యాఖ్యానించండి