కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి 1


ఇమేజ్: బ్రిటానికా

(ప్రఖ్యాత అంతర్జాతీయ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, మాస్కో నివాసి అయిన ఇస్రాయెల్ షమీర్ సెప్టెంబర్ 18 తేదీన ‘కౌంటర్ పంచ్’ పత్రికకు రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. కాంబోడియాలో అమెరికా సాగించిన నీచ హత్యాకాండలను కప్పి పుచ్చుకోవడానికీ, బైటికి రాకుండా చేయడానికీ కమ్యూనిస్టు విప్లవ నేత పోల్ పాట్ పై అనేక అబద్ధాలు సృష్టించి పశ్చిమ పత్రికలు, రాజ్యాలు ప్రచారంలో పెట్టాయి. తన ప్రజలను తానే మిలియన్ల సంఖ్యలో మట్టుపెట్టిన  రక్తపిపాసిగా ప్రపంచం అంతా గుర్తుకు తెచ్చుకునే పోల్ పాట్ ను కాంబోడియన్లు మాత్రం ఒక మంచి దేశభక్తుడిగా,  జాతీయవాదిగా, దేశ ప్రేమికుడిగా గుర్తుపెట్టుకున్నారని ఇటీవలే కాంబోడియా సందర్శించి వచ్చిన షమీర్ చెబుతున్నాడు. శ్రీ శ్రీ చెప్పిన ‘దాచేస్తే దాగని సత్యం’ ఐన ‘పోల్ పాట్ కాంబోడియా’ను నేటి కాంబోడియన్ల దృష్టిలో ఏమిటో ఈ వ్యాసం మనముందుంచుతుంది -విశేఖర్)

ఇప్పుడు, ఈ ఋతుపవనాల సీజన్ లో కాంబోడియా పచ్చగా, చల్లగా సేదతీరుతోంది. కొండల ఏటవాలుల్లో వరి కంకుల్ని వరదలు ముంచెత్తాయి. ప్రాచీన దేవాలయాల్ని దాచి ఉంచే చిక్కటి అడవులని దాటి వెళ్ళడం దాదాపు అసాధ్యం. పోటెత్తే సముద్రాలు గజ ఈతగాళ్లని సైతం దగ్గరికి రానీయవు. వినమ్రమైన కాంబోడియాను తిరిగి దర్శించడానికి ఇది సరైన సమయం. కాంబోడియా క్రిక్కిరిసినదేమీ కాదు, కాంబోడియన్లు అత్యాశాపరులూ కాదు. చాలా శాంతియుతమైన విశ్రాంత దేశం కాంబోడియా. వాళ్ళు రొయ్యలు, చేపల్ని వేటాడతారు. పురుగు మందుల అవసరం ఏమీ లేకుండానే నారు పోసి, సాగు చేసి, కుప్ప నూర్చి వరి పండిస్తారు. తమకు సరిపోయినంత పండించుకుని తింటారు. ఎగుమతుల కోసం కూడా పండిస్తారు. స్వర్గం అయితే ఖచ్చితంగా కాదు గానీ, గ్రామ సైనికులు నిత్యం పని చేస్తుంటారు.

సోషలిజం వేగంగా కూల్చివేయబడుతోంది: చైనీయుల ఫ్యాక్టరీలు యూరోపియన్, అమెరికన్ మార్కెట్ల కోసం టీ-షర్ట్ లను మధిస్తుంటాయి. వేలమంది కాంబోడియా యువతీ యువకులు నెలకి 80 డాలర్ల వేతనం కోసం ఆ ఫ్యాక్టరీల్లో స్వేదం చిందిస్తుంటారు. యూనియన్ గా ఐక్యం అయ్యే సూచన కనిపిస్తే చాలు, పనిలోంచి తొలగించబడుతున్నారు. నూతన ధనికులు రాజ భవనాల్లో విలాస జీవనం సాగిస్తున్నారు. వారి ఇలాకాలో అనేక లెక్సస్ కార్లు, అప్పుడప్పుడూ రోల్స్ రాయిస్ లు దర్శనమిస్తుంటాయి. కలప ఎగుమతి కోసం అడవులను నాశనం చేస్తూ, వ్యాపారులను సంపన్నం కావిస్తూ, నల్లని ఎర్రని, దృఢమైన విలువైన అటవీ చెట్ల దూలాలు ఓడరేవుకి నిత్యం తరలిపోతుంటాయి. రాజధానిలో అనేక కొత్త ఫ్రెంచి రెస్టారెంట్ లను కూడా చూడొచ్చు. ఎన్.జి.ఓ ల ప్రతినిధులు కార్మికుడి నెల వేతనాన్ని ఒక్క నిమిషంలో సంపాదిస్తారు.

కమ్యూనిస్టు పతాకం నీడలో సాగిన అనుపమానమైన సాంప్రదాయక రైతుల తిరుగుబాటు ద్వారా సామాజిక వ్యవస్ధను మార్చుకోవడానికి కాంబోడియన్లు ప్రయత్నించిన కల్లోల కాలం నాటి జ్ఞాపకాలేవీ పెద్దగా మిగల్లేదు. అద్వితీయమైన రోజులవి: జీన్ లూక్ గోడార్డ్ (ఫ్రెంచి సినిమా దర్శకుడు) దర్శకత్వం వహించిన ‘లా చినోయిసే’ (1968 లో విడుదలయిన ప్రఖ్యాత ఫ్రెంచి సినిమా) సినిమా ప్రదర్శితమవుతున్న రోజులు; చైనాలో పునః చైతన్యం కోసం పార్టీ బోధకులను మారుమూల వ్యవసాయ క్షేత్రాలకు పంపుతున్న ‘సాంస్కృతిక విప్లవ’ కాలం; అవినీతితో పుచ్చిపోయిన రాజధానిపై ఖ్మేర్ రోజ్ కవాతు నడుపుతున్న కాలం. మావో పంధాలో మరింత సోషలిజానికి పురోగమించడమా లేక మాస్కో మార్గంలో వెనక్కి తిరిగి తక్కువ సోషలిజం వైపుకి మళ్లడమా అన్న రీతిలో సోషలిస్టు ఉద్యమం రెండుగా చీలిన రోజులు. ఖ్మేర్ రోజ్ ప్రయోగం 1975 నుండి 1978 వరకూ కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది.

ఆశ్చర్యకరంగా కాంబోడియన్లకు ఆ కాలం నాటి చెడ్డ జ్ఞాపకాలేవీ లేవు. ఎప్పుడో ఒకసారి వెళ్ళే ఒక సందర్శకుడికి ఇది నిజంగా దిగ్భ్రమ కలిగించే ఆవిష్కరణ. ‘నిజాన్ని’ పునర్నిర్మించడానికి నేను రాలేదు. అదేమయినా సరే, కాంబోడియన్ల ఉమ్మడి జ్ఞాపకం ఏమిటో తెలుసుకోడానికీ, 20 వ శతాబ్దం చివరినాటి ఘటనలను ఎలా అర్ధం చేసుకున్నారో తెలుసుకోవడానికీ, గత కాలపు ఏ వృత్తాంతాన్ని కాలం వడకట్టిందో తెలుసుకోవడానికీ మాత్రమే నేను వెళ్ళాను. సర్వశక్తివంతమైన పశ్చిమ దేశాల కల్పిత కధనాల యంత్రాంగం తయారు చేసి వదిలిన వృత్తాంతాలు మన చేతనలో నిబిడీకృతమైపోయాయి. రక్తపిపాసులైన ఖ్మేర్ రోజ్ కమ్యూనిస్టులు వధ్య క్షేత్రాల్లో తమ ప్రజలను తామే సంహరిస్తూ ఆ వృత్తాంతాల్లో దర్శనమిస్తారు. పీడకలల్ని తెచ్చే నియంత పోల్ పాట్ దయారాహిత్యం గురించయితే ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

పుంఖాను పుంఖాలుగా ఉటంకించబడే అమెరికన్ ప్రొఫెసర్ ఆర్.జె.రమ్మెల్ ఇలా రాశాడు. “1970 జనాభా దగ్గర దగ్గర 7,100,000 ఉంటే అందులో 3,300,000 పురుషులు, స్త్రీలు, పిల్లలు హత్య చేయబడ్డారు. వీరిలో అత్యధికులు ఖ్మేర్ రోజ్ చేతుల్లోనే చచ్చిపోయారు.” ఆయన అంచనాలో ప్రతి రెండో వ్యక్తీ హత్య చేయబడ్డాడు.

అయితే, బహుళ సంఖ్యలో హత్యాకాండలు జరిగినా, 1970 నుండి కాంబోడియా జనాభా సగానికి తగ్గకపోగా రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది. హత్యాకాండలకు దిగినవారు ఉత్త అప్రయోజకులన్నా అయుండాలి లేదా వారి హత్యాకాండల గాధలు అతిశయోక్తులన్నా అయుండాలి.

కాంబోడియన్లు గుర్తుపెట్టుకున్న పోల్ పాట్ ఉగ్రశాసనుడేమీ కాకపోగా గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. దేశీయ సంస్కృతినీ, దేశీయ జీవన విధానాన్నీ అమితంగా ప్రేమించే దేశప్రేమికుడు. రాచరిక భవనాల మధ్య ఆయన పెరిగాడు. ఆయన పిన్ని లోగడి రాజుకు ఉంపుడుకత్తె. ప్యారిస్ లో చదువుకున్నప్పటికీ డబ్బు, కెరీర్ ల వెంట పరుగులెత్తకుండా ఇంటికి తిరిగొచ్చాడు. పేద రైతులను తెలుసుకోడానికి ఆయన కొన్ని సంవత్సరాలు అటవీ గిరిజనుల మధ్య గడిపాడు. పరాన్నభుక్తులయిన నగరవాసుల చేతుల్లో రోజువారీ ప్రాతిపదికన ఛిద్రమవుతున్న సాధారణ గ్రామీణుల కోసం పరితపించాడు. అధికారాయుధాన్ని చేబూనిన దోపిడీ దొంగలనుండి గ్రామాలను రక్షించుకోవడానికి సైన్యాన్ని నిర్మించాడు. సాధు హృదయుడయిన పోల్ పాట్ తనకోసం సంపదలను, ఖ్యాతినీ, అధికారాన్నీ కోరుకోలేదు. ఆయనకు ఒక గొప్ప ఆశయం ఉంది. కాంబోడియాలో విఫల పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చెయ్యడం, గ్రామీణ సంప్రదాయానికి తిరిగి మళ్లడం, అక్కడినుండి నూతన దేశాన్ని నిర్మించుకోవడం.

ఆయన స్వప్న దర్శనం సోవియట్ కంటే భిన్నమైనది. సోవియెట్లు రైతుల్ని పిండి తమ పరిశ్రమల్ని నిర్మించారు; పోల్ పాట్, గ్రామీణుల అవసరాలను తీర్చడానికి గ్రామాల్ని పునర్నిర్మించి, ఆ తర్వాతే పరిశ్రమలని నిర్మించదలిచాడు. ఆయన దృష్టిలో నగరవాసులు పనికొచ్చేదేమీ చేయలేదు. వారిలో అనేకులు వడ్డీ దోపిడీదారులతో సంబంధం ఉన్నవారే. వలసానంతర కాంబోడియాకి ప్రత్యేకమైన లక్షణం ఇది. ఇతరులు ప్రజల సంపదలను దోచే విదేశీ కంపెనీలకు సహాయక సేవకులు. బలీయమైన జాతీయవాదిగా పోల్ పాట్ కి వియత్నాం, చైనా జాతీయ మైనారిటీలపై అనుమానాలున్నాయి. కానీ ఆయన అమితంగా ద్వేషించినది మాత్రం ఆస్తులను స్వాధీనం చేసుకునే తత్వాన్నీ, పేరాశనీ, కనబడిందంతా లాక్కునే దోపిడీ తత్వాన్ని. సెయింట్ ఫ్రాన్సిస్, లియో టాల్స్ స్టాయ్ లు ఆయన్ని భేషుగ్గా అర్ధం చేసుకుని ఉండేవారు.

… …ఇంకా ఉంది

3 thoughts on “కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి 1

  1. కొన్ని పెట్టుబడిదారీ పత్రికలు వేసిన అంచనా ప్రకారమే పోల్‌పాట్ చేతిలో చనిపోయినది లక్షా డబ్బి వేల మంది. కానీ అమెరికన్ పత్రికలు మాత్రం ఆ లెక్కలని పద్దెనిమిది లక్షలుగా చూపించాయి. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా బాంబ్ దాడులకి కాంబోడియాలో ఏడు లక్షల మంది చనిపోయారు. అమెరికా బాంబ్ దాడులలో చనిపోయినవాళ్ళ శవాలనీ, పుర్రెలనీ చూపించి, ఆ పుర్రెలని మ్యూజియంలలో పెట్టి, అవి పోల్‌పాట్ చేతిలో చనిపోయినవాళ్ళ పుర్రెలని నమ్మించారు.

  2. హిట్లర్, గోబెల్స్ ఎంత చక్కగా అబద్దాలు చెప్పేవారో, అమెరికన్ మీడియా కూడా అంతే చక్కగా అబద్దాలు చెప్పగలదు. మనం ఇప్పుడు ఇంటర్నెట్ వాడడం అమెరికా పడేసిన భిక్షేనని అంటూ అమెరికా చెప్పే అబద్దాలన్నిటినీ పూర్తిగా నమ్మేస్తుంటారు. అమెరికాకీ, రష్యాకీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోన్నప్పుడు అమెరికా తన సైనిక & గూఢచర్య అవసరాల కోసం ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్‌లోకి సమాచారం పంపే పరిజ్ఞానం కనిపెట్టింది. అప్పట్లో ఇంటర్నెట్ పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఇంటర్నెట్‌కి అభివృద్ధి చేసినది యూరోప్‌వాళ్ళు. క్యూబాలోకి ఇంటర్నెట్ టెక్నాలజీ ప్రవేశించకుండా అమెరికా ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో వీళ్ళకి తెలియదు, తెలిసినా అమెరికానే ఆరాధిస్తారు. అమెరికా ఎన్ని అబద్దాలు చెప్పినా, ఆ అబద్దాలు నమ్ముతున్నట్టు నటించేవాళ్ళు ఎంత మంది ఉన్నా వియత్నాం యుద్ధ సమయంలో వియత్నాం, కాంబోడియా, లావోస్ దేశాలలో అమెరికా చేసిన హత్యా కాండల నిజాలు దాగవు. ఆ నిజాలన్నీ ఇంటర్నెట్ ఆర్కివ్స్‌లలో ఉన్నాయి. కానీ తమకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా అని గొప్పగా ఫీల్ అయిపోయేవాళ్ళు అవి చదవరు.

వ్యాఖ్యానించండి