నానా జాతుల సంస్కృతుల ప్రతిబింబాలు ఈ పెళ్ళిళ్ళు -ఫోటోలు


ఒక జాతి సంస్కృతిని ప్రతిబింబించే అంశాల్లో ముఖ్యమైనది పెళ్లి. చరిత్రలో కుటుంబ జీవనం స్ధిరపడ్డాక పెళ్లి వేడుకలకు ఎనలేని ప్రాముఖ్యత పెరిగిపోయింది. కాల క్రమంలో సంఘంలో హోదాను, ఆస్తుల గొప్పతనాన్నీ చూపుకోవడానికి పెళ్లి కూడా ఒక సాధనంగా మారినా, వివాహం యొక్క సాంస్కృతిక ప్రాధాన్యత మాత్రం పెరిగిందే గానీ తగ్గిపోలేదు.

పెళ్ళిళ్ళు ఆడంబరాలకు వేదికలుగా మారి ఖరీదు పెరిగిపోవడం ఒక విపరిణామం. దానివల్ల మెజారిటీ పేద వర్గాలకు అవి అందుబాటులో లేకుండా పోయాయి. పెళ్లి అంటేనే ఒక వేడుకగా మాత్రమే కాక భరించలేని ఖర్చుగా కూడా మారిపోయింది. ఇటీవల జరిగిన బ్రిటిష్ యువరాజు, బ్రూనే యువరాణి తదితరుల పెళ్ళిళ్ళతో పాటు హాలీవుడ్, బాలీవుడ్ తదితర వుడ్ ల పుణ్యమాని కోట్ల విలువ చేసే సెలబ్రిటీలుగా అవతరించిన ధనికుల పెళ్ళిళ్ళలో మిలియన్ల డాలర్లు ఖర్చయిపోతున్నాయి. ఈ నేపధ్యంలో సామూహిక వివాహ వేడుకలు రంగం మీదికి వచ్చాయి. సామూహిక పెళ్ళిళ్ళు ఒక్క ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాపితంగా ఒక ధోరణిగా ఉన్నదని ఈ కింద ఉన్న కొన్ని ఫోటోలు చూస్తే తెలుస్తుంది.

ఇండియా, చైనా, పెరు, మంగోలియా, జోర్డాన్, రష్యా, ఫిలిప్పైన్స్, పాకిస్ధాన్, తైవాన్, సోమాలియా, బ్రూనే, సిరియా, పాలస్తీనా, ఇజ్రాయెల్, బెలారస్, బ్రెజిల్, స్పెయిన్, బొలీవియా, ఘనా, ఇరాక్, మాసిడోనియా, రుమేనియా తదితర దేశాల వివాహ వేడుకలను ఈ ఫొటోల్లో చూడవచ్చు. చాలా దేశాల సంస్కృతులు క్రిస్టియన్ వివాహ సంస్కృతిని అనుసరించడాన్ని బట్టి క్రైస్తవ వివాహ సంస్కృతి ప్రపంచంలోని నలుమూలలకీ విస్తరించిందని గ్రహించవచ్చు.

ఈ మధ్య కాలంలో అమెరికన్లు, జర్మన్లు, బ్రిటిషర్లు ఇండియాకి వచ్చి హిందూ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం జరుగుతోంది. అమెరికాలో కూడా కొందరు అమెరికన్లు హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకుంటుంటే మరికొందరు వివిధ పార్టీలకు చీరల్లో దర్శనం ఇస్తున్నారు. ఇన్నాళ్ళు పశ్చిమానికి సాగిన సంస్కృతీ ప్రవాహం ఇపుడు తూర్పువైపుకి కూడా సాగుతోందనడానికి ఇదొక సూచన కావచ్చు. అయితే పశ్చిమ సంస్కృతీ ప్రవాహం విలువల పతనానికి దారితీస్తే, తూర్పు సంస్కృతీ ప్రవాహం సంస్కృతుల మేలి కలయికకు దారి తీయడం యాదృచ్ఛికం కాకపోవచ్చు.

 

(బోస్టన్ పత్రిక ఈ ఫొటోలను అందించింది)

వ్యాఖ్యానించండి