చదువు కోసం అడుక్కున్న ఐశ్వర్య, సమాజం బతికేఉందని నిరూపించిన దాతలు


సిస్టర్ సెలైన్ అగస్టీన్ తో ఐశ్వర్య

కడుపు చూపిస్తూ అడుక్కునే భిక్షకులు కోకొల్లలు. పిల్లల్ని భిక్షక వృత్తిలో దింపి లక్షలు, కోట్లు సంపాదించే మాఫియా ముఠాలకు కొదవలేదు. పదవులు, కాంట్రాక్టులు అడుక్కోవడం రాజకీయ నాయకులు, సూపర్ ధనికుల జన్మహక్కు. కానీ పొట్ట కోసం అడుక్కుంటున్న నాయనమ్మకి తెలియకుండా పక్కనే నిలబడి చదువుకోసం రహస్యంగా సహాయం కోరిన ఐదేళ్ల ఐశ్వర్య కధ ఎవరూ విని ఉండరు. మతి చలించి తనను వదిలి వెళ్ళిపోయిన అమ్మ కోసమేనేమో తెలియదు గానీ డాక్టరీ చదువుకోవాలన్న బలమైన కోరిక ఐశ్వర్యను చదువు కోసం చేయి చాచేలా చేసింది. సేలం రైల్వేస్టేషన్ లో కడుపు నింపుకోమని టిఫిన్ ప్యాకెట్ కొనిచ్చిన ప్రయాణీకుడు కణ్ణన్ దానాన్ని తిరస్కరించి, ధైర్యం చేసి చదువుకి సాయం చెయ్యమని కోరడంతో ఆ పాపకు దాతల దాతృత్వం వరదలా చేరుతోంది.

ఐశ్వర్యకు అమ్మా, నాన్నల ప్రేమ పొందే భాగ్యం దక్కలేదు. తండ్రి అంధుడు కాగా, తల్లి మానసిక వికలాంగురాలు. ఐశ్వర్యను వదిలి తల్లి ఎటో వెళ్లిపోయింది. భిక్షకురాలయిన నాయనమ్మ పళనియమ్మాల్ పాపను సాకుతోంది. సేలం రైల్వే స్టేషన్ లో పళనియమ్మాల్, ఐశ్వర్యల గురించి తెలియనివారు లేరు. ‘ది హిందూ’ పత్రిక ప్రకారం సేలం రైల్వే స్టేషన్ లో ఐదేళ్ల ఐశ్వర్య ముఖం అందరూ ఎరిగినదే. తన ఈడు పిల్లల్లాగా కాకుండా స్టేషన్ కి వచ్చే పాసింజర్లను, సందర్శకులను ఐశ్వర్య ‘చదువుకుంటాను, సాయం చెయ్యమ’ని కోరేది. నాయనమ్మ ప్రయాణీకులను దానం చెయ్యమని కోరుతుంటే ఆమె వెంటే ఐశ్వర్య నడిచేది. ప్రయాణీకులు డబ్బులు ఇవ్వజూపినా ఐశ్వర్య తీసుకునేది కాదట.

సేలంలోని ఎగుమతిదారు, సోషల్ వర్కర్ కూడా అయిన జి.కణ్ణన్ ముందు చేయి చాచాక ఐశ్వర్య చదువు కోరికకు రెక్కలొచ్చాయి. ఐశ్వర్య తనకు పరిచయమయిన సంఘటన గురించి కణ్ణన్ ఇలా చెప్పాడు. “బాగా రాత్రి అయింది. లేట్ నైట్ ట్రైన్ అందుకోవాలి. ఆహారం కొనుగోలు చేస్తుండగా నా పక్కనే ఐశ్వర్య, తన నాయనమ్మ కనిపించారు. మరో రెండు ప్యాకెట్లు కొని వారికిచ్చాను. వృద్ధురాలు నా సహాయాన్ని అంగీకరించింది. కానీ ఆశ్చర్యంగా పాప తిరస్కరించింది. తర్వాత పాప తనకు చదువు నేర్పగలరా అని లోగొంతుకతో రహస్యంగా అడిగింది” అని కణ్ణన్ తెలిపాడు.

ఐశ్వర్య ఏమి అడుగుతోందో అర్ధం అయ్యాక కణ్ణన్ చాలా ఆశ్చర్యపోయాడు. అకస్మాత్తుగా, అసాధారణ రీతిలో ఎదురైన పాప విన్నపాన్ని విని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఆయన వెంటనే సూరమంగళం ఎ.సి.పి టి.చంద్రశేఖరన్ కి సమాచారం ఇచ్చాడు. ఎంక్వైరీ చేశాక పాప దీన గాధ తెలిసింది. యాచకురాలయిన నాయనమ్మ సంరక్షణలో ఉన్న ఐశ్వర్యకు చదువుకోవాలన్న కోరిక బలంగా ఉన్నట్లు కూడా తెలిసింది. తమ వెంట వస్తే బడిలో చేర్చుతామని పోలీసులు కోరడంతో ఐశ్వర్య సంతోషంగా తలూపింది. పోలీసులు పాపను ‘లోటస్’ అనే అనాధ శరణాలయంలో చేర్చారు.

ఐశ్వర్య కధనాన్ని ‘ది హిందూ’ అక్టోబర్ 12 న వెలుగులోకి తెచ్చింది. ఐశ్వర్య కు సహాయం చెయ్యదలిస్తే ‘లోటస్ హోమ్’ కు పంపించాలని లోటస్ నిర్వాహకురాలు సిస్టర్ సెలైన్ అగస్టీన్ ‘ది హిందూ’ పత్రిక ద్వారా కోరింది. ఐశ్వర్య కల నెరవేరడానికి తన సహాయంగా కణ్ణన్ రు. 10,000 లోటస్ కి ఇచ్చాడు. సిస్టర్ సెలైన్ తన ఫోన్ నెంబర్ 09600416555 అని తెలియజేసింది. తన చిరునామా: Lotus Home, 885 First Plot, Rohini Garden, Alagapuram Pudur, Salem –16 గా ‘ది హిందూ’ తెలిపింది.

ఐశ్వర్య వార్త పత్రికలో వచ్చాక లోటస్ హోమ్ కి దాతల విరాళాలు విరివిగా రావడం ప్రారంభించాయి. డబ్బు, మనీ ఆర్డర్లు, డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో దాతలు లోటస్ హోమ్ పై ఇపుడు కరుణ వర్షం కురుస్తోంది. కొన్ని వందల మంది ఫోన్ కాల్స్ తో తన సెల్ ఫోన్ క్రిక్కిరిసిపోయిందని సిస్టర్ హిందూ పత్రికకు చెప్పింది. ఐశ్వర్యకు దీవెనలు పంపేవారు కొందరయితే,  తక్షణ సహాయంతో పాటు భవిషత్తుకోసం కూడా హామీలు ఇచ్చేవారు అనేకులు. ఇటు కన్యాకుమారి నుండి అటు చివర ముజఫర్ పూర్ (బీహార్) వరకూ అనేకమంది ఐశ్వర్య దీన గాధకి స్పందించి నైతిక, ధన సహాయం చేస్తున్నారు. “మనసుకు నాటుకునే ఐశ్వర్య చిరునవ్వు (infectious smile), కదిలించే ఆమె కధలకు వస్తున్న స్పందన చూస్తే సమాజం ఇంకా ఎంత మంచితనంతో నిండి ఉందో తెలియజేస్తోంది” అని సిస్టర్ సెలైన్ పత్రికకు తెలిపింది.

లోటస్ హోమ్ మేనేజర్ల ప్రకారం కణ్ణన్ చొరవ, సహాయం ఐశ్వర్య భవిష్యత్తుకు పునాదిని వేశాయి. ముజఫర్ పూర్ నుండి అభిషేక్ చౌదరి, సేలం స్టీల్ ప్లాంట్ నుండి కళ్యాణసుందరం చెరో 10,000 దానం చేశారు. ఇంకా అనేకమంది వందల, వేల రూపాయల్లో తమ దాతృత్వాన్ని వ్యక్తం చేశారు. “అనేకమంది మా హోమ్ ఖాతాకి నేరుగా డబ్బు జమ చేశారు. చాలామంది మాకసలు చెప్పకుండానే ఖాతాలో డబ్బులు వేశారు” అని హోమ్ నిర్వాహకులు తెలిపారు. కేవలం డబ్బుతోనే సహాయం పరిమితం కాలేదు. సేలం జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో పేరుపొందిన పాఠశాలల కరెస్పాండెంట్లు కొందరు ఐశ్వర్యకు చదువు చెబుతామని ముందుకొచ్చారు. ఒక మహిళా కరెస్పాండెంటు స్కూల్ వరకే కాకుండా ఆ తర్వాత కూడా చదివిస్తానని ముందుకొచ్చింది. విద్యా హాస్పిటల్స్ కి చెందిన డా.షణ్ముగం ఐశ్వర్య కల నిజం చేయడానికి ముందుకొచ్చాడు. అనేక పాఠశాలల విద్యార్ధులు తమ పాకెట్ మనీలో కొంత భాగాన్ని విరాళాలుగా సేకరించి లోటస్ హోమ్ కి పంపారు.

లోటస్ హోమ్ నిర్వాహకులను కదిలించిన సంఘటనను తప్పనిసరిగా చెప్పుకోవాలి. నమక్కల్ నుండి ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారికి ఫోన్ చేశాడు. తననులోటస్ హోమ్ లో ఉండనివ్వాలనీ, అక్కడ ఉండి జీవితంలో మిగిలిన కాలాన్నంతా ఐశ్వర్యకు చదువు చెప్పడానికి వెచ్చిస్తాననీ, అందుకు అనుమతి ఇవ్వాలనీ ఆయన విజ్ఞప్తి చేశాడు. తన నెలసరి పెన్షన్ రు.20,000 తో సహా తన రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఐశ్వర్య చదువుకోసం వెచ్చించడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ ఆయన తెలిపాడు. ఇంకా అనేకమందయితే తన వేతనాలకి తగ్గట్టుగా నెల నెలా రు.100 నుండి రు. 500 వరకూ పంపుతామని తెలియజేశారు.

భారత దేశంలో ఐశ్వర్యలకు కొదవేమీ లేదు. పేదరికం వల్ల తల్లి దండ్రుల నిరాదరణకి గురయి చిన్న చీపురు చేతబుచ్చుకుని రైల్వే కోచ్ లు శుభ్రం చేస్తూ అడుక్కునే అనాధ బాలలు ప్రయాణీకులకు నిత్యం తారసపడుతుంటారు. దాదాపు అన్నీ పట్నాల్లోనూ చిన్న పిల్లలు అనేకమంది దీనంగా చేతులు చాస్తూ కనిపిస్తున్నారు. వీరెవరికీ చదువుకోవాలన్న ధ్యాస, కోరిక లేకపోవచ్చుగానీ పూటకింత తిండిపెట్టి చదివిస్తామంటే తిరస్కరించకపోవచ్చు. స్వేచ్ఛగా బతకాలన్న సహజసిద్ధమైన కోరిక, బందిఖానాగా కనిపించే చదువును తిరస్కరిస్తుందని గ్రహించి వీరందరికీ తిండి పెట్టి చదివించడానికి దాతలు, అనాధ గృహాలు ముందుకు వస్తే ఎంతో ఉపయోగం.

పత్రికలో వచ్చిన వార్తలకు కదిలిపోయే దాతలు కంటికి ఎదురుగా కనపడే దీనులకు సహాయం చేయాలన్న ఆలోచనకు త్వరగా రాలేకపోవడం ఎలా అర్ధం చేసుకోవాలి? సుప్రీం కోర్టు తీర్పు మేరకు 25 శాతం సీట్లు పేదలకు కేటాయించడానికి అనేక ప్రవేటు పాఠశాలలు నిరాకరిస్తున్నాయి. అలా నిరాకరించకుండా సుప్రీం కోర్టు తీర్పు స్ఫూర్తిని యధాతధంగా స్వీకరిస్తే అనేకమంది పేదలు చదువులకు నోచుకుంటారు. దాతల సహాయాన్ని పక్కదారి పట్టించకుండా నిర్దేశిత లక్ష్యం కోసం తప్పక వినియోగిస్తారన్న నమ్మకం కలిగిస్తే ఇంకా అనేకులు తమ గొర్రెతోక వేతనాలను స్వల్పంగానయినా పంచుకోవడానికి సిద్ధపడతారని ఐశ్వర్య ఉదంతం చెబుతోంది.

8 thoughts on “చదువు కోసం అడుక్కున్న ఐశ్వర్య, సమాజం బతికేఉందని నిరూపించిన దాతలు

  1. “గొడ్డుపోలే”దన్న మాట ఉపయోగించకూడని మాట. మీ భావం మంచిదే అయినా భాషా ప్రయోగంలో సెన్సిబిలిటీస్ ఎప్ప్పటికఫ్ఫుడు మనం సమాజం నుండి నేర్చుకోవలసే ఉంటుంది. దయతో గుర్తించగలరు.

  2. స్పందించే గుణం మనిషిలో ఇంకా చావలేదని పదే పదే గుర్తు చేయడానికి ఇలాంటి కథనాలను మానవీయ లేదా కారుణ్య కథనాలు అనే విభాగంలో చేర్చి మీ హోమ్ పేజీలో కనిపించేలా చేయగలరు. లోకంలో సహాయం చేయాలని ఉండీ సహాయం చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారని రంగనాయకమ్మగారు జానకివిముక్తి నవల్లో సత్యం పాత్రద్వారా చెప్పించారు.

    నిన్ననే వాటికన్ సిటీలో పోప్ బెనెడిక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు కేథలిక్కు ధర్మావలంబకులకు సెయింట్ హడ్ ప్రకటించారని చదివాను. మా పత్రికలో కూడా రాశాను. కాని తనకు ‘తిండి సహాయం వద్దు చదువుకోసం సహాయం చేయండి’ అంటూ రహస్యంగా అడిగిన ఐశ్వర్య, లోకంలోని చెడ్డ గుణాలన్నింటినీ పారదోలే కారుణ్యమూర్తిగా ప్రపంచానికి స్పూర్తి నిస్తోంది. పత్రికలో వచ్చిన కథనానికి ఇంతమంది స్పందించారంటే ఆ కథనంలో ఎంత నిర్మలత్వం ఉందనుకోవాలి? రోజూ కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న రాజకీయ, ఆర్థిక, పాదయాత్రల దుర్గంధాలను పక్కనబెట్టి ఇలాంటి మానవీయ కథనాలకు పత్రికలు ప్రాముఖ్యతను ఇస్తే ఎంతమంది ఆపన్నులకు నిజమైన సహాయం అందుతుందో కదా.

    శేఖర్ గారూ, మీరు నిజంగా తెలియకుండానే ‘గొడ్డుపోలేదు’ అనేటటువంటి పదప్రయోగాలు చేస్తూండవచ్చు కాని మా పదహారేళ్ల వైవాహిక జీవితంలో కొన్ని వందలసార్లు మీకు పిల్లలు ఎంతమంది అని అడిగించుకుని ‘లేరు’ అనే జవాబు చెప్పీ చెప్పీ ఒకరకమైన ఆత్మన్యూనతా భావానికి గురైపోయాం మేం.

    లోకంలోని పిల్లలంతా మన పిల్లలే అనే ఆలోచనతో ప్రజాజీవితంలో భాగంగా పిల్లలకు దూరమైపోయాం. జనం ఎన్ని సార్లు అడిగినా నవ్వుతూ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేవాళ్లం కాని సమాజంలోకి వచ్చాక పిల్లలు లేరని చెప్పవలసి వచ్చినప్పుడు పైకి నవ్వుతూ లేరని జవాబిస్తున్నా, లోపల ఒకలాంటి నిర్వేదం పుట్టుకొస్తూంటుంది.

    గొడ్డుపోవడం… పిల్లలను కనలేనితనాన్ని ఎంత మొరటుగా, సమాజం ఇంజెక్ట్ చేయబట్టి ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఈ పదం మనల్ని ఇలా వదలకుండా వెంటాడుతూ వస్తోందో చూడండి.

    చర్చ ఐశ్వర్య జీవితం నుంచి పక్కకు పోతోందేమో… క్షమించాలి.

    కలకాలం దాచుకుని చదవాల్సిన మహత్వ గాథను ప్రచురించినందుకు కృతజ్ఞతలు.

    బ్లాగ్ లోకం నుంచి బయటకు వెళ్లి నెలపైనే అవుతోంది. మీ బ్లాగులోకి కూడా తొంగిచూస్తున్నాను కాని వ్యాఖ్యలకు దూరంగా ఉండటానికి ఇదే కారణం.

  3. రాజు గారూ, టైటిల్ మార్చాను. మీ చేదు అనుభవాలని తట్టిలేపినందుకు క్షంతవ్యుడ్ని. నిజానికి ఆ పదం రాసినపుడు పిల్లల్ని లేనివారిని అలా అంటారన్న ధ్యాసే నా మనసులో లేదు. సాధారణ వాడుక అన్నట్లుగా రాసేసాను.

    ఐశ్వర్యకి దానం చేసినవారిలో డబ్బు ఎక్కువ ఇచ్చినవారి కంటే పేరు చెప్పకుండా దానం చేసినవారే నిజమైన దాతలని నాకు అనిపించింది. ఎందుకంటే దానం చేసినపుడు ఎదుటివారికి సాయం చేద్దామన్న స్పృహ కంటే దాతృత్వాన్ని చూపుకునే స్పృహ ఎక్కువగా కనిపిస్తుంటుంది. చెప్పకుండా ఖాతాలో డబ్బు వెయ్యడం అంటే అలాంటి స్పృహ లేనట్లే కదా.

    మరొక సంగతి ఏమిటంటే వంద నుండి ఐదొందల వరకూ నెల నెలా డబ్బులు వేస్తామన్నవారిది కూడా గొప్ప గుణం అని అనిపిస్తోంది. అలా చెప్పారంటే పత్రిక హైప్ ముగిసాక కూడా పాపని కనిపెట్టి ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లే కదా. ఆ హామీని నిలుపుకోగలిగేవారయితే వారు నిస్సందేహంగా సాయం కంటే పరిష్కారాన్నే కోరుకున్నారని అర్ధమే కదా.

  4. ఇంతకుముందు ఇలాగే జరిగింది. ప్రముఖ జర్నలిస్ట్ రాము గారు తెలియక తన బ్లాగ్‌లో “స్టూవర్ట్‌పురం బేచ్” అనే ఫ్రేస్ ఉపయోగించారు. స్టూవర్ట్‌పురం గ్రామస్తులందరూ ఎరుకల కులస్తులు. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో నేరస్తజాతుల చట్టం అనే చట్టం ఒకటి ఉండేదనీ, బ్రిటిష్‌వాళ్ళు ఆ జాతులవాళ్ళని అరెస్ట్ చేసి చెరసాలల నుంచి విడుదల చేసిన తరువాత వాళ్ళకి వ్యవసాయ భూములు ఇచ్చేవాళ్ళనీ, ఆ జాతులవాళ్ళు వ్యవసాయంలో స్థిరపడి దొంగతనాలు మానేశారనీ, ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులు ఎరుకల, తెలగపాముల లాంటి కులాలవాళ్ళని అనుమానిస్తుంటారనీ ఇలా చరిత్ర అంతా చెప్పాము. స్టూవర్ట్‌పురం గ్రామస్తులు ఎరుకల కులస్తులు అని తన గురువు గారు చెప్పిన విషయం కూడా రాము గారికి గుర్తొచ్చి ఆయన స్టూవర్ట్‌పురం బేచ్ అనే ఫ్రేస్ వాడినందుకు క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవడమే మంచిది.

  5. ప్రవీణ్ గారూ, మీ సూచన ఉద్దేశ్యాన్ని ఆహ్వానిస్తున్నాను. అదే సమయంలో కొన్ని సమస్యలను కూడా చూస్తున్నాను.

    ఎవరికైనా, క్షమాపణ చెప్పే పరిస్ధితి ఎప్పటికీ రాకుండా ఉంటుందంటారా? ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనుకుని స్పందనలను, క్రియాశీలతను అణచిపెట్టుకుంటే తప్ప ప్రతి మనిషీ చాలా సందర్భాల్లో ‘ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది’ అనుకోకుండా ఉండగలరంటే నాకు ఆశ్చర్యమే.

    క్షమాపణ చెప్పె పరిస్ధితి రాకూడదు అని నిర్ణయించుకుంటే ఆ పరిస్ధితి వచ్చినపుడు కూడా మొండిగా వ్యవహరించే ప్రమాదం ఉంటుందని నా భావన. విచారం వ్యక్తం చేయడాన్ని చిన్నతనంగా చూస్తే ఇక దిద్దుబాట్లకు అవకాశం తగ్గిపోతుంది కదా!

  6. తెలిసి తప్పు చెయ్యడం వేరు, తెలియక తప్పు చెయ్యడం వేరు. ఉద్యోగం దొరక్క, వ్యవసాయ భూములు లేక పొట్టకూటి కోసం దొంగతనాలు చేసే ఎరుకలవాళ్ళతో కోట్లు సంపాదించే ఎలైట్ క్లాస్‌వాళ్ళని పోల్చాడు. సమాజం గురించి తెలిసిన జర్నలిస్టే అలాంటి పోలికలు తెస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే “క్షమాపణ చెప్పే పరిస్థితి రాకుండా చూసుకోవాలి” అని అన్నాను.

  7. ఇక్కడ ఒక విషయం గమనించాలి. దానధర్మాల వల్ల పేదరికం పోదు. అలా పోయే పరిస్థితి ఉంటే రాబర్ట్ ఓవెన్, సెయింట్ సైమన్‌ల కాలంలోనే పేదరికం పోయేది. దానం చేసేవాడు తన అదనపు విలువ నుంచి కొంత భాగమే దానం చేస్తాడు కానీ దోపిడీ ప్రయోజనాలని పూర్తిగా వదులుకోడు.

వ్యాఖ్యానించండి