అమెరికా దురాక్రమణపై పోరాటంలో తాలిబాన్ పరిమితులు గుర్తించాలి


(ఇది నాగరాజు అవ్వారిగారి వ్యాఖ్య.  తాలిబాన్ కి మద్దతు ఎందుకివ్వాలన్నదీ వివరిస్తూ నేను రాసిన ఆర్టికల్ కింద రాసిన వ్యాఖ్య. ‘తాలిబాన్ కి మద్దతు’ లాంటి పెద్ద పదాలను ఉపయోగించనవసరం లేదన్న ఆయన సూచనని నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను. తాలిబాన్ కి ఉన్న పరిమితులను గుర్తించాలన్న నాగరాజు గారి పరిశీలన వాస్తవికమైనది. తాలిబాన్ గురించి ఆయన చేసిన విశ్లేషణ సమగ్రంగా ఉన్నందున, పాఠకులకు ఉపయోగం అన్న దృష్టితో ఆయన రాసిన రెండు వ్యాఖ్యలను కలిపి టపా గా మార్చి ప్రచురిస్తున్నాను.-విశేఖర్)

ఆఫ్ఘన్ దురాక్రమణ సామ్రాజ్యవాద దురాక్రమణే. ఈ రోజు ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక రూపాలలో వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఇట్లాంటి వ్యతిరేకతలలో తాలిబాన్ పోరాటం ఒకటి. తాలిబాన్ పోరాటం అనగానే కరుడు కట్టిన ఇస్లాం మత చాందసవాదులు మాత్రమే చేస్తున్న పోరాటంగా కూడా నేను అనుకోవడం లేదు. అది వారి నాయకత్వంలో కొనసాగుతున్నప్పటికీ దానిలో భాగంగా పోరాడుతున్నది సామాన్య ఆఫ్ఘాన్ ప్రజలు.

అమెరికా చేసిన దురాక్రమణకు, మారణ కాండకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తమకు అందుబాటులో ఉన్న భావజాలంతోనూ, సంస్థతోనూ(తాలిబాన్) ఐడేంటిఫై అవడం వల్ల అక్కడ తాలిబాన్‌కు ఇంతటి బలం చేకూరింది. తాలిబాన్ స్థానంలో మరొకటి ఉండి ఉన్నా ఇదే జరిగేది. తాలిబాన్ల నాయకత్వంలో పోరాడాల్సి రావడం ఆఫ్గాన్ ప్రజలకు చరిత్ర విధించిన విషాద పరిమితి.

అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, తాలిబాన్ వంటి వాటికి సామ్రాజ్య వాదంతో పోరాడడానికి కావలసిన అవగాహన గానీ, అవసరం గానీ ఉండవు. తమ భూభాగంలోనికి మరొకరు రావడం పట్ల ఉండే వ్యతిరేకతతో మాత్రమే తాలిబాన్ అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఇది దానికున్న కారణం. ఒక్క మాటలోఆఫ్ఘాన్ పోరాటాన్ని వర్తమాన చరిత్రతో గత చరిత్రకు చెందిన సామాజికశక్తి తలపడుతున్న సంక్లిష్టమైన సందర్భంగా చెప్పుకోవాలి. ఇట్లా చరిత్రలోని సామాజిక శక్తులు పునరావృతం కావడం సామ్రాజ్వాద యుగపు ప్రత్యేక లక్షణంగా కూడా గుర్తించాల్సి ఉంటుంది.

ఆలోచిస్తే అనేక జాతుల సముదాయంగా ఉన్న ఆఫ్ఘాన్ ప్రజలందరిని కలుపుకొని పోరాడగలిగినంత భావ సామరస్యం తాలిబాన్ వంటి వాటి నుండి ఆశించడం కష్టం. ఇంకా అక్కడి ప్రజాస్వామిక వాదుల పట్ల తాలిబాన్ ఏ వైఖరిని ప్రదర్శీస్తుందన్నది కూడా ఆలోచించాల్సిన విషయం.

ఇవన్నీ తాలిబాన్లకున్న పరిమితులు. అంతర్గతంగా ఇలా ఉన్నప్పటికీ ప్రపంచానికంతటీకీ ముప్పుగా ఉన్న అమెరికా సామ్రాజ్యవాదానికి తమ పరిమితులతోనే ఎదుర్కోబూనడం ప్రస్తుత పరిస్థితులలో ఆహ్వానించదగ్గ విషయం. అయితే ఆ పోరాటానికి మద్దతునివ్వడం అనేది దాని తప్పులతో సహా కలిసి నడవడమే అవుతుంది. ఈ చర్య మావోయిస్టులతో సహా మరే ప్రజాస్వామిక వాదీ చేసినట్లుగా నాకు తెలియదు. ఆఫ్ఘాన్ ప్రజల మీద సామ్రాజ్య వాద దాడిని ఖండించడం జరిగింది. ఆఫ్ఘన్ ప్రజలు చేస్తున్న పోరాటం పట్ల తమ తమ సానుభూతిని వ్యక్తం చేయడం మాత్రమే జరిగింది. హమాస్ నాయకులను దారుణంగా చంపినపుడు ఆ దాడిని కమ్యునిస్టులు, ప్రజాస్వామిక వాదులు ఖండించారు. హమాస్ పోరాటానికి మద్దతు తెలపలేదు.

ఇక రెండవది మీరు జాతీయ వాదంతో మీరు తెచ్చిన పోలిక ఆఫ్ఘాన్‍లో జరుగుతున్న సంఘటనలలో దేని గురించి మాట్లాడాలి దేనిగురించి మాట్లాదకూడదన్న దృష్టితో రాసినది. ఈ సందర్భంగా ప్రజల మధ్య చీలికలు తెచ్చే వైఖరితో ఉండకూడదని కూడా అన్నారు. మంచిదే. కానీ ప్రజలు చీలిపోకుండా, ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాలతో సామరస్యంగా ప్రవర్తించగల ప్రజాస్వామిక వైఖరితో మెలగాల్సిన బాధ్యత తాలిబాన్ల మీద ఉంది.ఇదే తాలిబాన్లకు లోపించిందని నేను మరలా చెపుతున్నాను. మీరు జరగాల్సిన మంచి గురించి మాట్లాడుతున్నారు. నేను నాయకత్వం వహించే శక్తులకు ఉండాల్సిన లక్షణాలను గురించి మాట్లాడుతున్నాను. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ తాలిబాన్‍కు ఉండకూడని లక్షణలు ఉన్నాయి కాబట్టే మద్ధతులాంటి పెద్ద మాటలను ఆలోచించి ఉపయోగించాలని కోరుతున్నాను.

అమెరికన్ సామ్రాజ్యవాద జియో పాలిటిక్స్ లో భాగంగా సంస్కృతుల మధ్య పోరాటం అన్న భావన ముందుకొచ్చింది. ఈ భావన అమెరికా ఆయిల్ అవసరాలకు బాగా సరిపోతుంది. అది ఇస్లాంను అనాగరికమైనదిగా ప్రచారం చేస్తోంది. నిజానికి ఇస్లాం చాందసవాద శక్తుల పట్ల అమెరికా తన ప్రయోజనాల ప్రాతిపాదికగానే కొన్ని చోట్ల వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మరికొన్ని చోట్ల భుజాన వేసుకొని నడుస్తుంటుంది. ఇది అమెరికా వైఖరి.

ముస్లీం జనాభా అధికంగా ఉన్న దేశాలలో, అక్కడ అమెరికాసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాలనూ, ప్రజాస్వామిక సంస్థలనూ బలహీనపరచడానికి అమెరికా ఇస్లాం మత చాదసవాద శక్తులను బలపరిచింది. బలపరుస్తున్నది. పాలస్తీనాలో అరాఫత్ నాయకత్వంలో ఉన్న విమోచన సంస్థను బలహీన పరచడానికి హమాస్‍ను ఇజ్రాయిల్, అమెరికా పెంచి పోషించాయి. పి ఎల్ వొ అనేక రకాలుగా బలహీన పడిన తర్వాత, అక్కడ హమాస్ బలమైన శక్తిగా తయారై ఇజ్రాయిలుకు, అమెరికాకు పక్కలో బల్లెమైంది. ఇలాంటి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు. దీని బట్టి అర్థం చేసుకోవలసిన విషయం ఒకటుంది.

చాందసవాద శక్తులకు ప్రజల మద్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించి సమీకృతం చేయగల శక్తి చాలా తక్కువ. ఇది సామ్రాజ్య వాద శక్తులతో తనకున్న పరిమితులతో మాత్రమే పోరాడగలుగుతుంది. అంతేకాక భావజాల రీత్యా కూడా ఇది వర్తమాన ప్రపంచంలో బలహీనమైన శక్తి. ప్రజాస్వామిక శక్తులతో పోరాడడం కన్నా తాలిబాన్, హమాస్ లాంటి వాటితో పోరాడడం సాపేక్షికంగా సామ్రాజ్యవాదానికి తేలిక. ఇది అమెరికా తన గత పరాజయాల నుండి నేర్చుకున్న పాఠం. తాలిబాన్ వంటి పోరాటాలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడే కోణం.

అరబ్ దేశాలలో విప్లవం పేరుతో ఇటీవల జరిగిన సంఘటనలు చాలా సంక్లిష్టమైనవి. వీటి సమీకరణలు గందరగోళ పరిచే విధంగా కూడా ఉన్నాయి. ప్రజాస్వామిక పోరాటాలు అంతటా బలహీన పడిన ప్రస్తుత తరుణంలో మీడియా ఏది చెబితే అది నిజమని నమ్మే వాతావరణం కూడా ఉంది. కాబట్టి నిర్వాహకులు ఓపికతో, గందరగోళానికి తావివ్వని విధంగా ఇలాంటి విశ్లేషణలను నిర్వహించాల్సి ఉంటుంది.

2 thoughts on “అమెరికా దురాక్రమణపై పోరాటంలో తాలిబాన్ పరిమితులు గుర్తించాలి

  1. మత చాందసాన్ని భావజాలంగా గల శక్తులతో ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి అన్న ప్రశ్నకు దేశ కాలాలకు అతీతంగా పనికి వచ్చే ఎత్తుగడ అంటూ ఏదీ ఉండదు. ఈ విషయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది. వేరు వేరు ప్రాంతాల ప్రజాస్వామిక వాదులు, కమ్యునిస్టుల వైఖరులలో దీని వల్లనే తేడా ఉండడానికి కూడా వీలుంది. ఈ తేడాలను పట్టించుకోకుండా ఫలానా దేశంలో కమ్యునిస్టులు మతవాదులతో జట్టు కట్టారు చూసారా అని కూడా జనరలైజ్ చేయకూడదు. ఒక ప్రాంత చరిత్ర, మత వాద శక్తుల పాత్ర, ప్రజల పట్ల వాటి వైఖరి వంటివి కూడా ఈ విషయాలను ప్రభావితం చేస్తాయి.

    ఈ సందర్భంగా ఒక ఉదాహరణను చెబుతాను. గుజరాత్ మారణ కాండ తరువాత హిందూత్వ శక్తుల ప్రాభల్యం గురించి చెబుతూ వరవరరావు ఒక విషయాన్ని గుర్తు చేసారు. ఎమర్జెన్సీ సమయంలో ఆర్ ఎస్సెస్ ను దూరంగా ఉంచకపోవడం దేశంలోని ప్రజాస్వామిక వాదులు, కమ్యూనిస్టులు అనుసరించిన అపసవ్య వైఖరిగా ఆయన అభిప్రాయపడ్డారు.

    నిజానికి ఆరెస్సెస్ చరిత్రలో ఎమర్జెన్సీ వ్యతిరేక వైఖరి తప్ప మరే ప్రజోపయోగ కార్యక్రమమూ లేదు. ఎమర్జెన్సీ పట్ల ఈ రకమైన వ్యతిరేక వైఖరిని ఆరెస్సెస్ ప్రదర్శించడమనేది దాని స్వాభావిక లక్షణం కాదు. ఆరెస్సెస్ ఏ క్షణానయినా నియంతృత్వాన్ని కౌగిలించుకోగల భావజాలం కలిగినది. ప్రజాస్వామ్యం పట్ల దానికి ఆవగింజంతయినా గౌరవం లేదు. ఎమర్జెన్సీ సమయంలో అది ప్రదర్శించిన వ్యతిరేక వైఖరి గాంధీని హత్య చేసిన సంగతులను మరుగున పరుచుకోవడానికి, ఓట్ల ప్రజాస్వామ్యంలో తన వంతు భాగం పంచుకోవడానికి మాత్రమే ఉద్దేశించినది. ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోని అది ప్రజాస్వామిక శక్తులతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చినపుడు, ప్రజాస్వామిక శక్తులు కూడా భావజాలాలతో నిమిత్తంలేకుండా ఎంతమంది కలిసి వస్తే అంతమందినీ కలుపుకొని పని చేసాయి.

    ఆరెస్సెస్ గురించి లోతుగా ఆలోచించడానికి చరిత్ర కూడా పరిమితులను విధించింది. కానీ ఎనభైల నుండి ఆరెస్సెస్ పట్ల వైఖరిని స్పష్టపరుచుకోవడానికి వీలైంది. అనేక అద్యయనాలు, విశ్లేషణలు దాని మతతత్వ వైఖరిని, నియంతృత్వాన్ని, నాజీలను పోలిన కార్యాచరణను తేటతెల్లం చేసాయి. పెరిగిన బలంతో అది చేసిన దుర్మార్గాలు కూడా దీనికి సాక్షాలుగా నిలబడ్డాయి. ఈ నేపధ్యం నుండే వరవరరావు ఆరెస్సెస్ ఎమర్జెన్సీ వ్యతిరేక వైఖరి చరిత్ర గురించి వ్యాఖ్యానించి ఉంటాడు.

    ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించిన ఉద్దేశం పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది.

వ్యాఖ్యానించండి