అవినీతిని వదిలి ప్రజాస్వామిక చట్టాలపై ప్రధాని పోరాటం -కార్టూన్


ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రకటనలు అత్యంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి. అవినీతి నిర్మూలనకి చట్టం తెమ్మంటే అలా అడిగినవాడికి అవినీతిని అంటగడతారు. లోక్ పాల్ చట్టం తెమ్మంటే ప్రభుత్వాన్ని ప్రవేటు సంస్ధలు బ్లాక్ మెయిల్ చేయడాన్ని సహించనంటూ లక్షలాది కోట్ల అవినీతిపై పల్లెత్తు మాట మాట్లాడడు. పాలకుల, కంపెనీల అవినీతిని కొద్దో గొప్పో వెల్లడిస్తున్న సమాచార హక్కు చట్టం వల్ల ప్రవేటు వ్యక్తుల ప్రైవసీ హక్కులకి భంగం కనుక సవరిస్తానని హుంకరిస్తున్నాడు.

సమాచార హక్కు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నదనీ, సమాచార హక్కుకీ ప్రైవసీ హక్కుకీ సమతూకం ఉండాలనీ అవినీతికి మన్మోహన్ పరోక్షంగా మద్దతు పలుకుతున్నాడు. ఆ విధంగా లక్షల కోట్ల అవినీతిని విచారించి శిక్షించడానికి బదులు, దానికి ‘ప్రైవసీ హక్కు’ గా కొత్త నిర్వచనం ఇవ్వడానికి సాహసించాడు. ‘సమాచార హక్కు చట్టం’ అనే పిల్లిని ఎలుక స్ధానంలో నిలిపి చట్టాల్ని కొరుక్కుతినే అవినీతి ఎలుకని పిల్లి స్ధానంలోకి ప్రమోట్ చేస్తున్నాడు.

ప్రైవసీ పేరుతో అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం మన్మోహన్ చేస్తున్నాడు. వాద్రా, సల్మాన్ ఖుర్షీద్, వీరభద్ర సింగ్, ఇస్పాత్ స్టీల్ కంపెనీ తదితర వ్యాపారుల, కంపెనీల, మంత్రుల, రాజకీయ నాయకుల అవినీతి వెల్లడిని ప్రైవసీ హక్కు ఉల్లంఘనగా నిర్వచనం ఇస్తున్నాడు. నాలుగు లక్షల కూడంకుళం ప్రజల ప్రాధమిక హక్కులయిన ఆస్తి హక్కు, జీవన హక్కు, ప్రైవసీ హక్కును కాలరాయడం మన్మోహన్ దృష్టిలో సమర్ధనీయమే గానీ, ప్రజల సొమ్ము దోపిడీని సాక్ష్యాలతో వెల్లడిస్తే మాత్రం ప్రైవసీ హక్కు ఉల్లంఘన!?

The Hindu

“పిల్లుల వల్ల లాభం లేనట్లుంది – అయితే ఎలుకనే పునర్నిర్వచించుదాం…”

One thought on “అవినీతిని వదిలి ప్రజాస్వామిక చట్టాలపై ప్రధాని పోరాటం -కార్టూన్

వ్యాఖ్యానించండి