చైనా టెలికమ్యూనికేషన్స్ కంపెనీలతో జాతీయ భద్రతకి ప్రమాదం కలగవచ్చని అమెరికా కమిటీ ఒకటి హెచ్చరించింది. ముఖ్యంగా ప్రఖ్యాత టెలీ కంపెనీలయిన హువి, జెడ్.టి.ఇ కంపెనీల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా కాంగ్రెస్ కమిటీ హెచ్చరించింది. అమెరికా కంపెనీల స్వాధీనం, విలీనాల నుండి ఈ రెండు కంపెనీలను నిషేధించాలని సిఫారసు చేసింది. కాగా, తమ సిఫారసుకు కమిటీ చూపిన కారణం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. చైనా ప్రభుత్వంతోనూ, మిలటరీతోనూ తమకు సంబంధం లేదని రుజువు చేసుకోవడంలో విఫలం కావడమే తమ సిఫారసుకు కారణంగా కమిటీ తెలిపింది. ఇరాన్ వద్ద లేని అణుబాంబుని సాకుగా చూపి ఆర్ధిక, వాణిజ్య, రాజాకీయ ఆంక్షలు విధించినట్లుగానే జాతీయ భద్రతను సాకుగా చూపి చైనా వాణిజ్య ప్రయోజనాలకు ఎసరు పెట్టాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామం ద్వారా స్పష్టం అవుతోంది.
అమెరికన్ హౌస్ ఇంటలిజెన్స్ కమిటీ నివేదికను జెడ్.టి.ఇ కంపెనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రమాదకరమైన రాజకీయ దురుద్దేశ్యాలే అమెరికా కమిటీ నిర్ణయాలకు కారణమని హువి సంస్ధ స్పష్టం చేసింది. మున్నేన్నడూ లేని విధంగా కాంగ్రెస్ కమిటీ విచారణకు తాము సహకరించామనీ అయినప్పటికీ వాస్తవాలకు విరుద్ధమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమనీ జెడ్.టి.ఇ కంపెనీ వ్యాఖ్యానించింది. అమెరికా విధించిన సమస్త ప్రమాణాలనూ తమ కంపెనీ పరికరాలు పాటిస్తున్నాయని, వాటి వల్ల ఎటువంటి ప్రమాదమూ లేదనీ జెడ్.టి.ఇ తెలిపింది.
“టెలికమ్యూనికేషన్స్ కంపెనీలను ద్రోహపూరిత లక్ష్యాలకు వినియోగించడానికి అనువైన సాధనాలు, అవకాశం, ప్రేరణ చైనాకి ఉన్నాయి… అందుబాటులో ఉన్న బహిరంగ, రహస్య సమాచారం ప్రకారం హువి, జెడ్.టి.ఇ కంపెనీల్లో విదేశీ రాజ్య హస్తం లేదని నమ్మడానికి వీల్లేదు. కనుక అమెరికా భద్రతకూ, కంప్యూటర్ సిస్టం లకు అవి ప్రమాదకరం” అని నివేదిక పేర్కొన్నట్లుగా బి.బి.సి తెలిపింది. చైనా కంపెనీలు తమకు అసంపూర్ణమైన, పరస్పర విరుద్ధమైన సమాచారం ఇచ్చాయనీ, సమాచారం ఇవ్వకుండా ఎగవేసే విధంగా స్పందించాయనీ నివేదిక ఆరోపించింది. కమిటీ భయాలను దూరం చెయ్యడంతో సహకరించలేదని ఆరోపించింది. ప్రభుత్వ కాంట్రాక్టర్లు హువి, జెడ్.టి.ఇ కంపెనీలకు చెందిన పరికరాలను గానీ, విడి భాగాలను గానీ వాడరాదని కోరింది. అమెరికా చట్టపరమైన బాధ్యతలకు మరింత పారదర్శకంగా స్పందించేవరకూ చైనా కంపెనీలపై నిషేధం విధించాలని కోరింది.
కాంగ్రెస్ కమిటీ ఆరోపణలను చైనా ప్రభుత్వం తిరస్కరించింది. తమ కంపెనీలపై ఉన్న పూర్వాభిప్రాయాలను పక్కనబెట్టాలని చైనా విదేశాంగ శాఖ అమెరికాను కోరింది. “మార్కెట్ ఎకానమీ సూత్రాలకు అనుగుణంగా చైనా టెలికం కంపెనీలు తమ అంతర్జాతీయ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాయి” అని చైనా విదేశాంగ ప్రతినిధి హాంగ్ లీ ఒక ప్రకటనలో తెలిపాడు. “అమెరికా చైనాల ఆర్ధిక, వాణిజ్య సంబంధాల యొక్క పరస్పర ప్రయోజనకరమైన స్వభావాన్ని ఇముడ్చుకునే విధంగా అమెరికాలో ఈ కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి” అని ఆయన తెలిపాడు. “చైనా కంపెనీలు అమెరికాలో చట్టబద్ధంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి అమెరికా ఆర్ధిక వృద్ధికి, ఇరుదేశాల్లో ఉపాధి కల్పనకూ దోహదం చేస్తున్నాయి… విదేశీ పెట్టుబడులకు అమెరికా కూడా సరైన సౌకర్యాలు కల్పిస్తుందనీ చైనా సంస్ధల ఆర్ధిక కార్యకలాపాలకు సమానమైన, ధర్మబద్ధమైన ప్రాతిపదిక ఇస్తుందని ఆశిస్తున్నాము” అని చైనా ఎంబసీకి చెందిన మరో ప్రతినిధి గెంగ్ షాంగ్ వ్యాఖ్యానించాడని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది.
తమ సంస్ధపై అమెరికా కమిటీ చేసిన ఆరోపణలు చైనాలో పని చేస్తున్న అమెరికా కంపెనీలకు కూడా వర్తిస్తాయని జెడ్.టి.ఇ కంపెనీ ప్రతినిధి గుర్తు చేశాడు. “గమనించవలసిన విషయం ఏమిటంటే, సంవత్సరం పాటు పరిశోధించాక కమిటీ చేసిన నిర్ధారణ అంతా ఒకే ఒక్క అంశంపైనే కేంద్రీకృతమైంది. ‘(చైనా) ప్రభుత్వ ప్రభావం నుండి స్వేచ్ఛగా వ్యవహరిస్తుందని జెడ్.టి.ఇ ని నమ్మలేము’ అని మాత్రమే కమిటీ చెప్పింది. చైనాలో పని చేసే ఏ కంపెనీకయినా ఈ నిర్ధారణ వర్తిస్తుంది. ఏదైనా అనైతిక పద్ధతి లేదా చట్టవ్యతిరేక ప్రవర్తన ఆధారంగా అమెరికా మార్కెట్ కి సేవ చేసే అర్హత జెడ్.టి.ఇ కి లెదని కమిటీ చెప్పలేకపోయింది” అని జెడ్.టి.ఇ గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ డైరెక్టర్ డేవిడ్ దై షు అన్నాడని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
హువి సంస్ధను చైనా మాజీ మిలట్రీ ఉద్యోగి స్ధాపించాడు. 1987 లో స్ధాపించబడి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన ఈ సంస్ధకు చైనా మిలట్రీతో సంబంధాలున్నాయని అమెరికా, తదితర పశ్చిమ దేశాలు ఆరోపిస్తుంటాయి. స్వేచ్చా మార్కెట్ సూత్రాల పట్ల భక్తి ప్రపత్తులు ప్రకటించే అమెరికా, యూరప్ లు తమ కంపెనీల ప్రయోజనాలకు గట్టి పోటీ వచ్చినపుడు ఆ సూత్రాలను పూర్తిగా గాలికి వదిలేస్తాయి. తాము ప్రబోధించే మార్కెట్ ఎకానమీ ఆర్ధిక సూత్రాలను తామే ఉల్లంఘిస్తూ దానికి జాతీయ భద్రత, మానవహక్కులు లాంటివాటిని సమర్ధనగా తెచ్చుకుంటాయి. అందులో భాగంగానే అమెరికాకి చెందిన కంపెనీలను చైనా కంపెనీలు కొనుగోలు చేయకుండా అడ్డుకోవడం పెరిగిపోయింది.
అమెరికా కంప్యూటర్ కంపెనీ ‘3లీఫ్ సిస్టమ్స్’ ను గత సంవత్సరం కొనుగోలు చేయాలని హువి భావించింది. అయితే ఈ కొనుగోలును అమెరికా కమిటీ ఒకటి అడ్డుకుంది. హువి, జెడ్.టి.ఇ కంపెనీలు తమ పరికరాలను స్ధాపించి సమాచారాన్ని చైనాకు చేరవేసే ఏర్పాట్లు చేశాయని ఈ సంవత్సరం ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలేవీ ఇంతవరకూ రుజువు చేయలేకపోయారు. భద్రతకు ప్రమాదం అని ఆధారం లేని ఆరోపణలు చెయ్యడం, ఆ ఆరోపణలు నిజంకాదని మీరే నిరూపించుకోండని చెప్పడం అమెరికా కమిటీలకు ఒక అలవాటు. ఆ పేరుతో గట్టి పోటీ ఇస్తున్న విదేశీ కంపెనీల వాణిజ్య ప్రక్రియలలో జోక్యం చేసుకుని సమాచారం సేకరించే ఎత్తుగడని కూడా ఈ కమిటీల అవలంబిస్తాయని అనేక ఆరోపణలు ఉన్నాయి.
బి.బి.సి ప్రకారం తాజా ఆరోపణల వెనుక అమెరికాలో తారస్ధాయికి చేరిన ఎనికల ప్రచారం ఒక కారణంగా పని చేసింది. డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్ధుల ఎన్నికల ప్రచారాల్లో చైనా ఒక హాట్ టాపిక్ గా కొనసాగుతున్నది. కరెన్సీ విధానం, చైనా కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలు మున్నగు అంశాల్లో చైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఒబామా, మిట్ రోమ్ని లు తమ తమ ప్రచారాల్లో ఒకరికి మించి మరొకరు వాగ్దానాలు గుప్పిస్తున్నారు. ఓరెగాన్ లోని నాలుగు గాలి మరల విద్యుత్ కేంద్రాలను చైనా కంపెనీలు కొనుగోలు చెయ్యకుండా ఈ నెలలోనే అధ్యక్షుడి హోదాలో ఒబామా అడ్డుకున్నాడు. గాలి మరల విద్యుత్ కంపెనీని చైనా కొనుగోలు చేస్తే అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు వస్తుందో సమాచారం లేదు. భారత చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అడ్డుకుంటున్నారని వలపోసిన ఒబామా అమెరికాలో చైనా పెట్టుబడులను అడ్డుకోవడానికి వెనకాడకపోవడం గమనించవలసిన విషయం.