డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా ప్రభుత్వం ఏజెంటు -కేజ్రీవాల్


Photo: The Hindu

సోనియా గాంధీ అల్లుడి గిల్లుడి పై దృష్టి పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన స్వరాన్ని మరింత పెంచాడు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించకుండా స్ధిరాస్తి కంపెనీ ‘ఢిల్లీ లాండ్ అండ్ ఫైనాన్స్’ (డి.ఎల్.ఎఫ్) కి దళారీగా వ్యవహరిస్తున్నదని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. భారత దేశానికి అనధికారిక ప్రధమ కుటుంబంగా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు అభివర్ణించే సోనియా కుటుంబ అల్లుడు రాబర్ట్ వాద్రా కు అయాచిత లబ్ది చేకూర్చిన డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను ధారాదత్తం చేసిందని ఆయన ఆరోపించాడు. భారతదేశ పాలకులు దేశ వనరులను ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పే దళారులని, వారు స్వతంత్రులు కాదనీ భారత దేశంలోని విప్లవ కమ్యూనిస్టు పార్టీలు నాలుగు దశాబ్దాల క్రితమే చేసిన విశ్లేషణకు అవినీతి ఉద్యమకారుడు కేజ్రీవాల్ తాజా ఆరోపణల ద్వారా మద్దతు పలికినట్లయింది.

“హర్యానా ప్రభుత్వం డి.ఎల్.ఎఫ్ కంపెనీకి ఏజెంటుగా మారిపోయింది. అది ప్రజా ప్రభుత్వం కాదు” అని అరవింద్ కేజ్రీవాల్ పత్రికల సమావేశంలో తీవ్రంగా వ్యాఖ్యానించాడు. “పంచాయితీ భూముల్ని డి.ఎల్.ఎఫ్ కి ఇచ్చేశారు. హుడా భూమిని డి.ఎల్.ఎఫ్ కి ఇచ్చేశారు. డి.ఎల్.ఎఫ్ కోసం ఎఫ్.ఎ.ఆర్ (ఫ్లోర్ ఏరియా రేషియో) ను కూడా పెంచేశారు. భూ వినియోగ చట్టాలను కూడా డి.ఎల్.ఎఫ్ కోసం మార్చివేశారు” అని అరవింద్ కేజ్రీవాల్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. రాబర్ట్ వాద్రాకు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మంజూరు చేసిన డి.ఎల్.ఎఫ్ క్విడ్-ప్రో-కో పద్ధతిన హర్యానా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందిందని అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల క్రితం ఆరోపించాడు. తన ఆరోపణలకు మద్దతుగా మరిన్ని పత్రాలను అరవింద్ విలేఖరులకు ఈ రోజు అందజేశాడు.

డి.ఎల్.ఎఫ్ కంపెనీతో తనకు ఉన్న సంబంధాలపై హర్యానా ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశాడు. తన ఆరోపణలకు రుజువుగా కోర్టు రికార్డులతో పాటు ఇతర పత్రాలను ఆయన విలేఖరులకు పంపిణీ చేశాడు. విలేఖరుల సమావేశంలో పలువురు రైతులు కూడా పాల్గొన్నారని ‘ది హిందూ’ తెలిపింది. హర్యానా ప్రభుత్వం తమ భూములను బలవంతంగా గుంజుకుందని సమావేశంలో పాల్గొన్న రైతులు చెప్పారు. అనేక తప్పుడు పద్ధతుల్లో, దొంగ సాకులు చూపి తమ భూములను లాక్కున్నారని వారు తెలిపారు.

హర్యానా ప్రభుత్వానికీ, డి.ఎల్.ఎఫ్ కంపెనీకీ మధ్య ద్రోహపూరిత సంబంధం ఉన్నదంటూ పంజాబ్ అండ్ హర్యానా హై కోర్టు చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ విలేఖరుల దృష్టికి తెచ్చాడు. కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం రాబర్ట్ వద్రాకు మద్దతుగా ముందుకు రావడం పాటల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. “ఈ రోజు మేము సపర్పించిన ఆధారాలను బట్టి ఆదాయ పన్ను శాఖ దాడులు చేయవవలసి ఉంది. కానీ ఈ దేశ ఆర్ధిక మంత్రే స్వయంగా ముందుకు వచ్చి వాద్రాలకు మద్దతుగా గొంతు విప్పాక వాద్రాకు నోటీసు ఇవ్వడానికి ఇక ఏ అధికారికి ధైర్యం ఉంటుంది?” అని కేజ్రీవాల్ ప్రశ్నించాడు. డి.ఎల్.ఎఫ్, వాద్రా ల మధ్య ఉన్న వివాదాస్పద వ్యాపార సంబంధాలు అవినీతి నిరోధక చట్టానికి పని కల్పించేవేనని ప్రముఖ లాయర్ శాంతి భూషణ్ విలేఖరులకు తెలిపాడు.

వాద్రాకు మద్దతుగా కాంగ్రెస్ అధికార గణం అంతా దిగడం ఏమిటని కేజ్రీవాల్ ప్రశ్నించాడు. కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ మంత్రులు ఒక ప్రవేటు పౌరుడయిన వాద్రాకు మద్దతుగా రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. “కాంగ్రెస్ కీ వాద్రాకి మధ్య సంబంధం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాద్రాకీ, ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించాడు. “ఆర్ధిక మంత్రి ఆయనను ఎందుకు సమర్ధిస్తున్నాడు? న్యాయ శాఖ మంత్రి ఎందుకు సమర్ధిస్తున్నాడు? మంత్రులంతా ఆయనని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు” అని కేజ్రీవాల్ ప్రశ్నించాడు.

ప్రవేటు కంపెనీలు, వ్యక్తులకు మధ్య వ్యవహారాలని ప్రశ్నించవలసిన అవసరం ప్రభుత్వానికి లేదని మొదట వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ప్రముఖులు, ప్రతినిధులు కొద్ది గంటల్లోనే రూటు మార్చారు. వాద్రాపై దాడి అంటే ఆయన అత్తగారు, కాంగ్రెస్ నాయకురాలూ అయిన సోనియా గాంధీ పై దాడేననీ, సోనియాపై దాడి కాంగ్రెస్ పార్టీపై దాడేననీ కనుక వాద్రాకు మద్దతుగా కాంగ్రెస్, ప్రభుత్వమూ రంగంలోకీ దిగాలనీ భావించినందునే మంత్రులు, కాంగ్రెస్ నాయకులూ ప్రవాహంలా ముందుకొచ్చి వాద్రాకు రక్షణగా నిలిచారనీ ‘ది హిందూ’ పత్రిక వ్యాఖ్యానించింది. వాద్రా వ్యాపారాలను సమర్ధిస్తూ ప్రకటనలు ప్రకటనలు గుప్పించిన మంత్రులుగానీ, కాంగ్రెస్ నాయకులుగానీ అరవింద్ కేజ్తీవాల్ ఆరోపణలకు సరైన సమాధానం మాత్రం ఇవ్వలేకపోయారు. హర్యానా నుండి ఎటువంటి లబ్ది లేకుండా డి.ఎల్.ఎఫ్ తేలికపాటి రుణాలను వద్రాకు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటో వారు వివరించలేదు.

కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఈ విధంగా ఉంటే అరవింద్ ఆరోపణలపై బి.జె.పి సైతం స్పందించకపోవడం మరొక విచిత్రం. కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి, అవినీతి ఉద్యమకారుడు అందించిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి బి.జె.పి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. వాద్రా ఆస్తులపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని బి.జె.పి ప్రతినిధులు లో గొంతుకతో వ్యాఖ్యానించినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఆ మాత్రం వ్యాఖ్యానాన్ని కూడా పూర్వపక్షం చేసేశాడు. వాద్రా పై ఆరోపణల్లో అసలు సాక్ష్యాలే లేవని నితిన్ వ్యాఖ్యానించడంతో బి.జె.పి ఉద్దేశ్యాలపై అనుమానాలు బయలుదేరాయి. ఒక పక్క సాక్ష్యం లేదంటూనే వాద్రా పత్రాలను తాను చూశానని ఆయన అంగీకరించాడాన్ని పత్రికలు ఎత్తిచూపుతున్నాయి.

మహారాష్ట్రలో 70,000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల అవినీతిలో ఒక కాంట్రాక్టర్ కు మద్దతుగా నితిన్ రాసిన లేఖ వెల్లడి కావడంతో బి.జె.పి అధ్యక్షుడు వాద్రా అవినీతిపై స్పందించడం లేదని పత్రికలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. అద్దాల గడిలోనుండి రాళ్ళు విసరడానికి గడ్కారీకి ధైర్యం లేదని పత్రికలు చెణుకులు విసురుతున్నాయి. కాంగ్రెస్ బొగ్గు కుంభకోణంపై పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసిన బి.జె.పి తమ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బొగ్గు కుంభకోణంలో ఉన్నట్లు వెల్లడి కావడంతో మేకపోతు గంభీరంతో ఎలాగో నెట్టుకొచ్చింది. ఎన్.డి.ఎ హయాంలో వాజ్ పేయి అల్లుడి అనూహ్య ఎదుగుదల పట్ల కాంగ్రెస్ మౌనం వహించినందుకు ప్రతిఫలంగానే బి.జె.పి వాద్రా ఎదుగుదలపై మౌనం వహిస్తూ కృతజ్ఞత ప్రకటిస్తున్నదని ‘ది హిందూ’ ఎడిటోరియల్ చేసిన వ్యాఖ్యానం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా ప్రభుత్వం ఏజంటని అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణ ఆషామాషీ ఆరోపణ కాదు. అరవై కోట్ల బోఫోర్స్ కుంభకోణం దగ్గర్నుండి లక్షల కోట్ల 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం ల వరకూ ప్రభుత్వాల పాత్ర ఏజెంటు గిరీ కే పరిమితం అయిందన్న వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. పత్రికల్లో వచ్చిన ఈ కుంభకోణాలు కేవలం కొద్ది సంఖ్యలోనివే. పాలకవర్గాల మధ్య వాటా పంపిణీలలో సమస్యలు తలెత్తడం వలన వెల్లడి అయిన ఈ కొద్ది కుంభకోణాలు వాస్తవానికి ‘టిప్ ఆఫ్ ది ఐస్ బెర్గ్’ తో సమానం.

అరవై యేళ్ళ సోకాల్డ్ స్వతంత్ర ప్రజాస్వామ్యంలో భారత పాలకుల విధానాలన్నీ ఈ కోవలోనివేనని ప్రతి ఒక్కరూ గుర్తించవచ్చు. కేంద్ర, రాష్ట్రాల విధానాలు, ఆర్ధిక నిర్ణయాలు ప్రధానంగా ప్రవేటు భూస్వాముల, పెట్టుబడిదారుల ఆర్ధిక ప్రయోజనాలకు దోచి పెట్టడానికి ఉద్దేశించినవే తప్ప ప్రజల కోసం కాదు. దేశీయ వనరులను దేశ ప్రజలకు ఉపయోగపెట్టే బదులు స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పడానికే ప్రభుత్వ విధానాలనీ, ఈ విధానాలను ప్రశ్నించినవారికి నక్సలైట్లనో, ఉగ్రవాదులనో ముద్ర వేసి దాటవేయడానికి, అణచివేయడానీకీ పాలకులు పరిమితం అయ్యారనీ నాలుగు దశాబ్దాలుగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలు చెబుతూ వచ్చాయి. మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటన ఈ వాస్తవాన్నే ప్రతిబింబించడం కాకతాళీయం మాత్రం కాదు.

2 thoughts on “డి.ఎల్.ఎఫ్ కంపెనీకి హర్యానా ప్రభుత్వం ఏజెంటు -కేజ్రీవాల్

  1. ఇప్పటివరకు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేవలం రాజకీయ నాయకుల అవినీతిని, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తూ కార్పొరేట్ కంపనీలు చేస్తున్న అవినీతిపై మాట్లాడని కేజ్రీవాల్ తదితరులు ఇప్పటికైనా ఈ అవినీతి విషయాలపై కూడా మాట్లాడితే బాగుంటుంది.
    డిఎల్ ఎఫ్ కంపనీ వాద్రాకు వడ్డీలేని రూ. 65 కోట్ల రుణం ఎందుకు ఇచ్చింది? రుణం తీసుకున్న అతనికే రూ 30 కోట్ల విలువైన ఆస్థులను రూ 5 కోట్లకే ఎందుకు అమ్మిందో అని ఆ కంపనీని ఎందుకు ప్రశ్నించకూడదు? నష్టాలలో ఉన్న జగన్ కంపెనీ రూ 10 శేర్లను రూ 350కి ఎందుకు కోన్నరో అన్న విషయాన్ని ప్రశ్నించాలి. డిబి గ్రూప్ కంపనీ ఎలాంటి హామీ లేకుండానే కరుణానిధి కుమార్తు కనీమొళికి రూ 200కోట్ల వడ్డీలేని రుణం ఎందుకు ఇచ్చింది. అధినేత్రుల అల్లుళ్లు, ముఖ్యమంత్రుల కూతుళ్లు, కొడుకులకే వందల కోట్ల మొత్తాలు ఉత్తి పుణ్యానికే ఇస్తున్నాయంటే ఎలా నమ్మాలి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s