భారతదేశ ప్రతిష్ట, ఆత్మగౌరవాలు దేశంలోని కోట్లాది శ్రమజీవుల్లో ఉన్నాయి తప్ప డాలర్ల కోసం దేశ సరిహద్దులు దాటడానికి అవలీలగా సిద్ధపడేవారిలోనో, తెల్లరాజ్యాల పౌరసత్వం కోసం అర్రులుచాచే బుద్ధి జీవుల్లోనో లేదని దళిత మహిళలు అక్కు, లీల లు చాటి చెబుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల పౌరసత్వం సంపాదిస్తేనే ప్రపంచాన్ని జయించినంత సంబరపడే కొద్ది బుద్ధుల అల్పజీవులు, దశాబ్దాల బెత్తెడు వేతన జీవనంలోనూ నిలువెత్తు ఆత్మ గౌరవాన్నీ త్యజించలేని అక్కు, లీలలను చూసి నిష్కళంక హృదయాలతో సిగ్గుపడవచ్చు. లేదంటే తమ సంస్ధలోని తోటి ఉద్యోగుల సహాయాన్నీ, మానవ హక్కుల సంస్ధ ఇవ్వజూపిన సహాయాన్నీ, దేశ దేశాలనుండి ఉప్పొంగిన సానుభూతి సహాయాన్నీ అన్నింటినీ గడ్డిపోచ లెక్కన తిరస్కరించడం ఎవరికైనా ఎలా సాధ్యం?
అక్కు, లీల లపై కర్ణాటక ప్రభుత్వ దురాగతాన్ని ‘ది హిందూ’ పత్రిక మూడు రోజుల క్రితం వెలుగులోకి తెచ్చినపుడు అనేకమంది దాతలు మహిళలకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తామంటూ ముందుకు వచ్చారు. మహిళల చిరునామా గానీ, బ్యాంకు ఖాతా నెంబర్ గాని పత్రిక ప్రచురించినట్లయితే నేరుగా వారికే డబ్బులు పంపడమో, వారి ఖాతాల్లో జమ చేయడమో చేస్తామని చెబుతూ పలువురు వ్యాఖ్యలు రాశారు. మహిళల తరపున పోరాడుతున్న ‘హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫౌండేషన్’ (హెచ్.ఆర్.పి.ఎఫ్) నాయకుడు షాన్ బాగ్ కి డబ్బు పంపమన్నా పంపుతామని పలువురు తెలియజేశారు. భారతదేశం నుండే కాక ఇతర దేశాలనుండి కూడా అనేకమంది స్పందించి దళిత మహిళలకు తమ సానుభూతి, మద్దతు ప్రకటించారు. అక్కు, లీల వ్యధార్ధ గాధను ప్రచురించాక ఈ బ్లాగ్ లో కూడా ఒక మిత్రుడు అదే విధంగా స్పందించారు.
అయితే ఈ ఉదార సహాయాన్ని స్వీకరించడానికి అక్కు, లీలలు తిరస్కరించారని ‘ది హిందూ’ ఈ రోజు తెలియజేసింది. తమకు ఇవ్వవలసింది ఇస్తే చాలుననీ, దానం అవసరం లేదనీ దళిత మహిళలిద్దరూ స్పష్టం చేశారని తెలిపింది. “మేము కోరుతున్నదంతా, మాకు చెల్లించవలసింది చెల్లించాలనే. 42 సంవత్సరాల మా కష్టానికి ఎంత వస్తుందో అంత ఇస్తే చాలు” అని అక్కు చెప్పిందని పత్రిక తెలిపింది.
ఉడుపిలోని మహిళా టీచర్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో అక్కు స్వీపర్ గా 1971 లో చేరింది. ఆమె తల్లి చనిపోవడంతో ఆమె స్ధానంలో స్వీపర్ ఉద్యోగంలో చేరింది. ఒక సంవత్సరం తర్వాత నాయనమ్మ స్ధానంలో లీల కూడా అదే సంస్ధలో స్వీపర్ గా చేరింది. వీరిద్దరి నియామకాన్ని దక్షిణ కన్నడ జిల్లా ‘పబ్లిక్ ఇనస్ట్రక్షన్’ విభాగపు డిప్యూటీ డైరెక్టర్ 1972లో స్వయంగా ఆమోదించాడు. వారి మూల వేతనాన్ని (బేసిక్) 15/- గా ప్రభుత్వం నిర్ధారించింది. “మా సర్వీసులని క్రమబద్ధీకరిస్తామని, ప్రభుత్వ నియమ నిబంధనల (కనీస వేతనాల చట్టం) ప్రకారం వేతనాలు పెంచుతామనీ మాకు హామీ ఇచ్చారు. కానీ సంవత్సరాల తరబడి అదే జీతం కొనసాగింది. 2001 లో న్యాయం చేయాలని ‘కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్’ (కె.ఎ.టి) కి వెళ్లడంతో ఆ జీతం కూడా ఇవ్వడం మానేశారు. మాకు రావలసిన బెనిఫిట్స్ ప్రభుత్వం చెల్లిస్తుందన్న ఆశతో అప్పటినుండి ఇప్పటివరకూ పని చేస్తూనే ఉన్నాము” అని అక్కు ‘ది హిందూ’ కి తెలియజేసింది.
నిజానికి మహిళలకు సహాయం చేస్తామని ముందుకు రావడం ఇపుడు కొత్తేమీ కాదు. వారు పని చేసే సంస్ధలోని ఉద్యోగులే వారికి ప్రతి నెలా సాయం చెయ్యడానికి గతంలోనే ముందుకు వచ్చారు. వారి సహాయాన్ని కూడా అక్కు, లీలలు తిరస్కరించాని ‘ది హిందూ’ తెలిపింది. “సంస్ధలోని కొందరు ఉపాధ్యాయులు వారికి కొంత డబ్బు ఇవ్వడానికి కొన్ని సంవత్సరాల క్రితం ముందుకు వచ్చారు. కానీ వారు తీసుకోవడానికి నిరాకరించారు. ఆ ఉపాధ్యాయుల ఇళ్ళల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసేపని వారికి అప్పగించాకనే వారి డబ్బు తీసుకోవడానికి అంగీకరించారు. వారి పోరాటానికి మద్దతు ఇస్తూనే, వారి ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండడానికి హెచ్.ఆర్.పి.ఎఫ్ జాగ్రత్త తీసుకుంది” అని మానవహక్కుల సంస్ధ నాయకుడు రవీంద్రనాధ్ షాన్ బాగ్ తెలిపాడు.
హెచ్.ఆర్.పి.ఎఫ్ జోక్యంతో అక్కు, లీలల పరిస్ధితి లోకానికి తెలిసినప్పటికీ వారి పోరాటం మాత్రం హెచ్.ఆర్.పి.ఎఫ్ తోనే మొదలుకాలేదు. రవీంద్రనాధ్ ఆ విషయమే చెబుతూ తాము కూడా సాయం చేయాలని ప్రయత్నించినప్పటికీ మహిళలు తిరస్కరించారని తెలిపాడు. “వారి పోరాటంలో హెచ్.ఆర్.పి.ఎఫ్ 1998 లో మాత్రమే చేరింది. 2001 లో వారి 15/- వేతనం కూడా ఆపేసినపుడు వారికి ఆర్ధిక, న్యాయ సహాయం ఇవ్వజూపాము. ఆర్ధిక సహాయం స్వీకరించడానికి వారు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. న్యాయ సహాయం స్వీకరించడానికి మాత్రమే అంగీకరించారు. అది కూడా కోర్టుల్లో వారి న్యాయ పోరాటం కోసం మా ఫౌండేషన్ ఖర్చు పెట్టినదంతా అణా పైసలతో తిరిగి తీసుకుంటామన్న షరతుమీదనే అంగీకరించారు” అని అక్కు, లీలల తిరుగులేని ఆత్మగౌరవం ఎంతటి ఉన్నతస్ధాయిదో రవీద్రనాధ్ వివరించాడు.
1971 నుండి 2001 వరకు నోరుమూసుకుని పని చేసినందుకు ప్రతిఫలంగా 15/- వేతనాన్ని దయతో కొనసాగించిన రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సింది ఇవ్వండని నోరు తెరిచి అడగడంతో 2001 నుండి అది కూడా ఇవ్వడం మానేసింది. చట్టం ప్రకారం అక్కు, లీలలకు బాకీతో సహా చెల్లించాలన్న కె.ఎ.టి నిర్ణయాన్ని తిరస్కరించి, ప్రభుత్వం హై కోర్టుకి వెళ్లింది. హై కోర్టులో కూడా చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకి వెళ్లడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనకాడలేదు. సుప్రీం కోర్టు కూడా మహిళలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఆ తీర్పు అమలుకాలేదు. తీరా ఇప్పుడేమో మహిళలు రిటర్ మెంట్ వయసుకి చేరారు గనక ఉద్యోగం ఇవ్వలేమని ప్రభుత్వం సుప్రీం కోర్టుకి చెబుతోంది. ‘స్పెషల్ లీవ్ పిటిషన్’ దాఖలు చేసి మహిళలకు వేతనం ఎగవేయడానికి ప్రయత్నిస్తోంది.
కె.ఎ.టి, హై కోర్టు, సుప్రీం కోర్టు అన్నీ అయ్యాక కూడా 42 సంవత్సరాలు పని చేసిన ఇద్దరు దళిత మహిళలకు న్యాయం దక్కలేదు. దళసరి చర్మాల నిరంకుశ బ్యూరోక్రాట్ అధికారుల వల్లనే ఈ ఘోరం జరిగిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటి దళసరి చర్మాలకు ప్రభుత్వంలో నాలుగు దశాబ్దాలపాటు నిర్విఘ్నంగా అధికార స్ధానాలు దక్కడమే అసలు సంగతి. ఒళ్ళువంచి 21 మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ వచ్చిన మహిళలకు ఇప్పటికీ న్యాయం దక్కకపోవడమే భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క మేడిపండు గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తున్నది. పత్రికల్లో వచ్చాక కూడా కర్ణాటక విద్యామంత్రి స్పందించిన తీరు అర్ధవంతంగా లేదు. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు చెప్పామని ఆయన అన్నాడు. “ఇది పాత కేసే. నివేదికను పరిశీలించాక మహిళలకు న్యాయం జరిగేలా చూస్తాను.” అని కర్ణాటక విద్యాశాఖ మంత్రి విశ్వేశ్వర్ హెగ్డే అన్నాడని పత్రికలు తెలిపాయి. పాత కేసే గనక కొత్తగా స్పందించేదేమిటని మంత్రిగారి ప్రశ్న కావచ్చు. అయితే నలభైయేళ్లపాటు ఈ దురన్యాయం ఎలా కొనసాగిందన్న ప్రశ్నకు మంత్రి, ఆయన ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాలి.
వ్యక్తిత్వ విలువలు స్పష్టంగా వ్యక్తం అయ్యేది కష్ట సమయాల్లోనే. వ్యక్తిత్వాలు బలహీనపడడానికీ, రాజీ పడడానికీ కష్టాల సుడిగుండాలే వ్యక్తులను ప్రోత్సహిస్తాయి. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చని తత్వాన్ని బోధించి మనుషులను బలహీనులను చేస్తాయి. 42 సంవత్సరాల కష్టాల జీవితం గడిపిన అక్కు, లీలల జీవితాల్లోని ప్రతి రోజూ కూడా ఫైనల్ పరీక్ష లాంటిదన్న సంగతి గుర్తిస్తే వారి ఆదర్శ వ్యక్తిత్వం యొక్క విలువ అర్ధం చేసుకోవచ్చు.
దొపిడీ వర్గ ప్రభుత్వాల తీరే అంత. చంద్రబాబు నాయుడు హయాంలొ కరువుతొ ప్రజలు అల్లాడుటుంటె ఎషియన్ గేమ్‌స్ అంటూ వందలకొట్లు కర్చుచేసింది. దేవుడి ప్రేరుతొ ఉత్సవాలంటూ కొట్లలొ కర్చుచేయగలదు ఒక పక్క మలమల మాడిచస్తూవున్నా!! తెలుగు మహా సభలంటూ 25 కొట్లు కర్చుచేస్తుంది ఆ మహాసభలవల్ల తెలుగు కు ఎలాంటి ప్రయొజనం చేకూరదు దాని వల్ల కొంతమంది లాభపడటం తప్ప. ఒక పక్క వెట్టి చాకిరీ చేయించుకుంటూ, మరొపక్క పారాన్న జీవులను మేపుతుంది.
దురదృష్టవశాత్తూ శ్రమను గుర్తించని, గౌరవించని సమాజం మనది. శ్రమపడేవాన్ని, కష్టాల్లో ఉన్నాడనుకుని సానూభూతి చూపుతాం. ఎటువంటి శ్రమచేయకుండా…ఊరికే కూచొని తినడమే అదృష్టంగా భావించే భావజాలం మన సంస్కృతిలో ఉంది. ఇటువంటి ఘన చరిత్రకు వారసులమైన మనం, ముఖ్యంగా మన పాలకులు శ్రమజీవుల చెమట విలువను గుర్తించరు. గౌరవించరు.
వీరికి వ్యతిరేకంగా కోర్టు వ్యవహారాలకోసమైనా ఖర్చు చేస్తారు కానీ….కనీస కూలీ ఇవ్వడానికి మాత్రం అంగీకరించరు. ఎందుకంటే మన పాలకులది దళసరి త్వచం కదా…
మరుగుదొడ్లు కడిగే పనికి రూ.15 రూపాయల వేతనమేమిటీ? దాన్ని కూడా ఆపేసి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళటమేమిటీ?
కష్టజీవుల మీద ఎందుకింత పంతం? కోర్టు తీర్పు తర్వాతయినా జరిగిందానికి లెంపలు వేసుకుని వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇవ్వకుండా మళ్ళీ ‘స్పెషల్ లీవ్ పిటిషన్’ దాఖలు చేయటమా? ‘ఇది పాత కేసే’ అని మంత్రి తేలిగ్గా తీసెయ్యటం కాదు; ఆ కేసు పరిష్కారం కాకుండా ఇంకా పాతగానే ఎందుకుందో, ఇన్నేళ్ళుగా ఎందుకు కొనసాగుతోందో ఆలోచించొద్దూ? జవాబు చెప్పొద్దూ?
సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం చేయటం, కుంగదీసే లేమిలో కూడా సాయాన్ని తిరస్కరించటం సాధారణ విషయం కాదు. అక్కు, లీలల స్వాభిమానం అనుపమానం! మహోన్నతం!
ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు మాత్రం pay revision committee వేసి జీతాలు వెంటనే పెంచేస్తారు కదా.