అమెరికా నిరుద్యోగం నిజంగానే తగ్గిందా?


Photo: The Guardian

సెప్టెంబర్ లో అమెరికా నిరుద్యోగం 8.1 శాతం నుండి 7.8 శాతానికి తగ్గిందని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బి.ఎల్.ఎస్) రెండు రోజుల క్రితం ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని బి.ఎల్.ఎస్ ప్రకటించడంతోటే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు సంతోషాన్ని ప్రకటించాయి. అమెరికా నిరుద్యోగం తగ్గినందుకు ఆశ్చర్యానందాలని ప్రకటించాయి. స్టాక్ మార్కెట్ల లాభాల్ని కూడా ఉపాధి నివేదికకి ఆపాదించి సంతృప్తి చెందాయి. అనుకోకుండా శుభవార్త విన్నామని శీర్షికలు పెట్టి మంచి రోజులు రానున్నాయని అమెరికా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించాయి. అయితే నిరుద్యోగం నిజంగానే తగ్గిందా అన్న ప్రశ్నలు కూడా బయలుదేరాయి. కేవలం నిరుద్యోగం తగ్గిందన్న వార్తనే హైలైట్ చేసి బి.ఎల్.ఎస్ నివేదికలోని ఇతర అంశాలకు చెప్పకుండా ఉండడం ద్వారా అసలు చిత్రాన్ని పత్రికలు మరుగుపరిచే ప్రయత్నం చేశాయని విమర్శలు వినవస్తున్నాయి.

నిరుద్యోగ శాతం తగ్గిందని చెప్పడమే కాకుండా బి.ఎల్.ఎస్ నివేదిక ఉపాధికి సంబంధించిన ఇతర ముఖ్యమైన విషయాలని కూడా తెలియజేసింది. కార్పొరేట్ పత్రికలు ఈ అంశాలేవీ తమకు తెలియనట్లు నటిస్తున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అమెరికా ట్రెజరీ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ, వాల్ స్ట్రీట్ జర్నల్ లో మాజీ కాలమిస్టు కూడా అయిన డా. పాల్ క్రెగ్ రాబర్ట్స్ ప్రకారం బి.ఎల్.ఎస్ నివేదిక సెప్టెంబర్ నెలలో 25 లక్షల మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకోలేదని తెలిపింది. వరుసగా నాలుగు వారాలపాటు ఉపాధి వెతుకులాటను విరమించుకోవడంతో వారు లెక్కలోకి రాలేదు. అంటే 25 లక్షల మంది నిరుద్యోగులను, నిరుద్యోగులుగా లెక్కించకుండానే బి.ఎల్.ఎస్ నిరోద్యోగ లెక్కలని ప్రకటించింది.

ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో అనైచ్ఛిక (involuntary) పార్ట్-టైమ్ ఉపాధి 6 లక్షలు పైగా పెరిగిందన్న విషయం గుర్తించినట్లయితే అమెరికాలో వాస్తవ నిరుద్యోగ పరిస్ధితి బి.ఎల్.ఎస్ ప్రకటించిన దానికంటే మరింత దయనీయమని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బి.ఎల్.ఎస్ ప్రకారం “వీళ్ళు పార్ట్-టైం పని చేసుకుని బతుకుతున్నారు. ఎందుకంటే వీరి ఉపాధిలో కోత పెట్టారు. లేదా పూర్తి కాలం ఉద్యోగం వారికి దొరకలేదు.”

కొత్త ఉద్యోగాలు చెబుతున్న 1.14 లక్షల ఉద్యోగాల్లో అధిక భాగం దేశీయ సేవల రంగంలోనివి. చాలా తక్కువ వేతనాల్లో కూడుకున్నవి. విదేశాలకు తరలించలేని ఉద్యోగాలు కావడం వల్లనే ఈ కాస్త ఉద్యోగాలయినా దక్కాయని పాల్ లాంటివారు చెబుతున్నారు. ఒక దశాబ్దంపాటుగా జరుగుతున్నట్లుగానే పూర్తికాలం ఉద్యోగాలు రద్దు చేసి కార్మిక చట్టాలు వర్తించని పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆధారపడుతూ లాభాలు మిగుల్చుకోవడంపై కంపెనీలు కేంద్రీకరించాయని విశ్లేషకులు చెబుతుండగా, సెప్టెంబర్ 2012 ఉపాధి నివేదికకూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. 1.14 లక్షల ఉద్యోగాల్లో అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగాలు, ఇతర హెల్త్ కేర్ ఉద్యోగాలు, బార్ టెండర్ల ఉద్యోగాలే 53 శాతం ఉన్నాయి.

రెస్టారెంట్లలోనూ, బార్లలోనూ పెరుగుతూ పోతున్న ఉద్యోగాలను వదలకుండా లేక్కీంచే బి.ఎల్.ఎస్ ప్రభుత్వాలు ఇచ్చే ఫుడ్ స్టాంప్ పై ఆధారపడి బతుకుతున్న నిరుద్యోగులను పట్టించుకోదన్న విమర్శ ఉంది. బార్లు, రెస్టారెంట్లలో బి.ఎల్.ఎస్ లెక్కిస్తున్న ఉద్యోగాల సంఖ్యపై కూడా పలు అనుమానాలున్నాయి. బి.ఎల్.ఎస్ నివేదిక ప్రకారం మిగిలిన 47 శాతం ఉద్యోగాలు రిటైల్ వ్యాపారం, రవాణా, వేర్ హౌసింగ్, ద్రవ్య కార్యకలాపాలు, వ్యాపార సేవలు, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా సేవలు తదితర రంగాల్లో వచ్చినవి. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు తరగతి గదుల్లో విద్యార్ధుల సంఖ్యను బాగా పెంచి, పదులు వేల సంఖ్యలో ఉపాధ్యాయులను ఉద్యోగాలనుండి తొలగించిన నేపధ్యంలో బి.ఎల్.ఎస్ ప్రకటించిన కొత్త ఉపాధ్యాయ ఉద్యోగాలు అనుమానాస్పదమే. ఉద్యోగులను తొలగించి మరింత తక్కువ వేతనాలతో కొత్త ఉద్యోగులను నియమించుకోవడం అమెరికాలోని అన్నీ రంగాల్లో ఒక విధానంగా అమలవుతోంది.  ఫలితంగా సంక్షోభంలో సైతం కంపెనీల లాభాలు యధావిధిగా కొనసాగుతుండగా వేతన జీవుల వేతనాలు కుదించుకుపోయి జీవనస్ధాయిలో కూడా కోతలను ఎదుర్కొంటున్నారు.

ఒక పక్క ఉపాధి పడిపోతుండగా మరోవైపు ధరల భారం మరింతగా పెరుగుతోంది. ఆగస్టు నెలలో వినియోగదారి ధరల సూచిక 0.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ధరల సూచీ ఈ స్ధాయిలో పెరగడం  జూన్ 2009 నుండి ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఆగస్టు ధరల పెరుగుదల వార్షిక స్ధాయిలో పరిగణించినట్లయితే అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా ఊర్ధ్వముఖంలో ఉన్నట్లేనని ఆర్ధికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

వ్యాఖ్యానించండి