తెలంగాణ ఎక్కడ? -కార్టూన్


“తెలంగాణా! అదెక్కడుంది?” కేంద్ర సచివుడు వయలార్ రవి కొద్ది రోజుల క్రితం వేసిన ప్రశ్న ఇది. కేంద్రంలో తిష్టవేసి, ఆంధ్ర దొరల డబ్బు కట్టలు మేస్తూ తెలంగాణ ప్రజల రాష్ట్ర ఆకాంక్షలను చెద పురుగుల్లా కొరికేస్తున్న అవినీతి కీటకాలు ఇలాంటి గుడ్డితనాన్ని ఇప్పటికి చాలా సార్లు ప్రదర్శించాయి. వీరి అంధత్వాన్ని గేలి చేస్తూ తెలంగాణ ప్రజలు పదే పదే ఆందోళనలు నిర్వహించి తెలంగాణ ఎక్కడుందో చాచికొట్టినట్లు చెప్పినా కళ్ళు తెరవడానికి వీరు నిరాకరిస్తున్నారు. పోలీసులు, పారా మిలటరీ బలగాలతో పాటు రైల్వేశాఖ, ఆర్టీసీ విభాగాల సహాయంతో తెలంగాణ ప్రజలను ‘సాగర హారం’ లో కలవనీయకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పిచ్చిపట్టినట్లు ప్రవర్తించినా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినా వేలాది తెలంగాణీయులు రాజధానికి చేరుకుని ‘తెలంగాణ’ ఎక్కడుందో చెప్పారు.

ప్రవాస మంత్రి వయలార్ రవి లాంటి అంధులు ఇప్పటికైనా ‘తెలంగాణ’ ఎక్కడుందో తెలుసుకున్నారో లేదో అనుమానమే. కావూరి సాంబశివరావు లాంటి పచ్చి తెలంగాణ ద్వేషులు కూడా ‘శాస్త్రీయంగా విభజిస్తే తెలంగాణకు అభ్యంతరం లేదని’ చెప్పి ఒక మెట్టు కిందికి దిగుతున్నారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని బొత్స లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కనీస జ్ఞానాన్నయినా కేంద్ర మంత్రులు అలవరుచుకుంటే తెలంగాణకే కాక దేశానికి కూడా ఉపయోగపడవచ్చు. సెప్టెంబర్ నెల్లోనే కేంద్రం చేత ప్రకటన చేయిస్తానని బీరాలు పలికి ఢిల్లీ చేరిన కె.సి.ఆర్ వయలార్ రవి అజ్ఞాన దురహంకారంపై నోరు మెదపలేదు. సానుకూల ప్రకటన తర్వాత సంగతి, కనీసం కేంద్ర మంత్రుల కారుకూతల్నయినా కె.సి.ఆర్ ఆపలేకపోయాడన్నది కంటికి కనిపిస్తున్న నిజం. కె.సి.ఆర్ ఇక బీరాలు మాని ఆందోళనపై దృష్టి పెడితే ఫలితం ఉంటుంది తప్ప పనికిమాలిన లాబీయింగ్ లు గడ్డి పరకను కూడా పెరకలేవని ఆయనతో పాటు టి.ఆర్.ఎస్ కూడా గ్రహించాలి.

“వాళ్ళేం అడుగుతున్నారో చూద్దాం, టి…. ఇ……”

7 thoughts on “తెలంగాణ ఎక్కడ? -కార్టూన్

  1. హైదరాబాద్‌లో బహుళజాతి కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. మేడి పండులా కనిపించే హైదరాబాద్ నగరం యొక్క ఇంపార్టెన్స్ తగ్గించడం ఇష్టం లేకే సోనియా, మన్మోహన్‌లు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ఒప్పుకోవడం లేదు. వాళ్ళు ఆ విషయం డైరెక్ట్‌గా చెప్పకుండా వాయలార్ రవి లాంటి వాళ్ళతో ప్రకటనలు చెయ్యిస్తున్నారు.

  2. నా అంచనా ప్రకారం అయితే కాంగ్రెస్ కు తెలంగాణ ఇవ్వవద్దనే ఆలోచన లేదు. ఇప్పుడంటే ఇప్పుడు ఇవ్వడానికి సిద్దం. కాని తెలంగాన ఇచ్చిన క్రెడిట్ తనకే రావాలి. తెలంగాణలో తనే అధికారానికి రావాలి. అదే సందర్భంలో ఆంధ్ర ఏరియాలో నష్టం రాకూడదు. అంతే కాదు, కేంద్రంలో ప్రభుత్వానికి ఏ ఇబ్బంధీ ఉండకూడదు. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ఇస్తానన్నా కాంగ్రెస్ కు ఓటు వేసేవాడు తెలంగాణలో కనిపించడం లేదు. అదే సందర్భంలో ఆ మాటంటే ఆంధ్రలోకూడా తుడుచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యి చందంలా ఉంది. ఏదైనా జరిగి తనకు అనుకూంలంగా పరిస్థితులేర్పడితే తప్ప కాంగ్రెస్ తెలంగాణకి ఒప్పుకోదు. అప్పటిదాకా సాగతీయక మానదు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇలా చేయకూడదు. తన ఆలోచన ఏమిటో ప్రజలకు తెలియజేయడమే మంచిది. కాని తనకు కొన్ని బాధ్యతలున్నాయని కాంగ్రెస్ భావించిందెప్పుడు?

  3. విశేఖర్ గారూ,
    సురేంద్ర వేసిన పై కార్టూన్ కి మరో ముఖ్యమైన యాంగిల్ ఉందనుకుంటా…
    అది ఇటీవల వివాదాస్పదమైన అంబేద్కర్ గారి, రాజ్యాంగ రచనా కమిటీ పై , కార్టూన్ని అనుకరిస్తూ సురేంద్ర గారు ఈ కార్టూన్ గీసినట్లుంది.
    రాజ్యాంగాన్ని రాయడానికి ‘రాజ్యాంగ రచనా కమిటీ’ చాలా సమయం తీసుకుంటుందనే విషయాన్ని విమర్శిస్తూ శంకర్ పిల్లై అప్పట్లో గీసిన కార్టూన్ ని , NCERT వారు ఇటీవల ఓ పాట్యపుస్తకంలో ముద్రించటం, దాని మీద అనేక దళిత సంఘాలు,పార్టీలు ఆందోళనలు చేసిన విషయం మీకు తెలిసే ఉంటుందనుకుంటా…
    అట్లే తెలంగాణా పై తేల్చడానికి సోనియా,మన్మోహన్లు కూడా అపరిమిత సమయం తీసుకుంటున్నారని సురేంద్ర ఆక్షేపిస్తున్నట్లుంది.
    తెలంగాణా ప్రజల ఆందోలనల గురించి దేశం మొత్తానికి తెలిసినా, తమ కేమీ తెలీనట్లు, కేవలం ఇప్పటికి మొదటి రెండు అక్షరాలు మాత్రమే చదివినట్లూ నత్త నడకనుతలపిస్తున్నట్లుగా ఉంది.

  4. చీకటి గారూ, అవును. నత్తనడకని తలపిస్తున్నట్లుగా ఉందని సురేంద్ర ఆక్షేపిస్తున్నారు. నా వివరణలో ఈ కోణం గురించి నేను రాయలేదు. అయితే, అంబేద్కర్ కార్టూన్ ని అనుకరిస్తున్న ఐడియా నాకసలు రాలేదు.

    అంబేద్కర్ కార్టూన్ లో నత్తల సవారీకి ఈ కార్టూన్ లో నత్త నడకకీ పోలిక ఉన్నట్లు అంతగా అనిపించడం లేదు. కార్టూనిస్టులు సునిశిత దృష్టిపరులు గనుక ఆ పోలిక ఉండవచ్చునేమో కూడా.

వ్యాఖ్యానించండి