ప్రజాస్వామ్యం నవ్వులపాలు, సాగరహారం వర్షం పాలు


ఫొటో: ది హీందూ

‘తెలంగాణ మార్చ్’ మరో సీరియస్ ఉద్యమంగా మారకుండా వర్షం అడ్డుపడడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బతికిపోయింది. మార్చ్ కి అనుమతించినట్లే అనుమతించి పోలీసులతో ఎక్కడికక్కడ నిర్బంధం ప్రయోగించడం ద్వారా మార్చ్ ని విఫలం చేయడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించడంతో రాజకీయ ఐకాస నాయకత్వం ఆగ్రహించింది. ప్రభుత్వం, పోలీసుల మోసానికి ప్రతిగా సాయంత్రం 7 గంటల లోపు మార్చ్ ముగిస్తామన్న హామీని రద్దు చేసుకుని, రాత్రంతా కొనసాగించనున్నట్లు ఐ.కా.స నాయకులు ప్రకటించారు. వర్షం వస్తున్నప్పటికీ మార్చ్ కొనసాగిస్తామని ప్రకటించిన ఐ.కా.స వర్షం ఎంతకీ ఆగకపోవడంతో మార్చ్ ముగిస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు. దానితో, తెలంగాణ పై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ నెక్లెస్ రోడ్ నుండి కదిలేదిలేదని ఐకాస ప్రకటించిన నేపధ్యంలో, వర్షం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద గండం గడిచినట్లయింది.

తెలంగాణ మంత్రుల ఒత్తిడితో, ‘తెలంగాణ మార్చ్’ లేదా ‘సాగర హారం’ జరుపుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. కానీ మార్చ్ విఫలం కావడానికి చేయవలసిన అన్నీ ప్రయత్నాలనూ చేయకుండా మాత్రం ప్రభుత్వం ఊరుకోలేదు. పోలీసులనూ, పారా మిలటరీ బలగాలనూ పెద్ద సంఖ్యలో దించి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. జిల్లాల్లో ఎక్కడికక్కడ బైండోవర్ కేసులు నమోదు చేసి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసింది. ముఖ్యమైన కార్యకర్తలు అనుకున్నవారిని అరెస్టులు చేసి స్టేషన్లలో నిర్బంధించింది. ప్రచారం చేస్తున్నవారిని జీబుల్లో, బస్సుల్లో ఊళ్ళకు దూరంగా తీసుకుపోయి వదిలిపెట్టడం పోలీసులు విస్తృతంగా చేశారు.

ఇవన్నీ చేసింది కాక శనివారం, ఆదివారం 40 కి పైగా రైళ్లను రద్దు చేశారు. నడిచిన రైళ్లనుండి కార్యకర్తలను బలవంతంగా దింపేశారు. ఆర్.టి.సి బస్సులను తిరగనివ్వలేదు. బస్సులు ఇవ్వొద్దంటూ స్కూళ్ళ యాజమాన్యాలను బెదిరించారు. కొన్ని చోట్ల పోలీసులు రైళ్ల డ్రైవర్లను, గార్డులను అదుపులో ఉంచుకుని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచేందుకు కారణం అయ్యారు. శాతవాహన, నవజీవన్, పాట్నా ఎక్స్ ప్రెస్, జి.టి. ఎక్స్ ప్రెస్ తదితర అంతర్రాష్ట్ర రైళ్లను గంటల కొద్దీ నిలిపి వేలాది జనం హైద్రాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నారు. గ్రామాల్లో, పట్నాల్లో హైద్రాబాద్ కి దారి తీసే రోడ్లపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వందలకొద్దీ వాహనాలను హైద్రాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నారు. అనేక గ్రామాల్లో వాహనాలు సీజ్ చేసి అదుపులో ఉంచుకున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని ప్రభుత్వాలు చెబుతాయి. ప్రజల హక్కులను కాపాడేందుకు చట్టాలున్నాయని కూడా చెబుతారు. కానీ వాస్తవంలో ఈ చట్టాలన్నీ ప్రజల నిరసనలనీ, హక్కులనీ అణచివేయడానికి తప్ప కాపాడడానికి కాదని తెలంగాణ ఉద్యమం ఇప్పటికి అనేకసార్లు రుజువు చేసింది. ఆదివారం సాగర హారంపై అమలు చేసిన పోలీసు నిర్బంధం కూడా ఈ కోవలోనిదే. చట్టాల్లో ఉండే హక్కులు ధనికవర్గాలవి కాగా, అణచివేత చట్టాలు మాత్రం ప్రజల కోసం ఉద్దేశించినవని పోలీసు చర్యలు చెబుతున్నాయి. అనుమతి ఇచ్చామని చెప్పి రైళ్లు, బస్సులు అడ్డుకున్న ప్రభుత్వ పెద్దలు, పోలీసులను అదేమని అడిగే చట్టాలేవీ లేవు. కానీ 7 గంటలకు ముగిస్తామన్న హామీని ఉల్లంఘించారనీ, ఇచ్చిన పరిమితికి మించి సభ జరిపారనీ చెబుతూ ఐకాస నేతలపైన పోలీసులు కేసులు పెట్టడం మొదలు పెట్టారు. 

నిరసన తెలిపే హక్కు ప్రజలకి ఉన్నపుడు హైద్రాబాద్ కి రాకుండా వారిని నిరోధించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? శాంతియుతంగా రైళ్లలో, బస్సుల్లో, లారీల్లో, జీపుల్లో వస్తున్న ప్రజలని బలవంతంగా దింపి, లాఠీ చార్జి చేసి మరీ వెనక్కి పంపే అధికారం చట్టాలు ఇచ్చాయా? 7 గంటలు కాగానే పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడం మొదలు పెట్టారు. నీటి ఫిరంగులని ప్రజలమీదికి ప్రయోగించి బలప్రయోగం చేశారు. ఐకాస నాయకులు ప్రసంగిస్తున్న వేదికపైకే నేరుగా బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇవన్నీ ప్రజాస్వామిక ప్రభుత్వాలు చేసే పనులేనా? లగడపాటి లాంటి జోకర్లు తాము కూడా ప్రజా ప్రతినిధులం అన్న సంగతి మరిచిపోయి ఉస్మానియా యూనివర్సిటీ మూసేయాలనీ, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వరాదనీ వదరుతున్నారు. ఇలాంటి వారికి ప్రజలు ఓట్ల ద్వారా ఇచ్చింది అణచివేసే అధికారమే తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించే అధికారం కాదని వారే తమ చేష్టల ద్వారా, కూతల ద్వారా చెబుతున్నారు.

బ్రోకర్ రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నంతవరకూ ప్రజా ఉద్యమాలకి దిక్కూ, దారీ  ఉండే అవకాశమే లేదు. కాంగ్రెస్, టి.డి.పి, టి.ఆర్.ఎస్ లాంటి ధనికవర్గాల పార్టీల చేతుల్లో ఉద్యమం ఉన్నందునే ఏ ఫలితమూ లేకుండా ఉద్యమం సాగుతోంది.  ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించి ఉద్యమానికి తామే నేతృత్వం వహించాలి. ద్రోహులను ఉద్యమం నుండి తరిమికొట్టి కావలసింది దక్కేదాకా ఉద్యమాన్ని కొనసాగించాలి.

9 thoughts on “ప్రజాస్వామ్యం నవ్వులపాలు, సాగరహారం వర్షం పాలు

  1. నిన్న ప్రభుత్వం HMTVతో సహా మూడు తెలంగాణా అనుకూల చానెల్‌లని హైదరాబాద్‌లో బ్లాక్ చెయ్యించింది. తెలంగాణాలోని గ్రామాలలో కరెంట్ సప్లై నిలిపి వేసి ప్రజలు టివిలు చూడకుండా చేసింది. శ్రీలంకలో LTTE ఉద్యమాన్ని అణచివెయ్యడానికి కూడా ఇంత సెన్సార్‌షిప్ పెట్టలేదు.

  2. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకి కె.సి.ఆర్ అసలైన ప్రతినిధి కాడన్నది ముందు గమనించవలసిన విషయం. ‘సాగరహారం’ లో పాల్గొనడం కోసం తెలంగాణ జిల్లాలనుండి వచ్చే ప్రయత్నంలో తీవ్రమైన పోలీసు నిర్బంధం ఎదుర్కొన్న ప్రజలే నిజమైన తెలంగాణ ప్రతినిధులు.

    కాబట్టి తెలంగాణ మాండలికం తెలుసుకోవాలంటే అక్కడి ప్రజలనే వినాలి తప్ప కె.సి.ఆర్ ని కాదు. కె.సి.ఆర్, ‘తెలంగాణ’ ప్రజల రాష్ట్ర ఆకాంక్షలపైన ఆధారపడి బతుకుతున్న పారసైట్ మాత్రమే.

  3. కిరణ్ గారూ,

    తెలంగాణ డిమాండ్ పైన గతంలో కొన్ని ఆర్టికల్స్ రాసాను. కింద సెర్చ్ బాక్స్ లో ‘తెలంగాణ’ అని తెలుగులో టైప్ చేస్తే ఆ ఆర్టికల్స్ కనపడతాయి.

    బహుశా తెలుగు టైపింగ్ మీకు అందుబాటులో లేదేమో. కింద ఒక లింక్ ఇస్తున్నాను. ఆ ఆర్టికల్ తో పాటు దాని కింద జరిగిన చర్చ కూడా చూడండి. కొన్ని విషయాలు మీ దృష్టికి రావచ్చు.

    http://wp.me/p1kSha-Id

వ్యాఖ్యానించండి