కూడంకుళంలో మత్స్యకారుల శాంతియుత నిరసనలను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్రాల సోకాల్డ్ ప్రజాస్వామిక ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్రూర నిర్బంధ విధానాలు స్వతంత్ర పరిశీలకుల ద్వారా మరోసారి వెల్లడైనాయి. కూడంకుళం అణు కర్మాగారంలో అణు ఇంధనం నింపడానికి వ్యతిరేకంగా సెప్టెంబరు 10 తేదీన సముద్రతీర గ్రామ ప్రజలు చేపట్టిన శాంతియుత ఆందోళనపై పోలీసులు అమానుష నిర్బంధాన్ని ప్రయోగించారనీ పిల్లలు, స్త్రీలపై కూడా బలప్రయోగం చేశారనీ, మైనర్ పిల్లలపై దేశ ద్రోహం నేరం మోపి బాలల ఖైదుకి పంపారని నిజనిర్ధారణ కమిటీ నివేదిక తెలిపింది. ఉద్యమాన్ని చీల్చి బలహీనపరచడానికి వివిధ మతాల ప్రజల మధ్య అపోహలు రేపేందుకు కూడా పోలీసులు కుట్ర చేశారని, శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఇళ్లను దోచుకున్నారనీ నివేదిక తెలిపింది.
‘చెన్నై సాలిడారిటీ గ్రూప్ ఫర్ కూడంకుళం స్ట్రగుల్’ (కూడంకుళం ఉద్యమానికి చెన్నై సంఘీభావం) సంస్ధ నాయకులు గురువారం చెన్నైలో పత్రికా సమావేశం జరిపి నిజనిర్ధారణ కమిటీ నివేదికను విడుదల చేశారని ‘ది హిందూ’ తెలిపింది. ఇదింతకరై లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనీ, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలనీ ‘చెన్నై సాలిడారిటీ గ్రూప్’ డిమాండ్ చేసింది. శాంతియుత ఆందోళనపై నిర్బంధ చర్యలకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలనీ, సంవత్సర కాలంగా చేస్తున్న ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరపాలనీ డిమాండ్ చేసీంది.
నిజనిర్ధారణ కమిటీకి బొంబే హైకోర్టు మాజీ జడ్జి బి.జి.కోల్సే పాటిల్ ఛైర్మన్ గా వ్యవహరించాడు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పాటిల్ ఇదింతకరైలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్ధితిని అమలు చేస్తున్నారని ఆందోళన ప్రకటించాడు. సమీప గ్రామాల ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన అన్నిరకాల హక్కులనూ హరించివేశారని తెలిపాడు. ప్రజల్లో పోలీసులు బయోత్పాతాన్ని సృష్టించారనీ, చిత్తం వచ్చిన రీతిలో పిలలతో సహా అనేకమంది నిరసనకారులను అరెస్టులు చేశారనీ తెలిపాడు. అరెస్టు అయినవారికి బెయిల్ కూడా దొరకకూడదన్న ఏకైక లక్ష్యంతో ‘దేశద్రోహం’ కేసులు పెట్టారనీ తెలిపాడు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్త మానవహక్కులను హరించివేయడానికి వ్యతిరేకంగా అందరూ గొంతు విప్పాలని నిజనిర్ధారణ బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఒక అణు ప్రక్రియలో గ్రామ ప్రజలను గినియా పందుల తరహాలో నిర్బంధించడం పై సుప్రీం కోర్టు, జాతీయ రాష్ట్ర మానవహక్కుల కమిషన్లు, తమిళనాడు ప్రజానీకం తదితరులంతా స్పందించాలని కోరారు.
ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందం రెండు రోజుల పాటు ఉద్యమ ప్రాంతంలో పర్యటించి సాక్ష్యాలను సేకరించారు. జస్టిస్ కోల్సే తో పాటు ముంబై రచయిత కల్పనా శర్మ, తమిళ రచయిత జో డి’క్రజ్ లు కూడా ఈ బృందంలో సభ్యులు. కూడంకుళం, ఇదింతకరై, సునామీ కాలనీ గ్రామాలతో పాటు పళయం కొట్టై లోని బాలల కారాగారాన్ని కూడా వారు సందర్శించి సాక్ష్యాలను సేకరించారు. “మేము కనుగొన్న అంశాలు పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. మహిళలు, పిల్లలు, వయో వృద్ధులపై కూడా తీవ్ర హింసను ప్రయోగించారన్న విస్తృత అవగాహనకు (మేము సేకరించిన సాక్ష్యాలు) బలం చేకూరుస్తున్నాయి” అని నిజనిర్ధారణ నివేదిక తెలిపింది.
అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే పోలీసులే గ్రామాల్లోని ఇళ్ళల్లో చొరబడి దొరికింది దొరికినట్లు దోచుకుపోవడం. ప్రభుత్వ, ప్రవేటు ఆస్తులను పోలీసులే ధ్వంసం చేశారనీ, లూటింగ్ కి పాల్పడ్డారని నివేదిక వెల్లడి చేసింది. దేశ ద్రోహానికి పాల్పడ్డారనీ (సెక్షన్ 124ఎ), ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారనీ (సెక్షన్ 121ఎ) కేసులు మోపి ప్రజలపై బహిరంగ వేధింపులకి పోలీసులు దిగారని తెలిపింది. “అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే పోలీసుల చర్యలు చట్టవిరుద్ధమైనవి. ఈ నేరాలకు పాల్పడింది పోలీసులే కావడంతో బాధితులు ఆ నేరాలను ఎక్కడా ఫిర్యాదు గానీ సవాలుగానీ చేయలేరు” అని నివేదిక తెలిపింది.
అణు కర్మాగారాన్ని ధ్వంసం చెయ్యడానికి నిరసనకారులు పధకం వేశారన్న పోలీసుల వాదనను డి’క్రజ్ కొట్టిపారేశాడు. అణు భయమే ఆందోళనకు ముఖ్య కారణంగా ఉన్నపుడు అణు ఇంధనం నింపుతున్న కర్మాగారాన్ని నిరసనకారులు ఎలా ధ్వంసం చేయగలరని ఆయన ప్రశ్నించాడు. నిరసనలకు ముందుభాగంలో స్త్రీలు, పిల్లలను ఉంచి వారిని కవచంలా వాడుకున్నారన్న పోలీసుల ఆరోపణను ఆందోళనకారులు తిరస్కరించారని బృందం తెలిపింది. పురుషులను ముందు నిలిపితే పోలీసుల రెచ్చగొట్టుడు చర్యలకు వారు త్వరగా స్పందించే ప్రమాదం ఉన్నందునే స్త్రీలు, పిల్లలను ముందు నిలిపాము తప్ప పోలీసుల ఆరోపణల్లో నిజం లేదని వారు స్పష్టం చేశారని బృందం తెలిపింది.
కూడంకుళం ఆందోళనకారులకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్ మద్దతు తెలిపాడు. పోలీసుల అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసనకారులకు సంఘీభావం ప్రకటించాడు. నిజనిర్ధారణ నివేదికలోని అంశాలను కూడా ఆయన సమర్ధించాడు. “నివేదికను ఆహ్వానిస్తున్నాను… మన రిపబ్లిక్ పోలీసు రాజ్యం కారాదు” అని ఆయన ఆందోళన నాయకులకు పంపిన ఈ మెయిల్ సందేశంలో తెలిపాడు. జస్టిస్ పి.బి.సావంత్, ఎ.పి.షా, రాజేందర్ సచార్ లు కూడా నిజ నిర్ధారణ బృందం ఛైర్మన్ జస్టిస్ కోల్సే పాటిల్ కు మద్దతు తెలిపారు. తమిళనాడులో నెలకొన్న తీవ్ర పరిస్ధితి పట్ల ఉనతాధికారులు వెంటనే స్పందించాలని వారు కోరారు. సాక్ష్యాత్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నత స్ధాయి బ్యూరోక్రాట్ అధికారులే స్వయంగా కూడంకుళం ప్రజలపై సాగుతున్న పోలీసు నిర్బంధాన్ని ఆదేశించినపుడు మాజీ న్యాయమూర్తులు వారికే తిరిగి విజ్ఞప్తి చేయడం వల్ల ఫలితం ఏముంటుంది?
