గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -1


నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నదంటూ ఊదరగొట్టడం భారత దేశ కార్పొరేట్ పత్రికలకు కొంతకాలంగా రివాజుగా మారింది. ‘వైబ్రంట్ గుజరాత్’ గా నరేంద్రమోడీ చేసుకుంటున్న ప్రచారానికి పత్రికలు యధాశక్తి అండదండలు ఇస్తున్నాయి. బ.జె.పి నాయకులు, కార్యకర్తలు ఈ ఊకదంపుడు కధనాలను చెప్పుకుని ఉబ్బితబ్బిబ్బు అవుతుంటే, కాంగ్రెస్ నాయకులేమో వాటిని ఖండించి వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల వాదనలన్నీ జి.డి.పి వృద్ధి రేటు, తలసరి ఆదాయం, పారిశ్రామిక వృద్ధి… వీటి చుట్టూనే తిరుగుతున్నాయి తప్ప గుజరాత్ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం గురించి మాట్లాడడం లేదు. అక్కడి ప్రజల ఆకలి, దారిద్ర్యాల గురీంచి గానీ, పోషకాహార లోపం గురించి గానీ, సహజవనరుల దోపిడి గురించి గానీ బి.జె.పి చెప్పలేదు, కాంగ్రెస్ కూడా ప్రశ్నించలేదు. గుజరాత్ అభివృద్ధి కధను పరిశీలించడం ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం.

ఆగస్టు 29, 2012 తేదీన అమెరికా పత్రిక ‘ద వాల్ స్ట్రీట్ జర్నల్‘ కు నరేంద్ర మోడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. గుజరాత్ లో పోషకార లోపం స్ధిరంగా, చాలా ఎక్కువగా ఉంటోంది. దానిని తగ్గించడానికి మీరేం చేయదలిచారని అడిగినప్పుడు నరేంద్ర మోడి చెప్పిన సమాధానం ఇది:

WSJ: Gujarat’s malnutrition rates are persistently high. What are you doing to combat this?

Modi: Gujarat is by and large a vegetarian state. And secondly, Gujarat is also a middle-class state. The middle-class is more beauty conscious than health conscious – that is a challenge. If a mother tells her daughter to have milk, they’ll have a fight. She’ll tell her mother, “I won’t drink milk. I’ll get fat.” We will try to get a drastic change in this. Gujarat is going to come up as a model in this also. I can’t make any big claims, because I don’t have a survey in front of me yet.

పై సమాధానంలో ‘వైబ్రంట్ గుజరాత్’ ప్రజల్లో పోషకాహార లోపానికి ముఖ్యమంత్రి రెండు కారణాలు చెప్పాడు. ఒకటి: గుజరాత్ ప్రజల్లో ఎక్కువమంది శాకాహారులు కావడం. రెండు: గుజరాత్ లో ఎక్కువగా ఉన్న మధ్య తరగతి జనం అందంగా కనిపించాలన్న కోరికతో పాలు లాంటి సమతులిత ఆహారాన్ని తీసుకోకపోవడం. ఒక దేశాన్ని గానీ, ఒక రాష్ట్రాన్ని గానీ, కనీసం ఒక ప్రాంతాన్ని గానీ పాలిస్తున్న వ్యక్తి ఎవరూ ప్రజల పోషకాహార లోపానికి ఇలాంటి అసంబద్ధ, అశాస్త్రీయ, తుంటరి కారణాలు చెప్పగలరని ఊహించడం దాదాపు అసాధ్యమే.

కానీ మన ‘వైబ్రంట్ గుజరాత్’ పాలకునికి అది సాధ్యపడింది. నరేంద్ర మోడి చెప్పిన కారణమే నిజమైతే శాకాహారులంతా పోషకాహార లోపం సమస్యను ఎదుర్కోవాలి. శాకాహారం మానేసి ఇకనుండి మాంసాహారం తీసుకోవాలని శాకాహారులందరికీ మోడీ సలహా ఇచ్చి ఉండాలి. మోడి అందుకు పూనుకుంటాడో లేదో గానీ వాస్తవం అయితే అది కాదు. శాకాహారం వల్ల శరీరానికి రావలసిన పోషక విలువలు అందవని ఏ శాస్త్రమూ చెప్పలేదు. పైగా మాంసాహారం వల్ల ఆ జబ్బూ, ఈ జబ్బూ వస్తుంది గనక అది మానేసి శాకాహారంలోకి దిగాలని చెప్పే పండిత పుత్రులకు, ఆశాస్త్రీయ బోధనలకు ఈ దేశంలో కొదవలేదు.

శాకాహారం అంటూ సొల్లిన మోడి అక్కడితో ఆగకుండా తన రాష్ట్రంలోని అమ్మాయిలను అపహాస్యం చేయడానికి కూడా పూనుకున్నాడు. తల్లులు తమ కూతుళ్లకు పాలు తాగమని చెబుతుంటే వారి కూతుళ్ళు మాత్రం అందుకు ఒప్పుకోకుండా ‘పాలు తాగితే ఒళ్ళు వస్తుంది’ అని చెప్పి పోట్లాటకి దిగుతున్నారట. కానీ గత సంవత్సరం అక్టోబర్ లో విడుదల చేసిన కేంద్ర మానవాభివృద్ధి నివేదిక (India Human Developement Report 2011) ప్రకారం గుజరాత్ లోని 5 సం.ల లోపు పిల్లల్లో 44.6 శాతం మంది పోషకాహారం లోపంతో బాధపడుతుంటే, 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ స్వయంగా ప్రస్తావించిన 2005-06 నాటి భారత కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూసినా గుజరాత్ లో 52 శాతం (అయిదేళ్లలోపు) పిల్లలు తమ వయసుకంటే చాలా తక్కువ సైజులో (stunted) ఉన్నారు. అంటే పెరుగుదల లేక గిడసబారి పోయి ఉన్నారు. 5-6 మధ్య వయసు పిల్లల్లో 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతుంటే, స్త్రీలలో కూడా 55 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. భారత దేశ పిల్లల్లో పోషకాహార లోపానికి ముఖ్య కారణాలు దరిద్రం, తల్లిపాలు ఇవ్వడంలో లోపాలు, ఆరోగ్య సౌకర్యాల లేమి, అవినీతితో నిండిన ఆహార పంపిణీ కార్యక్రమాలు అని ప్రభుత్వ నివేదికలు ఎప్పుడూ చెప్పే మాటే. అసలు కారణాలు వదిలేసి శాకాహారం, అందం స్పృహ అంటూ సమస్యలను కప్పి పుచ్చడానికే మోడి ప్రయత్నించాడు. అసలు అయిదేళ్ల లోపు పిల్లలకి అందం గురించిన స్పృహ ఉంటుందని ఏ సన్నాసి చెప్పాడో మోడి చెబితే బాగుండేది.

నిజానికి జి.డి.పి వృద్ధి కీ ప్రజల సౌభాగ్యానికి అసలు సంబంధం ఉండదని అందరూ అంగీకరిస్తారు. ఒక రాష్ట్రానికి లేదా దేశానికి చెందిన జి.డి.పిలో ప్రజలు ఎంత సుఖంగా బతుకుతున్నదీ సమాచారం ఉండదు. రాష్ట్రం వరకు తీసుకుంటే ఆ రాష్ట్ర ప్రాదేశిక సరిహద్దులలోపల జరిగే సకల ఉత్పత్తుల మొత్తమే ఆ రాష్ట్ర జి.డి.పి గా ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఉత్పత్తి కి సొంతదారులేవరు, ఉత్పత్తి ఎవరెవరికి ఎంతెంత పంపిణీ అవుతున్నదీ వివరాలు జి.డి.పి లో ఉండవు. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయని చెప్పే గుజరాత్ లో పెట్టుబడులు ఎవరివో అర్ధంకావడానికి ప్రత్యేక వివరణ అవసరం లేదు. విదేశీ పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు విదేశీ కంపెనీలకే చెందుతాయి తప్ప గుజరాత్ ప్రజలకి కాదు. గుజరాత్ లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు అక్కడి సహజ వనరులను ఖర్చు చేసి ఉత్పత్తులు తీసి అమ్ముకుంటాయి తప్ప గుజరాత్ ప్రజలకి ఇచ్చేయ్యవు. తమ లాభాలని తమతమ దేశాలకి తరలించుకెళ్తాయి లేదా తమ వద్దే ఉంచుకుని మరిన్ని లాభాలు సంపాదించే మార్గాలు అన్వేషిస్తాయి తప్ప గుజరాత్ ప్రజలకి విద్య నేర్పాలా, ఆరోగ్యం చూడాలా, పిల్లలకి పోషకాహారం ఇవ్వాలా అని చూడవు. మరి మోడి నిత్యం గొప్పలు చెప్పుకునే  విదేశీ పెట్టుబడుల వలన గుజరాత్ ప్రజలకి ఏమి ఒరిగినట్లు?

విదేశీ పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని కొందరు చెబుతారు. కానీ ఉద్యోగాలు ఎన్ని వచ్చిందీ కూడా జి.డి.పి వృద్ధి శాతం చెప్పదు. రైతుల పంటలకి గిట్టుబాటు ధరలు వస్తున్నదీ లేనిదీ జి.డి.పి చెప్పదు.  కూలీలు, కార్మికులు,  ఉద్యోగులు మొదలయినవారి వేతనాలు ఎంత ఉన్నదీ కూడా జి.డి.పి వృద్ధి శాతం తెలియజేయదు. అలాంటి జి.డి.పి గుజరాత్ లో పెరిగితే అది ఎవరిని ఉద్ధరిస్తే గొప్పలు చెబుతారు? ఒక కాలపరిమితిలో జరిగిన సకల ఉత్పత్తుల మొత్తమే జి.డి.పి అని గుర్తుకు తెచ్చుకుంటే అది ఎవరికి సొంతమని కూడా చర్చించుకోవాలి.

సరే, స్వదేశీ, విదేశీ పెట్టుబడుదారులు పెట్టుబడులు పెడతారు. ఉత్పత్తులు తీయాలంటే వారికి వనరులు కావాలి. భూములు, నీరు, ముడి సరుకులనుండి ఒక కంపెనీకి అవసరమైన భౌతిక వనరులు అన్నీ (గుజరాత్ గురించి మాట్లాడుకుంటున్నాం గనక) గుజరాత్ నుండే స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు వినియోగిస్తారు. కానీ ఈ భౌతిక వనరులు పెట్టుబడిదారులవి కావు. అవి గుజరాత్ ప్రజలవి. గుజరాత్ ప్రభుత్వం వనరులు తనవి అంటుంది. తనవి కాకపోతే వివిధ చట్టాలను ఉపయోగించి జనం దగ్గర్నుండి రౌడీయిజం చేసి లాక్కుంటుంది (అవి మళ్ళీ భూస్వాములవీ, పెట్టుబడిదారులవీ కాకపోతేనే సుమా) కూడా. డబ్బు, మద్యం, బంగారం, కులం, మతం మొదలైన అంశాలపై ఆధారపడి జరిగే ఎన్నికలు అనే ఒక ప్రహసనం ద్వారా సమకూరిన అధికారంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రౌడీయిజం చేస్తుంది. అంటే గుజరాత్ ప్రజలు ఇచ్చిన అధికారంతో, ప్రజల భౌతిక వనరులను ధనిక దోపిడీవర్గాలైన స్వదేశీ, విదేశీ పెట్టుబడుదారులకి అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం జి.డి.పి ని వృద్ధి చేస్తోంది. ప్రజలకు చెందని అలాంటి జి.డి.పి ఎంత వృద్ధి చెందినా గుజరాత్ ప్రజలకి ఒరిగేదేమీ లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా.

….ఇంకా ఉంది

7 thoughts on “గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -1

 1. హిందూత్వవాదులు (భక్తిశ్రద్ధలు లేకపోయినా ఆ ముసుగు వేసుకునేవాళ్ళు) మోడీ గురించి నిజాలు చదివితే ఎగిరెగిరి పడతారు. భిక్షగత్తె చిరిగిపోయిన రవిక వేసుకుంటే ఆమెని స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకునే హైక్లాస్ స్త్రీతో పోల్చే రకాలకీ, మోడీ లాంటివాళ్ళకీ తేడా లేదులే.

 2. నేను నరేంద్ర మోడి ని సమర్దించడానికి చెప్పడం లేదు. కాని మీ కథనం లో పౌష్టికాహార లోపం గురించి ఇచ్చిన స్టాటిస్టిక్స్ మిగతా వాటిలో ఎందుకు ఇవ్వలేదో అర్ధం కాలేదు. మిగతా పారాగ్రాఫ్ లో, గుజరాత్ అన్న పదం తీసేసి వేరే ఏ స్టేట్ పేరునైనా insert చేస్తే , అర్ధం మారుతుందని అనుకోవడం లేదు. మనం ప్రతీ రోజు ఏదో ఒక స్టేట్ గురించి, editorials లో చదివినట్టే ఉంటుంది.

  కాని గత పది సంవత్సరాల నుండి నరేంద్ర మోడి స్తిరంగా ఉండటం, ఇంకా అతనికి గుజరాత్ లో గుర్తింపు ఉండటం, వ్యవసాయం లో గత అయిదు సంవత్సరాల నుండి growth rate 9% ఉండటం, ఈ మధ్యన ఈనాడు లో వచ్చిన కథనాలు (అంత బారి ఎత్తున కథనాలు ప్రచురించిన ఈనాడు అబద్దం చెప్తుంది అని అనుకోవడం లేదు). నా ఉద్దేశ్యం లో నరేంద్ర మోడి కొత్తగా ఏమన్నా చేసాడో లేదో తెలియదు, కాని ఉన్నదాన్ని చెడగొట్టకుండా environment ని manageable level లో స్ధిరంగా ఉంచుతున్నాడేమో అని అనిపిస్తుంది.

  anyhow, ఇంకా ఉంది అని చెప్తున్నారు కాబట్టి, waiting for next ….

  (ఈ వ్యాఖ్యలో కొన్ని అచ్చుతప్పుల్ని నేను సవరించాను -విశేఖర్)

 3. వెంకట్ గారూ, మిగతా అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా గుజరాత్ అభివృద్ధి చెందుతోందని పత్రికలు చెబుతున్నాయి. అది నిజమా కాదా అన్నది చర్చించడం ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం. అందువల్ల గుజరాత్ వరకే లెక్కలు ఇచ్చాను. ఇతర రాష్ట్రాలతో పోలిక తర్వాత భాగంలో ఇస్తాను. అయితే పోలిక అనేది ఒక అంశం మాత్రమే.

  “మిగతా పారాగ్రాఫ్ లో, గుజరాత్ అన్న పదం తీసేసి వేరే ఏ స్టేట్ పేరునైనా insert చేస్తే , అర్ధం మారుతుందని అనుకోవడం లేదు.”

  సరిగ్గా చెప్పారు. ఇతర రాష్ట్రాల్లాగే గుజరాత్ పరిస్ధితి ఉందనీ, గుజరాత్ లో మోడి ప్రత్యేకంగా సాధిస్తున్నది ఏమీ లేదనీ ఈ ఆర్టికల్ లోని ఒక అంశం. వేరే పనికి వెళ్లడం వల్ల మధ్యలో ఆపాను. త్వరలో రెండో భాగం రాస్తాను.

 4. అది సరే! మోడీ గారి సమాధానం విన్న ఆ జర్నలిస్ట్ రియాక్షన్ ఏంటా అని…! హ్హాహ్హాహ్హాహ్హా…! ఏడ్వలేక నవ్వాల్సివస్తుంది..జనం అంటే ఇంత చులకనా! మొన్నటిదాకా ఈనాడు ఊదరగొడితే శెభాష్ అనుకున్నా..! మీరేమో అలాక్కాదంటున్నారు…నాలాంటి సగటు పాఠకుడికి కష్టమే మరి! సరే కానివ్వండి.. మీది కూడా విందాం .. అదే …చదువుదాం!

 5. “పైగా మాంసాహారం వల్ల ఆ జబ్బూ, ఈ జబ్బూ వస్తుంది గనక అది మానేసి శాకాహారంలోకి దిగాలని చెప్పే పండిత పుత్రులకు, ఆశాస్త్రీయ శుంఠలకు ఈ దేశంలో కొదవలేదు.” ఇది తప్ప మిగతా అంత బాగానే ఉంది. మీ అభిప్రాయం వేరే అని తెలుస్తూనే ఉంది. కాని అలా చెప్పే వారిని శుంఠలనే పద ప్రయోగం బాగా లేదు.

 6. కెవికె గారూ, పండిత పుత్రః పరమ శుంఠః అన్న అర్ధంలో ఆ పదం వాడాను. ప్రవాహంలో అలా వచ్చింది. మీరు చెప్పాక రాకూడని అర్ధం ఉన్నట్లు స్ఫురిస్తోంది. మారుస్తాను.

 7. గుజరాత్‌లో శాకాహారులు ఎక్కువ కాదు. ఆ రాష్ట్రంలోని వైశ్య కులస్తులలో జైనులు ఎక్కువ. వాళ్ళు మాంసం ముట్టుకోరు కనుక గుజరాత్ మీదుగా వెళ్ళే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో మాంసాహారం సప్లై ఉండదు. సాధారణ ప్రజలు ఏది దొరికితే అది తింటారు కానీ శాకాహారమే తినాలని రూల్ పెట్టుకోరు. ఇక్కడ కూడా పల్లెటూరివాళ్ళు ఆర్థిక కారణాల వల్ల పండగల నాడు మాత్రమే మాంసాహారం కొని తింటారు. అలాగని ఇక్కడ వెజిటేరియనిజంకి ప్రిఫరెన్స్ ఉందనుకోగలమా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s