కేజ్రీవాల్ కి గ్యాస్ కట్ చేసిన అన్నా -కార్టూన్


“నా పేరు వాడుకోవద్దు, నా ఫోటో పెట్టొద్దు” అని అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ ని హెచ్చరించాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేకి సన్నిహిత సహచరుడుగా పేరుపడిన అరవింద్ కేజ్రీవాల్ కి అన్నా హెచ్చరిక శరాఘాతం లాంటిది. ‘అన్నా బృందం’ పేరుతో ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ సంస్ధ కింద సాగిన ఉద్యమానికి అన్నా ముందు నిలబడినప్పటికీ ఉద్యమానికి అవసరమైన రోజువారీ వ్యవహారాలను చూసింది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాలే నని అప్పట్లో పత్రికలు ఘోషించాయి. అదే నిజమయితే ‘అన్నా బృందం’ అనే బ్రాండ్ నేమ్ కి సమకూరిన అవినీతి వ్యతిరేక ఉద్యమ ప్రతిష్టలో ప్రధాన భాగం అరవింద్ సాగించిన కృషి ఫలితమే. ఆ విధంగా అరవింద్ కృషి, అన్నా బృందం ప్రతిష్ట పరస్పరం విడదీయరానివి. అలాంటి విడదీయరాని ప్రతిష్టని విడదీసి ‘అన్నా బృందం’ అనే బ్రాండ్ నేమ్ కి ఉన్న విలువను అరవింద్ వాడుకోరాదని ఆంక్షలు విధించడం అంటే అరవింద్ రాజకీయ వంటకి అత్యవసరమైన ‘ఉద్యమ క్రెడిట్’ అనే గ్యాస్ ని కట్ చెయ్యడమే.

కార్టూన్: ది హిందూ

 

One thought on “కేజ్రీవాల్ కి గ్యాస్ కట్ చేసిన అన్నా -కార్టూన్

  1. నాకోడి కూయకుంటే అసలే తెల్లవారదు అనుకున్నాడట వెనకటికి ఒకాయన….

    అలాగే అన్నా గారు తన పేరు వాడుకోవద్దు అన్నంత మాత్రాన అవినీతిపై పోరాటం ఆగదు కదా..
    ఐతే తనపేరు వాడుకోవద్దు అని సూచించడం వెనుక హజారేకు ఉన్న అభ్యంతరాలేమిటో బోధపడడం లేదు. బహుశా కేజ్రివాల్‌తో ఉద్యమ స్వరూపం విషయమై కొంత వైరుధ్యం ఉండిఉండవచ్చునని నా అంచనా.
    స్వతంత్ర పోరాట సమయంలో గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌లకు మధ్య పోరాటవిధానంపై భిన్నాభిప్రాయలున్నాయి. ఫలితంగా ఇద్దరూ వేరువేరు మార్గాలు ఎంచుకున్నారు.
    తర్వాత బోస్‌ జర్మనీ..అట్నుంచి జపాన్‌ వెళ్లి వాళ్ల సహకారంతో సింగపూర్‌లో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించారు. ఆ సంధర్భంగా రేడియోలో బోస్‌ ప్రసంగిచిన సమయంలో….ప్రత్యేకంగా మహాత్మాగాంధీని ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా…స్వతంత్ర భారత జాతి సైన్యం ప్రస్థానం మొదలైందన్నారు.

    మార్గాలు వేరైనా నాటి నాయకులు చూపిన గొప్పతనం అది.

    పోరాడే విధానం ఒకటి కాకపోవచ్చు. కానీ పోరాట లక్ష్యం ఒకటే కదా… అందునా నిన్నటి దాకా ఒకే శిబిరం ఉన్న వాళ్ల మధ్య తేడాలు రావడం ఉద్యమాన్ని శంకించేవారికి బలాన్నిస్తుంది. ఈ విషయంలో హజారే కొంత ఉదారంగా వ్యవహరించాలని నా అభిప్రాయం. అది అవినీతిపై పోరుకు మరింత స్ఫూర్తినిస్తుంది. ఉద్యమం బలపడుతుంది.

వ్యాఖ్యానించండి