కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా లక్షలాది గ్రామ ప్రజలు సాగిస్తున్న పోరాటం కొనసాగుతోంది. ప్రజల భయాలు, ఆందోళనలు పట్టించుకోకుండా కూడంకుళం అణు రియాక్టర్ లో యురేనియం ఇంధన కడ్డీలను నింపడం ప్రారంభం అయిన నేపధ్యంలో మత్స్యకారులు వెయ్యికి పైగా పడవలతో ట్యుటికోరిన్ పోర్టును శనివారం దిగ్బంధించారు. తమిళనాడు తీరం అంతటా మత్స్యకారులు ఆందోళన చేయాలని PMANE (Peoples Movement Aganist Nuclear Energy) ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఈ నిరసనను చేపట్టారు. మరో వైపు అణు నియంత్రణ సంస్ధ పేర్కొన్న భద్రతా చర్యలు తీసుకోకుండా కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారాన్ని ప్రారంభించడానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ కొనసాగుతున్నది.
వేలాది పోలీసులను, పారా మిలటరీ బలగాలనూ దించి భయభ్రాంతులు సృష్టిస్తున్నప్పటికీ మత్స్యకారులు బెదరడం లేదు. అణు కర్మాగారాన్ని మూసేయాలని డిమాండ్ చేస్తూ వెయ్యికి పైగా పడవలతో వారు శనివారం ట్యుటికోరిన్ పోర్టును చుట్టుముట్టారని ఎన్.డి.టి.వి తెలిపింది. 3000 కి పైగా మత్స్యకారులు 500 కిపైగా నాటు పడవలు, మెకనైజ్డ్ పడవలతో ట్యూటుకోరిన్ పోర్ట్ అప్రోచ్ చానెల్ ను అడ్డుకున్నారని, అయితే కోస్ట్ గార్డ్, సి.ఐ.ఎస్.ఎఫ్ (Central Industrial Security Force) లకు చెందిన బలగాలు వారిని నిరోధించాయనీ ‘ది హిందూ’ తెలిపింది. హార్బర్ ప్రవేశద్వారాన్ని పడవలతో అడ్డుకోవడానికి మత్స్యకారులు ప్రయత్నం చేస్తూ సముద్రంలోనే ఉండిపోయారనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారని పత్రికలు తెలిపాయి.
కూడంకుళం అణు రియాక్టర్ 1 లో యురేనియం ఇంధనాన్ని లోడింగ్ చేయడం ఒక పక్క కొనసాగుతున్నప్పటికీ మత్స్యకారులు బెదరకుండా పోర్టు ముట్టడిలో పాల్గొన్నారు. ట్యుటికోరిన్, కన్యాకుమారి, తిరునల్వేలి (కూడంకుళం ప్లాంటు ఉన్న జిల్లా) జిల్లాలనుండి వచ్చిన మత్స్యకారులు ఈ ముట్టడిలో పాల్గొన్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. కూడంకుళంతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు 400 రోజులనుండి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు ఎందుకు వినడం లేదని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. మరోవైపు ట్యుటికోరిన్ పట్టణంలో అణు విద్యుత్ వ్యతిరేక కార్యకర్తలు మానవ హారం ఏర్పరిచి నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.
ప్లాంటు ప్రారంభం అయ్యాక దానికి చుట్టుపక్కల ఉన్న మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని PMANE ప్రతినిధులు తెలిపారు. ఆందోళన కమిటీ ప్రతినిధి సుబాష్ ఫెర్నాండో మాట్లాడుతూ “ప్లాంటు పని చేయడం అంటూ జరిగాక, దాని నుండి వెలువడే రేడియేషన్ వలన మత్స్యకారులు పట్టే చేపలు యూరోపియన్ మార్కెట్ కి ఎగుమతి చేయడానికి పనికిరాకుండా పోతాయి. ఇంధనం నింపినా ఇప్పుడయినా ప్లాంటుని ఆపొచ్చు” అన్నాడు. భారత దేశానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నట్లయితే ప్రజలు చెప్పేదాన్ని వినాలనీ, ఫుకుషిమా లాంటి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులనీ మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారని ‘ది హిందూ’ తెలిపింది. బతుకు భయంతో ఆందోళన చేస్తున్న మత్స్యకారులు ఇపుడు భారత ప్రభుత్వం దృష్టిలో ‘దేశ ద్రోహులు’ కావడంతో వారి ప్రశ్నలకు ‘రాజ ద్రోహం’ కేసులు, పారామిలటరీ బలగాల కవాతులే సమాధానాలయ్యాయి.
సెప్టెంబర్ 22 తేదీన ట్యుటికోరిన్, కన్యాకుమారి, రామేశ్వరం, చెన్నై లలో పోర్టు కార్యకలాపాలను అడ్డుకోవాలని PMANE రెండు రోజుల క్రితం పిలుపునిచ్చింది. కూడంకుళం అణు కర్మాగారం ఉన్న తిరునల్వేలి తో పాటు ట్యుటికోరిన్ జిల్లా కూడా కూడంకుళం వ్యతిరేక ఆందోళనకు కేంద్రంగా కొనసాగుతున్నది. దానిలో భాగంగానే ట్యుటికోరిన్ పోర్టును దిగ్బంధించడానికి మత్స్యకారులు నాటు పడవల్లో, యంత్ర పడవల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెప్టెంబర్ 10 తేదీన జరిగిన ఆందోళనలో ట్యుటికోరిన్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక మత్స్యకారుడు చనిపోయాడు. మరో వైపు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న ఎస్.ఉదయ్ కుమార్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మత్స్యకారుల ఇళ్లను తనిఖీ చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న నేపధ్యంలో స్వచ్చంధంగా అరెస్టు కావడానికి ఉదయ్ కుమార్ నిర్ణయించినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ చొరవతో ఆయన అరెస్టు ఆలోచనను విరమించుకున్న విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టులో కొనసాగుతున్న వాదనలు
సామాజిక కార్యకర్త, ‘ఫిషర్ మెన్ కేర్’ అనే స్వచ్ఛంద సంస్ధ అధిపతి అయిన జి సుందర రాజన్ కూడంకుళం ప్లాంటు ప్రారంభానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 20 న సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఆయన తరపున వాదిస్తూ లాయర్ ప్రశాంత్ భూషణ్ (మాజీ అన్నా బృందం సభ్యుడు), ఫుకుషిమా ప్రమాదం దరిమిలా ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ని నియమించిందనీ భూకంపాలు, సునామీలు తదితర ప్రకృతి విలయాలు సంభవించినపుడు తట్టుకోగల సామర్ధ్యం ప్లాంటుకి ఉన్నదీ లేనిదీ సమీక్షించాలని దానిని కోరిందనీ తెలిపాడు. సదరు టాస్క్ ఫోర్స్, ప్లాంటు ప్రారంభానికి ముందు 17 భద్రతా చర్యలు తీసుకోవాలని చెబితే 6 మాత్రమే తీసుకుని ముఖ్యమైన 11 చర్యలను వదిలేశారని తెలిపాడు.
“AERB (అణు శక్తి నియంత్రణ బోర్డు), ఈ (భద్రతా) చర్యలను అమలు చేయడానికి ఆరు నుండి రెండు సంవత్సరాల సమయం పడుతుందని ఇపుడు చెబుతోంది. ఆ చర్యలు తీసుకునేలోపు ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభావిస్తే, మెల్ట్ డౌన్ (యురేనియం ఇంధనం కరిగిపోయి వాతావరణంలోకి లీక్ అయే పరిస్ధితి ఏర్పడడం) జరిగేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. రేడియేషన్ పెద్ద ఎత్తున లీక్ అయి దశాబ్దాల తరబడి అక్కడి విశాల నివాసప్రాంతాలు నివశించడానికి వీలు లేనివిగా మారిపోయాయి. మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయవలసి వస్తుంది” అని ప్రశాంత్ భూషణ్ కోర్టుకి తెలిపాడు.
స్పెంట్ ఫ్యూయల్ (విద్యుత్ ఉత్పతి జరిగాక మిగిలిపోయే యురేనియం ఇంధనం) గురించిన అంశాన్ని కూడా ప్రశాంత్ భూషణ్ లేవనెత్తాడు. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం స్పెంట్ ఫ్యూయల్ ను రష్యాకి తిరిగి రవాణా చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఒప్పందాన్ని తిరగదోడారనీ, స్పెంట్ ఫ్య్యూయల్ ని మరో ఏడు సంవత్సరాల వరకూ ఇక్కడే ఉంచేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిందని భూషణ్ కోర్టుకి తెలిపాడు.
ప్రమాదం సంభవించిన ఫుకుషిమా వద్ద నిల్వ ఉంచిన స్పెంట్ ఫ్యూయల్ పైన ప్రపంచం భవిష్యత్తు ఆధారపడి ఉందని అమెరికా సెనేటర్లతో సహా అనేకమంది అణు నిపుణులు, పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన ప్రకటించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. భూకంపం, సునామీల వలన కట్టడాలు బలహీనం కావడంతో ఎత్తైన చోట నిలవ చేసిన స్పెంట్ ఫ్యూయల్ ట్యాంకు బద్దలై ప్రపంచం యావత్తూ రేడియేషన్ వ్యాపించే ప్రమాదం ఉన్నదని అమెరికా, యూరప్, ఆసియాల్లోని అనేకమంది ఆందోళన ప్రకటించారు. దాని ఫలితంగా త్వరలోనే స్పెంట్ ఫ్యూయల్ ని అక్కడి నుండి తొలగిస్తామని టేప్కో కంపెనీ గట్టి హామీ ఇవ్వవలసి వచ్చింది. ఈ నేపధ్యంలో రష్యాకి పంపవలసిన స్పెంట్ ఫ్యూయల్ ని కూడా కూడంకుళంలోనే నిలవ చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించడం ఆత్మాహత్యా సదృశం.
పిటిషనర్ లాయర్, స్పెంట్ ఫ్యూయల్ ప్రస్తావన తేవడాన్ని ప్రభుత్వ లాయర్ సొలిసిటర్ జనరల్ నారీమన్ అభ్యంతరం చెప్పగా కోర్టు దానిని తోసిపుచ్చింది. ఇదేమీ వైరి లిటిగేషన్ కాదని చెబుతూ స్పెంట్ ఫ్యూయల్ నిలవ చేసిన చోట ప్రమాదం జరగదని గ్యారంటీ ఏమన్నా ఉన్నదా అని నారీమన్ ను కోర్టు ప్రశ్నించింది. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత అక్కడి విష వ్యర్ధాలను తొలగించడం ఇప్పటికీ సమస్యగా ఉన్న సంగతిని కోర్టు గుర్తు చేసింది. (జర్మనీ కంపెనీ GIZ, భోపాల్ విష వ్యర్ధాలను తొలగిస్తానని మొదట చెప్పినప్పటికీ జర్మనీలో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది.) స్వతంత్రంగా వ్యవహరిస్తూ అణు పరిశ్రమలను నియంత్రించవలసిన AERB, వాస్తవంలో అణు పరిశ్రమకు లోబడి ఉన్న సంగతిని కూడా భూషణ్ కోర్టుకి తెలిపాడు. ఈ విషయాన్ని CAG కూడా తప్పుపట్టిన సంగతిని ఆయన కోర్టుకి తెలిపాడు.
Environment Impact Assesment Report, Environmental Management Plan, Public Hearing Report… ఇవేవీ లేకుండానే ప్లాంటు ప్రారంభానికి అనుమతి ఇచ్చారని పిటిషనర్ కోర్టుకి తెలిపాడు. అయినప్పటికీ ప్రజల భద్రత రీత్యా ఈ విషయాన్ని పరిగణించకుండా, హైకోర్టు, ప్లాంటు ప్రారంభానికి అనుమతి ఇచ్చిందని తెలిపాడు. తదుపరి హియరింగ్ సెప్టెంబరు 27 కి వాయిదా పడిందని ‘ది హిందూ’ తెలిపింది.
కోర్టులో ఎన్ని వాదనలు జరిగినప్పటికీ కూడంకుళం అణు కర్మాగారం ప్రారంభాన్ని కోర్టు వాయిదా వేయగలదేమో గానీ, ప్రారంభం కాకుండా అడ్డుకోజాలదు. రష్యాతో కుమ్మక్కై, రష్యా కంపెనీల లాభ దాహాన్ని తీర్చడానికి భారత ప్రజల భవిష్యత్తుని ప్రమాదంలో పడవేసేందుకు సిద్ధపడిన భారత, తమిళనాడు ప్రభుత్వాలతో తేల్చుకోవలసింది ప్రజలే.

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు…
ఉరికొయ్యలు చెరసాలలు ఉద్యమాల నాపలేవు….
అని ఓ ప్రజాకవి ఎప్పుడో తేల్చిచెప్పాడు.
ఇది అనేక సార్లు రుజువయ్యింది కూడా…
ఈ విషయం యూపీఏ పాలకులకు త్వరలోనే అనుభవంలోకి రావడం ఖాయం