“బిజినెస్ రూల్స్ ప్రకారమే జి.ఒ లు జారీ చేశాం. ఈ జి.ఒ లని తప్పు పడితే భవిష్యత్తులో ఎవరూ మంత్రి పదవి చేపట్టరు.” (టి.వి 5)
ఈ మాటలన్నది రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ. జగన్ అవినీతి కేసులో తమకి సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసుల వల్ల భవిష్యత్తులో మంత్రి పదవులు నిర్వహించడానికి ఎవరూ ముదుకు రారేమోనని మంత్రిగారికి అర్జెంటుగా భయం పట్టుకుంది. కోర్టులు ఇలాగే అవినీతి పేరుతో మంత్రులకి నోటీసులు ఇస్తూ భయపెడుతుంటే ఎలాగని కన్నా లక్ష్మీ నారాయణ గారు ఆందోళన పడుతున్నారు.
ఈ రాష్ట్ర/దేశ పౌరుడుగా నేను మంత్రి గారికి హామీ ఇవ్వదలుచుకున్నాను. భవిష్యత్తులోనే కాదు, ఇప్పుడు కూడా నేను మంత్రి పదవి చేపట్టడానికి రెడీ. నాతో పాటు ఈ రాష్ట్రంలో అక్రమ సంపాదన దృష్టి లేకుండా, ‘క్విడ్ ప్రో కో’ లాంటి అవినీతి చేష్టల జోలికి పోకుండా, రాజీ లేని దేశ సేవ దృష్టితో, మంత్రి పదవులు నిర్వహించడానికి లక్షలాది మంది యువతీ యువకులు, పెద్దలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మంత్రిగారు ఆందోళన చెందకుండా, వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో జగన్ అవినీతికి సహకరించినందుకు బాధ్యత వహించి మంత్రిపదవికి రాజీనామా చెయ్యొచ్చు. సుప్రీం కోర్టులో పొరాడి తాను సచ్చీలుడినేనని నిరూపించుకోవచ్చు.
మంత్రి కన్నాగారు ఇంకా ఏమంటారంటే, “ఇటువంటి నిర్ణయాలు తప్పు పడితే, ఇప్పటివరకూ పని చేసిన మంత్రులందరూ జైలుకి వెళ్లవలసిందే” అని. తనని తాను సమర్ధించుకునే తొందరలో మంత్రిగారు సత్యం చెప్పారు. కన్నా గారి అభిప్రాయం ప్రకారం, జి.ఒ లని తప్పు పడితే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకూ పని చేసిన మంత్రులంతా ఇబ్బందులు పడతారు (జైలుకి వెళ్తారు). స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇప్పటివరకూ పాలించిన మంత్రులంతా చేసిందేమిటో మంత్రి కన్నా గారు చక్కగా చెప్పేశారు. ఈ మధ్యకాలంలో ఈ విధంగా నిజాలు ఒప్పుకున్న రాజకీయ నాయకులని ముఖ్యంగా మంత్రులు ఎవరూ లేరనుకుంటా. ఎమ్మేల్యేలు, మంత్రులు అయ్యాక ఉన్నపళంగా ఆస్తులు ఎలా పెరుగుతాయో తెలుసుకోడానికి మంత్రి కన్నా గారు క్లూ ఇచ్చారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసుల మూలంగానే మంత్రి మోపిదేవి వెంకట రమణ ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఆయన దారిలో వెళ్లవలసిన మంత్రి ధర్మాన ప్రసాద రావు మంత్రి పదవి మిగుల్చుకుని బతికిపోతున్నాడు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ, సి.బి.ఐ చార్జి షీటులో నిందితుడుగా ఉండి కూడా, రాజీనామాని ముఖ్యమంత్రి ఆమోదించకపోవడం వల్ల, అరెస్టు తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. ధర్మాన రాజీనామా పైన ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకం ఇంకో ప్రహసనం.
ఈ నేపధ్యంలో మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, గీతా రెడ్డి లు మంగళవారం సమావేశం అయ్యారు. సి.బి.ఐ కౌంటర్ దాఖలు చేసినందున తాము కూడా కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు వీరు ప్రకటించారు. వ్యక్తిగతంగానే కోర్టులో పోరాడాలని వీరు నిర్ణయించారట. వీళ్ళు చేసిన అవినీతి నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులు భరించి కోర్టులో సమర్ధించాలని ఇన్నాళ్లూ డిమాండ్ చేస్తూ వచ్చారు. అది కుదరదని తేలిందో ఏమో స్వంతగానే పోరాడుతాం అంటున్నారు.
జి.ఒ ల సంగతికి వస్తే, జి.ఒ లంటేనే తప్పు పట్టాల్సినవి కావని మంత్రిగారు చెప్పదలిచినట్లు కనిపిస్తోంది. బిజినెస్ రూల్స్ ప్రకారం జి.లు ఇస్తే వాటి ద్వారా ఎంత అవినీతి జరిగినా చట్టబద్ధమేనని ఆయన చెప్పదలిచారా?
ప్రభుత్వాల లక్ష్యం ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా వ్యవహరిస్తూ, కాపలాదారులుగా వ్యవహరించడం. వనరుల పంపిణీని ప్రజలందరికీ సమానంగా అందేలా చూడడం. అది వదిలేసి స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాలు నడపడమే జరుగుతోంది. సో కాల్డ్ స్వతంత్రం వచ్చినప్పటినుండీ ఇదే తంతు. అందుకే మంత్రిగారు స్వాతంత్ర్యం నుండి పని చేసినోళ్ళంతా జైలుకి వెళ్లాలని ఉన్నమాట చెప్పారు. ఇన్నాళ్లూ అవినీతి చేయగా లేనిదే తామొక్కరమే ఎందుకు జైలుకి వెళ్లాలని ఆయన వాదన. ఇది పూర్తిగా ఒప్పుకోవలసిన వాదన. ఆ మేరకు ఏర్పాట్లలో ఉన్నట్లయితే దేశ సేవకు నిజంగానే కట్టుబడి ఉన్నవారు బోలెడు మంది మంత్రి పదవులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రివర్యులు తెలుసుకోవాలి.

తప్పుడు పనులు చేయకుండా ఏదీ జరగటం లేదన్న మాట!!దేశాన్ని పీక్కు తింటున్నారండీ గొర్రె జనాల ఓట్లు కొని!!