విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు భారత దేశం చేసే ప్రయాణంలో అణు విద్యుత్ కర్మాగారాలు సహాయపడతాయా? లేక ఆటంకం కలిగిస్తాయా? ‘ది హిందూ’ కార్టూనిస్టు ‘కేశవ్’ కాసిన్ని గీతలు గీసి, మరి కాసిన్ని రంగులు అద్ది వివరించారు. అమెరికన్ అణు పరిశ్రమ వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికే భారత్-అమెరికాల మధ్య ‘అణు ఒప్పందం’ కుదుర్చుకున్నామని అణు నియంత్రణ సంస్ధ ఎ.ఇ.ఆర్.బి మాజీ అధిపతి గోపాల కృష్ణన్ సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టాడు. గతంలో అణు విద్యుత్ ను షరతుల్లేకుండా సమర్ధించిన ఇప్పటి అణు సంస్ధ అధిపతి అనీల్ కాకోడ్కర్ కూడా జాగ్రత్తలు తప్పవని హెచ్చరిస్తున్నాడు.
ఈ రెండు అంశాలు పరిశీలిస్తే భారత ప్రజల విద్యుత్ అవసరాలకు అణు విద్యుత్ ప్రోత్సాహమా లేక ఆటంకమా అన్నది ఇట్టే అర్ధం అవుతుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రజలని దేశ ద్రోహులుగా ముద్రవేసి మరీ కూడంకుళం కర్మాగారంలో యురేనియం ఇంధనం నింపుతోంది. విదేశీ కంపెనీల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్న పాలకులది దేశ భక్తి ఎలా అయింది, జీవించే హక్కుని డిమాండ్ చేస్తున్న వేలాది ప్రజలు దేశ ద్రోహులు ఎలా అయిందీ ప్రజలే తేల్చుకోవలసిన విషయం.

విశెఖర్ గారూ. ఇండియాతొ అణు వప్పందం ద్వారా అమెరికాకు చేకూరేప్రయొజనం ఏంటి ? నాకు ఇలాంటి విషయాలు కొత్త కొంచం తెలియచెపుతార.
షణ్ముగ గారు, ఇండియాతో అణు ఒప్పందం ద్వారా అమెరికా కంపెనీలు తప్ప లాభపడేదెవ్వరూ లేరు.
బాంబుల కోసమో, ఇంకోదాని కోసమో మన పాలకులకి (ప్రజలకి కాదు) యురేనియం ఇంధనం కావలసి వచ్చింది. భారత దేశంలో నాణ్యమైన ఇంధనం చాలా తక్కువ. అందువల్ల విదేశాలపై ఆధారపడక తప్పదు. ఆస్ట్రేలియా లాంటి చోట్ల ఇది ఎక్కువగా దొరుకుతుంది. కానీ ఆ దేశాలు ఇండియాకి ఇంధనం అమ్మవు. దానికి కారణం అమెరికా ఒత్తిడి.
ఇండియాకి యురేనియంతో పాటు ఇతర అణు పరికరాలు (రియాక్టర్లు మొ.వి) అమ్మకుండా అమెరికా నలభై యేళ్లనుండి నిషేధం విధించింది. ఇందిరా గాంధీ ఉన్నపుడు అణు పరీక్షలు జరపడమే దీనికి కారణం. ఇండియా స్వంతంగా అణు పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవడం అమెరికాకి ఇష్టం లేదు. అమెరికా, యూరప్ దేశాల దృష్టిలో తమకు తప్ప ఇంకెవరికి అణు బాంబులున్నా వాటి వల్ల ప్రపంచానికి ప్రమాదం ముంచుకొస్తుంది.
మొదట అణు బాంబు తయారు చేసింది అమెరికాయే. దాన్ని ప్రయోగించి లక్షల మందిని చంపిందీ కూడా అమెరికాయే. కొత్త కొత్త టెక్నాలజీ తో బాంబుల్ని ఆధునీకరించేది అమెరికాయే. స్వతంత్ర దేశాలపైన దాడులు చేసి దురాక్రమణలు చేసేది అమెరికాయే. అయినా తమ వద్ద తప్ప ఇంకో దేశం వద్ద , ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి పేద దేశాల దగ్గర అణు బాంబులు ఉండకూడదని అమెరికా పంతం. పంతం అనేకంటే ‘ఒక వ్యూహం’ అనడం సరైంది.
తన వ్యూహంలో భాగంగా ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు’ (ఎన్.ఎస్.జి) పేరుతోటి దాదాపు 40 దేశాలతో ఒక పెత్తందారీ గ్రూపుని అమెరికా ఏర్పరిచింది. దీనికి అమెరికా నాయకురాలు. ఈ గ్రూపు అనుమతి లేకుండా ఇతర దేశాలకు అణు ఇంధనం గానీ, అణు పరికరాలు గానీ అమ్మకుండా నిషేధం విధించుకున్నాయి. తమ షరతులకి తలొగ్గితేనే ఇంధనం గానీ, పరికరాలు గానీ అమ్మేవిధంగా నిబంధనలు ఈ గ్రూపు రూపొందించింది. ఈ పెత్తనం వల్ల ఇండియాకి నలభైయేళ్లు యురేనియం ఇంధనం అంతర్జాతీయ వ్యాపారంలో దొరకలేదు.
అణు ఒప్పందం పేరుతోటి అమెరికా ఇండియాతో బేరం పెట్టింది. మీకు ఇంధనం ఇస్తాం, బదులుగా మా రియాక్టర్లు కోనాలి అని. నిజానికి అణు విద్యుత్ కేంద్రాలని అమెరికా చాలా కాలంగా కట్టడం మానేసింది. ఫుకుషిమా తర్వాత యూరప్ లో కూడా వ్యతిరేకత ప్రబలింది. జర్మనీ మరో పదేళ్ళలో పూర్తిగా అణు విద్యుత్ ని త్యజించదానికి నిర్ణయించింది. జపాన్ కూడా అదే నిర్ణయం తీసుకోవచ్చని పత్రికలు చెబుతున్నాయి. ఫుకుషిమా ముందువరకూ అణు విద్యుత్ గురించి ఆలోచించిన దేశాలు ఇపుడు అందుకు సిద్ధంగా లేవు.
కానీ మన పాలకులు మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దానికి కారణం అమెరికా ఒత్తిడి. న్యూక్లియర్ కంపెనీలకి అమెరికాలో శక్తివంతమైన లాబీ ఉంది. దాని ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ఇండియాపైన ఒత్తిడి తెప్పించారు. చెర్నోబిల్ ప్రమాదంతో పాటు అనేక చిన్న, పెద్ద ప్రమాదాల వల్ల చాలా సంవత్సరాలుగా అమెరికా, తదితర దేశాల కంపెనీలు రియాక్టర్లని అమ్ముకోలేకపోయాయి. అలా వృధాగా పడి ఉన్న పరికరాలను మనకి అంటగట్టడానికి పశ్చిమదేశాల కంపెనీలు కుట్రలు చేసి ఇండియాపైన ఒప్పందాన్ని రుద్దాయి. కమిషన్లు మేసి మనవాళ్లు కూడా అందుకు రెడీ అయిపోయారు. ఇందులో విద్యుత్ ప్రయోజనాలు లేకపోగా కంపెనీల ప్రయోజనాలే ఉన్నాయి. అది కూడా విదేశీ కంపెనీలు.
ఈనాడులో వచ్చిన ఆర్టికల్ ని కొద్ది రోజుల క్రితం ఈ బ్లాగ్ లో ప్రచురించాను. దాని ప్రకారం మన అవసరాలు తీరాలంటే అమెరికా వాణిజ్య ప్రయోజనాలు నెరవేర్చక తప్పదని భారత అణు సంస్ధ అధికారులు చెప్పినట్లు రాశారు. రాసింది కూడా అణు శాస్త్రవేత్త. అది చెప్పకుండా మనకి విద్యుత్ కావాలంటే తప్పదు ని మన్మోహన్ బొంకుతున్నాడు. ప్రజల భద్రతను ఫణంగా పెట్టి అమెరికా కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు.
పోనీ మనం కొన్న ఇంధనాన్ని గానీ, అణు పరికరాలని గానీ మన ఇష్టానుసారం వినియోగించుకోవచ్చా అంటే, ఆదేమీ లేదు. విద్యుత్ ఉత్పత్తి చేశాక మిగిలిన ఇంధనాన్ని అమెరికాకి అప్పజెప్పాలి. లేదా దేనికీ వినియోగించేదీ అమెరికాకి చెప్పి చేయాలి. ఇంధనాన్ని పక్కకి మళ్లించకుండా అణు కర్మాగారాల్లో అమెరికా కెమెరాలు పెడుతుంది. ఈ షరతులకి మన్మోహన్ ఒప్పుకున్నాడు. ఈ ఒప్పందానికి అంగీకరించకపోతే రాజీనామా చేస్తానని ప్రభుత్వాన్ని బెదిరించి మరీ సంతకం చేశాడు.
ఇది పూర్తిగా అసమాన ఒప్పందం ఇండియా మెడలు వంచి కుదిర్చిన ఒప్పందం. మెడలు వంచడానికి మన పాలకులు సిగ్గుపడరు. వారి పని అదే. కానీ ప్రజలకి అబద్ధాలు చెబుతున్నారు. ప్రజల పట్ల బాధ్యతని గాలికొదిలి విదేశీ కంపెనీల ప్రయోజనాలను నెరవేరుస్తున్నారు. అందుకే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాలి.
మన్మోహన్ సింగ్ సామ్రాజ్యవాదులకి ఇంత విశ్వాసపాత్రుడు కాబట్టే గ్లోబలైజేషన్ అనుకూల పత్రికలు “మన్మోహన్ సింగ్ నిజాయితీపరుడనీ, అతని వెనుకాల ఉన్న మంత్రులు మాత్రమే అవినీతిపరులనీ” ప్రచారం చేస్తున్నాయి.