అణుకంప కేంద్రం! -ఈనాడు ఎడిటోరియల్


కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం (Photo: indrus.in)

(అణు విద్యుత్ కి వ్యతిరేకంగా దేశంలో క్రమంగా నిరసన వ్యాపిస్తోంది. ప్రజల పట్ల జవాబుదారీతనం లేని ప్రభుత్వాల వ్యవహార శైలి మేధో జీవులను కదిలిస్తోంది. ప్రజల భయాలకు సమాధానం చెప్పే బదులు ‘జీవించే హక్కు’ ను కోరడమే ‘దేశ ద్రోహం’ కింద లెక్కిస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల ‘ప్రజాస్వామిక డొల్లతనాన్ని’ పత్రికలు కూడా ప్రశ్నిస్తున్నాయి. సోమవారం, సెప్టెంబర్ 17 తేదీ నాటి ఈనాడు దిన పత్రిక సంపాదకీయం, కేంద్ర ప్రభుత్వ ఆలోచనా రాహిత్యాన్ని తూర్పారబట్టింది. ఆ సంపాదకీయమే ఇది.)

తమిళనాట కుడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమించిన స్థానికులకు అనూహ్య స్థాయిలో విశేష మద్దతు వ్యక్తమవుతోంది. భిన్నవర్గాలకు చెందిన సుమారు 120మంది ప్రముఖుల సంఘీభావ ప్రకటన- అణు విద్యుత్‌ రంధిలో జీవనభద్రత కొల్లబోతున్నదన్న ప్రజాందోళనను గట్టిగా సమర్థించింది. అణుశక్తి నియంత్రణ మండలికి గతంలో నేతృత్వం వహించిన గోపాలకృష్ణన్‌ మొదలు అరుంధతీరాయ్‌, సందీప్‌ పాండే వరకు వేర్వేరు నేపథ్యాలు కలిగినవారందరి సామూహిక స్పందనలో- సామాన్య జనావళి భయకంపిత గళమే ప్రతిధ్వనిస్తోంది! వెయ్యి మెగావాట్ల తొలి రియాక్టర్లో ఇంధనం నింపే కార్యక్రమం జరుగుతుందనగా వారంక్రితం అక్కడ నిరసన చిచ్చు ప్రజ్వరిల్లింది. అది వేల సంఖ్యలో ఆందోళనకారుల సమీకరణకు, ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారుల్ని చెదరగొట్టడానికి బాష్పవాయు ప్రయోగాలు, పోలీసు కాల్పుల దరిమిలా ఒకరి దుర్మరణం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. పరిసర గ్రామాలూ ఉద్రిక్తభరితమై జల సత్యాగ్రహం ఆరంభమైంది. పరిస్థితి ఇంతగా వికటించడానికి పుణ్యం కట్టుకున్నవి పాలకుల అలసత్వం, నిష్క్రియలే. దేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్కేంద్రం కుడంకుళంలో రానున్నదనగానే ఇబ్బడిముబ్బడిగా ఉపాధి అవకాశాలు అందివస్తాయని సంబరపడ్డ స్థానికుల్లో క్రమేణా భయానుమానాలు వేళ్లు తన్నుకున్నాయి. జపాన్‌లోని ఫుకుషిమా దుర్ఘటన తరవాత- అణువిద్యుత్‌కేంద్రమంటే మృత్యుభీకరమేనని తీవ్ర కలవరపాటుకు గురైన ప్రజానీకానికి సరైన సమాధానాలు, వివరణలు కరవయ్యాయి. జీవించే హక్కుకోసం పోరుబాట తొక్కిన వేలాది పౌరులపై దేశద్రోహ నేరాలు బనాయించారు. దమనకాండతో పోలీసులు నిరసనకారుల అణచివేతకు తెగబడ్డారు. ఈ దుర్మార్గాన్ని గర్హించిన సామాజికవేత్తలు- సమీక్షాసంఘం సిఫార్సుల మేరకైనా భద్రత చర్యలు చేపట్టలేదని అణుశక్తి నియంత్రణ మండలి ఒప్పుకోవడాన్ని సూటిగా ప్రస్తావిస్తున్నారు. భద్రతను ఇలా గాలికి వదిలేస్తే, అణువిద్యుత్‌ ప్రాజెక్టులు శవాల దిబ్బలను కళ్లకు కడతాయని హడలెత్తిపోతున్న ప్రజలకు దిక్కెవరు?

ప్రస్తుతం 4780 మెగావాట్లున్న అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2020లోగా 20వేల మెగావాట్లకు చేర్చే క్రమంలో కుడంకుళం పెద్ద ముందడుగని యూపీఏ సర్కారు పదేపదే చాటుతోంది. కుడంకుళం లక్షిత సామర్థ్యం రెండువేల మెగావాట్లకన్నా, తమిళనాడులో గాలిమరల ద్వారా ఉత్పత్తి చేస్తున్న పవన విద్యుత్తే ఎక్కువ. ఈ అరకొర అణువిద్యుత్తే పరమాద్భుతమంటున్న సర్కారు భద్రతా ప్రమాణాలకు సంబంధించి వాస్తవాలు బహిర్గతం చేయకపోవడంపట్ల పదునైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుడంకుళం కర్మాగారం త్వరలో పని ప్రారంభించడం తథ్యమన్న కేంద్రమంత్రి వీరాస్వామి- భూకంపం, సునామీ వచ్చినా తట్టుకోగల శక్తి దేశీయ అణు ప్రాజెక్టులన్నింటికీ ఉందని ఢంకా బజాయిస్తున్నారు. భద్రతా ప్రమాణాల వాసి అంత దివ్యంగా విలసిల్లితే- తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిని పక్కకు తప్పించి కుడంకుళం కేంద్రానికి ఆదరాబాదరా అనుమతులు ఎందుకు రాబట్టినట్లు? విద్యుత్‌కేంద్రంలో ఏదైనా ఘోరం సంభవిస్తే, పరిహారం చెల్లించే బాధ్యత ఎవరిదని ప్రధాని మన్మోహన్‌ అణుశక్తి విభాగానికి లేఖ రాయడంలో అంతరార్థమేమిటి? జరగరానిది ఏమైనా జరిగితే తమమీద ఈగైనా వాలరాదన్నట్లు చట్టబద్ధ రక్షణల కోసం బహుళజాతి సంస్థలు వెంపర్లాడుతున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని; ఇంతవరకు అణు, రేడియేషన్‌ విధానమే రూపొందలేదని ‘కాగ్‌’ నివేదిక తూర్పారబట్టింది. ఆ వూసెత్తకుండా తమిళనాడు ప్రభుత్వాన్ని ఏదోలాగా ఒప్పించగలిగామంటున్న కేంద్ర సచివులు, స్థానిక నిరసన వెనక విదేశీ శక్తుల ప్రమేయముందంటూ చౌకబారు ఆరోపణలకు పాల్పడుతున్నారు. ఒక్క కుడంకుళంలోనే కాదు- మహారాష్ట్రలోని జైతాపూర్‌, హర్యానాలోని గోరఖ్‌పూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వాసులు తమకు అణువిద్యుత్‌ప్రాజెక్టులు వద్దుమొర్రో అని కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకోని ‘ధర్మ ప్రభువులు’ జాతి గుండెలపై కుంపట్లు రగిలించడానికే కంకణం కట్టుకున్నట్లు, నిష్పూచీ బాగోతాలు వెలగబెడుతున్నారు!

ఆరు దశాబ్దాల నాడు అణువిద్యుదుత్పాదన ప్రయోగాలు ఆరంభమయ్యాయి. నేటికీ వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్వడమే తప్ప- పూర్తిస్థాయి అణుభద్రత యంత్రాలు, యంత్రాంగాల సృష్టిలో మానవాళి సంపూర్ణ విజయం సాధించలేకపోయింది. జాతి ఇంధన భద్రతకు అణువిద్యుత్‌ అత్యావశ్యకమంటున్న యూపీఏ నాయకగణం జనం గుండెల్లో అణుభయాలను ఉపశమింపజేసే బాధ్యతను సాంతం విస్మరించిందన్నది, అంతకన్నా చేదునిజం. భారత అణువిద్యుత్‌ కార్యక్రమంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇనుమడించాల్సి ఉందని ప్రధానమంత్రి ఆమధ్య సెలవిచ్చారు. కుడంకుళం, కక్రపార్‌, హరిపూర్‌, కొవ్వాడ లాంటిచోట్ల క్షేత్రస్థాయి నిరసనలు ఎందుకు భగ్గుమంటున్నాయో లోతుగా తరచిచూసే శ్రద్ధ, ఆసక్తి పాలకుల్లో కరవు! భారత్‌కు అణురియాక్టర్లు సరఫరా చేస్తున్న దేశాలన్నింటా ప్రమాదాల చరిత్ర దేశీయంగా నిరసనోద్యమాలకు వూపిరి పోస్తోంది. కొత్త రియాక్టర్ల నిర్మాణాన్ని స్విట్జర్లాండ్‌ నిలిపేయగా, ఉన్న అన్ని ప్రాజెక్టుల సమీక్షకు రష్యా సిద్ధపడుతోంది. కొన్నాళ్లక్రితం వరకు తమ విద్యుదవసరాల్లో 30 శాతం దాకా అణుప్లాంట్ల ద్వారా తీర్చుకున్న జపాన్‌ను నిరుటి ఫుకుషిమా దురంతం ఠారెత్తించింది. దైచీ అణువిద్యుత్‌ కేంద్రం సునామీ పాలబడి భారీగా రేడియోధార్మికత వెలువడి గగ్గోలు పుట్టాక, అక్కడి 50 ఉత్పాదక కేంద్రాలూ వరసగా మూతపడ్డాయి. ఒకప్పుడు అణువిద్యుత్‌తప్ప దేశానికి దిక్కులేదన్న కకోడ్కర్‌ లాంటి శాస్త్రవేత్తలూ రియాక్టర్ల శీతలీకరణ వ్యవస్థల మెరుగుదలతో పాటు మరిన్ని భద్రతాంశాల మీదా తప్పక దృష్టి సారించాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో దిట్టలనిపించుకున్న దేశాలే ఆచితూచి అడుగేస్తున్న దశలో, అణుభూతానికి ఆవాహన చేసేదాకా తగ్గేది లేదన్న యూపీఏ సర్కారు మంకుపట్టు వల్ల- సామాజిక అశాంతి పెచ్చరిల్లుతోంది; జాతి జీవన భద్రతే చచ్చుబడుతోంది!

One thought on “అణుకంప కేంద్రం! -ఈనాడు ఎడిటోరియల్

  1. సామ్రాజ్యవాది బూటు మీద కాకిరెట్ట పడితే తన జేబులోని వంద రూపాయల నోట్‌తో దాన్ని తుడిచి సామ్రాజ్యవాదుల పట్ల భక్తిని చాటుకునే మన్మోహనులు ఉన్నంత కాలం దేశం ఇలాగే ఉంటుంది.

వ్యాఖ్యానించండి