ఇస్లాంని అవమానిస్తూ అమెరికాలో రూపొందిన సినిమాను నిరసిస్తూ ప్రపంచ వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నాయి. గత మంగళవారం బెంఘాజీ (లిబియా) లో అమెరికా రాయబారిని బలి తీసుకున్న ముస్లింల ఆగ్రహ ప్రదర్శనలు ఆసియా, ఆఫ్రికాలతో పాటు యూరోపియన్ దేశాలకు కూడా విస్తరించాయి. మహమ్మద్ ప్రవక్తను ‘స్త్రీ లోలుడు’ గా హంతకులకు నాయకుడుగా చిత్రీకరించడం పట్ల చెలరేగిన నిరసన పలు చోట్ల హింసాత్మక రూపం తీసుకున్నాయి. లిబియా, ఈజిప్టులతో పాటు ట్యునీషియా, సూడాన్ లలో కూడా అమెరికా రాయబార కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. సూడాన్ లో బ్రిటన్, జర్మనీ రాయబార కార్యాలయాలపైనా ప్రదర్శకులు దాడి చేశారు.
సూడాన్ రాజధాని ఖార్టోమ్ లో నిరసనకారులు అమెరికా ఎంబసీలోకి జొరబడ్డారు. జర్మనీ, బ్రిటన్ ఎంబసీ లపై కూడా దాడి జరిపారు. ట్యునీషియా రాజధాని ట్యునీస్ లో అమెరికా రాయబార కార్యాలయంపై దాడి జరిపారు. పోలీసులు ప్రదర్శకులపై కాల్పులు జరపడంతో వారు కూడా ప్రతి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. యెమెన్, ఈజిప్టులలో ఘర్షణలు జరిగాయి. లెబనాన్ లో జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు.
ట్యునీషియాలో కొన్ని వందల మంది ఆందోళనకారులు అమెరికా ఎంబసీలోకి చొరబడ్డారని బి.బి.సి తెలిపింది. వారు కార్ పార్క్ ను తగలబెట్టారని తెలిపింది. పోలీసులు వారిపై కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఎంబసీ పై ‘అల్లా తప్ప మరో దేవుడు లేడు, మహమ్మద్ ఆయన దూత’ అని రాసి ఉన్న ఆల్-ఖైదా జెండాను వారు ఎగరేశారు. సూడాన్ రాజధాని ఖార్టోంలో జర్మనీ ఎంబసీకి పాక్షికంగా నిప్పు పెట్టారు. జర్మనీ జాతీయ జెండాను చించేసి ఇస్లామిక్ బ్యానర్ ను దాని స్ధానంలో నిలిపారు.
ఈజిప్టు రాజధాని కైరోలో అమెరికా ఎంబసీని వేలాది మంది ప్రదర్శకులు చుట్టుముట్టి అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రదర్శకులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టడానికి ప్రయత్నించినా నిరసనలు కొనసాగాయి. ముళ్ళ కంచెలతోటీ, సిమెంటు దిమ్మలతోటీ వీధులను పోలీసులు దిగ్బంధిచినా నిరసనలు ఆగలేదు. సినాయ్ ద్వీపకల్పంలోని సైనిక స్ధావరంలోకి ప్రదర్శకులు చొచ్చుకెళ్లగా, అలెగ్జాండ్రియా నగరంలొ అమెరికా ఎంబసీ ముందు ఘర్షణలు జరిగాయి. ముస్లింల ఆగ్రహానికి కారణమైన ‘ఇన్నోసెంట్స్’ సినిమా పట్ల ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ ముర్సి నిరసన తెలిపాడు. ముర్సి సభ్యుడుగా ఉన్న ముస్లిం బ్రదర్ హుడ్ సంస్ధ కూడా ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించింది.
యెమెన్ రాజధాని సనా లో అమెరికన్ ఎంబసీ ముందు నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శకులపై పోలీసులు నీటి క్షిపణులు ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపారు. ఎంబసీ రక్షణ కోసం 50 మంది మెరైన్లను అదనంగా పంపినట్లు అమెరికా ప్రకటించింది. లెబనాన్ నగరం ట్రిపోలి (లిబియా రాజధాని కాదు) లో కోడి మాంసం ఉత్పత్తి చేసే అమెరికా బహుళజాతి సంస్ధ కె.ఎఫ్.సి షాపుకి నిప్పు పెట్టారు. ప్రదర్శకులు భద్రతా బలగాలతో కలబడ్డారు. బాంగ్లాదేశ్ లో వేలాదిమందితో ప్రదర్శనలు జరిగాయి. సినిమా నిర్మాతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమెరికా జాతీయ జెండాను తగలబెట్టారు.
యూరోపియన్ నగరాల్లోనూ నిరసనలు జరిగాయి. లండన్ లో దాదాపు 200 మంది నిరసనకారులు అమెరికా ఎంబసీ ముందు ప్రదర్శనలు జరిపారు. అమెరికా, ఇజ్రాయెల్ జాతీయ జెండాలను తగలబెట్టారు. ఆఫ్ఘనిస్ధాన్ నగరం జలాలాబాద్ లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బెల్జియం రాజధాని బ్రసేల్స్ లో అమెరికా ఎంబసీ ని ముందుగానే ఖాళీ చేశారు. పాలస్తీనా నగరాలు గాజా, తూర్పు జెరూసలేం లలో వేలాది మందితో ప్రదర్శనలు జరిగాయి. నైజీరియాలో మసీదుల ముందు ప్రదర్శన జరుపుతున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. శ్రీలంక, మాల్దీవులలో సైతం ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఇండియాలో కూడా చెన్నైలో అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి.
యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జోస్ మాన్యువల్ బోరోసొ హాస్యాస్పద ప్రకటన ఒకటి చేశాడు. పశ్చిమ దేశాల ఎంబసీలపై జరుగుతున్న దాడులు ‘నాగరిక ప్రపంచ నియమాలకు విరుద్ధం’ అని ఆయన ప్రకటించాడు. సద్దాం వద్ద సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి ఆంక్షలు విధించి, ఆ దేశంలోని పసిపిల్లలకు పాలడబ్బాలు కూడా అందకుండా చేసిన యూరోపియన్ యూనియన్ కి తమదాకా వచ్చాక ‘నాగరిక ప్రపంచ నియమాలు’ గుర్తుకు వచ్చాయట. ఇరాక్, లిబియాలపై అమానవీయంగా దాడి చేసి దేశాధ్యక్షులతో పాటు, వేలాది మంది పౌరులను యుద్ధ విమానాలతో బాంబులతో హత్యలు కావించినపుడు ఈ నాగరిక సూత్రాలు ఏమైపోయాయో మరి? తాము యుద్ధం ప్రకటించిన టెర్రరిస్టులకే విధ్వంసక ఆయుధాలు సరఫరా చేసి సిరియాలో కిరియా తిరుగుబాటు నడపడం, స్వతంత్ర సిరియా సార్వభౌమత్వాన్ని కబళించడం, వేలాది సిరియా పౌరుల మరణాలకు దోహదం చేయడం ఏ నాగరిక సూత్రమో ఈయనగారు సెలవివ్వాలి.
మంగళవారం కైరో (ఈజిప్టు), బెంఘాజీ (లిబియా) లలో అమెరికా ఎంబసీలలో ఒకేసారి దాడి చేయడంతో ప్రారంభమయిన అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు క్రమంగా ప్రపంచం అంతటా విస్తరించాయి. బెంఘాజిలో అమెరికా ఎంబసీ పై రాకెట్ ప్రొపెల్డ్ గ్రేనేడ్ తో జరిగిన దాడిలో అమెరికా రాయబారితో పాటు నలుగురు అమెరికన్లు చనిపోయారు. దానితో ప్రపంచవ్యాపితంగా తమ ఎంబసీల వద్ద రక్షణ పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
మహమ్మద్ ప్రవక్తను, ఇస్లాం ను పరిహసిస్తూ తీసిన సినిమా నిజానికి ఇటీవల నిర్మించినదేమీ కాదు. అమెరికాలోని ‘క్లారియన్ ఫండ్’ అనే క్రైస్తవ మతఛాందస సంస్ధ, ఇస్లాం వ్యతిరేక ప్రాపగాండాలో భాగంగా తీసిన ఈ సినిమా నిర్మించి పలు సంవత్సరాల గడిచాయి. అలాంటిది అదేదో నిన్న మొన్న విడుదల అయినట్లు సినిమా వల్లనే నిరసనలు చెలరేగాయని పశ్చిమ పత్రికలు చెప్పడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. తమ ప్రచారాన్ని సమర్ధించుకోవడానికి అరబిక్ సబ్ టైటిల్స్ తో యూ ట్యూబ్ లో పోస్ట్ చేసింది ఇప్పుడే అని చెబుతున్నాయి.
ఆశ్చర్యకరంగా సినిమా ఎవరు నిర్మించిందీ కూడా తమకు తెలియదని పశ్చిమ కార్పొరేట్ వార్తా సంస్ధలు చెబుతున్నాయి. (ఉదాహరణకి బి.బి.సి రాసిన వార్త: The film’s exact origin and the motivation behind its production remain a mystery.) సిరియాలో విలేఖరులు తిరిగే అవకాశం లేకపోయినా ప్రభుత్వ బలగాలు వందలోందల ప్రజల్ని చంపేస్తున్నాయని దొంగ ఫోటోలు పెట్టి మరీ చెప్పిన పశ్చిమ వార్తా సంస్ధలు ఒక అమెరికన్ క్రిస్టియన్ మాట ఛాందస సంస్ధ నిర్మించిన దురహంకార సినిమా ఎవరు నిర్మించారో ‘మిస్టరీ’ గా ఉందని చెబుతున్నాయి. సెప్టెంబర్ 11 దాడుల వార్షికోత్సవ సందర్భంగా ముస్లిం సంస్ధలు ఒక పధకం ప్రకారం కైరో, బెంఘాజీ లలోని అమెరికా రాయబార కార్యాలయాలపై హింసాత్మక దాడులు నిర్వహించాయని గ్లోబల్ రీసర్చ్ లాంటి సంస్ధలు విశ్లేషిస్తుండడం గమనార్హం.
అమెరికా వ్యతిరేక నిరసనలు ప్రపంచవ్యాపితంగా జరిగితే అదీ అమెరికా మద్దతు ఇచ్చి అధికారంలో నిలిపిన ఈజిప్టు, లిబియాల్లోనే, అమెరికా మద్దతు ఉన్న ముస్లిం టెర్రరిస్టు సంస్ధలే, తమ రాయబారిని చంపితే అది ప్రపంచానికి తెలియకూడదన్నమాట! దానిని కూడా ఏదో సినిమా చూసి గోల చేస్తున్నారని తప్పుడు ప్రచారంలోకి తోసేయ్యాలన్న మాట!

మూర్ఖత్వానికి ఏ మతమైతే ఏమిటి కానీ ‘డా విన్సీ కోడ్’ సినిమాని నిషేధించాలని గొడవ చేసినవాళ్ళకి కూడా ఆ సినిమాలో ఏముందో తెలుసని అనుకోను.