చంద్రబాబు నాయుడు గారూ! గ్యాస్ బండ మోస్తే, నిరసనా?


Photo: Frontpageindia.com

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పెంచింది. పెంచడం పరోక్షంగా జరిగినా జనంపైన మాత్రం ప్రత్యక్షంగా బాదేసింది. సంవత్సరానికి కుటుంబానికి 6 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ రేట్లకు ఇస్తానని చెప్పింది. తద్వారా మిగిలిన సిలిండర్లను ఓపెన్ మార్కెట్లో 750/- ధరకి కొనక తప్పని పరిస్ధితి కల్పించింది. బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ప్రతి కుటుంబం పైనా సంవత్సరానికి అదనంగా 750 రూపాయల భారం పడనుంది. ఈనాడు ఎడిటోరియల్ ప్రకారం ఐదుగురు ఉన్న కుటుంబానికి నెలకి ఒక సిలిండర్ ఖర్చవుతుంది. వీరందరిపైనా ఏడాదికి 2,000/- అదనపు భారం పడుతుందని ఈనాడు తెలిపింది.

ఇది నేపధ్యం. ఈ ఘోరం పైన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలపాలనుకున్నారు. గ్యాస్ ధరల పరోక్ష పెంపుదల ద్వారా ప్రజల్లో ప్రబలిన వ్యతిరేకతను ఆయన సొమ్ము చేసుకోవాలనుకున్నారా లేక నిజంగానే ప్రజలు ఎదుర్కోనున్న భారం తలచుకుని కదిలిపోయారో తెలియదు (తెలుసనుకోండి!) గానీ చంద్రబాబు నాయుడుగారు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసన తెలపడానికి సిద్ధపడ్డారు. దానికాయన ఎంచుకున్న మార్గమే చాలా ఘోరంగా ఉంది. కోట్లాది శ్రమ జీవులని అవమానపరిచేదిగా ఉంది. శ్రమని అమ్ముకోవడం తప్ప బతకడానికి మరొక మార్గం లేని కోట్లాది కూలీలని ఎద్దేవా చేసినట్లుగా ఉంది.

నిరసన తెలియజేయడానికి ప్రతిపక్ష నాయకుడికి గ్యాస్ బండ మోయడం ఒక మార్గం అయితే బతకడానికి గ్యాస్ బండ మోస్తున్నవారి పరిస్ధితిని ఎలా చూడాలి? గ్యాస్ బండ మొయ్యడం అంటే శ్రమ. చంద్రబాబు నాయుడిగారి ఇంటి వంటగదికి గ్యాస్ బండ రావాలన్నా, ముఖ్యమంత్రి ఇంటికి రావాలన్నా, ఎవరో ఒకరు మోస్తేనే గ్యాస్ బండ తాను ఉండవలసిన స్ధానానికి చేరుకుంటుంది. దానంతట అది నడిచిరాదు. బండి మీద తెచ్చినా, రిక్షాలో తెచ్చినా, మినీ లారీలో తెచ్చినా వాహనం నుండి ఇంట్లోకి సిలిండర్ చేరాలంటే ఒక కూలీ దాన్ని మొయ్యాల్సిందే. ‘మొయ్యడం’ అనే శ్రమ ఎవరో ఒకరి చెయ్యాల్సిందే. అలాంటి శ్రమని చంద్రబాబు నాయుడు గారు అవమానించడం తగునా?

శారీరక శ్రమలు ఇమిడి ఉన్న పనులని కింది స్ధాయి శ్రమలుగా, బుద్ధిని ఉపయోగించి చేసే శ్రమలని గొప్ప శ్రమలుగా భావించే బుద్ధి ఒక వైకల్యం. అది సామాజిక అంగవైకల్యం. మానవ జీవనంలో శ్రమ చేస్తే తప్ప పూచిక పుల్ల కూడా నడిచిరాదు. మనిషిని జంతువు నుండి వేరు చేసిందే శ్రమ. శ్రమ ద్వారానే మనిషి కొత్త కొత్త ఉత్పత్తి పరికరాలను తయారు చేసుకుని, ఉత్పత్తి పెంచుకుని, సామాజిక సంబంధాలని నాగరిక స్ధాయికి తెచ్చుకోగలిగాడు.

మేధో పరిజ్ఞానం అభివృద్ధి చెందిందంటే, సాంకేతిక పరిజ్ఞానం అనూహ్య స్ధాయికి చేరుకుందంటే, శారీరక శ్రమే వాటికి మూలం. కోట్లాది శారీరక శ్రమల వైఫల్యాల, విజయాల అనుభవాలే వేలాది ఉత్పత్తిపరికరాల సృష్టికి దారి తీసాయి. కొడవలయినా, కంప్యూటరయినా శ్రమ చేయకుండా ఒక ఉత్పత్తి పరికరం తయారు కాదు. ఉత్పత్తి పరికరంపై శ్రమని వెచ్చించకపోతే ఆ పరికరమే పనికిరానిదిగా ఉండిపోతుంది. శారీరక శ్రమల తాలూకు అనుభవాలు పోగుపడితేనే విజ్ఞానం. శ్రామిక అనుభవాలు, వాటి ఫలితాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చితేనే ఒక శాస్త్రం పుడుతుంది. అంటే, శాస్త్ర పరిజ్ఞానం అనేది కోట్లాది శ్రామికులు వేల యేళ్లపాటు చేసిన శారీరక శ్రమల ఫలితం.

శారీరక శ్రమల ఫలితాన్ని అక్షరీకరించుకుని, శాస్త్రబద్ధం చేసుకుని, పుస్తకాల్లో బధ్రపరిస్తే అది టెక్స్ట్ బుక్స్ గా, పరిశోధనా గ్రంధాలుగా, శాస్త్ర సిద్ధాంతాలుగా మనముందు ఉన్నాయి. వాటిని చదివి, అర్ధం చేసుకుని, వీలయితే కొంత చేర్చి మళ్ళీ అప్పజెబితే, పరీక్ష పేపర్లపై రాసి సర్టిఫికెట్లు తెచ్చుకుంటే… అదే మేధావితనంగా చలామణి అవుతోంది.  అంతేతప్ప పుస్తకాలు వాటికవే విజ్ఞానం కాదు. విజ్ఞాన ప్రతిబింబం పుస్తకాలు. శారీరక శ్రమల నుండి నేర్చుకున్న జ్ఞానాన్ని బుర్రలో భద్రపరుచుకుని ఆ శారీరక శ్రమలనే ఈసడించుకోవడం బుద్ధి వైకల్యం.

పాలకులకి, ధనికులకి, మేధావులం అనుకుంటున్నవారికీ శ్రమని అవమానించడం కొత్తకాదు. చాలా యేళ్ళ క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి ఒకరు ఏదో మతపరమైన తప్పు చేశాడని గురుద్వారా ముందు కూర్చుని చెప్పులు తుడవాలని శిక్ష విధించారు. మెడికోలకి కోపం వస్తే నిరసనగా రోడ్లు ఊడవడం పరిపాటి. రిజర్వేషన్లపై నిరసన చెప్పాలనుకున్నపుడు మన భారత అగ్రకుల ప్రతిభావంతులు కూడా ఇలాగే చెప్పులు తుడవడం, బూట్ పాలిష్ చెయ్యడం, రోడ్లు ఊడ్వడం ఒక నిరసన కార్యక్రమగా చేపడతారు. పెట్రోల్ రేట్లు పెంచితే ఆటోలు, కార్లను తాళ్ళతో లాగి ఫోటోలకు ఫోజులిస్తూ జాతర చేస్తారు. వీళ్ళ దృష్టిలో ఈ శారీరక శ్రమలు చెయ్యడం ఒక శిక్ష. ఒక శిక్షను తమకు తామే వేసుకోవడం వారు తెలియజేసే నిరసన.

రెండొందల యేళ్లు భారత దేశాన్ని దోచుకుతిన్న తెల్లోడిని మెడబట్టి బైటికి గెంటకుండా  అన్నం మానేసి తనతోపాటు కోట్లాది భారత పోరాట కార్యకర్తలను కూడా శిక్షించిన గాంధీ ఈ దరిద్రగొట్టు నిరసన రూపానికి మూల పురుషుడు. ఆ తర్వాత పాలకులు, పాలకులతో కుమ్మక్కయిన ప్రజా విద్రోహులు దీన్ని ఒక కళగా అభివృద్ధి చేసి ఆకలితో, దరిద్రంతో, అణచివేతలతో వేగిపోతున్న శ్రామిక ప్రజలపై రుద్దారు. తద్వారా ప్రజా చైతన్యాన్ని మొద్దుబార్చారు. గాంధీ పోరాట రూపానికి ప్రపంచంలో అనేక దేశాల ఆధిపత్య వర్గాలకు ఆదర్శ పోరాటరూపం. తాము ఆచరించడానికి కాదు, ప్రజల చేత ఆచరింపజేయడానికి. అలాంటి పోరాట రూపం ఆంధ్ర పదేశ్ సంస్కరణల రూపకర్త అయిన చంద్రబాబు నాయుడికి అనుసరణీయం కావడంలో ఆశ్చర్యం లేదు.

బుద్ధి జీవుల బుద్ధి వైకల్యం వల్ల శారీరక శ్రమకూ, మేధో శ్రమకూ మధ్య ఉన్న వైరుధ్యం వెర్రితలలు వేస్తున్నది. అగ్ర స్ధానం పొందవలసిన శ్రమ అధోస్ధానంలో ఉంది. దానితో శ్రమను అవమానించడం కొందరికి అలవాటుగా మారితే ఇంకొందరికి ఫ్యాషన్ గా మారింది. ఈ వైకల్యాన్ని సరి చేసుకోకపోతే ఇక సమాజానికి పుట్టగతులు ఉండవు.

12 thoughts on “చంద్రబాబు నాయుడు గారూ! గ్యాస్ బండ మోస్తే, నిరసనా?

  1. నిరసన సమయంలో గాడిదలని ఊరేగించి చాకలివాళ్ళని అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో బట్టల మూటలు మొయ్యడానికి చాకలివాళ్ళు గాడిదలని ఉపయోగిస్తుంటారు.

  2. “కొడవలయినా, కంప్యూటరయినా శ్రమ చేయకుండా ఒక ఉత్పత్తి పరికరం తయారు కాదు. ఉత్పత్తి పరికరంపై శ్రమని వెచ్చించకపోతే ఆ పరికరమే పనికిరానిదిగా ఉండిపోతుంది. శారీరక శ్రమల తాలూకు అనుభవాలు పోగుపడితేనే విజ్ఞానం. శ్రామిక అనుభవాలు, వాటి ఫలితాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చితేనే ఒక శాస్త్రం పుడుతుంది. అంటే, శాస్త్ర పరిజ్ఞానం అనేది కోట్లాది శ్రామికులు వేల యేళ్లపాటు చేసిన శారీరక శ్రమల ఫలితం.”

    వ్యాసం ఆద్యంతం బాగున్నా, పై ఉటంకింపులోని విషయం హృద్యంగా ఉంది.

    పారిశ్రామికవాడలన్నింటింలోనూ ఈ నాటికీ కార్మికులను, రోజు కూలీలను… ‘చెప్పింది మాత్రమే చేసే బుర్రలేనోళ్లు’ గా చిత్రిస్తూ నీచంగా చూస్తున్నది మన పారిశ్రామిక సంస్కృతి.

    ప్రపంచంలో శారీరక శ్రమ అనేదే లేకపోతే మేధో శ్రమగాళ్లకు కూడు కూడా దక్కదన్నది వాస్తవం. శ్రమను గుర్తించిని, శ్రమను గౌరవించని మేధస్సు ఒక మేధస్సేనా?

    రైతు ఏ స్కేలు కూడా వాడకుండా తన జీవితానుభవం నేర్పిన జ్ఞానంతో పొలంలో 90 డిగ్రీల చక్కదనంతో ఎడ్లను నడిపి కొండ్ర వేస్తాడు. వంపులు లేకుండా కొండ్ర నిటారుగా వేయడంలోనే రైతు పనితనం దాగి ఉందని గ్రామీణ సమాజం విశ్వాసం. రైతు సంపాదించే ఈ సంచిత జ్ఞానం మేథస్సు కాకుండా పోయి కాగితాలను, కంప్యూటర్లను ఆడించే జ్ఞానం మాత్రమే మేధస్సు ఎలా అయింది?

    శారీరక శ్రమలను హీనంగా చూసే ఈ కుహనా మేధస్సు వెనుక మార్మికత్వాన్ని బద్దలు గొట్టవలసిన అవసరముంది.

    మానవ శ్రమల వెనుక తాత్విక కోణాన్ని మీ కథనం చక్కగా వ్యక్తీకరించింది.

    అభినందనలు.

  3. అవును కదా రాజు గారూ, నా చిన్నపుడు ఆ నిటారు కొండ్రలు ఒక అద్భుతం. బస్సుల్లో, రైళ్లలో వెళుతూ చూస్తున్నపుడు ఈ కొండ్ర గీతలు గుండ్రంగా తిరుగుతూ ఏదో తెలియని భావాల్ని కలిగించేవి. మీరన్నట్లు కొండ్రలు రైతు మేధకు సరైన సాక్ష్యం.

  4. శారీరక శ్రమ , మానసిక శ్రమ , నైపుణ్య శ్రమ శ్రమలన్నీ దేనికదే ప్రత్యేకం . పరస్పరాధారితాలు. ఎక్కువ తక్కువ అంటూ కొలతలు అనవసరమైనవి. ఓ డాక్టర్ వైద్యం చేయాలీ అంటే వేసుకున్న కోటు , పట్టుకున్న కత్తెర వంటి పరికరాలు లేకుండా తన మేధస్సును ఎలా ప్రదర్శించగలడు- ప్రయోజనం లో పెట్టగలడు. కోటులో ముడిపదార్ధం ప్రత్తిని పండించే కూలీ గుర్తుకు రావాల్సిందే. నోట్లోకి అన్నం పోయేటప్పుడు ఆ ముద్ద లో కూలీ శ్రమ చూడలేని మేధస్సు వృధాయే. అడుగడుగునా ఏ వస్తువు ఉపయోగం లోకి వచ్చినా అక్కడ శ్రమ ఇమిడే ఉంటుంది. మెదడు పని చేయాలంటే ఆ మెదడు శరీరం లోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. శరీరం పని చేయడానికి ఏ ఆహారం శ్రమ లేకుండా రాదు. ఏట్లో నీరు నోట్లొకి రావాలన్నా , పల్లెం లో అన్నం పంటి క్రిందకు రావాలన్నా శ్రమ చేయాల్సిందే. మంచి పోస్టు శ్రమ విలువను , గొప్పతనాన్ని తెలిపేందుకు ఈ అంశాన్ని వాడుకోవడమూ సబబు సబబు. అభినందనలు విశేఖర్ గారు.

  5. Gandhi ni polchadam correct kaadu.. emi cheyyaleni chetakani vallakamte tana prayatnam chesaru gaandhi..ippudu dadapu ade paristiti vumdi kada meeru mana palakulanu meda patti bayataku genti veya galara..?chetakani chevaleni analysis valla mee greatness masaka baaripotumdi ituvamti post chesemundu alochimchamdi..Ravi Kiran D.S.P. @KKD

  6. గాంధీ చరిత్ర మీకు తెలిసినట్టు లేదు. ఎం.వి.ఆర్.శాస్త్రి గారు వ్రాసిన “మన మహాత్ముడు” పుస్తకం మీ కాకినాడలో కూడా దొరుకుతుంది. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో పోలీసులు నిరాయుధులపై కూడా కాల్పులు జరిపేవాళ్ళు. పోలీసులు నిరాయుధులపై కాల్పులు జరిపినప్పుడు గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌లపై దాడులు చేసి తగలబెట్టేవాళ్ళు. ఆ సమయంలో గాంధీ హింస పెరిగిపోతోందని చెప్పి స్వాతంత్ర్య పోరాటాన్ని ఆపివెయ్యించడానికి ప్రయత్నించాడు కానీ తన credentialsని నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు. గాంధీ బ్రిటిష్‌వాళ్ళకి అంత విశ్వాసపాత్రునిగా పని చేశాడు.

  7. శ్రమయేవ జయతే….శ్రమలోనే సర్వస్వం ఉంది. కొంతమందికి శ్రమపడకుండానే అన్నీ సమకూరుతున్న దృష్టాంతాలు కనిపించవచ్చు. కానీ వాళ్ల సుఖం వెనుక కూడా ఎవరోఒకరి శ్రమ ఉంటుంది. శ్రమను గౌరవించిన సమాజాలు, సంస్కృతులే నిలబడతాయి. శ్రమకు దూరమైన మనిషి అనారోగ్యం పాలైనట్లే… శ్రమను గౌరవించని సమాజాలు అంతరించిపోతాయి. శ్రమించడం మనిషి బాధ్యత. శ్రామికులను గౌరవించడం పాలకుల ధర్మం

  8. M V R శాస్త్రి గారు గాంధీ గారిని విమర్శిస్తూ రాస్తేనే చదివే వాళ్ళు అంతంత మాత్రం .ఇక నిన్ను నన్ను తిడుతూ రాస్తే సరే సరి . ” ఈ అబ్బాయి చాల మంచోడు ” సినిమా పెద్ద Flop పేరు చూసి పెదవి విరిచేశారు .

    ఇప్పుడు రాబోయే ” నేను చాల వరస్ట్ ” సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్నారు …. హిట్ అవుతుంది …మరి..

    గాంధి దేవుడు కాదు … ఇప్పటి తరం వాళ్ళం చూడ లేదు కూడా … కాని ఎంత విమర్శిస్తారు …. గాంధీ సమ కాలీనుడు .. Albert Einstein కన్నా ఎవరు చెప్పగలరు గాంధీ గురించి ?

    గాంధీ హిందూ కులం లో పుట్టడం .. ఆయన చేసుకున్న దౌర్భాగ్యం ఏమో ! ఏ ముస్లిం గానో పుట్టి ఉంటె … పేరు ఎత్తడానికి …. భయ పడే వారు … ఈ తరం భారతీయులు ..కనీసం ఇంత విమర్శ అయినా తప్పించు కునె వారేమో…

    200 సంవత్సరాలు .. దిక్కు మొక్కు.. తల తోక లేని పోరాటానికి … దారి తెన్ను చూపించింది … దిశా నిర్దేశం చేసి పోరాటాన్ని … విజయవంతంగ ముగించింది గాంధీ …. ఇప్పటి పోరాటాలు … సార ఉద్యమం నుండి .. తెలంగాణా ఉద్యమం దాక చూస్తోనే ఉన్నాం … విమర్శించడం చాల తేలిక … ముక్యం గా ఆ వ్యక్తి బౌతికంగ మన మధ్య లేనప్పుడు .. ఇక గాంధీ ని తిట్టడం మరీ సులభం .. పెద్దగ ప్రతి విమర్శ కూడా ఉందదు

    ఒక చెంప .. మరో చెంప కదా గాంధీ .. సిద్ధాంతం

    అయినా చంద్ర బాబు ను విమర్శించడం కోసం ఆర్టికల్ ఎందుకు రాయడం .. టైం వేస్ట్ కదా .. ఎలాగు సాక్షి పేపర్ ఆ పని చేస్తోంది ….

    జగన్ / కాంగ్రెస్ కోసం . ఆంధ్ర జ్యోతి / ఈనాడు … బాబు కోసం సాక్షి . ఉన్నాయి కదా …. పేపర్లు చాల క పోతే చానల్స్ ఉన్నాయ్ కదా .. 24 గంటలు …. 365 రోజులు…..

    మండేలా నుండి ఒబామా దాక గాంధీ ని స్మరిస్తున్నారంటే ….అది వారి వారి వెధవాయత్వం కాదు కదా?

    కూర లో … తాలింపు లాగ లేదా బిర్యానీ లో .. గరం మసాలా తగిలించి నట్టు … సినిమా లో ఐటెం సాంగ్ లాగనో .. ప్రతీ రైటర్ ఎక్కడో అక్కడో .. ఎప్పుడో అప్పుడు … గాంధీ ని విమర్శించడం ( వాడుకోవడం అనాలేమో ..) అలవాటు ఐపోయింది ….

    gopal.

  9. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేవాడు నిజంగా ఎవడూ ఉండదు. అందుకే గాంధేయవాదాన్ని ఊహాత్మక శాస్త్రం (speculative philosophy) అనేది. MVR శాస్త్రి గారు వ్రాసిన పుస్తకాన్ని మీరు పూర్తిగా చదవలేదు. స్వాతంత్ర్య సంగ్రామం బలపడిన ప్రతి సారీ హింస పెరిగిపోతోందని చెప్పి గాంధీ మహాత్ముడు సంగ్రామాన్ని ఆపడానికి ప్రయత్నించాడు కానీ తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు. అతను బ్రిటిష్‌వాళ్ళ కింద అంత విశ్వాసపాత్రునిగా పని చేశాడు. బ్రిటిష్‌వాళ్ళ పెంపుడు టామీ అయిన మోహన్ దాస్ గాంధీయే ఇప్పుడు మహాత్మా గాంధీ అని పిలవబడుతున్నాడు.

  10. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం,బడుగు బలహీన వర్గాల వారి కోశం పనిచేసిన వ్యక్తితో ఈ విధంగా సిలిండర్ మోయించడం మన తెలుగు ప్రజలు చేసుకున్న ధౌర్భాగ్యం. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ని గెలిపించి ఉంటే ఆయన తొమ్మిదేళ్ళ పడిన కష్టం తెలిసొచ్చేది.

వ్యాఖ్యానించండి