అచ్చమైన ప్రజలే కూడంకుళం ఉద్యమ నిర్మాతలు -ఫోటోలు


కూడంకుళం అణు కర్మాగారం వల్ల తమ భద్రతకు, జీవనోపాధికీ ప్రమాదమని స్ధానిక ప్రజలు భయపడుతున్నారు. ఫుకుషిమా అణు ప్రమాదం జరిగాక వారి భయాలు నిజమేనని వారికి రూఢి అయింది. కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా, గత సంవత్సరం ఆగస్టు నుండి వారు శాంతియుత నిరసన ప్రారంభించారు. కర్మాగారానికి వ్యతిరేకంగా గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. నెలల తరబడి నిరాహార దీక్ష చేశారు. వారి భయాలు పోగొట్టడానికి బదులు ప్రభుత్వం వందలమంది ప్రజలపై ‘దేశ ద్రోహం’ కేసులు నమోదు చేసింది. రష్యా కంపెనీ కోసం భారత ప్రభుత్వం సొంత ప్రజలను దేశ ద్రోహులుగా ముద్ర వేసి వేధింపులకు సిద్ధపడింది.

అణు కర్మాగారంతో భయపడుతున్న ప్రజలను పారామిలట్రీ బలగాలతో కవాతు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లలను, పనులకు వెళ్తున్న మహిళలను నిత్యం తనిఖీలు జరుపుతూ వారి జీవనాన్ని దుర్భరంగా మార్చివేశారు. గ్రామాలను పోలీసు పోస్టులతో నింపేశారు. ప్రజల తరపున ఉద్యామిస్తున్న విద్యావంతులపై కేసులు పెట్టి ప్రజల తరపున పనిచేస్తే ఏమవుతుందో ప్రభుత్వాలు చెబుతున్నాయి. విదేశీ నిధులతో ఉద్యమం చేస్తున్నారని ఆరోపించిన ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రులు ఒక్క ఆధారమూ చూపలేదు. సంబంధిత కేసులు పెట్టలేదు. అబద్ధ ఆరోపణలను మాత్రం కొనసాగిస్తున్నారు.

కూడంకుళం అణు కర్మాగార వ్యతిరేక పోరాటం అచ్చమైన ప్రజల పోరాటం. ఆ విషయం ‘ది హిందూ’ పత్రిక అందించిన ఈ ఫోటోలు చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. సంవత్సర కాలంగా జరుపుగున్న ఈ పోరాతం ఎంత శాంతియుతంగా జరుగుతూ వచ్చిందో కూడా ఈ ఫోటోలు సూచిస్తాయి. ప్రజల మొరవినకుండా అణు ఇంధనం నింపడానికే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించాక ప్రజలు ఏంచేయాలి? ఇంతకాలంగా నిరసన తెలుపుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దున్నపోతు మీద వర్షంలా వ్యవహరిస్తే ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలి. కంచే చేను మేస్తుంటే ప్రజలను కాపాడేదెవరు? మొర పెట్టుకుని, పెట్టుకునీ విసిగిపోయేలా చేసి ప్రజలను రెచ్చగొట్టాక ఇప్పుడు హింసాత్మకంగా ఆందోళన మారిందని ప్రభుత్వాలు నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నాయి. పోలీసులను పురమాయించి చోద్యం చూస్తున్నాయి.

వ్యాఖ్యానించండి