యు.పి.ఏ కి కష్టాలు ముమ్మరం అయినట్లు కనిపిస్తోంది. ‘మద్దతు ఉపసంహరిస్తా’ అంటూ మమతా బెనర్జీ తరచుగా బెదిరించే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ములాయం సింగ్ యాదవ్ కూడా ఆమెకు జత చేరినట్లు కనిపిస్తోంది. యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి తో పంకిలమయిందని ఆయన చేసిన వ్యాఖ్య గురువారం పత్రికల పతాక శీర్షికలను ఆకర్షించింది.
రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే నిర్ణయాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూ వచ్చింది. ఆమెను మేనేజ్ చెయ్యడానికి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా కలకత్తా వచ్చి మరీ ప్రత్యేక సమావేశం జరిపింది. రిటైల్ లో ఎఫ్.డి.ఐ పెట్టుబడుల విషయం తమ మధ్య చర్చకు రాలేదని మమత చెప్పినప్పటికీ హిల్లరీ క్లింటన్ అలా చెప్పలేదు. ఎఫ్.డి.ఐ విషయం మాట్లాడడానికే తాను మమత వద్దకు వచ్చానని హిల్లరీ చెప్పింది. ఇంటలిజెన్స్ బ్యూరో లో టెర్రరిస్టు వ్యతిరేక సెల్ ను తెరిచే బిల్లుని కూడా మమత వ్యతిరేకించీంది. రాష్ట్రాల అధికారాలను హరించేదిగా ఉందని ఆమె ఆరోపిస్తూ దానిని వ్యతిరేకించింది. ఇవే కాక రైల్వే బడ్జెట్ లాంటి ఇతర అంశాల్లో కూడా మద్దతు ఉపసంహరిస్తానని మమత బెదిరించడం ప్రజల దృష్టిలో ఉన్నది.
రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చే విషయాన్ని ములాయం సింగ్ కూడా వ్యతిరేకిస్తున్నట్లు గతంలో ప్రకటించాడు. కానీ విదేశీ పెట్టుబడుల విషయంలో వీరు చేసే ప్రకటనలకు ఎన్నడూ కట్టుబడలేదు. నిర్ణయం ప్రకటించినపుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు హడావుడి చెయ్యడం బేరసారాలు ముగిశాక దేశం కోసమే అని తోక ముడవడం సో కాల్డ్ మిత్ర పక్షాలకు, ఆ మాటకొస్తే ప్రతిపక్షాలకు కూడా ఒక రివాజు. అవినీతి కుంభకోణాలతో యు.పి.ఏ మచ్చ తెచ్చుకుందని నిన్న ములాయం అకస్మాత్తుగా ప్రకటించడం సంచలనానికి కారణం అయీంది. మమత బెదిరింపుల నేపధ్యంలో ములాయంను రిజర్వ్‌డ్ లో ఉంచుకున్న యు.పి.ఎ ప్రభుత్వానికి ఇప్పుడు ఆయన కూడా వెనక్కి తిరగడం సమస్యే.
