- కూడంకుళం అణు కర్మాగారం (ఫొటో: ది హిందూ)
తమిళనాడు కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు సాగిస్తున్న పోరాటానికి సుప్రీం కోర్టు నుండి ఒకింత మద్దతు లభించీంది. ఇంధనం నింపడంపై స్టే విధించడానికి నిరాకరించినప్పటికీ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎదురుకానున్న ప్రమాదాన్ని పరిశీలించడానికి అంగీకరించింది. కర్మాగారం చుట్టూ ఉన్న ప్రజల భద్రతే అంతిమమని వ్యాఖ్యానించింది. ఇంధనం నింపినప్పటికీ రెండు నెలల వరకూ కర్మాగారాన్ని ప్రారంభించబోమన్న కేంద్రం హామీపై నమ్మకం ఉంచింది. మద్రాస్ హై కోర్టు తీర్పులను పరిశీలించి, వాద ప్రతివాదాలు వినడానికి అంగీకరించింది. విద్యుత్ పేరుతో రష్యన్ కంపెనీల కోసం కూడంకుళం ప్రజలపై పరోక్ష యుద్ధం సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం కోర్టులో తన పూర్తి స్ధాయి లీగల్ బృందాన్ని ప్రవేశపెట్టి, తన ఉద్దేశ్యాన్ని చాటుకుంది.
“ప్రజల భద్రతకే ప్రధమ ప్రాముఖ్యత. కర్మాగారం సమీపంలో పేద ప్రజలు నివసిస్తున్నారు. తమ బతుకుకి రక్షణ ఉంటుందో లేదో వారు తెలుసుకోవాలి” అని జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ దీపక్ మిశ్రా లతో కూడిన బెంచి పేర్కొంది. సెప్టెంబరు 20 న హియరింగ్ ఉంటుందని తెలిపింది. “ప్లాంటుకి మేము వ్యతిరేకం కాదు. పిటిషనర్ కి కూడా వ్యతిరేకం కాదు. కానీ భద్రతా చర్యలపై ‘అణు శక్తి నియంత్రణ బోర్డు’ చేసిన సిఫారసులను అమలు చేశారో లేదో మేము తెలుసుకోగోరుతున్నాము” అని బెంచి తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తన పూర్తి స్ధాయి లీగల్ టీం ని రంగంలోకి దింపింది. అటార్నీ జనరల్ జి.ఇ.వాహన్వతి, సొలిసిటర్ జనరల్ రోహింటన్ నారీమన్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ ముగ్గురూ ముక్తకంఠంతో ప్రభుత్వ వాదనలను వినిపించారు. అణు శక్తి బోర్డు నియంత్రణలన్నింటినీ అమలు చేయలేదని చెబుతూనే ప్లాంటు మాత్రం పూర్తిగా భద్రమేనని ప్రభుత్వం నమ్మబలికింది. ప్రజలకు కనీస భద్రత ఉండడానికి బోర్డు చేసిన సిఫారసులు పూర్తిగా అమలు చేయకుండా ‘ప్లాంటు పూర్తి భద్రం’ ఎలా అవుతుందో ప్రజలకు తెలియవలసిన విషయం. సరైన భద్రతా చర్యలు తీసుకోని ప్లాంటు వద్దని మొత్తుకుంటున్న వేలమంది ప్రజలపై ‘దేశ ద్రోహం’ కేసులు పెట్టి ప్రజల భద్రతపై తమకు ఉన్న గౌరవం ఏమిటో నిజానికి ప్రభుత్వాలు ఇప్పటికే చెప్పుకున్నాయి.
పిటిషనర్ సామాజిక కార్యకర్త సుందరరాజన్ తరపున మాజీ అన్నా బృందం సభ్యుడు ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించాడు. ఇంధనం నింపకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరాడు. ఇంధనం నింపితే కర్మాగారం పని మొదలవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే యురేనియం ఇంధనం నింపాక పని మొదలు కావడానికి రెండు నెలలు పడుతుందని ప్రభుత్వ లాయర్లు తెలిపారు. ప్రభుత్వ లాయర్ల స్టేట్ మెంట్ ని రికార్డ్ చేయాలని భూషణ్ కోరగా బహిరంగ కోర్టులోనే ప్రకటించినందున రికార్డు చేయనవసరం లేదని బెంచి పేర్కొంది.
ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా, బోర్డు చేసిన 17 భద్రతా సిఫారసులను పట్టించుకోకుండా మద్రాస్ హైకోర్టు ఇంధనం నింపుదలను నిలిపివేయడానికి అంగీకరించలేదని పిటిషనర్ కోర్టుకి తెలిపాడు. భద్రతా సిఫారసులు అమలు చేయకపోవడం పట్లనే పిటిషనర్ అభ్యంతరం తప్ప ప్లాంటు ప్రారంభానికి కాదని కోర్టు గుర్తించింది. కనుక ఇంధనం నింపాక కూడా, పని ప్రారంభించకుండానే, భద్రతా చర్యలను అమలు చేయవచ్చన్న సూచనను కోర్టు వ్యక్తం చేసింది.
17 భద్రతా సిఫారసుల్లో 6 మాత్రమే అమలు చేశారని భూషణ్ తెలపగా, ఆరు నెలలనుండి రెండు సంవత్సరాల లోపు సమయం సిఫారసుల అమలు తీసుకుంటుందనీ, దశలవారీగా భద్రతా సిఫారసులను అమలు చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ప్లాంటు స్ధాపనకే పిటిషనర్ వ్యతిరేకమని ప్రభుత్వం ఆరోపించింది. మార్చి 16, 2012 తేదీన సుప్రీం కోర్టు ఇలాంటి వాదనలే విన్నదనీ, కోర్టు వాటిని ఆమోదించలేదనీ ప్రభుత్వం కోర్టుకు గుర్తు చేసింది. ఈ వాదనను భూషణ్ తిరస్కరించాడు. పిటిషన్ ను కోర్టు అనుమతించిందని ఆయన గుర్తు చేశాడు.
అణు ప్రమాద నష్ట పరిహార బిల్లు
‘కామన్ కాజ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధ పిటిషన్ ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా మార్చి 16, 2012 తేదీన అనుమతించాడు. వివాదాస్పద ‘అణు ప్రమాద పౌర పరిహార చట్టం’ న్యాయబద్ధతను ఈ పిటిషన్ లో సవాలు చేశారు. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు పౌరుల ప్రాధమిక హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని పిటిషనర్ కోర్టుకి తెలిపాడు. అణు ప్రమాదం జరిగితే ఎంత నష్టపరిహారం ఇవ్వాలన్నదే తప్ప అసలు ప్రమాదం జరగకుండా పాటించవలసిన భద్రతను గురించిన ప్రస్తావన చట్టంలో లేదని తెలిపాడు.
ఈ వాదనలను పరిశీలించడానికి కోర్టు అంగీకరించింది. అణు ప్రమాద పరిహార చట్టం ఆర్టికల్ 21 లో పొందుపరిచిన పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నదీ లేనిదీ పరిశీలిస్తామని తెలిపింది. అయితే తమవద్ద తగిన నైపుణ్యం లేనందున అణు ప్లాంటుల గురించి పిటిషనర్ లేవనెత్తిన శాస్త్రీయ అంశాల జోలికి పోలేమని కోర్టు తెలిపింది. దీనినే పిటిషనర్ వాదనలను కోర్టు అంగీకరించలేదన్నట్లుగా ఇప్పుడు ప్రభుత్వ లాయర్లు వక్ర భాష్యం చెప్పడానికి పూనుకున్నట్లు కనిపిస్తోంది. తమకు నైపుణ్యం లేదు గనక పరిశీలించలేము అని చెప్పడానికీ, పిటిషన్ సకారణం కాదు గనుక పరిశీలించలేమని చెప్పడానికీ తేడా లేనట్లుగా వారు చెప్పబూనినట్లు కనిపిస్తోంది.
అదీ కాక ఎటువంటి ప్రమాదం జరిగినా అణు కర్మాగారం నిర్మించిన కంపెనీ 1500 కోట్ల పరిహారం చెల్లిస్తే చాలని నష్టపరిహార చట్టం చెబుతోంది. కానీ అణు ప్రమాదం జరిగితే కలిగే నష్టం అపారం. కొన్ని సంవత్సరాల నుండి వేల సంవత్సరాల వరకూ ప్రమాదం తాలూకు ప్రభావం నిలిచిపోతుంది. పర్యావరణానికీ, ప్రజల ఆరోగ్యానికీ తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయినప్పటికీ ఎంత నష్టం జరిగినా కంపెనీలు 1500 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని చట్టం చెయ్యడం అంటే ప్రజల భద్రత పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్త శుద్ధి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
కానీ ఇంతటి బలహీన చట్టాన్ని కూడా ఆమోదించడానికి రష్యా, అమెరికాలు అంగీకరించడం లేదు. మేమసలు నష్టం పరిహారం చెల్లించనే చెల్లించమని చెబుతున్నాయి. నష్టపరిహార చట్టం తమకు వర్తించరాదని డిమాండ్ చేస్తున్నాయి. కూడంకుళం కర్మాగారం విషయంలో రష్యా డిమాండ్ కి ప్రభుత్వం తలోగ్గింది కూడా. అదేమంటే చట్టం అమలులోకి రావడానికి చాలా ముందే కూడంకుళం ఒప్పందం జరిగిందని అసంగత వాదన చేస్తోంది. చట్టంలో కనీసంగానైనా ఉన్న ప్రజా భద్రతా స్పృహను ఒంటబట్టించుకోవడానికి నిరాకరించింది.
విదేశీ కంపెనీలకు మేలు చెయ్యడానికి ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్న నేపధ్యంలో కూడంకుళం ప్రజలకు సుప్రీం కోర్టు ద్వారానైనా స్వాంతన లభించే సూచనలు చాలా తక్కువనే చెప్పవచ్చు. మరో ఫుకుషిమా భారత భూభాగంపై చూడబోమన్న గ్యారంటీ ప్రస్తుతానికైతే లేదు.