కూడంకుళం ఆందోళన: సముద్ర అలలపై కొత్తతరహా ఉద్యమం


Photo: The Hindu

కూడంకుళం అణు కర్మాగారంకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్ధానిక ప్రజలు తమ పోరాటానికి సముద్రాన్ని తోడు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలు తమ ఊళ్లను, రహదారులను, ఖాళీ స్ధలాలను పోలీసు మాయం చేసిన నేపధ్యంలో గురువారం సముద్రంలోకి దిగి ఆందోళన మొదలు పెట్టారు. మధ్య ప్రదేశ్ ‘జల్ సత్యాగ్రహ్’ తరహాలో సముద్రంలోకి దిగి మానవహారాన్ని నిర్మించి రోజంతా ఆందోళన తెలిపారు. ప్రభుత్వం యధావిధిగా పోలీసుల చేత సముద్రం ఒడ్డుని దిగ్భంధించింది. అదనపు పోలీసు బలగాలను రప్పించి ప్రజలపై వేధింపులు కొనసాగించింది.

‘ది హిందూ’ ప్రకారం ఆందోళనకారులు నాలుగు డిమాండ్లు ముందుకు తెచ్చారు. కూడంకుళం అణు రియాక్టర్ లో ఇంధనం నింపకుండా నిలిపివేయడం, అణు విద్యుత్ ప్లాంటు వ్యతిరేక ఆందోళనకారులను అరెస్టు చేసే ఉద్దేశ్యాలను ఉపసంహరించుకోవడం, నష్టపోయినవారికి తగిన పరిహారం చెల్లించడం, ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నవారిని విడుదల చెయ్యడం.

ఉద్యమ నాయకుడు ఎస్.పి.ఉదయ్ కుమార్ ను పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఆయన ఎక్కడ ఉన్నదీ పోలీసులు కనిపెట్టలేదు. పోలీసులకు సరెండర్ అవుతానని ప్రకటించిన ఉదయ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ప్రజల ఒత్తిడిమేరకు ఆ ఆలోచనను విరమించుకున్న సంగతి విదితమే. ప్రజలపై కాల్పులు జరిపి ఒకరిని బలిగొన్న పోలీసులు హింసను రెచ్చగొట్టారని ప్రజలపై ప్రత్యారోపణలకు దిగారు.

కూడంకుళం వ్యతిరేక ఉద్యమాన్ని క్రిమినలైజ్ చెయ్యడానికి ప్రభుత్వాలు మొదటినుండీ ప్రయత్నిస్తూ వచ్చాయి. ప్రజల భయాందోళనలను దూరం చెయ్యడానికి అవి ఎన్నడూ ప్రయత్నించలేదు. ప్రజలను, వారి ఆందోళనను ఉదాసీనంగా చూస్తూ, అణచివెయ్యవచ్చు అని భావించారే తప్ప ప్రజల పట్ల కనబరచవలసిన బాధ్యతను ఏనాడూ చూపలేదు. ప్రజలతో చర్చలు జరిపి నచ్చజెప్పడానికి ప్రయత్నించలేదు. అణు బోర్డు చెప్పిన భద్రతా చర్యలు కూడా చేపట్టలేదు.

అణు వ్యర్ధాన్ని ఏమి చేయనున్నారన్న నిపుణుల ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని అనుకోలేదు. ప్రమాదం జరిగితే ప్రజలను ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి మాక్ డ్రిల్ చేయించాల్సి ఉన్నా దాని జోలికే పోలేదు. మాక్ డ్రిల్ ఎందుకు చేయించలేదంటే సమాధానం ఇవ్వదు. ఎన్ని అడిగినా, ఎంత ఆందోళన చేసినా ప్రాజెక్టు భద్రమైనదే అని చెప్పిందే చెప్పి దున్నపోతు చందంగా వ్యవహరిస్తున్నది. ప్రజల భద్రతకు గ్యారంటీ ఇచ్చే ఉద్దేశ్యం లేదు కనుకనే ప్రభుత్వాల వద్ద సమాధానాలు ఏమీ లేవని అనేక పత్రికలు ఘోషిస్తున్నా చలనం లేదు.

ప్రజలు హింసాత్మక చర్యలకు దిగితే దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేసి క్రూరంగా అణచివేయడానికి ఇన్నాళ్లూ ప్రభుత్వాలు ఎదురు చూశాయి. సోమవారం జరిగిన కొన్ని సంఘటనలు వారి వ్యూహానికి ఊతం ఇచ్చాయి. అప్పటినుండీ పోలీసు అధికారుల బెదిరింపులు, ప్రేలాపనలు ఊపందుకున్నాయి. వేలమంది గ్రామీణ ప్రజలపై ‘దేశ ద్రోహం’ కేసులు పెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని వేధింపులకు, అణచివేతకు దిగుతున్నాయే తప్ప ప్రజల భయాలను పట్టించుకోవడం లేదు.

ఇదిలా ఉండగా, ఇండియాలో సైతం న్యూక్లియర్ లాబీయిస్టుల తమ కార్యకాలాపాలను అధికం చేశాయి. పత్రికలలో తమ మద్దతుదారులను తయారు చేసుకుంటున్నాయి. పశ్చిమ దేశాల్లో వలేనే అణు విద్యుత్ కి వ్యతిరేకంగా బొగ్గు విద్యుత్ లాబీలు, అనుకూలంగా న్యూక్లియర్ లాబీలు ఆర్టికల్స్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. డబ్బు ప్రవాహాల ప్రోత్సాహంతో జరుగుతున్న వీరి యుద్ధాల్లో అసలు వాస్తవాలు మరుగున పడే ప్రమాదం తలెత్తుతోంది. సైన్స్ పేరుతో లాబీయింగ్ సైన్స్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడవలసిన శాస్త్రీయ వాస్తవాలు ఇండస్ట్రియల్ లాబీయిస్టుల చేతుల్లో అస్త్ర, శాస్త్రాలుగా మారిపోతున్నాయి. విద్యావంతులు వీరి పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం తలెత్తింది.

వ్యాఖ్యానించండి