కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం లేదనీ, తాము అన్నివిధాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామనీ ప్రధాని మన్మోహన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న కబుర్లు నిజం కాదని రుజువవుతోంది. భారత అణు శక్తి నియంత్రణ బోర్డు (Atomic Energy Regulatory Board -AERB) మాజీ అధిపతి గోపాల్ కృష్ణన్ స్వయంగా ఈ విషయాన్ని బట్టబయలు చేశాడు. ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా, కూడంకుళం అణు కర్మాగారం ప్రారంభించకముందు కనీసం 17 రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించిన ఎ.ఇ.ఆర్.బియే వాటన్నింటిని పక్కనబెట్టి ఇంధనం నింపడానికి అనుమతించిందని వెల్లడి చేశాడు. తద్వారా అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలు కూడా అణుపరిశ్రమ వర్గాలకు తమ బుర్రలను తాకట్టు పెట్టిన సంగతిని పరోక్షంగా వెల్లడి చేశాడు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాజ్దీప్ సర్దేశాయ్ తో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ విభ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించాడు.
ఎవరు ఫూల్స్?
“ప్రభుత్వాలు, అణు పరిశ్రమ బాస్ లు ఎవరిని ఫూల్స్ చేయాలనుకుంటున్నారు?” అని గోపాల్ కృష్ణన్ ప్రశ్నించాడు. “ఫుకుషిమా
ప్రమాద ఘటన జరిగాక కూడంకుళం ప్లాంటు భద్రతను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించింది. కూడంకుళంలో రియాక్టర్ ప్రారంభం చేసి విద్యుత్ ఉత్పత్తి చెయ్యడానికి ముందు దానికి 17 సవరణలు, చేర్పులు చేయాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. ‘అణు శక్తి నియంత్రణ బోర్డు’ ఈ విషయం చెప్పాక డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎటామిక్ ఎనర్జీ ఆ సవరణలు చేశాక కర్మాగారాన్ని ప్రారంభిస్తుందని ఎవరైనా భావిస్తారు. కానీ అలా జరగలేదు” అని గోపాల కృష్టన్ సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ తో మాట్లాడుతూ చెప్పాడు.
“ఆటామిక్ ఎనర్జీ సెక్టార్ లో ఒక విభాగం 17 సవరణలు ఎందుకు చెయ్యాలో సాంకేతిక కారణాలు చెబుతుంటే, అదే సంస్ధ వెనక్కి తిరిగి రియాక్టర్ పని మొదలు పెట్టవచ్చని చెబుతుంది. ప్రభుత్వాలు, అణు పరిశ్రమ బాస్ లు ఎవరిని ఫూల్స్ చెయ్యాలనుకుంటున్నారు?” అని గోపాల కృష్టన్ ప్రశ్నించాడు. విదేశాలనుండి నిధులు అందుకుని ఉదయ్ కుమార్ ఉద్యమం నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలను గోపాల కృష్ణన్ ఖండించాడు. తనకు ఉదయ్ కుమార్ 20 యేళ్ళుగా తెలుసనీ, తనకు ఉన్నదంతా ఆయన వెబ్ సైట్ కే ఖర్చుపెట్టాడని గోపాల కృష్ణన్ చెప్పాడు.
రుజువుల్లేని ఆరోపణలు
స్కాండినేవియన్ దేశాలనుండి అందుతున్న నిధులతో కూడంకుళం వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా గతంలో ఆరోపణలు చేశాడు. తమ భద్రత గురించీ, భవిష్యత్తు గురించీ ఆందోళన చెందుతున్న ప్రజల భయాలను దూరం చేయడానికి ప్రయత్నించకుండా సాక్ష్యాత్తూ దేశ ప్రధానే ఆందోళన చేస్తున్న ప్రజలపై ఆరోపణలు చేయడం అత్యంత దౌర్భాగ్యం. కాగా తాను చేసిన ఆరోపణలను ప్రధాని ఇంతవరకూ నిరూపించలేకపోయాడు. గత మార్చిలో ఉదయ్ కుమార్ ఆఫీసుపైనా, ఇంటిపైనా పోలీసులు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నా విదేశీ నిధుల మళ్లింపు ఆరోపణలకు ఆధారం చూపలేకపోయారు. కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా సోమవారం కూడంకుళం ఉద్యమంపై విదేశీ నిధుల ఆరోపణ చేశాడు. ‘పాడిందే పాడరా’ అన్నట్లు నిరూపించలేని ఆరోపణలు చెయ్యడం ప్రజల బతుకు భయాన్ని అవహేళన చెయ్యడమే.
ఎన్.జి.ఓ సంస్ధలు చేస్తున్న అరుదైన న్యాయమైన ఉద్యమాల్లో కూడంకుళం అణు కర్మాగార వ్యతిరేక ఉద్యమం అని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ తన ‘కేపిటలిజం: ఏ ఘోస్ట్ స్టోరీ’ లో తెలియజేశారు. విదేశాల నుండి వచ్చే నిధులను ఆందోళనకు మళ్లించిన విషయం నిజమే అయితే ఈ ఉద్యమం ఇప్పటిదాకా కొనసాగే అవకాశమే ఉండేది కాదు. పరిశోధనా సంస్ధలన్నింటినీ చేతిలో ఉంచుకుని తాము చేసే ఆరోపణలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుజువు చెయ్యలేకపోవడాన్ని బట్టి సదరు ఆరోపణలు ఎంతటి అవాస్తవమో అర్ధం అవుతోంది.
ప్రధానికి సహాయపడితే విదేశీ నిధులు ఓ.కె
అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు భారతదేశంలోకి డబ్బు ప్రవాహంలా ప్రవహించిందన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తించాలి. అణు ఒప్పందం కోసం అమెరికాతో పాటు అనేక పశ్చిమ దేశాలనుండి భారత పాలకులకు డబ్బు కట్టలు ప్రవహించినా అడిగిన నాధుడేలేడు. ఈ విషయాన్ని కూడా గోపాల కృష్ణన్ ఎత్తిచూపాడు. “ఇండో-యు.ఎస్ అణు ఒప్పందాన్ని, దాని ఆమోదాన్ని నేను చాలా దగ్గరినుండి పరిశీలించాను. వివిధ చోట్ల ప్రభావాన్ని (influence) కొనుగోలు చెయ్యడానికి ఇండియా, అమెరికా రెండు దేశాలనుండి పెద్ద ఎత్తున డబ్బు ప్రవహించడాన్ని నేను వ్యక్తిగతంగా గమనించాను. విదేశీ హస్తం, విదేశీ డబ్బూ… ఇవి ప్రధాన మంత్రికీ, ఆయన ఆటామిక్ ఎనర్జీ గ్రూపుకీ సహాయం చేస్తున్నంతవరకూ దాని గురించి ఎవరూ మాట్లాడరు” అని గోపాల కృష్ణన్ ప్రధాని ఆరోపణల్లోని బండారాన్ని నేరుగా బైటపెట్టాడు. విదేశీ పెట్టుబడుల కోసం మోరలు చాచి అందుకోసం ప్రభుత్వ విధానాలను సైతం తాకట్టుపెట్టే ప్రధాని, మంత్రులు విదేశీ నిధులంటూ ఆరోపించడమే ఒక అభాస.
ఆరునూరైనా…
భారత ప్రజల ఆందోళన ఎలా ఉన్నా అణు ఇంధనం నింపేది నింపేదేనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెగేసి చెబుతున్నాయి. సెప్టెంబర్ 13 తేదీకల్లా యురేనియం అణు ఇంధన కడ్డీలను రోబోట్లతో రియాక్టర్ లోకి నింపడానికి అణు విభాగాలు, శాస్త్రవేత్తలు ఉద్యుక్తులవుతున్నారు. మరోవైపు కూడంకుళం ప్రజల అరెస్టులు కొనసాగుతున్నాయి. 50 మందికి పైగా కార్యకర్తలను ఇప్పటికే అరెస్టు చేశారని పత్రికలు తెలిపాయి. ఉద్యమ నాయకులు ఉదయ్ కుమార్ తదితరులను అరెస్టు చెయ్యడానికి కూడా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. సుప్రీం కోర్టులో ప్రశాంత్ భూషణ్ మంగళవారం దాఖలు చేసిన వ్యాజ్యం ఎప్పటికీ విచారణకు వస్తుందో తెలియలేదు. మొత్తం మీద ప్రభుత్వాల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ఒకటి కాదని కూడంకుళం ప్రజల ఆందోళన, వారిపై సాగుతున్న క్రూర నిర్భంధం స్పష్టంగా చాటి చెబుతున్నాయి.