కేరళ పోలీసులకు చెందిన యాంటీ-పైరసీ విభాగం ఏకంగా 1010 మంది నెట్ వినియోగదారులపై కేసులు పెట్టింది. ‘బేచులర్ పార్టీ’ అనే మళయాళం సినిమాని ఇంటర్నెట్ లో అప్ లోడ్ గానీ, డౌన్ లోడ్ గానీ చెయ్యడమే వీరు చేసిన నేరం. దేశంలో ఇలాంటి కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారని ‘ది హిందూ’ చెబుతోంది. బొగ్గు గనుల్ని దోచుకున్న వారిని ఏమీ చెయ్యలేకపోగా పార్లమెంటు సైతం వారికి అండగా ఉంటుంది. ఒక సినిమా డౌన్ లోడ్ చేసుకున్నవారిని కేసులు పెట్టి వేధించడానికి మాత్రం ఆఘమేఘాల మీద పోలీసులూ, ప్రభుత్వాలూ కదులుతారన్నమాట. ఇంతా చేసి ‘బేచులర్ పార్టీ’ సినిమా చైనా సినిమా ‘ఎక్సైల్డ్’ కి కాపీ అని తెలుస్తోంది.
‘బేచులర్ పార్టీ’ సినిమా కి చెందిన సిడి/డివిడి/మొబైల్ ఫోన్/ఇంటర్నెట్/మెమొరీ కార్డ్ హక్కులన్నీ సజీతన్ అనే వ్యక్తి కొనుగోలు చేసాడట. త్రిసూర్ నుండి నడిచే ‘మూవీ చానెల్’ సొంతదారు ఈ సజీతన్. సినిమా సి.డి లను ఆగస్టు 19 న ఈయన కంపెనీ విడుదల చేసింది. సి.డి విడుదల చేసిన రెండు రోజుల్లోనే కోయంబత్తూర్ నుండి నడిచే ‘తమిళ్ రాకర్స్’ వెబ్ సైట్ పైన యాంటీ పైరసీ సెల్ కి సజీతన్ ఫిర్యాదు చేశాడు. సినిమాని అప్ లోడ్ చేశారని భావిస్తున్న 16 ఐ.పి అడ్రస్ లపై కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. యాంటీ పైరసీ పోలీసు వెంటనే రంగంలోకి దిగి ఇప్పటికీ 1010 మంది నెట్ వినియోగదారులపైన ‘ఇంటర్నెట్ ని దుర్వినియోగం చేస్తున్నారన్న’ కేసు నమోదు చేశారు. ఇంటర్నెట్ ‘దుర్వినియోగదారుల’ కోసం వీరి అద్భుత సాహస వేట ఇంకా కొనసాగుతోందని పత్రిక తెలిపింది.
గత పదిరోజుల్లో ఇంటర్నెట్లో 30,000 మందికి పైగా ‘బేచులర్ పార్టీ’ సినిమాని చూశారని పోలీసులు కనిపెట్టారు. ఇంతోసిదానికి యాంటీ పైరసీ సెల్, హై టెక్ సెల్, జాదూ టెక్ ప్రైవేట్ సోల్యూషన్స్ అనే ప్రవేటు సంస్ధ ఉమ్మడిగా పని చేస్తున్నాయి. జాదూ టెక్ ప్రవేట్ సోల్యూషన్ సంస్ధ కేరళ పోలీసుల తరపున సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఐ.పి అడ్రస్ లను బట్టి వినియోగదారుల పేర్లు, అడ్రస్ లను ఈ సంస్ధ సేకరిస్తోంది. పోలీసింగ్ పనిని ఔట్ సోర్స్ చెయ్యడం అన్నమాట!
యాంటీ పైరసీ సెల్ ఇచ్చిన వివరాల ప్రకారం సినిమాని ‘చట్టవిరుద్ధంగా’ చూసినవారు అనేక దేశాల్లో ఉన్నారు. అమెరికా, యు.కె, యు.ఎ.ఇ, కతార్, కువైట్, ఐర్లాండ్, ఫిలిప్పైన్స్, చైనా, సౌత్ ఆఫ్రికా, ఉగాండా, అల్జీరియా, బోట్సువానా, కజకిస్ధాన్ మొ.న దేశాల్లో ‘బేచులర్ పార్టీ’ సినిమాను ‘అక్రమ పద్ధతుల్లో’ చూసేశారు. ఇండియాలో తీసుకుంటే ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, కోల్ కతా, రాజస్ధాన్, లక్నో, కపుర్తలా, తిరునల్వేలి, కోయంబత్తూరు, పుదుచ్చేరి, తిరువనంతపురం, కొల్లాం, ఎర్ణాకులం, కోజీకోడ్, కొట్టాయం, పాలక్కాడ్ తదితర పట్టాణాల్లో జనం ‘అక్రమంగా’ సినిమా చూసేశారు. ఇందులో హైద్రాబాద్ లేకపోవడం ఆశ్చర్యమే.
ఆర్డినరీ, గ్రాండ్ మాస్టర్ అనే సినిమాల సి.డి లని సజీతన్ కంపెనీయే నెలక్రితం విడుదల చేసింది. విడుదల చేసిందే తడవుగా ఆర్డినరీ సినిమాను 30 లక్షల మంది, గ్రాండ్ మాస్టర్ సినిమాని 12 లక్షల మంది ఇంటర్నెట్ లో అక్రమంగా చూశారని యాంటీ పైరసీ సెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ 42 లక్షల మందిపైనా కేసులు పెట్టి ఎన్ని దేశాల్లో ఎన్ని కోర్టులకి లాగుతారో చూడాల్సి ఉంది. ‘బేచులర్ పార్టీ’ సినిమానుండే కేసులు మొదలు పెడుతున్నారని అనుకున్నా 30,000 మందిపైన కేసులు పెట్టాలి. ఇంకా కొన్ని మళయాళం సినిమాలని సోషల్ వెబ్ సైట్ లలోకి అప్ లోడ్ చేశారని కేరళ పోలీసులు 30 మందిపైన కేసులు నడుపుతున్నారు. వారి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఏది అక్రమం?
పైరసీ ని ఒక వ్యాపారం గా నడుపుతున్నవారి పైన దాడులు చేసి కేసులు పెడితే ఒక అర్ధం. సినిమాల్ని ఇంటర్నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకుని చూసినా ఐ.పి అడ్రస్ లు పట్టుకుని మరీ కేసులు పెట్టడం అంటే చాలా అతి. పోలీసులు దీనికేమి చెపుతున్నారంటే సి.డీలు దొరక్కపోవడం వల్ల జనం సినిమా హాళ్ళకి వెళ్ళి సినిమాలు చూస్తున్నారట. తద్వారా ప్రభుత్వానికి ధియేటర్ల నుండీ ఆదాయం పెరిగిందట.
అదీ సంగతి! ప్రజలు పదులూ, వందలు ఖర్చు పెట్టుకుని సినిమా హాళ్ళకి వెళ్ళి సినిమా చూడాలి తప్ప ఇంటర్నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకోకూడదు. అలా చేస్తే పోలీసు కేసులు తప్పవని కేరళ ప్రభుత్వం జనానికి చెప్పదలుచుకుంది. వందలు పెట్టి సినిమా హాళ్ళకి వెళ్ళి సినిమాలు చూసి కలల బేహారుల డబ్బు రాశులు పెంచాలి. అంత కష్టపడి సంవత్సరాల తరబడి డ్యాన్సులు, స్టెప్పులు నేర్చుకుని, ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ లలో హావ భావాల వ్యక్తీకరణలో శిక్షణ పొంది, రంగులు పూసుకుని గెంతి, గ్లిజరిన్ కన్నీళ్ళు కార్చి… ఇన్ని చేసే ‘మహా మహా నటులకి’ కోట్ల ఆదాయం రావద్దా మరి! గొప్ప గొప్ప నటులందర్నీ ఏర్చి కూర్చి కోట్ల కోట్ల రూపాయల సెట్టింగుల్నీ నిర్మించి, కూల్చి జనానికి వినోదం పంచడానికి కష్టపడుతుంటే……. సినిమా హాలుకి రాకుండా ఇంటర్నెట్ లో ‘అక్రమంగా’ చూసేస్తారా?
సినిమా అయినా నాటకం అయినా, కధయినా కాకరకాయయినా జనజీవితాలకి ప్రతిబించాలే. జనజీవితాలని ప్రతిబించడం ద్వారా సమాజం తప్పొప్పులని ఎత్తి చూపి సామాజిక జీవనంలో గుణగణాల పెంపుదలకి సినిమా దోహదపడాలి. దానికి బదులు మరిన్ని తప్పులను జత చేయడం, వినోదం పేరుతో జనాన్ని మరింత కష్టపెట్టడం సినిమా పరిశ్రమకి తగని పని. ప్రజలకి వినోదం పంచడానికి పుట్టిన సినిమా కళ చివరికి ఆ ప్రజలనే జైళ్ళకి పంపి ‘వినోద హింస’ ని పంచడం అత్యంత దౌర్భాగ్యం, దుర్మార్గం. వినోదం ఏ రూపంలో ఉన్నా అది ప్రజల సాంఘిక జీవనంలో భాగం. ప్రజల సాంఘిక జీవనానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు కలల బేహారుల డబ్బు కట్టలకి సాగిలపడడం అత్యంత హేయం, గర్హనీయం.
సినిమా కళ అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ఫలితం కూడా. వేల ఏళ్ల మానవ పరిణామంలో జరిగిన సాంకేతికాభివృద్ధిలో రాతిపనిముట్లు తయారు చేసుకున్న ఆదిమ మానవుడు కూడా భాగస్వామే. మానవ నాగరికత ఫలితంగా సాధించిన అభివృద్ధి ఫలితం ప్రతి ఒక్క మానవుడికీ సమానంగా అందడమే సహజ న్యాయం. రంగు అద్దుకుని నటించినందుకు, నటులచేత నటింపజేసినందుకూ కొద్ది మందికి మాత్రమే వినోద వ్యాపార ఫలాలు దక్కాలనడమే అసలు నేరం. ఆదాయ పంపిణీకి అడ్డుకుట్టవేయడమే ఇది. ఒక సినిమా తీసి విడుదల చేశాక సంవత్సరాల తరబడి ఒకరి నుండి మరొకరికి వినోద హక్కులు బదలాయిస్తూ అతి కొద్ది మంది మాత్రమే కోట్ల రూపాయలు జమ చేసుకునే హక్కు కల్పించడం, హక్కు లేకుండా సినిమా చూడడాన్ని నేరంగా చెప్పడమే నిజమైన అక్రమాలు. అక్రమాల జాతరకి హక్కులు కల్పించి ‘సక్రమం’ చేసే చట్టాలు న్యాయవిరుద్ధమైనవి. ఇలాంటి చట్టాలను రద్దు చేయాలి.
వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వ్యాపారి చివరికి దేశాన్ని కబళించినట్లు, జనం వినోదం ఆధారంగా నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్న సినిమా కళ చివరికి ప్రజల వినోదానికి కూడా సంకెళ్లు వెయ్యడానికి సిద్ధపడడం, దానికి ప్రభుత్వాలు కూడా సహకరించడం సహించరాని విషయం. విజ్ఞులందరూ దీనిని గట్టిగా వ్యతిరేకించాలి.
సినిమాలలో జరిగేవి నిజ జీవితంలో జరగవు. సినిమాలో నడి రోడ్ మీద పోలీస్ ఆఫీసర్‌ని హత్య చేసినా ఎవరూ సాక్ష్యం చెప్పరు, లాయర్ ఉద్యోగం చేసే స్త్రీని రేప్ చేసినా ఆ పని చేసినవాణ్ణి అరెస్ట్ చెయ్యరు. ఇలాంటి కల్పితాలు ఆధారంగా నిర్మించే సినిమాలు చూడడానికి 50 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ ఎంత మంది కొంటారు? యాభై రూపాయల టికెట్‌లు లక్ష మంది కొంటే సినిమా నిర్మాతకీ, డిస్ట్రిబ్యూటర్లకీ, థియేటర్ యజమానులకీ కలిపి యాభై లక్షల ఆదాయం వస్తుంది. కానీ సినిమా నిర్మాణ ఖర్చు కోట్లలో ఉంటుంది. అంత ఖర్చు పెట్టి క్వాలిటీ లేని సినిమాలు నిర్మించడం నిర్మాతల తప్పైతే వాటిని థియేటర్‌కి వెళ్ళి చూడకుండా ఫ్రీగా వస్తే చూడాలనుకునే వాళ్ళ మీద కేస్‌లు పెట్టడం ఎందుకు?
This is surprising attitude. I support your comments
ఆడలేక మద్దెల ఓటి అన్నట్లు…ఉంది. పైరసీ చేసిన వాడిని….లేదా దాన్ని సొమ్ము చేసుకునే వాడిని అరెస్ట్ చేయాలి. అసలు ఈ పైరసీ గురించి చెప్పాలంటే పెద్ద కథ అవుతుంది. సామాన్య ప్రేక్షకుడు ఎవడూ పైరసీ కావాలని చూడడు.
ఒక కుటుంబం సినిమా చూడాలంటే (భార్య, భర్త, ఇద్ధరు పిల్లలు ) కనీసం వెయ్యి వదులుతుంది. మల్టీప్లెక్స్ ఐతే మరీ దోపిడీ. టికెట్ 150. కూల్ డ్రింక్ 100. సమోసా 60. ఇది ఏమైనా న్యాయం గా ఉందా. ?
మరి మల్టీప్లెక్స్ ఎందుకు మాములు థియేటర్లోనే చూడొచ్చుకదా అనొచ్చు.? అక్కడా తక్కువేం లేదు. పెద్ద హీరో సినిమా ఐతే వారం రోజులు బ్లాక్ లో తప్ప బయట అమ్మరు. లోపలకు పోతే కంపు కొట్టే పరిసరాలు..భీకరమైన శబ్ధాలు. ఇన్ని కష్టాల మధ్య థియేటర్లో చిత్రహింసలు పడేకన్నా…ఎవడైనా పైరసీ దొరికితే చూడటమే మేలు అనుకుంటాడు.
పైరసీకి ఇదో కోణమైతే…ఇంకో కోణం అసలు పైరసీ ఎలా జరుగుతోంది..? చేస్తోంది ఎవరు..?
బజార్ లో పది రూపాయల లాభం కోసం కాసెట్ అమ్మేవాడు పైరసీ చేయడు. సినిమా విడుదల కాకముందే రికార్డింగ్ థియేటర్లోనే పైరసీ జరుగుతుంది. ఒక వర్గం హీరోని అడ్డుకునేందుకు ఇంకో వర్గం కుట్ర చేస్తుంది. ఇలా ఎన్నో కోణాలు..!
చివరగా ఒక్క మాట.
పైరసీకి అసలు కారణం ఏంటో ఆత్మవిమర్శ చేయకుండా.. తమ మనుగడకు కారణమైన ప్రేక్షకుల మీద కేసులు పెట్టడం అంటే.. తాము కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే..!
చందు గారు, కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. హీరోల వైరాల వల్ల కూడా పైరసీ జరుగుతుండడం గమనించవలసిన కోణం. మీరు చెప్పినట్లు వినోద వ్యాపారులు తాము కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు. పెట్టుబడి తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటుందన్నట్లు.