రాజకీయ నాయకుల అవినీతికి వ్యతిరేకంగా కార్టూన్లు గీసినందుకు కాన్పూర్ కార్టూనిస్టు అసిమ్ త్రివేది ని మహారాష్ట్ర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత నెలలో అసిమ్ త్రివేదికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ చేసిన స్ధానిక కోర్టు సోమవారం ఆయనని వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పజెప్పింది. త్రివేది అరెస్టుపై దేశవ్యాపితంగా నిరసన తలెత్తింది. ప్రెస్ కౌన్సిల్ ఇండియా ఛైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు అరెస్టును తీవ్రంగా ఖండించాడు. రాజకీయ నాయకుల ఆజ్ఞల మేరకు ఇష్టారీతిన అరెస్టులు సాగించే పోలీసులు నేరస్ధులవుతారని కటువుగా వ్యాఖ్యానించాడు. ఖండన మండనలు విస్తృతంగా వెల్లువెత్తడంతో నెపాన్ని పోలీసుల పై నెట్టడానికి మహారాష్ట్ర హోమ్ మంత్రి ప్రయత్నిస్తున్నాడు.
పార్లమెంటును టాయిలేట్ గానూ, జాతీయ చిహ్నంలోని మూడు సింహాలను రక్తం తాగుతున్న తోడేళ్ళుగానూ చిత్రిస్తూ తన వెబ్ సైట్ లో కార్టూన్లు ప్రచురించినందుకు అసిమ్ త్రివేది పై ‘రాజద్రోహం’ (sedition) నేరం మోపారు. గత డిసెంబరులో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కి చెందిన ఒక లాయర్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ నేరాన్ని మోపారు. అన్నా హజారే ఆందోళనలో ప్రదర్శించిన కార్టూన్ బ్యానర్ పై చేసిన ఫిర్యాదును అసిమ్ వెబ్ సైట్ పైకి మరల్చారు. ఆగస్టులో త్రివేదిపై స్ధానిక కోర్టు ఒకటి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. డిసెంబరు లో దాఖలయిన ఫిర్యాదుకు ఆదివారం అరెస్టు చేసారు. కోర్టులో హాజరుపరచాక పోలీసుల అభ్యర్ధన మేరకు అసిమ్ ను సెప్టెంబరు 16 వరకూ పోలీసు రిమాండ్ కు పంపారు.
“నాకు అందిన సమాచారం మేరకు కార్టూనిస్టు చట్ట విరుద్ధంగా చేసిందేమీ లేదు. నిజానికి ఆయనని అరెస్టు చెయ్యడమే చట్ట విరుద్ధం. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 342 కింద తప్పుడు కారణాలతో అరెస్టు చెయ్యడం తీవ్ర నేరం. కనుక ఆయనని అరెస్టు చేసినవారినే అరెస్టు చెయ్యాలి” అని సుప్రీం కోర్టు మాజీ న్యాయమార్తి, ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ‘ది హిందూ’ తో తీవ్రంగా వాఖ్యానించాడు. “రాజకీయ నాయకులు ఇచ్చే అటువంటి చట్టవిరుద్ధ ఆదేశాలను అనుసరించే పోలీసు అధికారులపై ముందు విచారణ జరపాలి. ‘న్యూరెంబర్గ్ వార్ క్రైమ్ ట్రిబ్యునల్’ లో నాజీ అధికారులను శిక్షించినట్లు కఠినంగా శిక్షించాలి” అని కట్జు వ్యాఖ్యానించాడు.
కార్టూన్ గీయడం నేరం ఎలా అవుతుందని కట్జు ప్రశ్నించాడని ‘ది హిందూ’ తెలిపింది. రాజకీయ నాయకులు విమర్శలను అంగీకరించడం నేర్చుకోవాలని సూచించాడు. “ఆరోపణ నిజమైతే దానికి (కార్టూన్ కి) తగినవారని అర్ధం. (ఆరోపణ) తప్పైతే దానిని విస్మరించాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రవర్తనను అనుమతించడానికి వీలులేదు” అని జస్టిస్ కట్జూ అన్నాడు.
గత డిసెంబరు లోనే అసిమ్ త్రివేది వెబ్ సైట్ ను నిషేధించారని ఐ.బి.ఎన్ లైవ్ తెలిపింది. వెబ్ సైట్ నిషేధించాక ‘న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్’ (స్వయం నియంత్రణ కోసం టి.వి చానెళ్లు ఏర్పాటు చేసుకున్న సంస్ధ) కార్టూన్ లను ప్రదర్శించరాదని నిర్దేశించినట్లు తెలుస్తున్నది. కార్టూన్లు అగౌరవంగా ఉన్నాయి కనుక చూపరాదని సదరు అసోసియేషన్ నిర్దేశం గా తెలుస్తున్నది. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాజ్దీప్ సర్దేశాయ్ ఈ నిర్దేశానికి మద్దతు తెలుపుతూనే కార్టూనిస్టు అరెస్టును ఖండించాడు. “తిరస్కార సూచనగా, సానుభూతి తెలిపే ఉద్దేశ్యంతో కార్టూన్లను తిరిగి ప్రదర్శించడం మంచిదే. ఐతే అది జాతీయ చిహ్నాలకు అగౌరవం కానంతవరకే. చట్టం రెండు వైపులా పదునున్న కత్తి” అని వ్యాఖ్యానిస్తూ ఆయన “ఈ దేశంలో విద్వేషపూరితమైన ఉపన్యాసం ఇచ్చినా తప్పించుకోవచ్చు కానీ ప్యారడీ, రాజకీయ వ్యంగ్యానికి పాల్పడితే మాత్రం వెంటనే అరెస్టులు జరుగుతాయి. ఇది హాస్యాస్పదం, ప్రమాదకరం కూడా. హింసను ప్రేరేపించేవారి కోసం వారు ఎందుకు వెళ్లరు?” అని ప్రశ్నించాడు.
అరెస్టుకు దారి తీసిన కార్టూన్లు ఇవే. (క్లిక్ చేసి పెద్ద సైజు చూడగలరు.)
నిరసనలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా తోక ముడిచింది. కోర్టు మంజూరు చేసిన పోలీసు కస్టడీని ముంబై పోలీసులు వదులుకుంటున్నట్లు ఐ.బి.ఎన్ లైవ్ తెలిపింది. అంతకుముందు మహా రాష్ట్ర హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ అసిమ్ కస్టడీకి తగిన కారణం లేదని వ్యాఖ్యానించాడు. “పోలీసుల పరిశోధన పూర్తయింది. పోలీసు కస్టడీ కోరవలసిన అవసరం లేదు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాను. ఆ విషయం కోర్టులో చెబుతాము” అని పాటిల్ అన్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు లేకుండా డిసెంబర్ లో నమోదైన కేసుకి సెప్టెంబరు లో అరెస్టు చెయ్యడం అసాధ్యం. ప్రజాభిప్రాయానికి తలొగ్గుతున్నామని చెప్పిఉంటే పాటిల్ కి ఆ గౌరవమైనా దక్కి ఉండేది. తగిన కారణం లేదని హోమ్ మంత్రి అన్నది కస్టడీకా లేక అరెస్టుకా (లేక రెండూ ఒకటేనా) అన్నది స్పష్టం కాలేదు. అరెస్టుకే అన్నట్లుగా ఐబిఎన్ లైవ్ చెప్పినప్పటికీ మంత్రి మాటలు ఆ విధంగా లేవు.
‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (ఐ.ఎ.సి) ప్రతినిధులు అసిమ్ త్రివేది అరెస్టును ఖండించాడు. ఐ.ఎ.సి కార్యకర్త కనుకనే తన కుమారుడిని అరెస్టు చేశారని త్రివేది తల్లితండ్రులు ప్రకటించారు. అయితే త్రివేది తమ సభ్యుడు కాడని ఐ.ఎ.సి ప్రతినిధి మయంక్ గాంధీ తెలిపాడు. తమ సభ్యుడు కానప్పటికీ అవినీతి కి వ్యతిరేకంగా త్రివేది పోరాడుతున్నాడనీ ఆయనకి తాము నైతిక మద్దతు ఇస్తున్నామనీ తెలిపాడు. ఐ.ఎ.సి తో పాటు పలువురు కార్టూనిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు అసిమ్ త్రివేది అరెస్టు ను ఖండించారు.
అప్ డేట్: అసిమ్ త్రివేదికి సెప్టెంబరు 24 వరకు జ్యుడిషియల్ కస్టడి విధించారు -ఇండియా టు డే
Section 124A in the Indian penal code was introduced by colonial britishers in 1860 after the 1857 revolt inorder to supress the nationalist idealogy of indians.Today the same 124A section is used by our political leaders to supress the anti corruption activists in india.
it is unfortunate that our politicians (not statesmen) have no sense of humour. Nehru had a lot of it and encouraged cartoonists like sankar of sankar’s weekly.
ఆదర్శాలు అనేది చెప్పడానికే బాగుంటాయి కానీ ఆచరించడానికి కాదు. తమ అవినీతిపై వచ్చే విమర్శలు చూసి నవ్వుకుని దాన్ని sense of humor అని అనుకునేవాళ్ళు నిజ జీవితంలో ఎవరూ ఉండరు.
ఈ రెండు కార్టూన్లూ ఘాటుగా, తీవ్రంగానే ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం సమాజ అస్తవ్యస్తాలను మొరటుగా, కటువుగా కవిత్వీకరించిన దిగంబర కవులు గుర్తొచ్చారు.
కార్టూనిస్టు త్రివేది చెప్పినట్టు ఈ కార్టూన్లు వాస్తవాలకు పట్టిన అద్దం మాత్రమే. అద్దాన్ని ఆడిపోసుకుంటే, అద్దం సొంతదారును నిర్బంధిస్తే అది రాజ్యాంగం పట్ల గౌరవం అవ్వదు. ‘అవినీతినైనా సహిస్తాం కానీ ఇలాంటి విమర్శలను సహించబోము’ అని ఈ అరెస్టు ద్వారా చెప్పారన్నమాట.
“అస్తవ్యస్తాలను మొరటుగా, కటువుగా కవిత్వీకరించిన దిగంబర కవులు గుర్తొచ్చారు.”
వేణు గారూ, సరైన పోలిక. కటువైన వాస్తవాన్ని అందులో పాత్రధారులే భరించలేకపోయారన్నమాట!