బొగ్గు కుంభకోణంలో మీడియా, మాయమవుతున్న ఫోర్త్ ఎస్టేట్


2జి కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మీడియా బొగ్గు కుంభకోణంలో నేరుగా లబ్ది పొందినట్లు సి.బి.ఐ పరిశోధనలో వెల్లడైంది. నాలుగు మీడియా కంపెనీలు అక్రమ లబ్ది పొందాయని ‘ది హిందూ’ చెప్పినప్పటికీ పేర్లు వెల్లడించలేదు. నెట్ వర్క్ 18 (ఐ.బి.ఎన్ గ్రూపు), డి.బి కార్ప్ (డెయిలీ భాస్కర్ గ్రూపు) లు లబ్ది పొందిన మీడియా కంపెనీల్లో ఉన్నాయని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.  తమకు కేటాయించిన బొగ్గు గనులనుండి కంపెనీలు అక్రమ లబ్ది పొందాయన్న ఆరోపణలపై సి.బి.ఐ విచారణ చేస్తున్న సంగతి విదితమే.

Source: The Economic Times

గత జనవరిలో బొగ్గు కుంభకోణంపై కాగ్ ముసాయిదా నివేదిక లీక్ అయ్యాక అక్రమ కేటాయింపులపైనా, కంపెనీలు అక్రమ లాభం పొందడంపైనా ప్రాధమిక విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగ్ పూర్తి స్ధాయి నివేదిక అందాక సి.బి.ఐ కూడా పూర్తి స్ధాయి విచారణ ప్రారంభించినట్లు తెలుస్తున్నది. అనుభవం లేని కంపెనీలకు, పేపర్ కంపెనీలకు బొగ్గు గనులను విచ్చలవిడిగా కేటాయించిన ఫలితంగా ఆయా కంపెనీలు పైసా ఖర్చు చెయ్యకుండానే గనులను ఇతరులకు అమ్ముకుని లబ్ది పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో మీడియా కంపెనీలు ఉన్నట్లు ‘ది హిందూ’ తెలిపింది.

బొగ్గు గనుల కేటాయింపులను రద్దు ఎందుకు రద్దు చేయవద్దో చెప్పాలంటూ ఇంటర్-మినిస్టీరియల్ గ్రూపు (ఐ.ఎం.జి) పది కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం నుండి ఐ.ఎం.జి కంపెనీల వాదనలను వింటున్నది. మరో పక్క సి.బి.ఐ విచారణలోలో మీడియా కంపెనీల పాత్ర వెలుగులోకి వచ్చింది. ‘ది హిందూ’ ప్రకారం మూడు ప్రింట్ మీడియా కంపెనీలు, ఒక ఎలక్ట్రానిక్ చానెల్ కంపెనీ బొగ్గు గనులు పొందిన కంపెనీల్లో ఉన్నాయి. ఈ కంపెనీలు ఏవన్నదీ పత్రిక చెప్పలేదు.

“తమ పేర్లు వెల్లడికాకుండా ఉండడానికి వీలుగా ఫ్రంట్ కంపెనీలు పెట్టుకుని ఈ కంపెనీలు బొగ్గు గనులను పొందగలిగాయని పరిశోధనలో తేలింది. కేటాయింపుల క్రమంలో నేరుగా తమ పేర్లు బైటికి రాకుండా ఉండడానికి ఈ పద్ధతిని అనుసరించాయి. ఒక పబ్లికేషన్ అయితే విద్యుదుత్పత్తి కంపెనీ స్ధాపించింది. ఆ లింకేజీ ద్వారా లబ్ది పొందింది. ఐ.ఎం.జి మూడురోజుల పాటు జరిపిన సమావేశాల్లో (మీడియా కంపెనీల్లో) ఒక కంపెనీకి సమన్లు పంపినట్లు తెలుస్తున్నది” అని ప్రభుత్వ వర్గాలు చెప్పాయని ‘ది హిందూ’ తెలిపింది.

నెట్ వర్క్ 18 గ్రూపు

ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రకారం నెట్ వర్క్ 18, డి.బి కార్ప్ కంపెనీలు బొగ్గు గనుల కేటాయింపుల్లో లబ్ది పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫస్ట్ పోస్ట్ (అన్నీ రకాల డిజిటల్ మీడియా కూ అనువుగా ఉండడానికి రూపొందించిన వెబ్ సైట్) కూడా ఈ నెట్ వర్క్ 18 లోనిదే. నెట్ వర్క్ 18, సెన్సెక్స్, నిఫ్టీ రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలలోనూ లిస్ట్ అయిన కంపెనీ. అనేక చానెళ్లను ఈ కంపెనీ నిర్వహిస్తున్నది. సి.ఎన్.బి.సి-టి.వి18 (వ్యాపార వార్తల చానెల్), సి.ఎన్.బి.సి ఆవాజ్ (హిందీ), ప్రముఖ ఎడిటర్ రాజ్ డీప్ సర్దేశాయ్ నేతృత్వంలోని  సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్, ఐ.బి.ఎన్ 7 (హిందీ), ఐ.బి.ఎన్ లోక్ మట్ (మరాఠీ), వెబ్ 18 (ఐ.బి.ఎన్ లైవ్ డాట్ కామ్, మనీ కంట్రోల్ డాట్ కామ్, ఇన్ డాట్ కామ్, జోష్ 18 డాట్ కామ్)… ఇవన్నీ నెట్ వర్క్ 18 నిర్వహిస్తున్నవే. ఎం.టి.వి ఇండియా, నిక్ ఇండియా, వి.హెచ్ 1 ఇండియా, కలర్స్, హిస్టరీ టీవి 18, స్టూడియో 18, హోమ్ షాప్ 18, ఇన్ఫో మీడియా 18 తదితర చానెళ్లు కూడా దీని కింద  ఉన్నాయి.

నెట్ వర్క్ 18 కి చెందిన ఇన్ డాట్ కామ్ ఇండియాలో చాలా పాపులర్. 2008 లో ఇండియాలో నెంబర్ 2 గా ఇది నిలిచింది. మనీ కంట్రోల్ డాట్ కామ్ ఆసియాలో అతి పెద్ద ద్రవ్య, వ్యాపార పోర్టల్. ప్రపంచంలో రెండో పెద్దది కూడా. పది లక్షల రిజిస్టర్డ్ యూజర్లు ఉన్న ఈ వెబ్ సైట్ కి నెలకి 15 కోట్ల పేజ్ వ్యూలు ఉన్నాయట. సాంకేతిక ఉత్పత్తులు, గృహోపకరణ ఉత్పత్తులు తదితర ఉత్పత్తులపై సమాచారం ఇచ్చే వెబ్ సైట్లను కూడా నెట్ వర్క్ 18 నిర్వహిస్తున్నది.

మరో ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, భారత దేశ సంపన్న వ్యాపారి ముఖేష్ అంబానీ కంపెనీ అయిన రిలయన్స్ గ్రూప్ గత జనవరిలో నెట్ వర్క్ 18 లో 49 శాతం వాటా కొనేసింది. ఈనాడు కి చెందిన అనేక రాష్ట్రాల ప్రాంతీయ చానెళ్లను కూడా రిలయన్స్ కొనేసింది. తెలుగు ఈటీవీ చానెళ్లలో 24.5 శాతం వాటా రిలయన్స్ చేతుల్లో ఉంది. బొగ్గు కుంభకోణంలో రిలయన్స్ కంపెనీ కూడా పెద్ద లబ్దిదారు. రిలయన్స్ కోసం కాగ్ ప్రత్యేక నివేదికనే కేటాయించిందంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.

డి.బి. కార్ప్ గ్రూపు

ఇక డి.బి కార్ప్ కంపెనీ కూడా అనేక ప్రముఖ పత్రికలు, చానెళ్లు నిర్వహిస్తున్నది. హిందీ పత్రికల్లో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న దైనిక్ భాస్కర్ ఈ కంపెనీదే. భాస్కర్ గ్రూపుగా పిలిచే ఈ మీడియా కంపెనీకి 1700 కోట్ల విలువ చేసే వ్యాపార సామ్రాజ్యం ఉన్నదని వికీ పీడియా ద్వారా తెలుస్తున్నది. వార్తా పత్రికలు, టెలివిజన్, వినోదం, ప్రింటింగ్, టెక్స్ టైల్స్, వినియోగ సరుకులు, ఇంటర్నెట్ సేవలు తదితర రంగాల్లో దీనికి వ్యాపారాలున్నాయి. జీ గ్రూపు తో కలిసి డి.ఎన్.ఏ (డెయిలీ న్యూస్ అండ్ అనాలసిస్) అనే వార్తల వెబ్ సైట్ నడుపుతోంది.

దైనిక్ భాస్కర్ (హిందీ పత్రిక), డెయిలీ భాస్కర్ (వెబ్ సైట్ – ఇంగ్లీష్), దివ్య భాస్కర్ (గుజరాతీ), డి.ఎన్.ఏ (ఇమ్ఘ్లీష్), బిజినెస్ భాస్కర్ పత్రికలు, వెబ్ సైట్లు డి.పి కార్ప్ ఆధీనంలో ఉన్నాయి. మధ్య ప్రదేశ్ లో ప్రారంభమై త్వరలోనే మొదటి స్ధానం చేరుకున్న దైనిక్ భాస్కర్ అనంతరం రాజస్ధాన్, చండీఘర్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకి విస్తరించింది. ఆహా జిందగీ (హిందీ, గుజరాతీ), భాస్కర్ లక్ష్య (రాజస్ధాన్) మ్యాగజైన్లను కూడా డి.బి నిర్వహిస్తున్నది. 7 రాష్ట్రాల్లో 17 స్టేషన్లతో రేడియో సేవలను డి.బి నిర్వహిస్తున్నది. రేడియోకి సంబంధించి దీని బ్రాండ్ నేమ్ MYFM.

కంపెనీల నియంత్రణలో మీడియా

పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల వ్యాపార విస్తరణకి దోహదం చేసిన ముఖ్యమైన అంగం కార్పొరేట్ మీడియా. పశ్చిమ దేశాల ప్రభుత్వాలను కూడా ప్రవేటీకరించిన బహుళజాతి కంపెనీలు మీడియా ద్వారా తమ ప్రభుత్వాల విధానాలకు మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, అభివృద్ధి తదితర ముసుగులు తొడిగి ప్రచారం చెయ్యడంలో పేరెన్నిక గన్నాయి. అత్యంత వినాశకర యుద్ధాలకు కూడా మానవతా ముసుగు తొడిగి స్వదేశ ప్రజలతో పాటు, ప్రపంచ దేశాల ప్రజల ఆమోదం పొందడడంలో పశ్చిమ మీడియా కంపెనీలు గణనీయంగా సఫలం అయ్యాయి. ప్రజల ఆమోదాన్ని తామే తయారు చేసి ప్రజలపై రుద్దడం, తమకు అనుకూలమైన వాదనలను ప్రజల నోళ్లలోకి, మెదళ్ళలోకి చొప్పించడం మున్నగు వాటిని ఇవి ఒక కళగా అభివృద్ధి చేశాయి. ఆర్ధిక ప్రయోజనాల రీత్యా కంపెనీలు-మీడియా-ప్రభుత్వం పెనవేసుకుపోయిన ఫలితం ఇది.

భారత మీడియా కూడా ఈ కళలో ప్రవేశించి సంవత్సరాలు గడిచాయి. దానిలో భాగమే నెట్ వర్క్ 18, డి.బి కార్ప్ లు బొగ్గు గనుల కుంభకోణంలో దొరికిపోవడం. తామే కుంభకోణంలో లబ్దిదారులుగా ఉన్నాక ఈ పత్రికలు తమ పత్రికా బాధ్యతను ఎలా నిర్వహిస్తాయి? వార్తా పత్రికలు స్ధాపించి ఆ లాభాల ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి, విస్తరింపజేసుకోవడం ఇంతకాలం భారతదేశంలో జరిగింది. దీనిలో వార్తకీ వ్యాపారానికి మధ్య ఎంతోకొంత దూరం పాటించబడింది. దేశంలో ప్రవేటు కంపెనీలు వృద్ధి చెంది, వాటి ఆస్తులు లక్షోప లక్షల కోట్ల స్ధాయికి చేరాక ప్రజల అభిప్రాయాలను తమ వ్యాపారాలకు అనువుగా మలుచుకోవలసిన అవసరం కంపెనీలకు ఏర్పడింది.

కార్పొరేట్ అధిపతులే ఎం.పి లై ప్రభుత్వాన్ని ప్రవేటు వ్యవహారంగా మారుతుండడం వలన ప్రభుత్వ-ప్రవేటు విభజన రేఖ మసకబారుతోంది. దానితో వార్తకూ, వ్యాపార ప్రయోజనానికి మధ్య దూరం తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే కొన్ని వార్తా పత్రికల్లో వార్తకూ, వ్యాపార ప్రయోజనానికి మధ్య దూరం కనుమరుగైపోయింది. వ్యాపార ప్రయోజనాలను తలకెక్కించుకున్నంత మేరకు ఇతర పత్రికలు కూడా వార్తా పరిశ్రమలో ప్రవేశిస్తున్నాయి. ‘ది హిందూ’ లాంటి పత్రికల్లో సైతం వార్తకు, వ్యాపారానికి మధ్య జరుగుతున్న ఘర్షణ బైటికి ఒలికి పత్రికలకు ఎక్కుతోంది. అనేకపత్రికల్లో రిపోర్టుల్లోనే వ్యాపార ప్రయోజనాన్ని చొపిస్తున్నారు. విశ్లేషణల్లో కూడా వ్యాపార ప్రయోజనాలను సమార్చించుకోవడానికి సైతం కొన్ని పత్రికలు వెనుదీయడం లేదు.

శాసన వ్యవస్ధ (పార్లమెంటు), కార్యనిర్వాహక వ్యవస్ధ (బ్యూరోక్రసీ), న్యాయ వ్యవస్ధ లు ప్రజాస్వామ్య వ్యవస్ధను కాపాడే మూడు స్తంభాలుగా (ఎస్టేట్) చెబుతారు. ఈ మూడు వ్యవస్ధలపై నిఘా వేసే వ్యవస్ధ గనుక పత్రికా వ్యవస్ధను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం (ఫోర్త్ ఎస్టేట్) గా చెప్పుకుంటున్నాం. ఇప్పుడీ విభజన చెరిగిపోతున్నది. సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల ఫలితం ఇది. ఈ విధానాలు ఏర్పరిచిన హైవేలపై దూసుకు వచ్చిన పశ్చిమ కార్పొరేట్ సామ్రాజ్యాధిపతులు తమ వినాశకర వ్యాపార సంస్కృతిని భారత పత్రికారంగంలోకి కూడా పట్టుకొచ్చారు. కార్పొరేట్ వాల్ స్ట్రీట్ కంపెనీలు సమకూర్చిన పెట్టుబడితో విస్తరిస్తున్న మీడియా సామ్రాజ్యాలు పెట్టుబడి ప్రయోజనాలే నెరవేరుస్తాయి తప్ప ప్రజాస్వామ్య ప్రయోజనాలు కాదు. పెట్టుబడి ప్రయోజనాలు నెరవేర్చకపోతే ఆ పెట్టుబడి వెనక్కిపోతుంది. కష్టపడి నిర్మించిన మీడియా సామ్రాజ్యాన్ని కూల్చివేయడం పెట్టుబడికి పెద్ద కష్టం కాదు. అందువలన మీడియా కంపెనీలు పెట్టుబడి ప్రయోజనాలు నెరవేర్చడం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కంపెనీలు మీడియాను వశం చేసుకోవడం, మీడియాయే కంపెనీలు పెట్టడం దీనిని మరింత సులభతరం చేసింది.

భారత కార్పొరేట్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ గా పని చేయడం ఇక అసాధ్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s