చూసే తీరిక ఉండాలే గానీ భారత రాజకీయ నాయకుల సర్కస్ విన్యాసాలకు, రెండు నాలుకల ప్రకటనలకు కొదవ ఉండదు. కొడుకు ఉద్ధవ్ ధాకరే తో పాటు మనవడు అధిత్య ధాకరేను కూడా శివసేన ఆధిపత్య స్ధానాలకు నామినేట్ చేసిన బాల్ ధాకరే కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై మండిపడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి కోసం ఆశపడుతున్నాడనీ, ప్రియాంక గాంధీ మరో ఇందిరా గాంధీ లాగా రాజకీయాల్లో ఎదగలానుకుంటున్నదనీ వాపోయాడు. శివసేనలో మాత్రం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నదనీ తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు.
“రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాడు. సోనియా అన్నీ తానే అయి నిరంకుశత్వంతో సాగుతోంది” అని శివసేన పత్రిక సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాల్ ధాకరే అన్నాడని ‘ది హిందూ’ తెలిపింది. “మరో ఇందిరా గాంధీ లాగా” ప్రియాంక వద్రా రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నదని వ్యాఖ్యానించాడు. “రాహుల్ పి.ఎం కావాలనుకుంటున్నాడు. పి.ఎం పోస్ట్ అంటే ఏమన్నా భేండీ బజారులో కుర్చీలాంటిదా?” అని ముంబైలోని ఓ మార్కెట్ ని సూచిస్తూ అన్నాడు.
“ధాకరేల్లో వారసత్వ రాజకీయాలు లేవు. కొడుకు ఉద్ధవ్ ని (ఎక్జిక్యూటివ్ ప్రెసిడెంట్) గానీ, మనవడు ఆదిత్య (యువ సేన అధిపతి) ని గానీ నేను నామినేట్ చేయలేదు” అని ధాకరే చెప్పుకున్నాడు. కానీ వాస్తవం ఏమిటంటే బాల్ ధాకరే వారసత్వ రాజకీయాలకి నిరసనగానే ఆయన మేనల్లుడు రాజ్ ధాకరే శివసేన నుండి బైటికి వెళ్ళాడు. శివసేన ఆధిపత్యం ఇవ్వలేదని ఆగ్రహించి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎం.ఎన్.ఎస్) పేరుతో ఇంకో ముఠా స్ధాపించుకున్నాడు. ఇటీవల బీహారీలని మహారాష్ట్ర నుండి తరిమివేస్తానని వదరుతున్నాడు. ముంబైలో ముస్లిం లంతా బంగ్లాదేశీయులేనని ప్రకటిస్తూ బాల్ ధాకరే వారసత్వాన్ని ప్రతి అంశలోనూ ప్రతిఫలిస్తున్నాడు.
పనిలో పనిగా మహారాష్ట్ర భవిష్యత్తు గురించి ఆందోళన ప్రకటించాడు. అసలు దేశం భవిష్యత్తు ఏమైపోతుందో నని ఆందోళన ప్రకటించాడు. దేశంలో రాజకీయ నాయకత్వమే లేకుండా పోయిందన్నాడు. ఆదిత్య కోసం ఉద్ధవ్ ని ప్రధానమంత్రి గా నాయకత్వ పాత్రలోకి ప్రమోట్ చేసే బృహత్ కర్తవ్యంలో ధాకరే మునిగి ఉన్నాడేమో తెలియదు. ఉద్ధవ్ ని సెంటర్ కి పంపిస్తే, ఆదిత్య కి మహారాష్ట్ర కి అప్పగించవచవచ్చునేమో!
ఒక్క కాంగ్రెస్, శివసేనలేనా? వామ పక్ష పార్టీలోనో లేక తృణమూల్ లాంటి డిక్టేటర్ పార్టీలోనో తప్ప భారత దేశంలో వారసత్వ రాజకీయాల్లేని ప్రాంతీయ పార్టీ గానీ, జాతీయ పార్టీ గానే ఉన్నదా? టి.డి.పి, సమాజ్ వాదీ పార్టీ, లాలూ పార్టీ, డి.ఎం.కె… ఇలా ఏది చూసినా వారసులతో నిండిపోయిన పార్టీయే. టి.డి.పి లో మామ ఎన్టీఆర్ నుండి పగ్గం చేజిక్కించుకున్న అల్లుడు నాయుడు కుర్చీ కోసం బావ గారితో పాటు ఆయన అన్న, అన్న గారి కొడుకు, బావ బాలయ్య గారి కొడుకు ఇలా వారసత్వం కోసం క్యూ కట్టి ఉన్నారు.
డి.ఎం.కె లో కరుణానిధి కుర్చీ కోసం ఇద్దరు భార్యల కొడుకులు పోట్లాడుకుంటున్నారు. ఒకరిని కేంద్రానికి పంపి మరొకరిని రాష్ట్రంలో ఉంచి కరుణానిధి వారి తగాదా తీర్చాడు. మరో పక్క కూతురి ముచ్చట కూడా ఎం.పి పదవితో తీర్చాడు. ములాయం యు.పి రాష్ట్ర కుర్చీని కొడుక్కిచ్చి కేసులనుండి బైటపాడడానికి కేంద్రంలో కాంగ్రెస్ తో లాలూచీ రాజకీయాలు నడుపుతున్నాడు. కొడుకు అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన స్ధానంలో పోటీ కోడలు డింపుల్ పోటీ చేస్తే ఇతర రాజకీయ పార్టీలేవీ పోటీ చేయలేదు. మాయావతి, మమత బెనర్జీ, జయలలిత లకు వారసులు లేరు గానీ ఉంటే ఎలా ఉండేదో? ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా నవిన్ పట్నాయక్ కూడా ఒక వారసుడే.
తన కొడుకు, మనవడు ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికయ్యారని బాల్ ధాకరే చెబుతున్నాడు. ఆ మాటకొస్తే ఎవరు కాదు? కొడుకులు, కూతుళ్ళు, మనవలు, బావలు, మరుదులు అంతా ఏదో ఎన్నికలో గెలిచి పార్టీ పదవులు చేపడుతున్నవారే. కాకపోతే ప్రత్యర్ధులెవరూ ఉండరు, అంతే. నిజానికి పార్టీ పదవులకి కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని చట్టాలు చాలానే ఉన్నాయి. కానీ పార్టీలు కుటుంబాల ఆస్తులుగా స్ధిరపడ్డాక పోటీ చేసే దమ్ము ఎవరికి ఉంటుంది? పోటీ చేస్తే పార్టీ సిద్ధాంతాలను ఉల్లంఘించారన్నమాటే!
వీరే కదా భారత దేశ ప్రజాస్వామ్య రధానికి సారధులు!? ఇలాంటి సారధుల సారధ్యంలో నడిచేది ప్రజాస్వామ్యమా? నిరంకుశత్వమా?
