శ్రీలంక కాకి తమిళనాడుపై ఎగరకూడదు మరి! -కార్టూన్


నేను చెప్పానా? తమిళనాడు పైన ఎగరకపోతేనే మంచిదని….!

శ్రీలంక తో భారత దేశానికి ఉన్న ప్రతి సంబంధాన్నీ రాక్షసీకరించే ప్రయత్నాలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ తమిళ జాతీయవాదంలో తామే నిఖార్సయినవారమని చెప్పడానికి అసలు సమస్యే కానీ అంశాలని పెద్ద సమస్యలుగా చేస్తున్నారు. ఎల్.టి.టి.ఇ తో పోరులో చివరి రోజుల్లో శ్రీలంక ప్రభుత్వం ఆదేశాల మేరకు తమిళ పౌరులపై సాగిన నరమేధం గురించి నిర్దిష్ట అవగానను ఇంతవరకూ ఈ పార్టీలేవీ ప్రకటించలేదు. శ్రీలంక ప్రభుత్వ మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికా తీర్మానం పెడితే దానికి మద్దతు ఇవ్వాలని గోల చెయ్యడమే తప్ప భారత ప్రభుత్వమే అలాంటి చర్య తీసుకునేందుకు ఈ పార్టీలేవీ ఒత్తిడి చేయలేదు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం శ్రీలంకకు చెందిన సామాన్య ప్రజలపైన విద్వేషం రెచ్చగొట్టడానికి మాత్రం పోటీలు పడుతున్నాయి.

శ్రీలంక సైనికులకి భారత దేశంలో శిక్షణ ఇవ్వకూడదంటే ఒక అర్ధం ఉంది, ఆ సైనికుల చేతుల్లోనే శ్రీలంక తమిళులు ఊచకోతలకు గురయ్యారు గనక. ఫ్రెండ్లీ మేచ్ ఆడడానికి వచ్చిన స్కూల్ పిల్లల పై కూడా విద్వేషం ప్రదర్శించడం, తమిళనాడు గుడులను చూడవచ్చిన శ్రీలంక తమిళులపై రాళ్ళ దాడి చెయ్యడం పరమ అవాంఛనీయం. ఈ విద్వేషం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలకు కూడా వ్యాపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక రాజ్యం ప్రదర్శిస్తున్న జాతి దురహంకారాన్ని వ్యతిరేకించాలంటే ఆ రాజ్యంపైనే ఆ వ్యతిరేకతను ఎక్కుపెట్టాలి తప్ప శ్రీలంక ప్రజలపై కాదు. శ్రీలంక ప్రజల పట్ల జాతి సహనం, స్నేహభావం ప్రదర్శించడం సరైన ప్రతిస్పందన అవుతుంది తప్ప ప్రతీకార భావనతో మళ్ళీ జాతి విద్వేషం వెళ్లగక్కడం సమస్య తీవ్రతకే దారి తీస్తుంది.

ఇరు దేశాల ప్రజా సంబంధాల్లో జాతి విద్వేషాలను చొప్పించి రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ప్రజలు ఈ ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

3 thoughts on “శ్రీలంక కాకి తమిళనాడుపై ఎగరకూడదు మరి! -కార్టూన్

  1. In my opinion, in general, racial oppression and descrimination of the state of Sri Lank is the real culprit. A section of Sri Lanka’s people are being carried away by the state’s ideology of racial supremacy, propagated by their ruling classes to fulfil their vested interests. When these vested interests are removed, people would come to their senses. However, the problem is how these vested interests can be removed. That is another issue.

  2. నా ఉద్దేశంలో – శ్రీలంకతో మన సంబంధాలు మెఱుగుపడే అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న మహింద రాజపక్స పూర్తి తమిళద్వేషి, భారత వ్యతిరేకి. పైకి మాత్రం సత్సంబంధాలు నటిస్తూంటాడు. అతని గుఱించి మఱో హిట్లర్ అని చెప్పుకుంటే తప్పులేదు. అతను భారత కరెన్సీని శ్రీలంక బ్యాంకుల్లో తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశాడు. అక్కడ ప్రజల బుఱ్ఱల్ని భారత్ కి వ్యతిరేకంగా పాడు చేసి పారేశారు. సరిచేయడానిక్కూడా వీల్లేని విధంగా !

వ్యాఖ్యానించండి