తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖర్ రావు మరోసారి ప్రజలని మభ్యపెట్టే పనిలో పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణ సమస్య ఈ నెలలోనే పరిష్కారం కానున్నదని ఆయన ప్రకటించాడు. ఢిల్లీకి ప్రయాణం కాబోతూ ఆయన పత్రికలు, చానెళ్ల ముందు ఈ అనూహ్య ప్రకటన చేశాడు. ఢిల్లీలో తెలంగాణ కోసం మూడు రోజులు దీక్ష చేసి జాతీయ పత్రికల దృష్టిని ఆకర్షించడంలో బి.జె.పి సఫలం అయిన నేపధ్యంలో కేంద్రీకరణను తనవైపు మళ్లించుకోవడానికే కె.సి.ఆర్ ఈ ప్రకటన చేశాడన్నది కొందరి అనుమానం.
“తెలంగాణ సమస్య ఈ నెలలో ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. అందులో అనుమానం లేదు” అని కె.సి.ఆర్ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. కె.సి.ఆర్ ప్రకటనను తెలుగు వార్తా చానెళ్లు కూడా బుధవారం రాత్రి ప్రసారం చేశాయి. తెరాస పార్టీకి చెందిన ఇతర నాయకులతో కలిసి కె.సి.ఆర్ భుధవారం ఢిల్లీ వెళ్ళాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఆయన కేంద్రాన్ని కోరనున్నట్లు ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం విషయమై రాష్ట్రంలో కదలికలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మరోసారి సమ్మెకు సిద్ధమని టి.ఎన్.జి.ఓ నాయకులు ప్రకటిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నట్లు పత్రికలు, చానెళ్ళ ద్వారా తెలుస్తున్నది. పోరు యాత్ర పేరుతో తెలంగాణ కోసం సి.పి.ఐ నిర్వహించిన యాత్ర కొద్ది రోజుల క్రితమే ముగిసింది. ఢిల్లీలో బి.జె.పి రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి మూడు రోజుల పాటు చేసిన దీక్ష పత్రికలు, చానెళ్ళ పతాక శీర్షికలను ఆకర్షించింది. బి.జె.పి కేంద్ర నాయకగణం అంతా కిషన్ దీక్షకు హాజరై మద్దతుగా ఉపన్యాసాలు ఇవ్వడంతో కిషన్ దీక్షకు జాతీయ స్ధాయి ప్రాధాన్యత ఏర్పడింది.
తాను పార్లమెంటు సెషన్ కు హాజరవడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్తున్నానని కె.సి.ఆర్ పత్రికలతో ఓ పక్క చెబుతూ మరో పక్క ఈ నెలలోనే తెలంగాణ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం అర్ధం కాని విషయం. కాంగ్రెస్ తో చర్చలు జరపనున్నారా అన్న ప్రశ్నకు, “చర్చలు సాధ్యమే. ఏదైనా సాధ్యమే” అన్న కె.సి.ఆర్ మాటలకు పత్రికలు ఎవరికి తోచిన అర్ధం వారు ఇచ్చుకుంటున్నాయి. కాంగ్రెస్ వాయిదా రాజకీయాలతో కుమ్మక్కై డొల్లుపుచ్చకాయ కబుర్లతో కాలం గడుపుతున్న కె.సి.ఆర్ లాంటి నాయకులు ఏమైనా చెప్పే స్వేచ్ఛ కలిగి ఉండడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం.
కాగా సకల జనుల సమ్మె తో కూడా కదలని కేంద్ర ప్రభుత్వం ఏ ప్రజాందోళనలూ పెద్దగా లేని ఈ సమయంలో తెలంగాణ సమస్య ఎందుకు పరిష్కరిస్తుందో ఊహకు అందని విషయం. ఆందోళనలు లేనప్పటికీ వివిధ స్టేక్ హోల్డర్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నదన్న వార్తలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. ఈ చర్చల నేపధ్యంలోనే రాయలసీమ కు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ టి.టి.పి నాయకుడు బైరెడ్డి నేతృత్వంలో పాదయాత్రాలు చోటు చేసుకున్నాయని పలువురు భావిస్తున్నారు.
తెలంగాణ పై త్వరలో కేంద్రానికి మరోసారి లేఖ రాయనున్నామని టి.డి.పి ప్రకటించినట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణపై కొత్తగా చెప్పేదేమీ లేదనీ కూడా ఆ పార్టీలోనే కొందరు నాయకులు గొణుగుతున్నారు. తన నిర్ణయం ఏమిటో టి.డి.పి ఎప్పుడో చెప్పిందనీ, తెలంగాణ ఏర్పాటు పై టి.డి.పి కి అభ్యంతరం ఏమీ లేదనీ ఆ పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు చెప్పినట్లు బుధవారం తెలుగు చానెళ్లు ప్రకటించడం మరొక అనూహ్య పరిణామంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అన్న ఆలోచనకు తెలుగుదేశం కి చెందిన సీమాంద్ర నాయకులు వచ్చేశారన్న అనుమానానికి ముద్దు కృష్ణమ ప్రకటన దోహదం చేస్తున్నది.
2014 ఎన్నికల కోసం తెలంగాణ నిర్ణయాన్ని అట్టే పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రెండేళ్ల ముందే తెలంగాణ తుట్టెను ఎందుకు కదిలిస్తుంది? తెలంగాణ విషయంలో బి.జె.పి వివిధ ఆందోళనలతో ముందంజలో ఉన్న నేపధ్యంలో ఇతర పార్టీల నాయకులు ఆత్మ రక్షణలో పడినందునే ఒకింత దూకుడు ప్రకటనలు వస్తున్నాయని భావించవచ్చు. దూకుడు ప్రకటనలకు కారణం ఏదయినప్పటికీ వీరు చేస్తున్న ప్రకటనలు తెలంగాణ పై వివిధ పార్టీల మధ్య ఏకాభిప్రాయానికి సూచనగా భావించవచ్చునేమో ఆలోచించవలసిన విషయం.