శ్రీలంక తమిళుల పరిస్ధితిపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ రెచ్చగొట్టే ప్రకటనలు వెరసి శ్రీలంక యాత్రీకులపై విద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు దేవాలయాలను సందర్శించడానికి శ్రీలంక నుండి వచ్చిన యాత్రీకులు మధ్యలోనే ప్రయాణం ముగించుకుని భయాందోళనలతో తిరుగు ప్రయాణం కట్టారు. తమిళనాడు సందర్శనకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం ‘ట్రావెల్ అడ్వైజరీ’ కూడా జారీ చేయవలసిన పరిస్ధితి తలెత్తింది. తమిళనాడు తమిళులనుండి రాళ్ళు, చెప్పుల దాడిని ఎదుర్కొన్న యాత్రికులలో శ్రీలంక తమిళులే మెజారిటీ కావడం జాతి విద్వేషం గుడ్డిదనడానికి ప్రబల తార్కాణం.
తిరుచి జిల్లాలోని వెలంకన్ని చర్చి ని సందర్శించడానికి శ్రీలంక నుండి వచ్చిన యాత్రీకులపై రాళ్ళదాడి జరిగింది. 180 మంది ప్రయాణిస్తున్న మూడు బస్సులపై దుండగులు కట్టూరు వద్ద మగళవారం రాళ్ళతో దాడి చేయడంతో బస్సుల ముందు, పక్క అద్దాలు దెబ్బతిన్నాయి. సోమవారం అంతా యాత్రికులు తమిళ సంఘాల సభ్యుల చేత నిరసన ప్రదర్శనలు, వేధింపులు ఎదుర్కొన్నారు. యాత్రికులు శ్రీలంక రాయబార కార్యాలయాన్ని సహాయం అర్ధించడంతో పోలీసు రక్షణ కల్పించినప్పటికీ మంగళవారం వారిపై రాళ్ళదాడి కొనసాగింది. వెలంకన్ని దేవాలయం సందర్శిస్తున్న సందర్భంగా యాత్రికులను వేధించిన వివిధ తమిళ సంఘాల సభ్యులు, వారు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పటికీ వెంటాడి రాళ్ళదాడికి తెగబడ్డారు.
నాగపట్టినం వద్ద దేవాలయాన్ని సందర్శించిన అనంతరం 178 మంది యాత్రీకులు తిరిగి వస్తుండగా నిరసన ప్రదర్శనలు ఎదుర్కొన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఎల్.టి.టి.ఇ అనుకూల సంస్ధ ‘నామ్ తమిఝార్ ఇయక్కం’ (ఎన్.టి.ఐ) సభ్యులు ఈ దురాగతంలో చురుకుగా పాల్గొనారు. ఎం.డి.ఎం.కె పార్టీ కూడా నిరసనల్లో చురుకుగా పాల్గొన్నట్లు తెలుస్తున్నది. సోమవారం తంజావూరు లోని పూండి మధ క్రిస్టియన్ దేవాలయాన్ని సందర్శిస్తుండగా శ్రీలంక యాత్రీకులను నిరసనకారులు వేధింపులకు గురి చేశారు.
యాత్రికులనుండి ఫోన్ కాల్స్ అందుకున్న తర్వాత శ్రీలంక రాయబార కార్యాలయం వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తిరిగి వెళ్ళడానికి తిరుచి ఎయిర్ పోర్టు కి వస్తుండగా యాత్రీకుల బస్సులపై హింసాత్మక దాడులకు తెగబడడంతో వారు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. శ్రీలంక యాత్రికులకు అన్నీ రక్షణాలు కల్పిస్తామని భారత ప్రభుత్వం ఒకవైపు హామీలు గుప్పిస్తుండగానే దాడులు జరిగాయి. ఈ లోపుగానే తమిళనాడు సందర్శించవద్దంటూ శ్రీలంక ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దీనితో శ్రీలంక యాత్రీకుల ద్వారా అందుతున్న టూరిజం ఆదాయానికి గండిపడినట్లయింది. 2011 లో 1,75,000 కు పైగా శ్రీలంక యాత్రికులు ఇండియా సందర్శించగా 2012 లో ఇది 2 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. తాజా గొడవలతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తున్నది.
గత కొన్ని నెలలుగా శ్రీలంకకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం సాగిస్తున్న చర్యలు తాజా దాడులకు ప్రేరణగా నిలిచింది. తమిళనాడులో శిక్షణ పొందుతున్న శ్రీలంక సైనికులను తక్షణమే తిరిగి పంపించాలని మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేయడంతో రగడ మొదలయింది. సమస్యను సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించే బదులు కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని, కొండొకచో మొండి వైఖరిని అవలంబించడంతో సమస్య క్లిష్టంగా మారింది. శ్రీలంక సైనికులకు శిక్షణ ఇవ్వడం ఆపేది లేదని కేంద్ర మంత్రి పళ్లం రాజు మొండిగా ప్రకటించడంతో జయలలితకు పరువు సమస్యగా ముందుకు వచ్చింది. కొద్ది రోజుల ప్రకటనల యుద్ధం అనంతరం చెన్నైలో శిక్షణ పొందుతున్న శ్రీలంక సైనికులను బెంగుళూరు శిక్షణా శిబిరానికి తరలించి శిక్షణ కొనసాగించడంతో ఆమెకు పుండుమీద కారం రాసినట్లయింది. శ్రీలంక సైనికులకు శిక్షణ ఇచ్చే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పట్టుదల, ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ఈ వివాదం కొనసాగుతుండగానే మరో కొత్త వివాదం ముందుకు వచ్చింది. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో స్నేహపూర్వక పోటీల్లో పాల్గొనడానికి శ్రీలంక స్కూల్ విద్యార్ధులకు అనుమతి ఇవ్వడంతో స్టేడియం అధికారులపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీలంక విద్యార్ధులకు అనుమతి ఇచ్చినందుకు స్టేడియం అధికారిని ఆగస్టు 31 న ఆమె సస్పెండ్ చేసింది. నిజానికి ఇలాంటి స్నేహపూర్వక పోటీలకోసం విద్యార్ధులు రావడం పోవడం సాధారణంగా జరిగే విషయమే. సైనిక శిక్షణ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంతాలు తలెత్తడంతో శ్రీలంక దేశీయుల సందర్శనలన్నీ అకస్మాత్తుగా సమస్యగా మారిపోయాయి.
శ్రీలంక సైనికులకు శిక్షణ ఇవ్వడం, ఫ్రెండ్లీ మాచ్ లకు అనుమతి ఇవ్వడం తదితర చర్యల ద్వారా తమిళుల సెంటిమెంట్లు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి జయలలిత ప్రకటిస్తోంది. తమిళుల మనోభావాలను పట్టించుకోకుండా శ్రీలంక సైనికులకు శిక్షణ ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నిస్తోంది. శ్రీలంకలో లక్షలమంది తమిళ శరణార్ధులు ఇప్పటికీ తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటుండగా, వారికి సరైన సహాయచర్యలు అందడం లేదనీ, ఈ విషయంలో శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి భారత ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదనీ అనేకమంది తమిళ సంఘాలు, పార్టీలు, మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు అభివృద్ధి చేసుకోవడానికి ఆతృత చూపుతున్నదే తప్ప తమిళుల పరిస్ధితిపట్ల ఆందోళన లేదని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతునాయి. ఇది నిజం కూడా.
శ్రీలంక ప్రభుత్వం తమిళుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నందుకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాలని మొదట భావించిన భారత ప్రభుత్వం తమిళ పార్టీల ఒత్తిడితో అనుకూలంగా ఓటు వేసింది. అందుకు శ్రీలంక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటినుండి శ్రీలంక ప్రభుత్వాన్ని మంచి చేసుకోవడానికి భారత అధికారులు అవసరానికి మించి ప్రయత్నాలు సాగిస్తున్నారని సర్వత్రా అభిప్రాయం నెలకొంది. ఈ నేపధ్యంలో శ్రీలంక సైనికులకు శిక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొండి ప్రకటన విమర్శలపాలయింది. అంశాలవారిగా సమస్యలను చర్చించి పరిష్కరించుకునే బదులు ఇరు దేశాల ప్రజా సంబంధాల్లోకి సైతం విబేధాలు చొరబడేలా కేంద్ర, రాష్ట్రాలు పరిస్ధితిని జఠిలం చేశాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎల్.టి.టి.ఇ తో పోరాటం ముగిసే చివరిరోజుల్లో తమిళులపై సామూహిక జాతి హత్యాకాండను శ్రీలంక సైన్యం అమలు చేసిందని ఆరోపణలున్నాయి. దానికి సాక్ష్యంగా అనేక వీడియోలు విడుదలయ్యాయి. ఈ ఆరోపణలను శ్రీలంక ప్రభుత్వం గుడ్డిగా తిరస్కరించింది. విచారణకు తిరస్కరించింది. తన సొంత వ్యవహారాల్లో జోక్యం తగదని వాదించింది. ఐక్యరాజ్య సమితి కార్యాలాయాలను శ్రీలంక అధికార పార్టీ కార్యకర్తలు అనేక రోజుల పాటు చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఇలాంటి సంఘటనలతో శ్రీలంక అధికార పార్టీ జాతి విద్వేషం ప్రపంచానికి ప్రస్ఫుటంగా రుజువయింది. శ్రీలంకలో తమిళ జాతి ప్రజల దీన పరిస్ధితి కూడా లోకానికి మరోసారి వెల్లడయింది. అయితే తమిళుల మానవహక్కుల కోసం, వారి భవిష్యత్తుకోసం రాయబారపరంగా చర్యలు తీసుకోవలసిన భారత ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించింది. ఎల్.టి.టి.ఇ అణచివేతలో శాయశక్తులా సహకరించిన భారత ప్రభుత్వం అక్కడి జాతుల సమస్య సంక్లిష్టం కావడంలో తాను ఒక చెయ్యి వేసింది.
ప్రపంచ వ్యాపితంగా అనేక జాతులు, దేశాల స్వతంత్ర నిర్ణయ హక్కులను కాలరాసిన అమెరికా తమిళుల మానవహక్కుల కోసం సమితిలో తీర్మానం ప్రవేశపెట్టడమే పెద్ద అభాస. ఈ చర్యను చేపట్టవలసింది నిజానికి భారత ప్రభుత్వమే. తమిళుల జాతీయ హక్కులను, ఆకాంక్షలను అణచివేయడంలో సహకరించిన భారత ప్రభుత్వం ఆ బాధ్యతను చేపట్టలేకపోయింది. ఫలితంగా అమెరికా జిత్తులకు చోటు కల్పించినట్లయింది. మానవహక్కులతో పాటు జాతీయ ఆకాంక్షలను, దేశాల స్వాతంత్ర్యాలను ఓ పైక్క అణచివేస్తూ అదే హక్కులకోసం లెక్చర్లు దంచుతూ ఉపదేశాలు ఇచ్చే కళలో ఆరితేరిన అమెరికాకు శ్రీలంక తమిళుల కోసం మొసలికన్నీరు కార్చడానికి ఎటువంటి అభ్యంతరమూ లేకపోయింది.
ఈ నేపధ్యంలో శ్రీలకం తమిళులు అనాధలుగా మిగిలిపోయారు. తమిళ జాతీయ సంస్ధలు అడపాదడపా సాగించే నిరసనలు, మతిలేని దాడులు తప్ప వారి ఆక్రందనలకు గొంతుక ఇచ్చేవారు లేకపోయారు. సమగ్ర దృక్పధంతో శ్రీలంక తమిళజాతి సమస్యను విశ్లేషించి తదనుగుణంగా పరిష్కరించేవారు లేని నేపధ్యంలోనే తమిళనాడులో తమిళయాత్రీకులన్న స్పృహ కూడా లేకుండా దాడులు జరుగుతున్న పరిస్ధితి నెలకొంది. శ్రీలంకలో తమిళుల దీన స్ధితికి శ్రీలంక పాలకవర్గాల వారు ప్రత్యక్ష బాధ్యులైతే భారత ప్రభుత్వాలు పరోక్ష బాధ్యత వహించాలి. శ్రీలంక తమిళుల సమస్య పరిష్కరించేవైపుగా భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వంపై తగిన రాజకీయ, రాయబార, అంతర్జాతీయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎంతటి దీర్ఘకాలం తీసుకున్నప్పటికీ భారత ప్రభుత్వం వైపునుండి తీసుకునే చర్యలు తమిళనాడు ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పుతాయి. భారత ప్రభుత్వ చిత్తశుద్ధిపై విశ్వాసం నెలకొన్న పరిస్ధితుల్లో ఇలాంటి దాడులకు అవకాశం ఉండదు.
