పవర్ గ్రిడ్ విఫలమై విద్యుత్ సరఫరా ఆగిపోతే… -ఫోటోలు


ఉత్తర భారతంలో నెల రోజుల క్రితం విద్యుత్ సరఫరా ఆగిపోయి జన జీవనం స్తంభించినప్పటి ఫొటోలివి. జులై 30, 31 తేదీల్లో ఉత్తర భారత దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలలో సరఫరా దెబ్బతిని అంధకారం నిండిపోయింది. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి సూపర్ ఫాస్ట్ సర్వీసులతో పాటు 300 కి పైగా రైళ్ళు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జులై 30 ఉదయం 2:30 కి మొదలుకొని తరువాత రోజు వరకూ బ్లాక్ ఔట్ కొనసాగింది.

ఆగ్రా వద్ద ట్రిప్ అయి పవర్ గ్రిడ్ విఫలం అయిందని, విద్యుత్ సరఫరా దెబ్బతినడానికి అదే కారణమనీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే పత్రికలకు చెప్పాడు. కానీ ఢిల్లీ విద్యుత్ మంత్రి హారూన్ యూసఫ్ ప్రకారం పొరుగు రాష్ట్రాలు క్రమ శిక్షణను ఉల్లంఘించి పవర్ గ్రిడ్ నుండి కేటాయించినదానికంటే ఎక్కువ విద్యుత్ లాక్కోవడం వల్ల గ్రిడ్ విఫలం అయింది. ఉత్తర ప్రదేశ్, రాజస్ధాన్, పంజాబ్ లు ఇలా అధికంగా విద్యుత్ వాడాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను పత్రికలు ఆ తర్వాత ధృవీకరించాయి. అయితే అసలు కారణాన్ని పత్రికలు, ప్రభుత్వం విస్మరించాయి. లాభాల కోసం ప్రవేటు రంగంలోని బొగ్గు, విద్యుత్ కంపెనీలు కక్కుర్తి పడడమే విద్యుత్ సంక్షోభానికి అసలు కారణం.

విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ లు ప్రభుత్వ కంపెనీల చేతుల్లో ఉన్నంతవరకూ పవర్ గ్రిడ్ లో క్రమ శిక్షణ పాటించడం ప్రభుత్వాల చేతుల్లో ఉంటూ వచ్చింది. కానీ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలను మెజారిటీ భాగం ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పాక ఈ పరిస్ధితి కట్టుతప్పింది. ప్రభుత్వరంగ కంపెనీలలో పెద్ద మొత్తంలో వాటాలను అమ్మేసి ప్రవేటు కంపెనీలకు కట్టబెట్టడంతో ప్రభుత్వ విద్యుత్, బొగ్గు, గ్యాస్ కంపెనీలపైన కూడా ప్రవేటు వ్యాపారులు పెత్తనం సాగించే పరిస్ధితి నెలకొంది. లాభార్జనే ప్రధాన లక్ష్యంగా చేసుకునే ప్రవేటు కంపెనీలు పవర్ గ్రిడ్ క్రమశిక్షణను ఉల్లంఘించి, ప్రభుత్వ నియమ నిబంధనలను పక్కన బెట్టి తమ చిత్తం వచ్చిన రీతిలో విద్యుత్ ను అమ్ముకుంటున్నాయి. ఫలితంగా రెండు రోజులపాటు ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక రైళ్లు, ఆసుపత్రులు, మెట్రో రైళ్లు, ఆఫీసులు, బ్యాంకులు, ట్రాఫిక్ సిగ్నళ్ళూ, ఇలా అనేక వ్యవస్ధలు చీకట్లో మగ్గిపోయాయి. నియంత్రణ వ్యవస్ధలు ప్రభుత్వం చేతుల్లో కాకుండా ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పడం అంటే దొంగ చేతికి తాళం చేతులు ఇవ్వడమే. దాని ఫలితం ఏమిటో ‘జేపీజీ డే’ అనే వెబ్ సైట్ అందించిన ఈ ఫోటోలు చూపిస్తున్నాయి.

వ్యాఖ్యానించండి