లేచి కలబడడం కాంగ్రెస్ నాయకులకి సాధ్యమా? -కార్టూన్


కార్టూన్: కేశవ్ (ది హిందూ)

 “విన్నావా? నిలబడి కలబడదాం అని అంటున్నారామే”

 

 

“ఆత్మ రక్షణలో పడవలసిన అవసరం మనకేమీ లేదు. లేచి నిలబడి కలబడదాం. లక్ష్య శుద్ధితో దూకుడుగా పోరాడుదాం. బ్లాక్ మెయిల్ చెయ్యడం బి.జె.పి కి అలవాటుగా మారింది.” డీలా పడిన కాంగ్రెస్ నాయకులకు స్ధైర్యాన్నివ్వడం కోసం సోనియా గాంధీ అన్న మాటలివి.  బొగ్గు కుంభకోణం వల్ల కేంద్ర ఖజానాకి 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడి చేసిన దరిమిలా పార్లమెంటు సమావేశాలను వారం రోజులుగా బి.జె.పి అడ్డుకుంటున్న సంగతి విదితమే. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేస్తే తప్ప పార్లమెంటు సమావేశాలను జరగనిచ్చేది లేదని బి.జె.పి హఠం వేసింది. బొగ్గు కుంభకోణం వల్ల ‘బ్లాక్ పెయింటింగ్’ తో సమగ్రత కోల్పోయిన ప్రభుత్వాన్ని ఎవరూ బ్లాక్ మెయిల్ చేయవలసిన అవసరం ఏమిటని బి.జె.పి నాయకుడు అరుణ్ జైట్లీ ప్రశ్నిస్తున్నాడు.

పార్లమెంటు ఉన్నది చర్చ చేయడానికే గనక చర్చిద్దాం అని కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. బి.జె.పి నాయకుడు అరుణ్ శౌరి లాంటి వారు కూడా ప్రధానిని ప్రకటన చేయనివ్వాలని వాదిస్తూ సమావేశాలను అడ్డుకోవడం పట్ల అసహనం ప్రకటిస్తున్నారు. పత్రికలు సైతం బి.జె.పి ఎత్తుగడను వివిధ రూపాల్లో తప్పు పడుతున్నాయి. మొదట మద్దతు ఇచ్చిన పత్రికలు కూడా ఇపుడు ‘అతి’ అయిందని వ్యాఖ్యానిస్తున్నాయి. ఎత్తుకోవడమే ‘ప్రధాని రాజీనామా’ డిమాండ్ ని ఎత్తుకోవడంతో ముందుకు సాగలేక అలాగని వెనక్కి లాగలేక బి.జె.పి సతమతం అవుతున్న అనుమానాలూ లేకపోలేదు.

చర్చ జరిగితే బొగ్గు కుంభకోణంలో బి.జె.పి పాత్ర వెల్లడవుతుంది గనక సమావేశాలను ఆ పార్టీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ వాదిస్తోంది. అసలు సమావేశాల బహిష్కరణ ఒట్టి నాటకమేనని ఈ నాటకంలో కాంగ్రెస్, బి.జె.పి లు కుమ్మక్కయ్యాయని సి.పి.ఐ, సి.పి.ఎం, సమాజ్ వాదీ, టి.డి.పి తదితర పార్టీలు ఆరోపిస్తున్నాయి. అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా బి.జె.పి ఆందోళన నాటకమేననీ, బొగ్గు కుంభకోణం కప్పి పెట్టే విషయంలో కాంగ్రెస్, బి.జె.పి లు కుమ్మక్కయ్యాయనీ ఆరోపించిన సంగతి గమనార్హం. బొగ్గు తవ్వకమే లేకపోతే నష్టం ఎక్కడిదని చిదంబరం ఓ పక్క ప్రశ్నిస్తుంటే, బొగ్గు లైసెన్సులు రద్దు చేస్తే ఆర్ధిక వ్యవస్ధకే నష్టం అంటున్నాడు మరో మంత్రి కపిల్ సిబాల్.

ఇన్ని వాదనల మధ్య ‘నిలబడి కలబడదాం’ అంటున్న సోనియా ధైర్య వచనాలు పని చేసేవేనా? కాంగ్రెస్ పార్టీలో గ్రామ నాయకుల దగ్గర్నుండి కేంద్ర మంత్రుల దాకా సోనియా భజన తప్ప వేరే ఎరగరాయే. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజకీయేతర పదవులను జూనియర్ నాయకులతో నింపాలన్నా సోనియా ఆమోదముద్ర పడితే తప్ప జరగదాయే. పార్టీతో పాటు ప్రభుత్వాల పగ్గాలు కూడా ఏక వ్యక్తి కేంద్రకంగా జరిగే పార్టీలో ‘నిలబడి కలబడే’ సంస్కృతి కొత్తగా ఎక్కడినుండి వస్తుందిట?

3 thoughts on “లేచి కలబడడం కాంగ్రెస్ నాయకులకి సాధ్యమా? -కార్టూన్

  1. అసలు రాజకీయ పార్టీలన్నీ ఒకే చెట్టు కొమ్మలు.అధికారం లోకి వస్తే ఏ పార్టీ అయినా అంతే ! అవును,ఎన్నికలు లేని ప్రత్యామ్నాయం రావాలి.

వ్యాఖ్యానించండి