తమతో బస్టాండ్ లో నిలబడి ఉన్న స్నేహితురాలిని కళ్ళముందే అసభ్యంగా వేధిస్తున్నారు. భరించలేని యువకులిద్దరూ గ్యాంగ్ అసభ్య చేష్టలకి అడ్డు చెప్పారు. అడ్డుకున్నందుకు ఇద్దరి యువకులని తీవ్రంగా కొట్టడమే కాకుండా కత్తితో రవిని కడుపులో పొడిచి పారిపోయారు. ‘ది హిందూ’ ప్రకారం యువకులిద్దరూ పోలీసులకి ఫోన్ చేయడంతో సమయానికి అక్కడికి వచ్చిన పోలీసులు బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్ళడం మాని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. స్టేట్ మెంట్ తీసుకుంటూ రక్తం కారుతున్న రవిని 40 నిమిషాలు పోలీస్ స్టేషన్ ముందే ఎండలో, ఆరు బయట పడుకోబెట్టారు. ఆ తర్వాత అంబులెన్స్ ని పిలిచినా ఆసుపత్రికి వెళ్ళేలోపే రవి చనిపోయాడు.
“వారి ఫార్మాలిటీస్ కోసం విలువైన సమయాన్ని గడిపే బదులు త్వరగా ఆసుపత్రికి తెచ్చినట్లయితే నా కొడుకు బతికి ఉండేవాడు” అని రవి తండ్రి సురేష్ దంగి ఆరోపించాడు. రవి స్నేహితులు అంకిత్ తదితరులు కూడా అదే చెప్పారు. అంకిత్ పరిస్ధితి మెరుగుపడిందనీ, స్ధిరంగా ఉందనీ నగర ఎస్.పి చెప్పినట్లు ‘జాగ్రన్ పోస్ట్’ తెలిపింది. పోలీసుల చర్య పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. మానవ హక్కుల కమిషన్ విచారణ ఆదేశించింది. వారం రోజుల లోపల నివేదిక ఇవ్వాలని కోరిందని జీ న్యూస్ తెలిపింది. అనుమానితుల్లో ముగ్గురిని పట్టుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐ.జి, హోమ్ మంత్రి కూడా విచారణకు ఆదేశించామని తెలిపారు.
తాము 108 కి ఫోన్ చేశామనీ, కానీ అంబులెన్స్ ఆలస్యంగా వచ్చిందని పోలీసులు తప్పించుకో జూస్తున్నారు. పోలీసులు తమ చర్యను సమర్ధించుకోవడానికే అలా చెబుతున్నారని ఐ.బి.ఎన్ వ్యాఖ్యానించింది. అయితే ఐ.బి.ఎన్ ప్రకారం కత్తిపోటు సంఘటన జరిగాక స్నేహితుడు, రవిని పోలీసు స్టేషన్ కి తెచ్చాడని పోలీసులు చెప్పినట్లు తెలిపింది. ఎలా జరిగినప్పటికీ పోలీసులు తీసుకోవలసిన మొట్టమొదటి చర్య రక్తం ఒడుతున్న బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళడం. దానికి బదులు స్టేట్ మెంట్ తీసుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అంటే మనిషికి ఉండవలసిన కనీస మానవీయ స్పందన లేకపోవడమే.
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనను ఐ.బి.ఎన్ లైవ్ టి.వి చానెల్ రికార్డు చేసి ప్రసారం చేసింది. పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసి ఉన్న వాహనాలకు ఆనుకుని రక్తం కారుతున్న శరీరంతో రవి పడి ఉంటే అతని స్నేహితుడు దీనంగా దిక్కులు చూస్తున్న దృశ్యం ఎవరినైనా కలిచివేయక మానదు. అంబులెన్స్ లో రవిని ఎక్కిస్తున్నపుడు అతను తెలివిగా ఉండడం కనిపిస్తూనే ఉంది. చొక్కా పైకెత్తి కత్తి పోటుని ఐ.బి.ఎన్ కెమెరాకి చూపించాడు కూడా. కానీ ఆసుపత్రికి వెళ్ళే వరకూ అతని ప్రాణం నిలవలేదు. అంబులెన్స్ నుండి అతని విగత శరీరాన్ని దించడం గమనిస్తే పోలీసుల ఉదాసీనత, యాంత్రిక విధి నిర్వహణ ఒక ‘ప్రాణం ఖరీదు’ తో సమానమైందని అర్ధం అవుతుంది.
ఆపరేషన్ ధియేటర్ లో రోగికి ఆపరేషన్ చేస్తున్నపుడు డాక్టర్లకు హృదయం ఉండకూడదు అంటారు. అయితే, అది రోగి క్షేమం కోసమే. రోగి తమ వద్దకు వచ్చినప్పటి నుండి చికిత్స ముగిసిన చివరి రోజు వరకూ ధనాపేక్ష డాక్టర్లు తమ హృదయాలను, మానవ విలువలను మొత్తంగా పారేసుకోవడం, డబ్బు కోసం పీడించడం మరొక అంశం. మరి పోలీసులు! డబ్బుగల వారి కోసం, పై అధికారుల కోసం, రాజకీయ నాయకుల కోసం తమ విధులనూ, కర్తవ్యాన్ని పోలీసులు అమ్ముకోవడం, హృదయ స్పందనలను చంపుకోవడం నేటి వ్యవస్ధకి ఉన్న రోగ లక్షణంగా భావించి కాసేపు పక్కన పెడదాం. రవి విషయంలో జరిగింది అది కాదు. (లేక ఆదేనా?)
కత్తి పోట్లకు గురై రక్తం కారుతున్న వ్యక్తి కళ్ల ముందు ఉన్నపుడు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాలన్న ఆతృత (urge) ని అణచిపెట్టుకోవడం, లేదా చంపేసుకోవడం ఎలా సాధ్యం? బహుశా పై అధికారుల ఆదేశాల మేరకో, నాయకులను సంతృప్తిపరచడానికో, ఇంకేదైనా కారణానికో అనేకమందిని తమ చేతుల్తోనే, తమ లాఠీలతోనే, ఒక విధిగా, కుళ్లబోడిచే కళలో ఆరితేరడం వల్లనే అది సాధ్యం అయిందా? రాజ్యం చేతిలో పని ముట్టుగా మారాక, పని ముట్టుగా మారకపోతే ఉద్యోగం ఉండదని అర్ధం అయ్యాక, ఉద్యోగం పోతే బతుకు లేదని తెలిసాక, ‘సాటి మనిషి’ అన్న కనీస స్పందన చచ్చిపోవడమే ఇండోర్ పోలీసుల నేరస్ధ ఉదాసీనతకు కారణం అయి ఉండవచ్చు. రాజ్యం అవసరాల కోసం మలచబడిన పోలీసులు ‘మానవ స్పందన’ ను కోల్పోవడమే రవి మరణానికి కారణమని చెప్పుకోవడం సముచితం.
ఐ.బి.ఎన్ లైవ్ ప్రసారాన్ని ఇక్కడ చూడవచ్చు.




ఇంత ఘోరమా? సహజ స్పందనలు కోల్పోయిన పోలీసుల అమానవీయతకు నిష్కారణంగా నిండు ప్రాణం బలైపోయింది. కథనం చదువుతుంటేనే దుస్సహంగా అనిపించింది… ఇక టీవీ ప్రసారాన్ని చూసే ధైర్యం లేదు నాకు..