కేంద్ర మంత్రికి ద్రవ్యోల్బణం సంతోషమేనట!–కార్టూన్


రైతుతో: ఎక్కువ అడగొద్దయ్యా! రేటు ఎక్కువైతే మళ్ళీ సగటు మనిషికి భారం కదా!

       జనంతో: ధరలు పెరిగాయని గొణక్కండి. రైతులకి అదే లాభం.

——————————————

ప్రజల అవసరాలతో పరాచికాలాడడం కేంద్ర మంత్రులకు ఆటగా మారినట్లుంది. ‘వాటర్ బాటిల్ కి 15/- ఖర్చు పెడతారు గానీ బియ్యం ధర రూపాయి పెరిగినా సహించలేరు’ అంటూ మధ్య తరగతి జనంపై ఏవగింపుని చాటుకున్న చిదంబరం సరసన, కేంద్ర ఉక్కు మంత్రి బేణీ ప్రసాద్ వర్మ చేరిపోయాడు. బియ్యం, గోధుమలు, పప్పులు, కూరగాయలు తదితర ధరలు పెరిగాయనీ, దానివల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని అంగీకరిస్తూనే, పెరిగిన ద్రవ్యోల్బణంతో తనకు సంతోషమేననీ దానివల్ల రైతులు లాభపడతారనీ వ్యాఖ్యానించి తన దళారీ బుద్ధి చాటుకున్నాడు. తద్వారా ప్రధాని దగ్గర్నుండి ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడి వరకూ ద్రవ్యోల్బణం పై వ్యక్తపరుస్తున్న ఆందోళనంతా ఒట్టిదేనన్న నిజాన్ని కూడా వెల్లడించాడు.

“పప్పులు, పిండి (గోధుమలు), బియ్యం, కూరగాయల ఖరీదు పెరిగిపోయింది. ధరలు ఎంత ఎక్కువగా ఉంటే రైతులకి అంత లాభం. ఈ ద్రవ్యోల్బణం నాకు సంతోషమే… ఆహారాల ధర పెరిగిందని మీడియా చెబుతోంది, కానీ రైతులకు అది లాభకరం… రైతులు లాభపడడానికి ప్రభుత్వం అనుకూలమే” అని మంత్రివర్యులు వాకృచ్చారు. దీన్నిబట్టి కేంద్ర ఉక్కు మంత్రి దృష్టిలో ద్రవ్యోల్బణం రైతులకి లాభం కనక ప్రజలంతా భరించవలసిందేనన్నమాట. అధిక ద్రవ్యోల్బణం ఆర్ధిక వ్యవస్ధకు నష్టకరం అని ప్రణబ్ ముఖర్జీ, సుబ్బారావు, మాంటేక్ సింగ్, చిదంబరం ఇత్యాధులంతా చెప్పేదంతా నిజం కాదన్నమాట.

అసలు బేణీ ప్రసాద్ గారి వాదనలో నిజం ఎంతో తెలుసుకోవడం అవసరం. అది తెలుసుకోవడానికి పెద్ద ఆర్ధికవేత్తలతో పనిలేదు. వర్మ గారి వాదన ఎంత తప్పో చెబుతూ పత్రికలు ఇప్పటికే ఉతికి ఆరేశాయి కూడా. రైతులు తీస్తున్న ఉత్పత్తులన్నీ నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారా అన్నది గమనించవలసిన విషయం. ఆ విధంగా రైతులే వినియోగదారులకు అమ్ముకునే వసతి ఎక్కడన్నా ఉందా? ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటల్ని అత్యంత తక్కువ రేట్లకి కొనేది దళారులు. మార్కెట్లో ధరలు పెరిగాక అనేక రెట్లు లాభాలకు అమ్ముకునేదీ దళారులే. అంటే ధరల పెరుగుదల వల్ల లాభపడుతున్నది దళారులే తప్ప రైతులు కాదు.

రైతులు దళారీలకి అమ్మేటపుడు రేట్లు తక్కువగా ఉండడం, వారి చెయ్యి దాటగానే అమాంతంగా పెరిగిపోవడం అందరూ ఎరిగిన సత్యం. రైతుకీ వినియోగదారుడికీ మధ్య అనేక పొరల్లో తిష్టవేసి కమిషన్లు గుంజే దళారీకే రైతులకి రావలసిన లాభం చేరుతుంది. ప్రతి సంవత్సరం ప్రాంతీయ పత్రికలనుండి, జాతీయ పత్రికల దాకా మొత్తుకునే పాటే ఇది. మరి రైతులకి లాభం అని మంత్రి ఎలా అనగలరు?

మంత్రిగారి అవగాహన ఇంకా అనేక విధాలుగా లోపభూయిష్టం. ప్రతి రైతూ అన్ని పంటలూ పండించడు. పప్పులు పండించే రైతు బియ్యం, గోధుమలు, కూరగాయలు కొనుక్కోవాల్సిందే. బియ్యం పండించే రైతు గోధుమలు, కూరగాయలు, పప్పులు కొనుక్కోవాల్సిందే. ఒక సరుకుకి ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన రేటు (ఒకవేళ) వస్తే, ఇతర సరుకులన్నీ అదే ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన రేట్లతో కొనుక్కోవాలి. రైతులు ప్రధానంగా ఉత్పత్తిదారు అవడంతో పాటు అతను ముఖ్యమైన వినియోగదారు కూడా. ఇక రైతు కి లాభం ఎక్కడ?

ఫస్ట్ పోస్ట్ లాంటి పత్రికలు ఇంకా సమర్ధవంతమైన విశ్లేషణ చేశాయి. ద్రవ్యోల్బణం వలన ప్రజలందరితో పాటు రైతులు కూడా నష్టపోతారన్నది అంతా అంగీకరించే సత్యం. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగినమేరకు రైతులు ఇతర సరుకలకోసం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అంటే తమ ఆదాయాల్లో మరింత భాగాన్ని కేవలం తిండి పైనే ఖర్చు పెట్టవలసిన పరిస్ధితికి రైతు నెట్టబడతాడు. జబ్బు చేస్తే మెరుగైన వైద్యం చేయించుకోలేడు. పిల్లల చదువులకి పెద్దగా ఖర్చు చేయలేక ‘చదివింది చాల్లెమ్మం’టాడు. చిన్న ముచ్చట్లు, ఆనందాలు రద్దు చేసుకుంటాడు. ఆ విధంగా వినోదం, మాన్యుఫాక్చరింగ్ సరుకులు, ఇతర వినియోగ సరుకులు కొనే తాహతు రైతుకీ తగ్గిపోతుంది. ఇతర ప్రజలతో పాటు రైతుల కొనుగోళ్ళు కూడా పడిపోవడం వల్ల పరిశ్రమల రంగం, వినియోగ రంగం, వ్యాపార రంగం కూడా ప్రభావితం అవుతాయి.

కొనుగోళ్ళు తగ్గినపుడు పెట్టుబడుదారులు ఉత్పత్తులను తగ్గించుకుంటాడు. కొత్త ప్రాజెక్టుల జోలికి పోవడానికి పెద్దగా సాహసించడు. అంటే కొత్త పెట్టుబడులు కూడా తగ్గిపోయే వైపుగా ప్రభావం పడుతుందన్నమాట. రైతులు, కూలీలు, మధ్య తరగతి ఉద్యోగులు, కార్మికులు తదితర అల్పాదాయ వర్గాల వారిపైన ద్రవ్యోల్బణం వినాశకర ప్రభావం చూపితుంది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్ధులు లాంటి అధికాదాయ వర్గాల పైన చూపే ప్రభావం లెక్కలోనిది కాకపోయినా మొత్తంగా ‘బిజినెస్ సెంటిమెంట్’ అని చెప్పేదానిపైన గణినీయ ప్రభావం చూపుతుంది. ఆర్ధిక కార్యకలాపాల గొలుసు కట్టు ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడి చొరవ తగ్గిపోతుంది. జాగ్రత్త పడే ధోరణి పెరుగుతుంది. ఈ ధోరణి కొద్ది కాలం వరకే ఉంటే పెద్ద నష్టం ఉండదు. కానీ సుదీర్ఘకాలం కొనసాగితే గనక జి.డి.పి వృద్ధి పైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అందుకే మేక్రో ఎకనామిక్స్ లో అధిక ద్రవ్యోల్బణం కి ప్రతికూల ప్రాదాన్యత ఉంటుంది.

ఈ అంశాలు తెలియనంత తెలివి తక్కువవాడా కేంద్ర మంత్రి? కానే కాదు. ఈ కాస్త ఆర్ధిక సూత్రాలు కూడా తెలియని తెలివిహీనులు కేంద్ర మంత్రి అయ్యే అవకాశమే లేదు. కాకపోతే మంత్రిగారి తెలివి ప్రజలను మోసం చెయ్యడానికి వీలుగా దారి తప్పింది. వాల్ స్ట్రీట్ దగ్గర్నుండి దళాల్ స్ట్రీట్ దాకా భారత ద్రవ్యోల్బణం పై వ్యక్తం చేస్తున్న ఆందోళనలకి సమాధానం కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు. దళారుల నల్ల డబ్బు మార్కెట్లలో విచ్చలవిడిగా సంచారం చేస్తుంటే దానిని అరికట్టే ఉద్దేశ్యంగానీ, దమ్ము గానీ పాలకులకి లేదు. ఒకవైపు వరుస కుంభకోణాలు పాలకుల పరువు తీస్తుంటే, మరోవైపు అధిక ద్రవ్యోల్బణం ప్రజల ఉసురు తీస్తున్నది. వీటినుండి బైటపడడానికి మంత్రులు కొత్త కొత్త జిమ్మీక్కులని ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రజల్లోనే వివిధ సెక్షన్ల మధ్య తగువులు పెట్టి బయటపడదామని చూస్తున్నారు.

చిదంబరం వ్యాఖ్యలు చూసినా, బేణీ ప్రసాద్ వర్మ వ్యాఖ్యలు చూసినా ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. పాలకులపై వ్యక్తమయ్యే వ్యతిరేకత పెరుగుతూ పోతున్న పరిస్ధితిలో దానిని తమవైపు నుండి ప్రజల్లోనే వివిధ సెక్షన్ల వైపుకి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమే కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు. పాలకులు తరచుగా అనుసరించే ఎత్తుగడే ఇది. ప్రజాగ్రహాన్ని ప్రజలమధ్యనే ఉండేలా చూడడం వారు దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఎత్తుగడ. అయితే కొన్ని పని చేస్తాయి, మరోకొన్ని తిప్పికొడతాయి. పని చేస్తే కలిగే లాభం కంటే తిప్పి కొడితే వచ్చే నష్టం చాలా తక్కువ. ప్రజల మతిమరుపు ఇక్కడ చక్కగా పాలకులకి ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి పాలకులకి పెద్దగా అభ్యంతరం ఉండదు. ప్రజాప్రాతినిధ్య ఎన్నికల వ్యవస్ధను తాగుడు, లంచం లాంటి ప్రలోభాల స్ధాయికి విజయవంతంగా దిగజార్చిన నాయకులకి ఇలాంటి చిన్న కొంటే వ్యాఖ్యలు వెనక్కి తన్నడం వల్ల వచ్చే నష్టం పెద్దగా లెక్కలోనిది కాదు.

భారత పాలకులు ప్రధానంగా దళారీలు. ఏ రంగంలో చూసుకున్నా ఈ దళారీలదే ఆధిపత్యం. వ్యవసాయం, రోడ్లు-భవనాలు-కాలవలు (కాంట్రాక్టులు), ఎగుమతులు & దిగుమతులు (వ్యాపారం), పరిశ్రమలు… ఇలా ఏ రంగం చూసుకున్నా దళారీలు అంటిపెట్టుకుని ఉంటారు. అందులో కష్టం చేసి ఉత్పత్తులకి చోదక శక్తులుగా ఉండే శ్రమ జీవుల శ్రమ శక్తిలో గణనీయ భాగాన్ని వీళ్ళు సొంతం చేసుకుంటారు. మార్కెట్లలో ఎగుడు దిగుడులను తామే సృష్టించి సొమ్ము చేసుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీళ్లే పార్లమెంటులో, అసెంబ్లీల్లో కూర్చుని చట్టాలు చేసేది. ఏ పార్టీ నీడలో ఉన్నా అంతా ఒకటే జాతి, దళారీ జాతి. కనుక వారి వ్యాఖ్యలు దళారులకి మద్దతుగా, దళారీ దోపిడిని కప్పి పుచ్చేవిగానే ఉంటాయి. ప్రజలు మేలుకొని ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి.

వ్యాఖ్యానించండి